50 ఏళ్ల తేనెమనసులు
కవర్ స్టోరీ: తెలుగు తెరకు కృష్ణ దొరికి ఇప్పటికి 50 ఏళ్లు. కృష్ణ అంటేనే ‘తేనె మనసు’. సాహసం + మంచితనం + మొండితనం + కష్టించే తత్వం + గ్లామర్ = కృష్ణ. ఆదుర్తి సుబ్బారావు లేకపోతే కృష్ణ లేడు. కృష్ణ లేకపోతే తెలుగు సినిమా చాలా మిస్సయిపోయేది. ఈ నెల 31కి ‘తేనె మనసులు’ విడుదలై 50 ఏళ్లు. ఈ నేపథ్యంలో కృష్ణ వెండితెర తొలి అడుగుల్ని, ‘తేనె మనసులు’ తీపి జ్ఞాపకాల్ని ఓసారి రివైండ్ చేసుకుందాం.
శివరామకృష్ణకు మద్రాసు నుంచి ఉత్తరం వచ్చిందహో! ఊరు ఊరంతా టముకు వేసినట్టుగా నిమిషాల్లో వార్త పాకిపోయింది. రచ్చబండ దగ్గరా ఇదే చర్చ. అమ్మలక్కల మధ్య ఈ కబురే. బుర్రిపాలెం... ఓ చిన్న పల్లెటూరు. తెనాలిలో బస్సెక్కితే పావుగంట ప్రయాణం. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి గారి పెద్దకొడుకు శివరామకృష్ణ అంటే ఆ ఊళ్లో కొంచెం ఫేమస్. ఎర్రగా, బుర్రగా... అచ్చం సినిమా స్టార్లా ఉంటాడు. కామ్‌గా బీకామ్ చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. పెద్దలంటే రెస్పెక్టు. కొంచెం కళాపోషణ కూడా ఉంది. డ్రామాలు, నాటకాలంటే మూడో కాలు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరైనా ఫేమస్ కావాల్సిందే. ఊళ్లో ఇంత ఇమేజ్ వచ్చాక, ఆటోమేటిగ్గా మనసు సినిమాల మీదకే మళ్లుతుంది కదా! శివరామకృష్ణ విషయలోనూ అంతే.
అతనే నా హీరో
ఈ సినిమాలో నన్ను బుక్ చేయడం నా అదృష్టం. జీవితాంతం ఆదుర్తి సుబ్బారావుగారికి రుణపడి ఉంటాను. చిత్రం కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత నన్నా చిత్రం నుంచి తొలగించమని ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ ఆయన ‘‘ఒకసారి హీరోగా ఎనౌన్స్ చేసిన తర్వాత ఇక మార్చేది లేదని, అతనే నా హీరో’’ అని చిత్రం పూర్తి చేశారు.
- కృష్ణ
నిర్మాత-రచయిత చక్రపాణికి రాఘవయ్య చౌదరి క్లోజ్ ఫ్రెండు. కొడుకు గురించి చెబితే ‘‘ఇంకా చిన్నపిల్లాడేగా కొంతకాలం ఆగమను. నేనే అవకాశమిస్తా’’ అన్నాడాయన. కానీ శివరామకృష్ణకు అంత ఓపికెక్కడిదీ? ఎల్వీ ప్రసాద్ ‘కొడుకులు-కోడళ్లు’ సినిమా తీస్తామని అనౌన్సుమెంట్ ఇస్తే, అప్లయ్ చేశాడు. లక్కీగా ఓ హీరోగా సెలక్టయ్యాడు. మిగతా ముగ్గురు బాలయ్య, రమణమూర్తి, శోభన్‌బాబు. రిహార్సల్స్ స్టార్ట్. కానీ బ్యాడ్‌లక్. సినిమా స్టార్ట్ కాకముందే షట్ డౌన్ అయిపోయింది. ఏం పర్లేదు... ఇది కాకపోతే ఇంకోటి. శివరామకృష్ణ కులాసాగా ఉన్నాడు. భరోసాగా ఉన్నాడు. పాండీబజారులో నిలబడి షోగ్గా కాఫీ తాగుతున్నాడు. అటువైపు వెళ్తున్న తమిళ దర్శకుడు ‘చిత్రాలయ’ శ్రీధర్‌కు ఇతను తెగ నచ్చేశాడు. ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాలో నువ్వే హీరోవన్నాడాయన. మళ్లీ బ్యాడ్‌లక్. శివరామకృష్ణకు అస్సలు తమిళం రాదు. కొంచెమొస్తే మేనేజ్ చేసేవారేమో! అంద ఛాన్సు కూడా ఇల్లై!!
****
మళ్లీ వేట మొదలు. జగ్గయ్య సినిమా ‘పదండి ముందుకు’ (1962) లో చిన్న వేషం...
ఏయన్నార్ సినిమా ‘కులగోత్రాలు’ (1962)లో ఇంకో చిన్న వేషం.
ఆ వెంటనే ఎన్టీఆర్ సినిమా ‘పరువు-ప్రతిష్ఠ’ (1963)లో మళ్లీ చిన్న వేషం.
ఈలోగా ఇంటి దగ్గర్నుంచీ అమ్మానాన్నా ప్రెజర్... వచ్చేయమంటూ. రిటర్న్ టూ బుర్రిపాలెం.
ఇక్కడకొచ్చాక మళ్లీ నాటకాల హడావిడి. ‘ప్రజానాట్యమండలి’ సంస్థ నాటకాలతో శివరామకృష్ణకు కాలం తెలియడం లేదు.
****
ఆ రోజు ‘ఆంధ్రపత్రిక’లో ఓ ప్రకటన. సినిమా అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ ఫొటో స్టూడియోలకు క్యూ కట్టారు. ఆ ప్రకటన ఇచ్చింది మామూలు వ్యక్తి కాదు. ఆదుర్తి సుబ్బారావు. గ్రేట్ డెరైక్టర్. ‘మూగమనసులు’ లాంటి క్లాసిక్స్ తీసినవాడు. కొత్తవాళ్లతో సినిమా తీస్తాడట. ఆసక్తి ఉన్నవాళ్లు ఫొటోలు పంపమని ప్రకటన. శివరామకృష్ణలో ఉత్సాహం తన్నుకొచ్చింది. మంచి పోజులో ఫొటో దిగి మద్రాసులోని బాబూ మూవీస్ ఆఫీసుకి పంపించాడు.
ప్రతి రోజూ పోస్టుమ్యాన్ కోసం వెయిటింగ్. తనకు కచ్చితంగా పిలుపొస్తుందని శివరామకృష్ణకు కాన్ఫిడెన్స్. నిజంగా ఉత్తరం వచ్చింది. వెంటనే మద్రాసు రమ్మని సారాంశం. బుర్రిపాలెం అంతా పండగ సీను. శివరామకృష్ణ రెలైక్కాడు. రైలు కన్నా వేగంగా అతని మనసు మద్రాసులో వాలిపోయింది.
****
అప్పటికే అరుణాచలం స్టూడియో నిండా జనం. చాలాసేపు వెయిట్ చేస్తే, ఎప్పటికో పిలుపొచ్చింది. లోపల ఆదుర్తి సుబ్బారావు, కెమేరామ్యాన్ సెల్వరాజ్, కోడెరైక్టర్ కె. విశ్వనాథ్, ఇంకెవరో ఉన్నారు. కొన్ని డైలాగులిచ్చి చెప్పమన్నారు కె. విశ్వనాథ్. శివరామకృష్ణకు స్టేజ్ ఫియర్ లేదు. గడగడా డైలాగులు చెప్పి పారేశాడు. స్క్రీన్ టెస్ట్ అయిపోయింది. వెంటనే రిజల్ట్ చెప్పేలా లేరు. నెల రోజులు ఆగాల్సిందే.
పాపం శివరామకృష్ణ... బుర్రిపాలెం వెళ్లాడన్న మాటే కానీ, నిద్ర లేదు. సెలక్ట్ అవుతానా లేదా అని ఒకటే టెన్షన్. ఆ 30 రోజులూ 30 యుగాల్లా అనిపించాయి.
మద్రాసు నుంచి ఉత్తరమొచ్చింది. శివరామకృష్ణ సెలక్టయ్యాడు. ఊరంతా సంబరాలు.
మళ్లీ మద్రాసు ప్రయాణం. శివరామకృష్ణ మనసు మనసులో లేదు. ఒకవైపు టెన్షన్. ఇంకో వైపు విపరీతమైన ఆనందం. అదే బోగీలో మహానటుడు ఎస్వీఆర్.
ఈ కుర్రాడి టెన్షన్ చూసి, ఆయనే పలకరించారు. శివరామకృష్ణ కథంతా చెప్పుకొచ్చాడు.
‘‘వెరీగుడ్... ఆదుర్తి లాంటి బ్రహ్మాండమైన డెరైక్టర్ దగ్గర పడ్డాక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు ఎస్వీ రంగారావు. దాంతో శివరామకృష్ణ దిల్ ఖుష్... ఫుల్ ఖుష్...
****
మద్రాసు టి. నగర్‌లోని బృందావన్ లాడ్జిలో స్నానం చేసి, వెంటనే ఆళ్వార్‌పేటలో ఉన్న బాబూ మూవీస్ ఆఫీసుకెళ్లాడు. లోపల నుంచి పిలుపొచ్చింది.
ఆదుర్తి... నిర్మాత సుందరం... కె.విశ్వనాథ్ కూర్చుని ఉన్నారు.
టెన్షన్‌గా వాళ్ల ముందు కూర్చున్నాడు శివరామకృష్ణ.
సుందరం ఓ పేపరిచ్చాడు. అది అగ్రిమెంట్. ‘‘ఈ సినిమాలో హీరోగా వేషం కన్ఫర్మ్. నెక్ట్స్ మూవీలో కూడా. ఈ మూవీకి 2 వేలు, ఆ మూవీకి 3 వేలు రెమ్యూనరేషన్’’.
‘‘నీకు సమ్మతమేగా?’’ అడిగారు ఆదుర్తి.
శివరామకృష్ణ ఉబ్బితబ్బిబ్బయిపోయున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అగ్రిమెంట్ మీద చిటికెలో సంతకం పెట్టేశాడు. సుందరం 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. శివరామకృష్ణకు ఇది కలో, నిజమో అర్థం కావడం లేదు.
****
5000 అప్లికేషన్లు వస్తే... బాగా వడపోసి 150 తీశారు. ఫైనల్‌గా ఇద్దరు హీరోల్ని, ఇద్దరు హీరోయిన్లని, 8 మంది కేరెక్టర్ ఆర్టిస్టుల్ని, 10 మంది ఉపపాత్రధారుల్ని సెలక్ట్ చేశారు.
శివరామకృష్ణతో పాటు రామ్మోహన్ ఇంకో హీరో. సుకన్య, సంధ్యారాణి హీరోయిన్లు. రామ్మోహన్ ఏరోనాటికల్ ఉద్యోగి. సుకన్యది రాజమండ్రి. సంధ్యారాణిది బెజవాడ. పొద్దున్నుంచీ రాత్రి వరకూ... అందరికీ రిహార్సల్స్. ఓ యజ్ఞమే మొదలైంది. కె.విశ్వనాథ్ దగ్గర డైలాగ్ కోచింగ్. హీరాలాల్ మాస్టర్‌తో డాన్సులో శిక్షణ. అందరూ కొత్తవాళ్లే. అక్కడేమో కొత్త వాతావరణం. అందరిలోనూ బిడియం. బండి నత్తనడక నడుస్తోంది. ఇలాగైతే నాలుగైదు నెలలైనా షూటింగ్‌కి వెళ్లలేరు.
అందుకే ఈ గ్యాంగ్‌ని తీసుకుని బీచ్కెళ్లారు. వేరే ప్లేసులకు పిక్నిక్కి తీసుకెళ్లారు. మెల్లిమెల్లిగా అందరూ క్లోజ్ అయిపోయారు. బండి స్పీడ్ పెరిగింది. ఇక రాత్రింబవళ్లూ ట్రైనింగే ట్రైనింగ్.
శివరామకృష్ణకైతే డాన్స్ ప్రాక్టీసుకి ఒళ్లు హూనమైపోయింది. అరికాళ్లు బొబ్బలొచ్చి చర్మం ఊడిపోయింది. దాంతో డాన్స్ ప్రాక్టీసుకి వారం గ్యాప్. మళ్లీ ప్రాక్టీస్ స్టార్ట్. ఇలా రెండు నెలలు ఫుల్ ట్రైనింగ్. అందరూ మెరికల్లా తయారయ్యారు.
****
ఆదుర్తి అప్పటివరకూ తీసింది 14 సినిమాలు. తోడికోడళ్లు, మాంగల్యబలం, నమ్మినబంటు, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, మంచి మనసులు, చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, దాగుడు మూతలు, సుమంగళి వగైరా... ఎక్కువ శాతం సిల్వర్ జూబ్లీలే. ఇండస్ట్రీలో టాప్ డెరైక్టర్ హోదా. ఏ పెద్ద హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీ. అయితే ఎక్స్పెరిమెంట్ అంటే సరదా ఆయనకు. కొత్తవాళ్లతో సినిమా తీయాలనుకున్నాడు. కొత్తవాళ్లతో సినిమా అంటే పులిమీసాలు పట్టుకుని ఉయ్యాలలూగడమే అని తెలుసు. అయినా ఆదుర్తి వెనక్కు తగ్గలేదు. కొత్తవాళ్లతో సినిమా అంటే కథ గమ్మత్తుగా ఉండాలి. కడివెడు కన్నీళ్లు... బండెడు సెంటిమెంటు... ఫుల్ యాక్షన్ కన్నా సరదా కథనం, హుషారైన పాత్రలూ ఉండాలి.
‘వక్రించిన సరళ రేఖలు’ గుర్తుకొచ్చింది. అప్పుడెప్పుడో రచయిత కె.ఆర్.కె. మోహన్ ఇచ్చిన నవల అది. ఇతివృత్తం బావుంటుంది. కానీ ఇంకా పోపు పెంచాలి. ఆ బాధ్యత ముళ్లపూడి వెంకటరమణ, కె.విశ్వనాథ్‌లకు ఆదుర్తి అప్పగించారు.
‘తేనెమనసులు’ స్క్రిప్టు రెడీ... ఆత్రేయ మాటలూ పాటలూ రెడీ... మహదేవన్ మ్యూజిక్ రెడీ.
****
చిన్న కథ. చింతలు లేని కథ. ఇద్దరమ్మాయిలూ ఇద్దరబ్బాయిల కథ. రామ్మోహన్-సంధ్యారాణి ఒక జంట. కృష్ణ-సుకన్య ఇంకో జంట.
రామ్మోహన్‌కు, సంధ్యారాణికి పెళ్లవుతుంది. సంధ్యారాణి తండ్రి ఒకరి దగ్గర డబ్బు దొంగిలించి మరీ ఈ పెళ్లి చేస్తాడు. కానీ కాపురం నిలబడదు. పెళ్లాం ముద్దపప్పులా ఉందని రిజెక్ట్ చేసి, కొత్తావకాయలా ఉన్న సుకన్య వెంటబడతాడు రామ్మోహన్. అప్పటికే సుకన్యకు కృష్ణతో పెళ్లి జరగబోయి ఆగిపోతుంది. పెళ్లి పీటలమీద సుకన్యను చూడని కృష్ణ, ఆ తర్వాత సుకన్యతోనే ప్రేమలో పడతాడు. సంధ్యారాణి, సుకన్య క్లోజ్‌ఫ్రెండ్స్. సంధ్యారాణి భర్త రామ్మోహన్ అని తెలుసుకొని, కృష్ణ సాయంతో వాళ్ల కాపురం నిలబెడుతుంది. ఇదీ క్లుప్తంగా కథ.
****
1964 మార్చి 16. హైదరాబాద్... సారథీ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్. అక్కినేని, సావిత్రి చీఫ్ గెస్ట్‌లు. కుర్ర టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వాళ్లు. సినిమా టైటిల్ - ‘తేనె మనసులు’. శివరామకృష్ణ టైటిల్ కూడా మారింది. ఇక నుంచీ అతని పేరు కృష్ణ. షూటింగ్ స్పీడ్‌గా సాగుతోంది. ఏయన్నార్, ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేసిన ఆదుర్తికి కొత్తవాళ్లతో యాక్టింగ్ చేయించుకోవడమంటే కొంచెం తలనొప్పే. అయినా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు.
మూడు రీళ్లు తీశాక, డెవలప్ చేసి ప్రొజెక్షన్ వేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా చూశారు.
ఒక్కొక్కరూ ఒక్కో సలహా. కృష్ణను తీసేయమన్నాడు ఒకాయన. ఆదుర్తి ఆయన వైపు గట్టిగా ఉరిమి చూశాడు.
ఆదుర్తికి ఆ రాత్రి నిద్ర లేదు. ఈ సినిమా ఎటు వెళుతోంది? ఆయనకు ఎక్కడో, ఏదో కొడుతోంది. ఇప్పటికే లక్ష వరకూ ఖర్చయ్యింది. ఇప్పుడేం చేయాలి? పొద్దున్నే నిర్మాత సుందరంతో ఆ నాలుగు రీళ్లూ చెత్తకుప్పలో పడేయమన్నారు ఆదుర్తి. ఆయన కంగారుపడిపోయారు. ‘‘ఏం లేదు... ఇదే సినిమాను మనం కలర్లో తీస్తున్నాం’’ చెప్పారు ఆదుర్తి.
సుందరం మొహంలో వెలుగొచ్చింది. నిజమే... కొత్తవాళ్లతో సినిమా రిస్క్ కాబట్టి, కలర్ అయితే మినిమమ్ గ్యారంటీ. అప్పటికే ‘లవకుశ’ కలర్లో వచ్చింది. అది పౌరాణికం.సాంఘికాల్లో మాత్రం ఇదే ఫస్టు. అప్పట్లో కలర్ ఫిల్మ్ అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అందుకే ఎక్కువమంది కలర్ జోలికి వెళ్లడం లేదు. కానీ ప్రేక్షకులు మాత్రం కలర్ సినిమాల కోసం యమా వెయిటింగ్.
****
హైదరాబాద్‌లో టాకీపార్ట్ తీసేశారు. పాటలకేమో ఊటీ, మైసూర్ వెళ్లారు. ఫస్ట్‌కాపీ వచ్చింది. ఆదుర్తి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మహదేవన్ మ్యూజిక్కూ, సెల్వరాజ్ ఫొటోగ్రఫీ, ఆత్రేయ డైలాగ్సూ, లిరిక్సూ, మంచి స్టోరీ వేల్యూ, ముఖ్యంగా సినిమా నిండా ఫ్రెష్‌నెస్... ప్రేక్షకులకు ఇంతకన్నా ఏం కావాలి??
****
1965 మార్చి 30. ‘తేనె మనసులు’ రేపే రిలీజ్. యూనిట్ అంతా విజయవాడలో ఉంది. అలంకార్ థియేటర్లో ప్రివ్యూ. హౌస్‌ఫుల్.
కృష్ణ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. తన జీవితాన్ని ఈ సినిమా మలుపు తిప్పుతుందా? ఏమో చూడాలి! ఇదే థియేటర్లో అంతకుముందు కృష్ణ బోలెడన్ని సినిమాలు చూశాడు. ఇప్పుడు తన సినిమా చూస్తున్నాడు. తెర మీద తాను. విజిల్స్... క్లాప్స్... అప్పుడప్పుడూ సెలైన్స్. ‘శుభం’ కార్డు పడేసరికే రిజల్ట్ తెలిసిపోయింది. ‘తేనె మనసులు’ సూపర్‌హిట్. యూనిట్ అంతా ఒకరికొకరు షేక్హ్యాండ్లిచ్చుకున్నారు.
బసవరాజుగా కృష్ణ బావున్నాడన్నారు. ప్రేక్షకులు కృష్ణ చుట్టూ మూగారు. రామ్మోహన్ చుట్టూ మూగారు. అప్పుడే హీరో క్రేజ్ మొదలైపోయింది.
విజయవాడ నుంచి గుంటూరు. అక్కడ నుంచీ రాజమండ్రి. సక్సెస్ టూర్. కొత్తవాళ్లు కాబట్టి ప్రజల వద్దకే తారలు.... కొత్త పబ్లిసిటీ ట్రెండ్. ఆదుర్తి జడ్జిమెంట్ ఫలించింది. కథను నమ్మి కొత్తవాళ్లతో సినిమా తీసినందుకు బాక్సాఫీసు దగ్గర తియ్యటి ఫలితం. సినిమా హండ్రడ్ డేస్ ఆడింది. తిరుపతిలో గ్రాండ్ ఫంక్షన్. కృష్ణ లైఫ్ మారిపోయింది. గ్రాఫ్ మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది అంతా హిస్టరీనే. కృష్ణ సూపర్‌స్టార్. 24/7 షూటింగులే షూటింగులు. చేతి నిండా సినిమాలు. రికార్డులే రికార్డులు. ఎన్నో ప్రయోగాలు... ఎన్నెన్నో సాహసాలు. 50 ఏళ్లల్లో 350కు పైగా సినిమాలు. దటీజ్ కృష్ణ. దీనికంతటికీ పునాది ‘తేనె మనసులు’. కృష్ణకు వెండితెర జన్మనిచ్చిన ఆదుర్తి సుబ్బారావుదీ ‘తేనె మనసే’. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంతింతై వటుడింతయై... అన్నంతగా ఎదిగిన కృష్ణదీ తేనె మనసే. కొన్ని కొందరి కోసమే జరుగుతాయేమో... సూపర్‌స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి రావాలని రాసిపెట్టి ఉంది కనుకే, ఆదుర్తి మైండ్‌లో కొత్తవాళ్లతో సినిమా తీయాలని బుద్ధి పుట్టినట్టుంది. విచిత్రంగా ఆదుర్తి, ఆ తర్వాత కొత్తవాళ్లతో సినిమానే తీయలేదు.
హిందీలో ‘తేనె మనసులు’
‘డోలీ’ పేరుతో 1969లో రీమేక్ చేశారు. కృష్ణ పాత్రను హిందీలో రాజేశ్‌ఖన్నా, సుకన్య పాత్రను బబిత, రామ్మోహన్ పాత్రను ప్రేమ్ చోప్రా, సంధ్యారాణి పాత్రను నజిమా చేశారు. అక్కడా మ్యూజికల్ హిట్టయ్యింది.
కృష్ణకు పద్మనాభం ప్లేబ్యాక్
ఈ సినిమాలో పాటలన్నీ బావుంటాయ్. ముఖ్యంగా ‘దివి నుండి భువికి దిగివచ్చె దిగివచ్చె’, ‘పురుషుడు నేనై పుట్టాలి’ పాటలు రెండూ సూపర్‌హిట్. ఘంటసాల, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ పాడారు. కృష్ణ, సుకన్యపై తీసిన ‘ఒన్-టు-త్రీ-ఫోర్-ఫైవ్-సిక్స్’ పాట ఒక్కసారి వినండి. అందులో కృష్ణకు ప్లేబ్యాక్ పాడింది ఫేమస్ కమెడియన్ పద్మనాభం. పాట తమాషాగా ఉండాలని ఆయనతో పాడించారు.
డూప్ లేకుండానే జంప్
ఈ సినిమాలో కృష్ణ స్కూటర్ నడిపే సీన్స్ ఉంటాయి. కృష్ణకు డ్రైవింగ్ రాదు. నటుడు రావికొండలరావుకు స్కూటర్ ఉంది. ఆ స్కూటర్‌తో కృష్ణకు డ్రైవింగ్ నేర్పారు. సారథీ స్టూడియోలోనే ప్రాక్టీస్. మూడు రోజుల్లోనే పర్ఫెక్ట్ అయిపోయారు కృష్ణ. సినిమాలో ఓ చోట కారును స్కూటర్ మీద ఛేజ్ చేస్తూ, స్కూటర్ మీద నుంచి కారులోకి జంప్ చేయాలి. ఆదుర్తి డూప్‌ను పెడదామన్నారు. ‘‘ఈ మాత్రం దానికి డూప్ ఎందుకండీ...’’ అంటూ కృష్ణ రిస్కు చేసి మరీ జంప్ చేశారు. సింగిల్టేక్లో షాట్ ఓకే. ఆదుర్తి ఫుల్ హ్యాపీ. ‘‘నువ్వెప్పటికైనా డాషింగ్ అండ్ డేరింగ్ యంగ్ హీరోవవుతావ్. రేపటి సూపర్స్టార్వవుతావ్’’ అని కృష్ణను మెచ్చుకున్నాడాయన. పై నుంచి దేవతలు తథాస్తు అన్నారు.
‘మేటి’ తారలూ ఎంపిక కాలేదు!
‘తేనె మనసులు’ తెలుగు తెరపై ఓ తీపి గుర్తు. రావికొండలరావు సతీమణి రాధాకుమారికి ఇదే తొలి సినిమా. రేడియోలో పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్న బేబీ రోజారాణి ‘చిన్ని’ వేషం వేశారు. అటుపై ఆమె తెలుగు బుల్లితెరపై తొలి మహిళా న్యూస్ ప్రెజెంటర్‌గా పేర్గాంచారు. శాంతిస్వరూప్‌ను పెళ్లాడారామె. ‘తేనె మనసులు’తో వారణాసి రామ్మోహన్ స్టార్ అయిపోతాడనుకున్నారు. ‘ఆంధ్రా దేవానంద్’ అనిపించుకున్న ఆయనకు కెరీర్ కలిసిరాలేదు. చివరకు కృష్ణ రికమెండ్ చేసి, ఆయనకు కొన్ని వేషాలు ఇప్పించారు. ‘తేనె మనసులు’కు అప్లయ్ చేసిన వారిలో హేమమాలిని, జయలలిత, కృష్ణంరాజు లాంటివారు కూడా ఉన్నారు. వాళ్లెవరూ సెలక్ట్ కాలేదు.
పార్కులో బెంచీ మీద... అసామాన్యుడు!
యాభై ఏళ్ళ క్రితం ‘తేనె మనసులు’ చిత్రానికి మేము సెలక్ట్ చేసి, శిక్షణనిచ్చిన కృష్ణ సినీ రంగంలో ఇంత ఎదిగి, విజయవంతంగా కథానాయకుడిగా నటజీవిత స్వర్ణోత్సవం పూర్తి చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ రోజులు, ఆ సంగతులు చాలా చిత్రంగా అనిపిస్తాయి. అప్పట్లో కృష్ణ... నటన పట్ల చాలా ఉత్సాహంగా, ఎంతో నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు. ఆ సంగతి నాకు ఇప్పటికీ గుర్తు. ‘డైలాగ్ చెప్పేటప్పుడు, చేతులు ఏం చేయాలి?’ అంటూ అప్పట్లో కృష్ణ మమ్మల్ని ఆసక్తిగా ప్రశ్న వేశారు. ‘నిజమేనయ్యా! మనం ఆలోచించలేదు’ అంటూ ఆదుర్తి గారు నాతో అన్నారు.
పనికొచ్చే ప్రతిభ ఉందని, అప్పట్లో మేము సెలక్ట్ చేసిన రామ్మోహన్, కృష్ణ, సుకన్య, సంధ్యారాణి - నలుగురితో ‘తేనెమనసులు’ తరువాత ‘కన్నెమనసులు’ కూడా తీశాం. ఆ తరువాత కూడా కృష్ణను ‘ప్రైవేట్ మాస్టర్’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఉపయోగించా. ‘ఉండమ్మా బొట్టు పెడతా’, ‘నేరము - శిక్ష’ లాంటి చిత్రాలూ కృష్ణతో చేశా. ఆయన ప్రతి చిత్రానికీ ఎదుగుతూ, క్రమంగా పెరిగారు. నిజం చెప్పాలంటే, అప్పట్లో సారథీ స్టూడియోలో మధ్యాహ్నం భోజనం చేసి, పార్కు లాంటి దానిలో బెంచీ మీద విశ్రాంతిగా పడుకొన్న ఒక సామాన్యుడు హీరోగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా ఇంత ఎత్తుకు ఎదుగుతాడని మేమెవరమూ ఊహించలేదు. మేము ఊహించనంత ఎత్తుకు ఎదిగినా, తొలిరోజుల నాటి మంచితనాన్ని వదులుకోలేదు కృష్ణ. ఆయనలోని ప్రత్యేకత అదే!
- ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్, ప్రముఖ దర్శకుడు
- పులగం చిన్నారాయణ