
ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'( Master Of Suspense Hitchcock) పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది. ఐదు రోజుల్లో పుస్తకాలు అన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈ పుస్తకం సెకండ్ ఎడిషన్ లాంచ్ చేస్తూ.. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకు రావడం అభినందనీయం అని ప్రశంసించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తాను.
ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవి పాడి మరిన్ని సంకల్పించాలి'' అని అన్నారు. ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందుమాట రాయడంతో పాటు ఆయన కెరీర్ లో తొలిసారి ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్ కాస్ట్ విడుదల చేశారు. అలాగే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ కూడా ముందుమాట రాశారు.
'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'లో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ (HLF)లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రశంసలను అందుకున్నారు పులగం చిన్నారాయణ, రవి పాడి.
Comments
Please login to add a commentAdd a comment