
మా చెల్లెలి స్నేహితురాలిగా ప్రియాంక పరిచయమైంది.. అనంతరం ప్రేమగా మారింది..
ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే.. కానీ, సివిల్స్ తర్వాతే∙అన్నా..
ఒకరినొకరు అవగాహనతో వెళ్తేనే బంధం బలంగా ఉంటుంది
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రేమ వివాహ అనుభవాలను పంచుకున్న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ఆరు నెలల తర్వాత.. నా అభిప్రాయం చెప్పా.. ప్రపంచంలో ప్రతీజీవి తోడు కోరుకుంటుంది. ఆ తోడు కోరుకోవడంలో ఆచితూచి అడుగులు వేయడం కీలకం. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు అంటే గౌరవం, బాధ్యతలు అన్నింటిని సరిచూసుకుంటూ.. నచ్చిన జోడీని ఎంచుకోవడం, అదికూడా ఆకర్షణ కాకుండా జీవితంగా భావించి.. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకొని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంటే.. ఒక మహాయజ్ఞంలాంటిదే. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్– ప్రియాంక దంపతుల ప్రేమ వివాహంలో. నేడు (శుక్రవారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ కేకన్ తన ప్రేమ వివాహ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
– సాక్షి, మహబూబాబాద్
నేను, ప్రియాంక ఒకరినొకరం ఇష్టపడిన విషయం ఇంట్లో తెలిసింది. కొన్నిరోజులు చర్చలు జరిగాయి. ముందుగా ప్రియాంక కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. కొంతసమయం తీసుకొని మా కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లారు. పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ, నేను కొన్ని ఆంక్షలు పెట్టాను. ఆ సమయంలో నేను సివిల్స్ ప్రిపరేషన్‌లో ఉన్న. నేను సివిల్స్ సాధించిన తర్వాతే పెళ్లి అనుకున్నాం. విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులకు, అటు ప్రియాంకకు చెప్పాను. నా ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. సివిల్స్ బాగా రాశాను. మంచి ర్యాంకు వస్తుందని చెప్పాను. అంతా సంప్రదాయం ప్రకారం లగ్నపత్రిక పెట్టుకున్నారు. పెళ్లికి 15 రోజుల ముందు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యాను. కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రియాంక ఫోన్‌లో అభినందనలు తెలిపినప్పుడు ఇద్దరి సంతోషం చెప్పలేను. ఆ తరువాత సంప్రదాయబద్ధంగా మా వివాహం జరిగింది. నేను అనుకున్నట్లు ఒకవైపు ప్రియాంకను, మరోవైపు ఐపీఎస్‌ను సాధించాను. ఇప్పటివరకు మా వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది. మా ఇద్దరికి తోడు మా బాబు విరాజ్. ముగ్గురం సంతోషంగా ఉన్నాం.

అవగాహన లేకపోతే బంధం గుదిబండనే..
మనిషికి మహిళ తోడు అవసరం. వివాహం అనేది అందరి జీవితంలో కీలక ఘట్టం. దీనికి ఆచితూచి అడుగులు వేయాలి. ప్రేమ అనేది ఒక ఆకర్షణ కావద్దు. ఇద్దరి బంధమనుకోవాలి. ఒకరి భావాలు మరొకరు పంచుకుంటూ ఒక అవగాహనతో వెళ్లాలి. లేకపోతే ఇరువురి కుటుంబ సభ్యులకు గుది బండగానే ఉంటుంది. ఇష్టపడటం, అనుకున్న ల క్ష్యాలను సాధించి తర్వాత వివాహం చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. నేటి యువత ఈ దిశగా ఆలో చించాలి. కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది.
నాన్న అంటే అందరికీ భయమే.. కానీ చెప్పక తప్పదు..
ఒకవైపు చెల్లెలి ఫ్రెండ్. అప్పటికే ఆమె బీటెక్ చేసి మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. నేను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. నేనంటే ఇష్టమని ప్రియాంక చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. మొదట ఏమి చెప్పాలో తెలియలేదు. సివిల్స్ సాధనే నా లక్ష్యం. ఈ సమయంలో ప్రేమ ఏంది అనుకున్నా. నా అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం అడిగాను. ఆమె కూడా సరేనంది. మాది పెద్ద కుటుంబం. నాన్న అంటే ముగ్గురు అన్నలతోపాటు అందరికీ భయమే. కానీ, ఆయన మాత్రం మాతో సరదాగానే ఉంటూనే పద్ధతిగా ఉండాలని చెబుతారు.. ఇటువంటి పరిస్థితిలో ప్రియాంక ప్రపోజ్ చేసిన విషయం ఇంట్లో చెప్పలేను. అలా అని ఉండలేను. నాలోనే నేను ఆలోచనలో పడ్డా. ఆరు నెలల తర్వాత ప్రియాంకకు ఓకే అని నా అభిప్రాయం చెప్పాను.
చెల్లెలు కలిపిన బంధం
మా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలో మా పిన్ని కూతురు అత్తగారి ఇల్లు ఉంటుంది. మా చెల్లి అంటే అందరికి ఇష్టం. ఆమెకు కూడా మేం అంటే ప్రాణం. అందుకోసమే తరచూ నేను అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మా చెల్లి దగ్గరికి తన స్నేహితురాలు ప్రియాంక వచ్చేది. చెల్లిని కలిసినప్పుడు ఒకరోజు ప్రియాంకను పరిచయం చేసింది. ఆమె కూడా సరదాగా మాట్లాడేది. కానీ, అది ప్రేమగా మారుతుందని అనుకోలేదు. చూస్తూ ఉండగానే ఒకరోజు నేనంటే ఇష్టమని నా చెల్లెలికి చెప్పింది. ఈ విషయం చెల్లి నాకు చెప్పేందుకు తడబడినా.. చివరకు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment