Ghazals
-
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్‌కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి లాహోర్‌కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్‌ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్‌కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్‌కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్‌జోన్‌గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్‌గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
Talat Mahmood: ఆ చిరు లేత గానానికి నూరేళ్లు
జల్తే హై జిస్కే లియే... ఆ పాట చిరుకెరటాల అలికిడిలా ఉండేది. ఫిర్ వహీ షామ్.. వహీ గమ్... ఆ గొంతు సాయం సంధ్యలో వీచే వీవెన వలే ఉండేది. సీనే మే సులగ్తే హై ఆర్మాన్... ఆ గానం పడగ్గది దీగూటిలో శిఖను కంపించే దీపంలా అనిపించేది. తలత్ మెహమూద్.. గజల్ నవాబ్. మృదుగాన చక్రవర్తి. హిందీ సినిమా గోల్డెన్ ఎరాలో వెలిగిన త్రిమూర్తులు... రఫీ, ముఖేష్, తలత్లలో ఒకడు. నేడు అతని శతజయంతి. భారతీయ సినిమా సంగీతంలో మెత్తని గొంతును ప్రవేశపెట్టి శ్రోతలను సమ్మోహితులను చేసిన తొలి గాయకుడు తలత్ మెహమూద్. అతడు గజల్ గానానికి మార్గదర్శకుడు. నిరుపమానమైన గజల్ గాయకుడు మెహదీహసన్ కు కూడా తొలిదశలో తలత్ మెహమూదే స్ఫూర్తి. తలత్ది ఘనమైన గాన చరిత్ర. అందుకే అతని శతజయంతి సందర్భం గాన ప్రియులకు వేడుక. 1941–44 మధ్య కాలంలో ‘తపన్ కుమార్’ పేరుతో కలకత్తాలో బెంగాలీ పాటలు పాడాడు తలత్. 1945లో కలకత్తాలో నిర్మితమైన ‘రాజలక్ష్మీ’ హిందీ సినిమాలో నటుడు–గాయకుడుగా తలత్ తన మెదటి సినిమా పాట ‘ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్’ పాడాడు. 1951లో ‘తరానా’లో పాడిన ‘సీనేమే సులగ్తే హైన్ అర్మా’ పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు ‘ఆర్జూ’లోని ‘ఏ దిల్ ముఝే ఏసీ జగ్హ లేచల్’ పాటా, ‘బాబుల్’ లోని ‘మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా’ చెప్పుకోతగ్గవి. ‘సంగ్దిల్’ సినిమాలో తలత్ పాడిన ‘ఏ హవా.. ఏ రాత్... ఏ చాందినీ’ మన దేశంలో వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ‘సంగ్దిల్’ సినిమాలోనే ‘కహాన్ హో కహాన్’ అంటూ తలత్ మరో గొప్ప పాట పాడాడు. ‘దాగ్’లో పాడిన ‘ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్’ పాట దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. తలత్ పాడిన ‘బారాదరీ’ సినిమాలోని ‘తస్వీర్ బనాతా హూ’, ‘ఫుట్ పాత్’లోని ‘షామే గమ్ కీ కసమ్’, ‘ఠోకర్’లోని ‘ఏ గమే దిల్ క్యా కరూన్’, ‘దిల్–ఎ–నాదాన్’ సినిమాలోని ‘జిందగీ దేనే వాలే సున్’ పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లోనే పెద్ద పల్లవి పాట ‘ఉస్నే కహా థా’ సినిమాలోని ‘ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే’ తలత్ పాడాడు. అప్పటి వరకూ దేశం వింటూ వచ్చిన సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ క్రూనింగ్ (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. 1944లో తలత్ పాడిన ‘తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ’ గజల్ రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది. ఆ గజల్ గానం దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో ‘సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా...‘ గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. ఆ తరువాత ‘గమ్ –ఎ–జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా’ (1947), ‘సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్’ (1947), ‘దిల్ కీ దునియా బసా గయా’ (1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో ‘రోరో బీతా జీవన్ సారా’, ‘ఆగయీ ఫిర్ సే బహారేన్’, ‘చన్ ్ద లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్’ వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. బేగం అఖ్తర్ గజల్ ధోరణికి భిన్నంగా గజల్ గానం పరివర్తనమవడానికి తలత్ ముఖ్యకారణమయ్యాడు. అందుకే అతను ‘గజల్ నవాబ్’ అనిపించుకున్నాడు. గైర్–ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్ లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు చక్కగానూ, గొప్పగానూ పాడాడు. ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలోని ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ పాట మనకు తెలిసిందే. ఈ పాట ‘జంజీర్’లో మన్నాడే పాడిన ‘యారీ హైన్ ఇమాన్ మేరా’ పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్తో కలిసి తలత్ పాడిన ‘హమ్ సునాతే హైన్ మొహమ్మద్’ అన్న నాత్. ‘అమృత’ సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన ‘ఏ దేవి వరము నీవు’ పాట పల్లవి తలత్ పాడిన గజల్ ‘రాతేన్ గుజర్ దీ హైన్’ కు దగ్గరగా ఉంటుంది. తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన ‘మనోరమ’ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో మూడు పాటలు ‘అందాల సీమ సుధా నిలయం’, ‘గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి’, ‘మరిచిపోయేవేమో ’ పాడాడు. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో1951లో ‘సంసార్’ హిందీ సినిమాలో ‘మిట్ నహీన్ సక్తా’, ‘యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్’ పాటలూ, 1952లో వచ్చిన ‘మిస్టర్ సంపత్’ సినిమాలో ‘ఓ మృగనయనీ...‘, ‘హే భగవాన్’ పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు ‘పాతాళభైరవి’, ‘చండీరాణి’ సినిమాలలో ఎన్.టి.రామారావుకు తలత్ పాడారు. 1964లో వచ్చిన ‘జహాన్ ఆరా’ సినిమాలోని ‘ఫిర్ వోహీ షామ్...‘ పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. అంతకు ముందు 1963లో ‘రుస్తమ్ సొహరాబ్’ సినిమాలో తలత్ ‘మాజన్దరాన్ మాజన్దరాన్’ అంటూ ఒక విశేషమైన పాట పాడాడు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడాడు. తలత్ 16 సినిమాల్లో నటించాడు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు తలత్. 1924 ఫిబ్రవరి 24న పుట్టిన తలత్ 1998లో తది శ్వాస విడిచాడు. తలత్ క్రూనింగ్ను దక్షిణ భారతదేశంలో పి.బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె.ఏసుదాస్‌కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, ఇతరులకూ చేరింది. మనదేశంలో క్రూనింగ్ ఉంది అంటే అది తలత్ మెహమూద్ వచ్చింది అన్నది చారిత్రికం. 1968లో అమెరికాలో జరిగిన ఒక టాక్ షోలో తలత్‌ను ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి ‘ఫ్రాంక్ సినాట్రా ఆఫ్ ఇండియా‘ అని అన్నారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటాడు. – రోచిష్మాన్ -
దిగ్గజ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూత
ముంబై: ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించిన గజల్ గాయకుడు భూపీందర్ సింగ్(82) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కోలన్ కేన్సర్, కోవిడ్ అనంతర సమస్యలతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మోహమ్మద్ రఫీ, ఆర్డీ బర్మాన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, గుల్జర్లకు సమకాలీకుడు ఈయన. ఆయన భార్య ప్రముఖ గాయకురాలు మిథాలీ సింగ్. ధరమ్‌కాంటా చిత్రంలోని ధునియా ఛూటే.. యార్ నా ఛూటే, సితారా చిత్రంలో ‘థోడీ సీ జమీన్ థోడా ఆస్మాన్’ పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నామ్ గుమ్ జాయేగా, దిల్ థూండ్తా హై.. మరిచిపోలేని క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. యూరిన్ ఇన్ఫెక్షన్తో పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన భూపీందర్కు.. ఆ తర్వాత కొవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే కోలన్ క్యాన్సర్, కొవిడ్ ఎఫెక్ట్‌తో ఆయన సోమవారం రాత్రి 8గం. ప్రాంతంలో మరణించారని వైద్యులు తెలిపారు. భూపీందర్‌సింగ్ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్ మోహన్ దృష్టిలో పడి సినిమా అవకాశాలు అందుకున్నారు. 1964లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హఖీఖాత్ ఆయన తొలి చిత్రం. అయితే ఆయన సోలో ట్రాక్ మాత్రం రెండేళ్ల తర్వాత ఆఖ్రీ ఖాట్ చిత్రంలోనే(రుత్ జవాన్ జవాన్ రాత్ మెహర్బాన్...) పాడారు. 1980లో సినిమాలకు మెల్లిగా దూరం అవుతూ వచ్చిన ఆయన.. భార్య మిథాలీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు. కేవలం సింగర్‌గానే కాకుండా.. గిటారిస్ట్‌గా హరే రామా హరే కృష్ణ చిత్రంలో ‘దమ్ మారో దమ్’, యాదోన్ కీ బారాత్ చిత్రంలో ‘చురా లియా హై’, ‘చింగారి కోయ్ భడ్కే’, షోలే చిత్రంలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌కు పని చేశారు. ఈ పాటల్లో గిటార్ మ్యూజిక్‌లు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భూపీందర్ సింగ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ మేరకు ఓ సంతాప ప్రకటన విడుదల చేశారు. -
ఏక్ ఎహసాస్
గజల్ మాస్ట్రో ఉస్తాద్ గులామ్ అలీఖాన్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని గజల్స్‌తో మేళవించి వీనుల విందు చేయడంలో గులామ్ అలీఖాన్ సిద్ధహస్తుడు. దీని ద్వారా వచ్చిన సొమ్మును కశ్మీర్లో వరద బాధితుల సహాయ నిధికి అందిస్తారు. ఒకరికి ఎంట్రీ రూ.500 నుంచి రూ.5,000. వేదిక: శిల్పకళా వేదిక, మాదాపూర్ సమయం: ఈ రోజు రాత్రి 7 గంటలకు