బాలీవుడ్ మూవీ షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో అర్జున్ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు ముదస్సర్ అజీజ్‍కు గాయాలయ్యాయి. మేరే హస్బెండ్‌కి బీవీ మూవీ షూట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఈనెల 18న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా బయటకొచ్చింది.
మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేశామని తెలిపారు.
బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఎవరికీ పెద్ద గాయాలు ఏమీ లేవు. కానీ అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే స్టూడియోలో పైకప్పు కూలిపోయింది. కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్ ఆపేశారు. సినీ పరిశ్రమలోని సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపాం. భవనాలు ఏదో ఒక రోజు కూలిపోయేలా ఉన్నాయని ఫిలిం సిటీకి కూడా లేఖ రాశాం. ఈ ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం కనిపించలేదు. చిత్ర పరిశ్రమ అంతా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అన్నారాయన.
కాగా.. అర్జున్ కపూర్ గాయంతోనే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. మేరే హస్బెండ్ కి బీవీ ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలోకి రానుంది. నిర్మాత జాకీ భగ్నానీ గతేడాది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment