
జల్తే హై జిస్కే లియే... ఆ పాట చిరుకెరటాల అలికిడిలా ఉండేది.
ఫిర్ వహీ షామ్.. వహీ గమ్... ఆ గొంతు సాయం సంధ్యలో వీచే వీవెన వలే ఉండేది.
సీనే మే సులగ్‌తే హై ఆర్మాన్... ఆ గానం పడగ్గది దీగూటిలో శిఖను కంపించే దీపంలా అనిపించేది.
తలత్ మెహమూద్.. గజల్ నవాబ్. మృదుగాన చక్రవర్తి. హిందీ సినిమా గోల్డెన్ ఎరాలో వెలిగిన త్రిమూర్తులు... రఫీ, ముఖేష్, తలత్‌లలో ఒకడు. నేడు అతని శతజయంతి.
భారతీయ సినిమా సంగీతంలో మెత్తని గొంతును ప్రవేశపెట్టి శ్రోతలను సమ్మోహితులను చేసిన తొలి గాయకుడు తలత్ మెహమూద్. అతడు గజల్ గానానికి మార్గదర్శకుడు. నిరుపమానమైన గజల్ గాయకుడు మెహదీహసన్ కు కూడా తొలిదశలో తలత్ మెహమూదే స్ఫూర్తి. తలత్‌ది ఘనమైన గాన చరిత్ర. అందుకే అతని శతజయంతి సందర్భం గాన ప్రియులకు వేడుక.
1941–44 మధ్య కాలంలో ‘తపన్ కుమార్’ పేరుతో కలకత్తాలో బెంగాలీ పాటలు పాడాడు తలత్. 1945లో కలకత్తాలో నిర్మితమైన ‘రాజలక్ష్మీ’ హిందీ సినిమాలో నటుడు–గాయకుడుగా తలత్ తన మెదటి సినిమా పాట ‘ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్’ పాడాడు. 1951లో ‘తరానా’లో పాడిన ‘సీనేమే సులగ్‌తే హైన్ అర్‌మా’ పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు ‘ఆర్‌జూ’లోని ‘ఏ దిల్ ముఝే ఏసీ జగ్‌హ లేచల్’ పాటా, ‘బాబుల్’ లోని ‘మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా’ చెప్పుకోతగ్గవి.
‘సంగ్‌దిల్’ సినిమాలో తలత్ పాడిన ‘ఏ హవా.. ఏ రాత్... ఏ చాందినీ’ మన దేశంలో వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ‘సంగ్‌దిల్’ సినిమాలోనే ‘కహాన్ హో కహాన్’ అంటూ తలత్ మరో గొప్ప పాట పాడాడు. ‘దాగ్’లో పాడిన ‘ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్’ పాట దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. తలత్ పాడిన ‘బారాదరీ’ సినిమాలోని ‘తస్వీర్ బనాతా హూ’, ‘ఫుట్ పాత్’లోని ‘షామే గమ్ కీ కసమ్’, ‘ఠోకర్’లోని ‘ఏ గమే దిల్ క్యా కరూన్’, ‘దిల్–ఎ–నాదాన్’ సినిమాలోని ‘జిందగీ దేనే వాలే సున్’ పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లోనే పెద్ద పల్లవి పాట ‘ఉస్నే కహా థా’ సినిమాలోని ‘ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే’ తలత్ పాడాడు.
అప్పటి వరకూ దేశం వింటూ వచ్చిన సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ క్రూనింగ్ (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. 1944లో తలత్ పాడిన ‘తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్‌లాన సకే గీ’ గజల్ రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది. ఆ గజల్ గానం దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో ‘సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా...‘ గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. ఆ తరువాత ‘గమ్ –ఎ–జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా’ (1947), ‘సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్’ (1947), ‘దిల్ కీ దునియా బసా గయా’ (1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో ‘రోరో బీతా జీవన్ సారా’, ‘ఆగయీ ఫిర్ సే బహారేన్’, ‘చన్ ్ద లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్’ వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. బేగం అఖ్తర్ గజల్ ధోరణికి భిన్నంగా గజల్ గానం పరివర్తనమవడానికి తలత్ ముఖ్యకారణమయ్యాడు. అందుకే అతను ‘గజల్ నవాబ్’ అనిపించుకున్నాడు.
గైర్–ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్ లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు చక్కగానూ, గొప్పగానూ పాడాడు. ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలోని ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ పాట మనకు తెలిసిందే. ఈ పాట ‘జంజీర్’లో మన్నాడే పాడిన ‘యారీ హైన్ ఇమాన్ మేరా’ పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్‌తో కలిసి తలత్ పాడిన ‘హమ్ సునాతే హైన్ మొహమ్మద్’ అన్న నాత్. ‘అమృత’ సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన ‘ఏ దేవి వరము నీవు’ పాట పల్లవి తలత్ పాడిన గజల్ ‘రాతేన్ గుజర్ దీ హైన్’ కు దగ్గరగా ఉంటుంది.
తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన ‘మనోరమ’ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో మూడు పాటలు ‘అందాల సీమ సుధా నిలయం’, ‘గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి’, ‘మరిచిపోయేవేమో ’ పాడాడు. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో1951లో ‘సంసార్’ హిందీ సినిమాలో ‘మిట్ నహీన్ సక్తా’, ‘యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్’ పాటలూ, 1952లో వచ్చిన ‘మిస్టర్ సంపత్’ సినిమాలో ‘ఓ మృగనయనీ...‘, ‘హే భగవాన్’ పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు ‘పాతాళభైరవి’, ‘చండీరాణి’ సినిమాలలో ఎన్.టి.రామారావుకు తలత్ పాడారు.
1964లో వచ్చిన ‘జహాన్ ఆరా’ సినిమాలోని ‘ఫిర్ వోహీ షామ్...‘ పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. అంతకు ముందు 1963లో ‘రుస్తమ్ సొహరాబ్’ సినిమాలో తలత్ ‘మాజన్దరాన్ మాజన్దరాన్’ అంటూ ఒక విశేషమైన పాట పాడాడు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడాడు. తలత్ 16 సినిమాల్లో నటించాడు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు తలత్. 1924 ఫిబ్రవరి 24న పుట్టిన తలత్ 1998లో తది శ్వాస విడిచాడు.
తలత్ క్రూనింగ్‌ను దక్షిణ భారతదేశంలో పి.బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె.ఏసుదాస్‌కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, ఇతరులకూ చేరింది. మనదేశంలో క్రూనింగ్ ఉంది అంటే అది తలత్ మెహమూద్ వచ్చింది అన్నది చారిత్రికం.
1968లో అమెరికాలో జరిగిన ఒక టాక్ షోలో తలత్‌ను ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి ‘ఫ్రాంక్ సినాట్రా ఆఫ్ ఇండియా‘ అని అన్నారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటాడు.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment