Ghazal
-
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
వ్యాపారంలో విజయవంతమైన ప్రతిఒక్కరికీ ఓ టెక్నిక్ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ మరికొంతమంది సక్సెస్ సాధిస్తుంటారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్ఫూర్తితో ప్రముఖ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ కోఫౌండర్ ఘజల్ అలాఘ్ వ్యూహాత్మక సమావేశ టెక్నిక్‌ను పంచుకున్నారు.తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించిన హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కంపెనీలో ఈ టెక్నిక్ నిర్ణయాలను గణనీయంగా ఎలా మెరుగుపరిచిందో ‘ఎక్స్’ పోస్ట్‌లో అలఘ్ వివరించారు. "మీరు నిర్వహించే ప్రతి వ్యూహాత్మక సమావేశంలో మీ కస్టమర్లు కూర్చున్నారని ఊహించుకోండి. మా ప్రతి వ్యూహాత్మక సమావేశాలలో ఒక కుర్చీని ఖాళీగా ఉంచుతాం. మా కస్టమర్లే అక్కడ కూర్చున్నారని భావిస్తాం. నేను జెఫ్ బెజోస్ నుంచి ఈ అద్భుతమైన టెక్నిక్ నేర్చుకున్నాను. ఇది హోనాసాలో నిర్ణయాలు తీసుకునే ప్రమాణాలను మెరుగుపరుస్తోంది" అని ఆమె రాసుకొచ్చారు."మేము ప్రతి ఆలోచనను కస్టమర్ల దృక్కోణం నుంచి పునఃపరిశీలన చేసుకుంటాం" అని అలఘ్ పేర్కొన్నారు. కస్టమర్లకు మేలు జరిగేలా ఉంటేనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ అత్యంత వినియోగదారు-స్పృహ కలిగిన కంపెనీలలో ఒకటిగా మారాలనే తమ లక్ష్యాన్ని అలఘ్ నొక్కి చెప్పారు.2008లో ఎన్ఐఐటీలో కార్పొరేట్ ట్రైనీగా ఘజల్ అలఘ్ వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. 2016లో ఆమె హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ (మామెర్త్) ను స్థాపించారు. ఇది టాక్సిన్ లేని చర్మ సంరక్షణ, హెయిర్ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులతో తక్కువ సమయంలోనే ఖ్యాతిని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ మోడల్ విజయవంతమైంది. -
Talat Mahmood: ఆ చిరు లేత గానానికి నూరేళ్లు
జల్తే హై జిస్కే లియే... ఆ పాట చిరుకెరటాల అలికిడిలా ఉండేది. ఫిర్ వహీ షామ్.. వహీ గమ్... ఆ గొంతు సాయం సంధ్యలో వీచే వీవెన వలే ఉండేది. సీనే మే సులగ్తే హై ఆర్మాన్... ఆ గానం పడగ్గది దీగూటిలో శిఖను కంపించే దీపంలా అనిపించేది. తలత్ మెహమూద్.. గజల్ నవాబ్. మృదుగాన చక్రవర్తి. హిందీ సినిమా గోల్డెన్ ఎరాలో వెలిగిన త్రిమూర్తులు... రఫీ, ముఖేష్, తలత్లలో ఒకడు. నేడు అతని శతజయంతి. భారతీయ సినిమా సంగీతంలో మెత్తని గొంతును ప్రవేశపెట్టి శ్రోతలను సమ్మోహితులను చేసిన తొలి గాయకుడు తలత్ మెహమూద్. అతడు గజల్ గానానికి మార్గదర్శకుడు. నిరుపమానమైన గజల్ గాయకుడు మెహదీహసన్ కు కూడా తొలిదశలో తలత్ మెహమూదే స్ఫూర్తి. తలత్ది ఘనమైన గాన చరిత్ర. అందుకే అతని శతజయంతి సందర్భం గాన ప్రియులకు వేడుక. 1941–44 మధ్య కాలంలో ‘తపన్ కుమార్’ పేరుతో కలకత్తాలో బెంగాలీ పాటలు పాడాడు తలత్. 1945లో కలకత్తాలో నిర్మితమైన ‘రాజలక్ష్మీ’ హిందీ సినిమాలో నటుడు–గాయకుడుగా తలత్ తన మెదటి సినిమా పాట ‘ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్’ పాడాడు. 1951లో ‘తరానా’లో పాడిన ‘సీనేమే సులగ్తే హైన్ అర్మా’ పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు ‘ఆర్జూ’లోని ‘ఏ దిల్ ముఝే ఏసీ జగ్హ లేచల్’ పాటా, ‘బాబుల్’ లోని ‘మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా’ చెప్పుకోతగ్గవి. ‘సంగ్దిల్’ సినిమాలో తలత్ పాడిన ‘ఏ హవా.. ఏ రాత్... ఏ చాందినీ’ మన దేశంలో వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ‘సంగ్దిల్’ సినిమాలోనే ‘కహాన్ హో కహాన్’ అంటూ తలత్ మరో గొప్ప పాట పాడాడు. ‘దాగ్’లో పాడిన ‘ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్’ పాట దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. తలత్ పాడిన ‘బారాదరీ’ సినిమాలోని ‘తస్వీర్ బనాతా హూ’, ‘ఫుట్ పాత్’లోని ‘షామే గమ్ కీ కసమ్’, ‘ఠోకర్’లోని ‘ఏ గమే దిల్ క్యా కరూన్’, ‘దిల్–ఎ–నాదాన్’ సినిమాలోని ‘జిందగీ దేనే వాలే సున్’ పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లోనే పెద్ద పల్లవి పాట ‘ఉస్నే కహా థా’ సినిమాలోని ‘ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే’ తలత్ పాడాడు. అప్పటి వరకూ దేశం వింటూ వచ్చిన సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ క్రూనింగ్ (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. 1944లో తలత్ పాడిన ‘తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ’ గజల్ రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది. ఆ గజల్ గానం దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో ‘సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా...‘ గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. ఆ తరువాత ‘గమ్ –ఎ–జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా’ (1947), ‘సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్’ (1947), ‘దిల్ కీ దునియా బసా గయా’ (1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో ‘రోరో బీతా జీవన్ సారా’, ‘ఆగయీ ఫిర్ సే బహారేన్’, ‘చన్ ్ద లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్’ వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. బేగం అఖ్తర్ గజల్ ధోరణికి భిన్నంగా గజల్ గానం పరివర్తనమవడానికి తలత్ ముఖ్యకారణమయ్యాడు. అందుకే అతను ‘గజల్ నవాబ్’ అనిపించుకున్నాడు. గైర్–ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్ లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు చక్కగానూ, గొప్పగానూ పాడాడు. ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలోని ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ పాట మనకు తెలిసిందే. ఈ పాట ‘జంజీర్’లో మన్నాడే పాడిన ‘యారీ హైన్ ఇమాన్ మేరా’ పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్తో కలిసి తలత్ పాడిన ‘హమ్ సునాతే హైన్ మొహమ్మద్’ అన్న నాత్. ‘అమృత’ సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన ‘ఏ దేవి వరము నీవు’ పాట పల్లవి తలత్ పాడిన గజల్ ‘రాతేన్ గుజర్ దీ హైన్’ కు దగ్గరగా ఉంటుంది. తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన ‘మనోరమ’ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో మూడు పాటలు ‘అందాల సీమ సుధా నిలయం’, ‘గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి’, ‘మరిచిపోయేవేమో ’ పాడాడు. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో1951లో ‘సంసార్’ హిందీ సినిమాలో ‘మిట్ నహీన్ సక్తా’, ‘యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్’ పాటలూ, 1952లో వచ్చిన ‘మిస్టర్ సంపత్’ సినిమాలో ‘ఓ మృగనయనీ...‘, ‘హే భగవాన్’ పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు ‘పాతాళభైరవి’, ‘చండీరాణి’ సినిమాలలో ఎన్.టి.రామారావుకు తలత్ పాడారు. 1964లో వచ్చిన ‘జహాన్ ఆరా’ సినిమాలోని ‘ఫిర్ వోహీ షామ్...‘ పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. అంతకు ముందు 1963లో ‘రుస్తమ్ సొహరాబ్’ సినిమాలో తలత్ ‘మాజన్దరాన్ మాజన్దరాన్’ అంటూ ఒక విశేషమైన పాట పాడాడు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడాడు. తలత్ 16 సినిమాల్లో నటించాడు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు తలత్. 1924 ఫిబ్రవరి 24న పుట్టిన తలత్ 1998లో తది శ్వాస విడిచాడు. తలత్ క్రూనింగ్ను దక్షిణ భారతదేశంలో పి.బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె.ఏసుదాస్‌కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, ఇతరులకూ చేరింది. మనదేశంలో క్రూనింగ్ ఉంది అంటే అది తలత్ మెహమూద్ వచ్చింది అన్నది చారిత్రికం. 1968లో అమెరికాలో జరిగిన ఒక టాక్ షోలో తలత్‌ను ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి ‘ఫ్రాంక్ సినాట్రా ఆఫ్ ఇండియా‘ అని అన్నారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటాడు. – రోచిష్మాన్ -
Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్ అడ్రస్
‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాదించిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్ల గురించి... ఫోర్బ్స్ ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్లు చోటు సంపాదించారు. కోవిడ్ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ‘హొనాసా కన్జూమర్’ కో–ఫౌండర్ గజల్ అలఘ్ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్ ఆ తరువాత కాలంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది. కోవిడ్ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్. ‘ఎమ్క్యూర్ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్‌షో ‘అన్కండీషన్ యువర్సెల్ఫ్ విత్ నమితా థాపర్’ నిర్వాహకురాలు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెస్సెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యుర్షిప్’కు మంచి ఆదరణ లభించింది. ‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు. నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్. భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది. -
నేను పుట్టింది నీ కోసం...
ఉర్దూ గజళ్లలో భాషా సౌందర్యం కవిత్వంతో పెనవేసుకుని ఉంటుంది. గాలిబ్ భాషా సౌందర్యాన్ని దాశరథి మాటల్లో చెప్పాలంటే, ‘ప్రతిదీ సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట యెంతొ దుష్కరమ్ము సుమ్ము’ వంటì ది. భాషలోని అతి లలిత పదాలని భావానికి తగినట్లుగా ఎన్నుకోవడమే గజల్ ప్రక్రియలోని ప్రతిభ. ప్రేయసి మీద విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒకే అక్షరాన్ని సైతం పదునుపెట్టిన బాణంలా వదలగలిగిన భాషా దురంధరుడు దాశరథి. గజల్ ప్రక్రియలో ‘షేర్’అనేది ముఖ్యం. రెండు పాదాలుండే షేర్ అంటే ‘పూలు’ అని అర్థం. అందుకే గులాబీపూవును దాశరథి ఈ పాటలో కవితా వస్తువుగా తీసుకున్నారు. అటువంటి ఒక అద్భుత గజల్‌ను తెలుగు సినిమాకు ఆయన రాయడం, ఆ గజల్‌ను హిందోళరాగంలో మా నాన్నగారు (మాస్టర్ వేణు) స్వరపరచి ఘంటసాలగారి మధురగళంలో రికార్డు చేయడం... అన్నింటికీ మించి ఎప్పుడూ మా నాన్నగారి రికార్డింగుకి వెళ్లని నేను ఆ పాట రికార్డింగుకు వెళ్లడం... అదే ఘంటసాలగారు పాటలు పాడిన చివరి సినిమా కావడం యాదృచ్ఛికం. ఘంటసాల గారు స్వయంగా మా ఇంటికి వచ్చి, నాన్నగారి దగ్గర కూర్చుని ఈ పాట నేర్చుకున్నారు. ఆ రోజులలో కమిట్మెంట్ అలా ఉండేది. ‘మధురమైన ఈ మంచి రేయిని వృథా చేయకే సిగ్గులతో’ అనే చరణంలో కాని, ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం’ అనే చరణంలో కాని కొన్ని అన్య స్వరాలు అనివార్యమైనా, వాటి ఛాయలు కనపడనీయకుండా, ‘హిందోళ’ రాగంలో అద్భుతంగా స్వరపరచడం మాస్టర్వేణుగారి ప్రతిభకు తార్కాణం అని నేను భావిస్తాను. తెలుగు చలనచిత్రసీమకు పరిచయం కాని తొలిరోజుల్లో బొంబాయిలో మేస్ట్రో నౌషాద్ అలీ వద్ద గడపడం, బేగమ్ అఖ్తర్, మెహదీ హసన్‌ల గజల్ ప్రక్రియలను దగ్గరగా పరిశీలించడం నాన్నగారికి గజల్ ప్రక్రియ మీద మోజును పెంచింది. తెలుగులో గజళ్లు వినిపించగలిగే అవకాశం వారికి రాలేదు. యువ నిర్మాతలు మహమ్మద్ రంజాన్ అలీ, మహమ్మద్ ఖమరుద్దీన్లు హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన ‘మా ఇంటి దేవత’ చిత్రంతో ఆ ఆశ తీరింది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణం ఒడిదొడుకులకు లోనైంది. 1973లో మొదలుపెట్టిన సినిమా 1980 దాకా విడుదలకు నోచుకోలేదు. ఘంటసాల 1974లో కాలం చేసిన తరవాత ఆరేళ్లకు గానీ ఈ సినిమా విడుదల కాలేదు. కలర్ సినిమాలు ఊపందుకున్న తరవాత ఈ సినిమా విడుదల కావడంతో దీనికి గుర్తింపు రాలేదు. ఇది హిందీ సినిమా కాజల్‌కు రీమేక్. దాశరథి రచించిన ఈ పాటలో పల్లవితోనే అడుగడుగునా మీర్జాగాలిబ్ కళ్లలో మెదలుతాడు. ‘విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి’ అంటూనే ‘నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి’ అంటాడు. కానీ ‘తాగాలి’ అనడు. అదే దాశరథి సున్నితమైన కవితా దృక్కోణం. ‘చంద్రుని ముందర తార వలె నా సందిట నీవే వుండాలి’ అంటూ ‘ఈ మధువంతా నీ కోసం, పెదవుల మధువే నా కోసం’ అని మధువును, మగువను ఏకదృష్టితో సంబోధిస్తాడు. ఇటువంటి అద్భుత రచనకు సంగీతం నిర్వహించే అదృష్టం నాన్నగారికి దక్కడం అదృష్టమే. నిర్మాతలు ఉర్దూ సంప్రదాయాలు తెలిసినవారు కావడం, గజల్ సంస్కృతి మీద మక్కువ వుండడం ఈ పాట సృష్టికి దోహదం చేసిన అంశాలు. మరో చరణంలో ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం’ అంటారు దాశరథి. ఇది ఒక అద్భుతమైన పోలిక. అందుకే గజల్ భాషా సంపద గొప్పది. అటువంటి పాట తెలుగులో రాసిన దాశరథి కూడా గొప్పవారు. అంతటి గొప్ప పాటకు స్వరపరచిన మా నాన్నగారు అదృష్టవంతులు. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టమైనది. సినిమా విజయవంతం కాకపోవడంతో ఈ పాట మరుగున పడిన మణిపూసైపోయింది. ఈ చిత్రానికి నిర్మాతలు రిజిస్టర్ చేసిన అసలు పేరు ‘కంటికి కాటుక – ఇంటికి ఇల్లాలు’. విడుదల ఆలస్యం కావడం వలన దానిపేరు ‘మా ఇంటి దేవత’ గా మారిపోయింది. కృష్ణ నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రమిది. హరనాథ్ తను కోల్పోయిన స్టార్‌డమ్‌ను తిరిగి సాధించేందుకు హాస్యనటుడు పద్మనాభం, కృష్ణ, జమునల సహకారంతో నిర్మాతలు వెనక ఉండి నటించిన చిత్రం. జాతీయాలు ఉంగరాల చేతి మొట్టికాయ ఎవరైనా పిడికిలి బిగించి నెత్తి మీద లాగిపెట్టి మొట్టికాయ వేస్తే నొప్పి పుడుతుంది. మామూలు చేతి మొట్టికాయకే అంత నొప్పి పుడితే, అలాంటిది వేళ్ల నిండా ఉంగరాలు తగిలించుకున్న ధన మదాంధుడెవడైనా కసిదీరా మొట్టికాయ వేశాడనుకోండి ఆ దెబ్బకి ఎలాంటి వాళ్లకైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉంగరాల తాకిడికి నెత్తి బొప్పి కడుతుంది. సాదాసీదా మనుషులు ఎవరైనా ధనబలం, అధికార బలం గల వారితో అనవసర వైరం పెట్టుకుని, వాళ్ల ద్వారా కీడు కొని తెచ్చుకునే సందర్భాల్లో ఉంగరాల చేతి మొట్టికాయలు తిన్నారనడం పరిపాటి. ఐదు పది చేయడం ఐదు పది చేయడమంటే ఐదో ఎక్కం చదవడం కాదు. ఒక్కో చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. రెండు చేతులూ జోడిస్తే రెండు చేతుల వేళ్లూ కలిపి పది వేళ్లవుతాయి. ఇలా రెండు చేతులూ జోడించడాన్నే ఐదు పది చేయడం అంటారు. గౌరవంతోనో, భక్తి ప్రపత్తులతోనో చేతులు జోడించే సందర్భాల్లో ఈ మాట అనరు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు, అధికార నిరంకుశుడైనప్పుడు వానితో తలపడటం సాధ్యం కాదని తలచినప్పుడు, లొంగుబాటే శరణ్యమనే పరిస్థితుల్లో చేతులు జోడించినప్పుడే ఐదు పది చేశాడంటారు. కాకదంతపరీక్ష కాకులకు దంతాలు ఉండవు. లేని దంతాలను పరీక్షించాల్సిన అగత్యం కూడా ఎవరికీ ఉండదు. అయితే, తమను తాము మేధావులుగా తలచే కొందరు ఏమీ లేని విషయమై గంభీర పరిశోధనలు సాగిస్తుంటారు. ఫలితమివ్వని పరీక్షలు చేస్తూ అనవసరంగా ప్రయాస పడుతూ అందరిలో నవ్వుల పాలవుతుంటారు. పనికి మాలిన విషయమై ఎవరైనా గంభీరంగా పరీక్షలు, పరిశోధనలు చేస్తున్నట్లు కనిపిస్తే, అలాంటి వాళ్లను కాకదంత పరీక్షలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తుంటారు. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
తెరపై రామానుజుల జీవితచరిత్ర!
కులమతాలకు అతీతంగా దైవానుగ్రహాన్ని పొందవచ్చనే విషయాన్ని నిరూపించిన మహనీయుడు భగవత్ శ్రీరామానుజులు. ఆయన జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సంఘ సంస్కర్త భగవత్ రామానుజులు’. అమృత క్రియేషన్స్ పతాకంపై మర్రి జమునారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మంజుల సూరోజు దర్శకురాలు. హైదరాబాద్‌లో ఈ సినిమా పాటల సీడీని చినజీయర్ స్వామీజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఎన్ని కులాలు, మతాలున్నా అందరూ కలిసి మెలిసి ఉండాలనే సందేశాన్ని రామానుజులు అందించారు. అందరూ సమానమే అనే సత్యాన్ని ప్రవచించిన ఓ మహనీయుని జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘గొప్ప ఆలోచనతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఓ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెర మీద ఆవిష్కరించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రం ఇది’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామనుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి, ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా!
గ్రంథపు చెక్క గజల్ కేవలం ఒక గీతం కాదు. ధ్వనులతో అంతర్ధ్వనులతో పొరలు పొరలుగా అల్లుకుపోయిన కమనీయ కవిత గజల్. ముషాయిరాల్లో గజల్‌కు ప్రాధాన్యం హెచ్చు. అది తీగలా శ్రోతల హృదయాల పందిళ్లను దట్టంగా అల్లుకుని పుష్పించి, పరిమళించి పరవశింపజేస్తుంది. గజల్ అంటే ‘కలకంఠులతో సరస సల్లాపం’ అని అర్థం చెప్పవచ్చు. అరబ్బీ భాషలో దీనికి ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందమైన లేడిపిల్ల అరుపు, సున్నితమైన పూల నుండి దారం తీయడం... ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పవచ్చు. ప్రణయ సర్వస్వం-గజల్. ‘నీవున్న మేడ గదిలో నను చేరనీయ రేమో! జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా! యేడేడు సాగరాలు, యెన్నెన్నో పర్వతాలు యెంతెంత దూరమైన బ్రతుకంతా నడిచిరానా!’ ఇదో గజల్. ప్రియుడు ప్రేయసి కోసం పడే తపన గజల్‌కు ప్రాణం. బాల్యదశలో మహాకవి గాలిబ్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాను. అగాథమైన అతని కవిత అర్థం కావడానికి చాలా తపన పడాలి. ‘‘భారతదేశానికి గాలిబ్ కవిత, తాజ్మహలు మరువరాని అందాలు’’ అని ఒక మహానుభావుడు అన్నాడట. అది సత్యం. -డా.దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ పుస్తకం నుంచి. -
కొత్త ప్రయత్నం
సుధీర్‌రెడ్డి, యువచంద్ర, గజల్ ప్రధాన పాత్రధారులుగా రాహుల్ సాంకృత్యియాన్ దర్శకత్వంలో రూపొందిన హారర్ చిత్రం ‘ది ఎండ్’. కోటేశ్వరరావు మోరుసు నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో రచయిత కోన వెంకట్ విడుదల చేశారు. ఫార్ములా చిత్రాలు రాజ్యమేలుతున్న నేటి తరుణంలో వాటిని బ్రేక్ చేస్తూ ఇలాంటి చిత్రాన్ని తీసిన దర్శక, నిర్మాతలను కోన వెంకట్ అభినందించారు. ప్రస్తుతం చిన్న సినిమాల సీజన్ మొదలైందనీ, ‘ది ఎండ్’ చిత్రం ఈ టీమ్‌కి గొప్ప ఆరంభం కావాలని కోరుకుంటున్నాననీ కోన వెంకట్ ఆశాభావం వెలిబుచ్చారు. కొత్త ప్రయత్నం చేయాలనే తలంపుతో ఈ హారర్ చిత్రాన్ని నిర్మించామనీ, యూ ట్యూబ్‌లోని ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోందనీ, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామనీ దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.