చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్‌ ఆఫ్‌ గజల్స్‌’ బేగం అఖ్తర్‌! | Queen of Ghazals: Begum Akhtar Play By Padmini Kolhapure | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్‌ ఆఫ్‌ గజల్స్‌’ బేగం అఖ్తర్‌!

Nov 2 2024 11:01 AM | Updated on Nov 2 2024 11:32 AM

Queen of Ghazals: Begum Akhtar Play By Padmini Kolhapure

రంగస్థలంపై గజల్‌ మారాణి 

చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్‌ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్‌ బేగం ‘క్వీన్‌ ఆఫ్‌ గజల్స్‌’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్‌ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన  వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..

వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌... ఇన్‌ ఫైజాబాద్‌: న్యాయవాది అస్ఘర్‌ హుస్సేన్‌కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.

‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్‌ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్‌ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్‌ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.

ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్‌ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్‌ ఇమ్దాద్‌ఖాన్‌ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి లాహోర్‌కు చెందిన మహ్మద్‌ ఖాన్, అబ్దుల్‌ వహీద్‌ఖాన్‌లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. 

బిబ్బీ ‘బేగం అఖ్తర్‌’ అయింది
పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్‌–బిహార్‌ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్‌ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్‌ఫోన్‌ రికార్డులతో బేగం అఖ్తర్‌ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.

లక్నోకు చెందిన ఇష్తియాక్‌ అహ్మద్‌ అబ్బాస్‌ అనే బారిస్టర్‌తో అఖ్తర్‌కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్‌ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.

సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్‌కు రెండో జీవితం అయింది. ఆల్‌ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్‌ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్‌ ఆఫ్‌ గజల్స్‌’గా నిచిలింది.

‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్‌ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్‌ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన  పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.

‘అమ్మీ’గా రంగస్థలం పైకి...
నాటకరంగాన్ని తన కాలింగ్‌ అండ్‌ కంఫర్ట్‌జోన్‌గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్‌గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్‌ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్‌ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement