![Sakshi interview about Rakul Preet Singh Valentines Day](/styles/webp/s3/article_images/2025/02/14/rakul---bhagnani-111.jpg.webp?itok=u2AXuLhQ)
నేడు వాలెంటైన్స్ డే
‘‘ఒక బంధం బలంగా సాగాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు.. నమ్మకమూ ఉండాలి. ప్రేమకు శ్వాస విశ్వాసమే’’ అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). జీవితంలో తాను అద్భుతమైన ‘ఫేజ్’లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఆనందానికి కారణం జీవిత భాగస్వామి జాకీ భగ్నానీ. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani), రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఈ ఇద్దరూ తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2024 ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో రకుల్ స్పెషల్ చిట్ చాట్ ...
→ మీరు, జాకీ ప్రేమలో ఉన్నప్పుడు జరుపుకున్న వాటిలో మరచిపోలేని ‘ప్రేమికుల దినోత్సవం’ గురించి చెబుతారా?
మా ఇద్దరి కాంబినేషన్ (జాకీ నిర్మాత–రకుల్ హీరోయిన్)లో వచ్చిన మొదటి సినిమా ‘కఠ్ పుతలీ’ (2022). ఆ సినిమా అప్పుడే మేం ఫస్ట్ వేలంటైన్స్ డే జరుపుకున్నాం. మా డేటింగ్ మొదలైంది అప్పుడప్పుడే. ఓ హోటల్‌లోని గ్రీన్‌హౌస్ ఏరియాని జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తగ్గట్టుగా మార్పించాడు. ఒకవైపు గిటారిస్ట్‌లు పాడుతుంటే ఆ పాటలు వింటూ, ఆరోగ్యకరమైన విందుని ఆస్వాదించాం. జాకీ నా కోసం గులాబీ పువ్వులు, పుష్పగుచ్ఛాలు ఇచ్చాడు. అదొక అందమైన, ఆహ్లాదకరమైన రోజు. సో.. నాకెప్పటికీ ఆ వాలంటైన్స్ డే గుర్తుండి పోతుంది.
→ ఓ జంట మధ్య బలమైన బంధం ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు?
పెద్ద టిప్ ఏంటంటే ‘నమ్మకం’. ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమైన బంధానికి పునాది వేస్తుంది. రిలేష్‌న్‌షిప్‌లో మంచి ష్రెండ్‌షిప్ ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే భాగస్వామిలో మంచి ఫ్రెండ్‌ని చూస్తామో, అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరికైనా జీవితం చాలా సునాయాసంగా సాగాలి... ఒత్తిడిగా కాదు. హ్యాపీగా సాగాలంటే నమ్మకం, విశ్వాసం, స్నేహం ముఖ్యం.
→ మీ ‘బెటర్‌హాఫ్’ జాకీ భగ్నానీ గురించి కొన్ని మాటలు...
జాకీ నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం.. తను నా సోల్‌మేట్ కావడం ఆనందం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మా ఇద్దరికీ ఉన్న పెద్ద తేడా ఏంటంటే నేను చాలా ‘హైపర్’, తను చాలా ‘కూల్’. నా హైపర్‌ని జాకీ ఎప్పుడూ విమర్శించింది లేదు సరికదా... పొగుడుతుంటాడు. అయినా ఒకరు హైపర్... మరొకరు కూల్... ఇలా ఉండటం కూడా బాగుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది (నవ్వుతూ). నా పార్ట్‌నర్‌లో నేను బెస్ట్ ఫ్రెండ్‌ని చూశాను. మేం ఇద్దరం ఏ విషయం గురించైనా చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ఏం చేయాలన్నా చేస్తాం. ఇక మేం ఒకరికొకరం ఇచ్చుకునే సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మేం మా పార్ట్‌నర్ కోసం మారాల్సిన అవసరం రాలేదు. పెళ్లికి ముందెలా ఉన్నామో ఆ తర్వాతా అలానే ఉన్నాం. అందుకే మేం ఇద్దరం అదృష్టవంతులం అంటాను.
→ అయితే పెళ్లి తర్వాత మీరు మారాల్సిన అవసరం రాలేదంటారా?
ఏ మార్పూ లేదు. అసలు ఒకరి జీవితం పెళ్లి కారణంగా ఎందుకు మారాలి? పెళ్లి తర్వాత జీవితం మెరుగవ్వాలి. నా లైఫ్ బెటర్ అయింది. పెళ్లికి ముందు నాకు నచ్చిన పనులు చేసినట్లే ఇప్పుడూ చేస్తున్నాను. ఫీలింగ్స్‌ని దాచేయకుండా షేర్ చేసుకునేంత స్వేచ్ఛ నా సోల్‌మేట్‌తో ఉంది. అందుకే జీవితం అందంగా, ఆనందంగా ఉంది. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించడం ఓ అదృష్టం. అర్థం చేసుకునే వ్యక్తి పక్కన ఉన్నప్పుడు జీవితంలోని ఆ దశ అద్భుతంగా ఉంటుంది.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment