Hitchcock
-
ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్.. మళ్లీ వచ్చాడహో!
క్లాసిక్ హారర్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ వీడియో గేమ్ రూపొందిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది! కాని ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కదా. ఈ లోటును పూరిస్తుంది ఆల్ఫ్రెడ్హిచ్కాక్–వర్టిగో. హిచ్‌కాక్ మూవీ ‘వర్టిగో’ను ఆధారం చేసుకొని రూపొందించిన ఎడ్వెంచర్ వీడియోగేమ్ ఇది. కథ అదే అయినప్పటికీ కథనం, పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. ఈడి మిల్లర్ అనే రచయిత కారు ప్రమాదానికి గురవుతాడు. భార్య, పిల్లల ఆచూకి తెలియదు. ఈ 3 డైమన్షన్ గేమ్వరల్డ్లో ప్లేయర్ 3 క్యారెక్టర్లను కంట్రోల్ చేయాలి. ‘కెన్ యూ ట్రస్ట్ యువర్ వోన్ మైండ్?’ అంటున్న ఈ గేమ్ ఫ్లాష్బ్యాక్లతో కూడిన మిస్టరీలతో ప్లేయర్ మైండ్‌కు బోలెడు పనికల్పిస్తుంది. ప్లాట్‌ఫామ్స్: విండోస్, ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్, ఎక్స్‌బాక్స్ వన్, నిన్టెండో స్విచ్ మోడ్స్: సింగిల్ ప్లేయర్ -
ఆ సమాధులు... సమాధానాలు అడుగుతున్నాయి!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ యూనియన్ భవంతిలో ‘ఇట్స్ ఏ గర్ల్’ ప్రదర్శన పూర్తయిన తరువాత... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మంచిచెడులు, కెమెరా నైపుణ్యం, దర్శకుడి ప్రతిభ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడ లేదు. పెద్దగా ఏమిటి? అసలు ఎవరూ మాట్లాడలేదు. గొంతులో మాటలు లేవు. కంట్లో మాత్రం కన్నీటిబావులు! ఎవరో అన్నారు మెల్లగా... ‘‘మనలో ఇంత క్రూరత్వం ఉందా!’’ అని. అంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడాలనిపించలేదు. అది ఆయస సమస్య మాత్రమే కాదు. ప్రేక్షకులందరి సమస్య. ఇక మనం ప్రధాన సమస్యలోకి వద్దాం... ‘ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య’ ‘ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన భర్త’ ‘చెత్తకుండీలో మరో ఆడశిశువు’ ఇవి పత్రికల్లో నిత్యం కనిపించే కాలాతీతమైన వార్తలు. ఈ హత్యలు నిన్న జరిగాయి. ఇవ్వాళ జరుగుతున్నాయి. రేపు కూడా జరుగుతాయి. ఏ నేరం చేశారని, చేస్తారని కడుపులో పిల్లని కడుపులోనే చంపేస్తున్నారు?! ఇది ఒక దేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు, అభివృద్ధికి, అభివృద్ధి లేమికీ సంబంధం లేకుండా చాలా దేశాల్లో పచ్చి నెత్తుటిలా మెరుస్తున్న సమస్య. అధిక జనాభా ఉన్న భారత్, చైనాలాంటి దేశాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. అందుకే ‘ఇట్స్ ఏగర్ల్’ ఈ రెండు దేశాలను కేంద్రంగా తీసుకుంది. మొదటి దృశ్యంలో ఒక మహిళ (ఇండియా) తన చేతులతో ఎనిమిదిమంది ఆడశిశువులను పురిట్లోనే ఎలా చంపింది చెబుతుంది. వారిని సమాధి చేసిన ప్రదేశం కూడా చూపుతుంది. ఆ స్థలాన్ని చూసిన వాళ్లకు- ‘‘మమ్మల్ని ఎందుకు చంపేశారు?’’ అనే ప్రశ్న దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తుంది. తన బిడ్డల హత్య గురించి చెబుతున్నప్పుడు ఆ తల్లి కళ్లలో ఎలాంటి భావోద్వేగాలు కానరావు. అయితే ఒకమాట మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో అంటుంది... ‘‘స్త్రీకి జీవితాన్ని ఇచ్చే శక్తి ఉంది. తీసుకునే శక్తి కూడా ఉంది’’ ఆమె కరుడుగట్టిన నేరస్థురాలేమీ కాదు... మామూలు గృహిణియే... మరి ఎందుకు ఆమె అంత క్రూరంగా మారిపోయింది. అది క్రూరత్వమేనా? ఆడశిశువులను చంపేయడం తప్పేమీ కాదనే నమ్మకం తాలూకు ధీమా?! ప్రపంచమంతా తిరుగుతూ పౌరహక్కుల ఉల్లంఘలపై, ప్రభుత్వహింసపై డాక్యుమెంటరీలు తీసే డేవిస్ ఒకరోజు ఇండియా, చైనాల్లో కొనసాగుతున్న గర్భస్థశిశు మరణాల గురించి విన్నాడు. ఆ క్రమంలో ఇండియా, చైనాల్లో పర్యటిస్తూ నాలుగు సంవత్సరాల కాలాన్ని తన డాక్యుమెంటరీ కోసమే వెచ్చించాడు. ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనే ముందస్తు ప్రణాళికలేవీ వేసుకోకుండానే కెమెరాతో రంగంలోకి దిగాడు. తాను ఈ రెండు దేశాల్లో తిరుగుతున్న రోజుల్లో ఎన్నో చేదు నిజాలు తెలిసాయి. పసిపిల్లలను రకరకాలుగా ఎలా చంపుతారో సూటిగానో, ఆ నోటో ఈ నోటో విని షాక్‌కు గురయ్యాడు. తమకు పుట్టబోయేది ఆడశిశువని తెలుసుకొని గర్భంలో బిడ్డని గర్భంలోనే చంపేసేవాళ్లు కొందరు. ఈ పనిని మొరటుగా చేసేవాళ్లు కొందరు. ఆధునిక వైద్య సహకారంతో చేసే వాళ్లు కొందరు. కొందరు గొంతు నులిమి చంపుతారు! కొందరు తల్లులు తాము ఇచ్చే పాలకు విషాన్ని కలిపి, పసి బిడ్డ చేత తాగించి చంపుతారు! ఒక దృశ్యంలో ఒక మహిళ అంటుంది... ‘‘ఆడపిల్లగా పుట్టి రోజూ చావడం కంటే ఒక్కసారే చనిపోవడం నయం కదా!’’ అని. ఈ మాటల్లో ఆమె క్రూరత్వం కంటే ఈ రోగగ్రస్థవ్యవస్థ క్రూరత్వమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. పేదరికమే ఈ శిశుహత్యలకు కారణం అని మనం ఒక నిర్ధారణకు వచ్చేలోపే... అదేమీ కాదు... అన్ని సామాజిక,ఆర్థిక వర్గాల్లోనూ ఇది ఉంది అని డా.మిట్టు ఖురాన (ఇండియా) ఉదంతం చెబుతుంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తారు కుటుంబపెద్దలు. మిట్టు కడుపులో ఉన్నది ఇద్దరు ఆడశిశువులు అనే విషయం తెలియగానే భర్త, అత్తమామలు మిన్ను విరిగి మీద పడిపోతున్నట్లుగా వణికిపోతారు. ‘అబార్షన్’ చేయించడానికి సకల ప్రయత్నిస్తారు. అయితే ‘అబార్షన్’ను మిట్టు బలంగా తిరస్కరిస్తుంది . దీంతో భర్త ఆమె పట్ల క్రూరంగా వ్యవహరిస్తాడు. గదిలో పెట్టి తాళం వేస్తాడు. ‘అక్రమ వలసదారులు’ అనే మాట మనం వింటుంటాం. అయితే చైనాలో మాత్రం దీని కంటే ‘అక్రమ సంతానం’ అనే మాటే ఎక్కువ వినిపిస్తుంది. అక్కడ ‘వన్ చైల్డ్ పాలసీ’ అమల్లో ఉంది. పరిమితి కంటే ఎక్కువమంది పిల్లల్ని కంటే, ఆ పిల్లలు ‘అక్రమ సంతానం’ జాబితాలో చేరిపోతారు. ఒక ఫ్యాక్టరీలో పని చేసే లీ ఫాంగ్ గర్భవతి అని తెలుసుకొని పోలీసులు ఇంటి మీద దాడి చేయడానికి వచ్చేలోపే భార్యాభర్తలిద్దరూ ఊరిని విడిచి పారిపోతారు. ఆమె ఒక రహస్య ప్రదేశంలో శిశువుకు జన్మనిస్తుంది. ఈ పిల్ల పెరిగి పెద్దయ్యాక చదువు, ఆరోగ్య సౌకర్యాలు ఉండే అవకాశాలు బొత్తిగా లేవు. లీగల్‌గా పని చేసుకోవడానికీ ఉండదు. ఇలాంటి వారి కన్నీటిని కూడా ఈ డాక్యుమెంటరీ తడుముతుంది. దీంతో పాటు మన దేశంలోని కట్నకానుకల వ్యవస్థ, ఆచారాలలోని మూఢత్వం, సాంస్కృతిక ప్రమాణాలలోని వైరుధ్యాలను చర్చిస్తుంది. ఆడపిల్లలపై ఉన్న రకరకాల సామెతలను ఉటంకిస్తుంది. ‘‘ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం భుజాలు తడుముకోవడం కాదు. భయపడి కళ్లు మూసుకోవడం కాదు... ‘చూశాం కదా... ఒక పనైపోయింది కదా!’ అనుకోవడం కూడా కాదు. ఏ మూల నుంచి చిన్న మార్పు వచ్చిన చాలు నా డాక్యుమెంటరీ న్యాయం జరిగినట్లే’’ అని తన మనసులో మాటను డెరైక్టర్‌గా చెప్పారు డెరైక్టర్. నిజమే కదా! - యాకుబ్ పాషా యం.డి -
ఒకానొక అధర్మ... అరాచక రాజ్యమున...
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తాలిబన్లు...అనే మాట వినగానే ఒకే రకమైన మానసిక భావన కలగకపోవచ్చు. ఎందుకంటే, వాళ్ల గురించి చదివి ‘భయపడిన’ రోజులు ఉన్నాయి. వాళ్ల నిరర్థక, తెలివిహీన నిబద్ధతకు ‘బాధ పడిన’ కాలాలూ ఉన్నాయి. కొన్ని చేష్టలకు బిగ్గరగా నవ్వుకున్న సందర్భాలూ ఉన్నాయి. దూరంగా ఉన్నాం కాబట్టి...‘తాలిబన్లు అనగా?’ అనే ప్రశ్నకు మన నిఘంటువులలో అనేకానేక అర్థాలు, సమాధానాలు ఉండి ఉండొచ్చు. మరి ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు? ముఖ్యంగా 1996-2001 కాలం నాటి ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండేది? ఆ కాలమంతా యావత్ ఆఫ్ఘనిస్తాన్ చిగురుటాకులా గజగజ వొణికింది. వాళ్ల ఉనికి, ప్రాబల్యం ఏ ప్రాంతానికి పరిమితమైనది అనేది పక్కన పెడితే... దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకే రకమైన భయంతో వణికి పోయాయి. వారి చాదస్తం చాదస్తంగానే ఉండిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ మహిళల స్వేచ్ఛకు ప్రమాదకారి అయింది. మహిళల ఆర్థిక, మానసిక ప్రపంచంలో చీకటి నింపింది. తాలిబన్ల పాలనలో సరికొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ‘మహిళలు ఉద్యోగాలు చేయవద్దు’ ‘ఆడవాళ్లు బిగ్గరగా నవ్వకూడదు’ ‘రేడియో వినవద్దు. టీవి చూడవద్దు...’ ‘ఆడవాళ్లు ఆటలు ఆడవద్దు’ ‘తప్పు చేసిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపండి’ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌లా లేదు... కన్నీటి బొట్టులా ఉంది. పులి ముందు వణుకుతున్న జింక పిల్ల వలే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటే... మొదటి రెండు రంగులు (నలుపు, ఎరుపు) పచ్చదనాన్ని మింగేసాయి. నల్లటి చీకటి! ఎర్రటి నెత్తురు!! చారిత్రక విలువతో పోల్చితే... ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈజిప్ట్‌తో పోల్చదగినది. అలాంటి దేశం కాస్తా... ఒకానొక కాలంలో ‘ఆఫ్ఘనిస్తాన్’ అనుకోగానే ‘తాలిబన్’ అని భయంభయంగా ప్రతిధ్వనించేది. రచయిత, డెరైక్టర్ సిద్దిక్... ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివి అమితాశ్చర్యానికి గురయ్యాడు. ఒక అమ్మాయి అబ్బాయిగా మారడం గురించిన వార్త అది. ఈ నేపథ్యంలోకి లోతుగా వెళితే అనేకానేక విషయాలు తెలిశాయి. వాటి సారం ‘ఒసామా’ కథగా రూపుదిద్దుకుంది. పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ లోనే ఈ ఫీచర్ లెంగ్త్ ఫిల్మ్‌ను చిత్రించారు. పన్నెండు సంవత్సరాల అందమైన అమ్మాయి మరీనాకు అమ్మ, అమ్మమ్మ అండగా ఉంటారు. వాళ్లకు మాత్రం ఏ అండా ఉండదు. మగదిక్కూ ఉండదు. అందుకే ‘‘నువ్వే మా దిక్కు’’ అన్నట్లుగా చిట్టి తల్లివైపు చూస్తారు తల్లీ, కూతుళ్లు. ఇంట్లో పొయ్యి వెలగాలంటే, బయటికి వెళ్లి ఎవరో ఒకరు పని చేయాల్సిందే. మరి ముగ్గురూ ఆడవాళ్లే కదా! తాలిబన్లేమో ఆడవాళ్లు బయట కనిపించకూడదు అంటున్నారు. పని చేయకూడదంటున్నారు. అందుకే కన్నీళ్ల మధ్య అమ్మమ్మ అంటుంది...‘ఆడపిల్లలను పుట్టించవద్దని దేవుడిని వేడుకుంటాను’ అని. బాధ పడుతూ కూర్చుంటే, కన్నీళ్లను దిగమింగుకుంటూ కూర్చుంటే పని కాదు కదా! అందుకే జుట్టు కురచగా కత్తిరించి, మగదుస్తులు వేసి మరీనాను మగపిల్లాడిగా మారుస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయి కాదు... ఒసామా అనే పేరుగల అబ్బాయి! ఒక పెద్ద మనిషి దగ్గర పనికి కుదిరిన ఒసామా ఆ తరువాత తాలిబన్ల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చేర్చబడుతుంది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి నిజమైన గుర్తింపు బయటపడుతుంది. ‘భయం నిండిన కళ్లతో తాలిబన్లను చూసే ఒసామా’ (తొలి దృశ్యంలో) ‘తన గుర్తింపు తెలిసిందనే భయంతో వణికి పోయిన ఒసామా’ (క్లైమాక్స్ ముందు దృశ్యంలో)... ఈ రెండు దృశ్యాల మధ్య జరిగినదంతా ఆ కథకు సంబంధించిన కథ మాత్రమే కాదు... ఆ కాలం నాటి చరిత్రను మార్మికంగానో, ప్రతీకాత్మకంగానో చెప్పడం కూడా. ‘క్షమించగలను. కానీ మరిచిపోలేను’ అనే నెల్సన్ మండేలా మాటతో మొదలయ్యే ఈ చిత్రంలో సుదీర్ఘమైన డైలాగులు, నేపథ్య ఉపన్యాసాల లాంటివేమీ ఉండవు. రకరకాల ప్రతీకల ద్వారా, నిశ్శబ్ద సన్నివేశాల ద్వారా చెప్పవలసిన విషయాన్ని బలంగా చెప్పాడు దర్శకుడు. ఆయన ఎక్కడి నుంచో దిగుమతైన డెరైక్టర్ కాదు... అచ్చంగా ఆఫ్ఘనిస్తానీయుడే. ఆ మట్టి వాసన తెలిసిన వాడే. కనుక సూక్ష్మ అంశాలను కూడా తెర మీదకు తేగలిగాడు. అందుకే ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడి పొయెటిక్ విజువల్ సెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. తాలిబన్ల పట్ల పాశ్చాత్య మీడియా చేసిన ‘అతి’ని కెమెరాలోకి అనుమతించకుండా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే నెపంతో తాలిబన్ల ‘అతి’ని వెనకేసుకువచ్చే అతివాదుల ‘అతి’ని దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. గొప్ప విషయం ఏమిటంటే, చిత్రం పూర్తయ్యాక గానీ... మనం చిత్రం చూశామనే భావన రాదు. మనం ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో కలియ తిరుగుతున్నట్లుగానే ఉంటుంది. పేద ఆఫ్ఘాన్ల ఇంట్లో గుడ్డి లాంతరు వెలుగులో కూర్చున్నట్లుగానే ఉంటుంది. పిల్లలను పడుకోబెట్టడానికి... ఒసామా అమ్మమ్మ చెప్పిన ఇంద్రధనుస్సు కథలాంటిదేదో విన్నట్లుగానే ఉంటుంది! - యాకుబ్ పాషా యం.డి చిత్రం: ఒసామా; దర్శకత్వం, రచన: సిద్దిక్ బర్మాక్ -
వెయ్యి చీకట్ల వాడు... లక్ష వెలుగుల రేడు!
దృశ్యం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అబ్రహం లింకన్ జీవితం ఆయనది మాత్రమే కాదు. సొంతం చేసుకుంటే అందరిదీ. ఆయన జీవితంలోని మేలిమి అంశాలు, సొంతం చేసుకున్నవాళ్లకు సొంతం చేసుకున్నంత. బహుముఖ కోణాల ఆయన జీవితం ఏకైక విశ్లేషణలకు, నిర్వచనాలకు లొంగనిది. ‘అమెరికన్ సివిల్ వార్’ కాలంలో ‘అధ్యక్షుడంటే ఇలా ధైర్యంగా ఉండాలి’, ‘అధ్యక్షుడంటే ఇలా దూసుకుపోవాలి’, ‘అధ్యక్షుడంటే ఇలా పట్టుదలగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అర్హతలకు తన వ్యక్తిత్వపు వెలుగులో సరికొత్త నిర్వచనాలు ఇవ్వడమే కాదు, నల్లబానిసల జీవితాలకు కొత్త వెలుగు తీసుకువచ్చినవాడు లింకన్. ఆయన ‘అధ్యక్షుడు’ కాకుండా ఉంటే... అమెరికా ఎన్ని అమెరికాలుగా ఉండి ఉండేదో! (కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి పేర్లతో!) అబ్రహం లింకన్ గురించి మాట్లాడుకోవడమంటే కెంటకీలోని నాల్గవ తరగతి పట్టణమైన హొడ్జెన్విల్లీలో జన్మించిన వ్యక్తి గురించి, ఆయన గొప్పదనం గురించి మాట్లాడుకోవడం కాదు. దేశాలకు అతీతమై, కాలాతీతమైన ఒక నవ ఉత్తేజం గురించి మాట్లాడుకోవడం. రాజనీతిజ్ఞులకు, ఆర్థిక వేత్తలకు, చరిత్రకారులకు, జీవితచరిత్రకారులకు, పాత్రికేయులకు లింకన్ జీవితంలో నుంచి ఎంత విలువైన ముడిసరుకు లభించిందో... కాల్పనిక రచయితలు, కళాకారులు, మానసిక విశ్లేషకులకు అంతే విలువైన ముడి సరుకు లభించింది. అబ్రహం లింకన్ జీవితం ఆధారంగా ఎన్నో పుస్తకాలు, మరెన్నో సినిమాలు వచ్చాయి కదా... మరి డెరైక్టర్ విక్రమ్ జయంతి తన ‘లింకన్’ అనే డాక్యుమెంటరీలో కొత్తగా ఏం చెప్పాడు? ‘‘కొత్తగా ఏం చెప్పగలను?’’ అని మొదట్లో తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు విక్రమ్. ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలు చూసిన తరువాత ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. ‘‘డాక్యుమెంటరీ తీయవద్దు’’ - ఇదీ నిర్ణయం. ‘‘ఒకవేళ తీస్తే మాత్రం...లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో కాదు, లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్‌తో తీయాలి’’. ‘లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’తో రీలు చుట్టేయడం కష్టమైన పనేమీ కాదు... కానీ ‘లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్’తో తీయడమే కష్టాల్లో కెల్లా కష్టం. చిత్రాన్ని కాదు... చిత్రం వెనుక చిత్రాన్ని చూడాలి. వాక్యాన్ని కాదు. వాక్యం వెనుక వాక్యాన్ని చూడాలి. సంతోషాన్ని కాదు... దాని వెనక దుఃఖాన్ని చూడగలగాలి! తాను చదివిన పుస్తకాల్లో నుంచి నోట్స్ రాసుకున్నాడు. శాస్త్రీయంగా విశ్లేషించడానికి లింకన్ బ్రెయిన్ కెమిస్ట్రీ డాటాలాంటిది అందుబాటులో లేదు కాబట్టి ‘డిప్రెషన్’తో సహా లింకన్‌కు సంబంధించిన రకరకాల మనోవైఖరులను సందర్భానుసారంగా ఒడిసి పట్టి వాటికి దృశ్యరూపం ఇచ్చి, ప్రపంచానికి సుపరిచితుడైన ఒక మహానాయకుడి ‘అపరిచిత ప్రపంచాన్ని’ పట్టుకోగలిగాడు విక్రమ్. థామస్ క్రాగ్వెల్ రాసిన పుస్తకం ఆధారంగా వచ్చిన ‘లింకన్ గ్రేవ్ రాబరీ’లాంటి డాక్యుమెంటరీలతో పోల్చితే, వాటిలో కనిపించే సస్పెన్స్, మలుపులు, నాటకీయత ‘లింకన్’లో బొత్తిగా కనిపించకపోవచ్చు. అయినప్పటికీ ‘లింకన్’ అనేది ఏ సస్పెన్స్ థ్రిల్లర్‌కూ తీసిపోని ‘ఆసక్తి’ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. పూరి గుడిసెలో కన్న కలల గురించి, వైట్‌హౌజ్‌లో కార్చిన కన్నీళ్ల గురించి గోర్ విడల్ గొంతులో లింకన్ స్వగత కథనం వినిపిస్తుంది. ప్రధాన స్రవంతి సినిమాలలో కనిపించే ఈ టెక్నిక్‌ను వాడుకొని డాక్యుమెంటరీని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు విక్రమ్. ‘‘ఎంతోమంది లింకన్ జీవితాన్ని తమ జీవితంతో పోల్చుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని’’ అంటాడు విక్రమ్. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే! లింకన్‌ను వెంటాడిన కుంగుబాటు, చావుపై ప్రధానంగా సాగే ఈ డాక్యుమెంటరీలో లింకన్ జీవితంలోని పలు అంశాలపై జీవితచరిత్రకారులు స్పందించారు. లింకన్ జీవితంలోని భిన్న పార్శ్వాల గురించి విశ్లేషించారు. ‘‘ఆయన విజయాలు, ప్రతిభకు సంబంధించిన విషయాలు మాత్రమే తెలుసుకుంటే... లింకన్ జీవితాన్ని అసంపూర్ణంగా తెలసుకున్నట్లే. నిజానికి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాడు. వాటి గురించి తెలుసుకుంటేగానీ ఆయన గొప్పదనం అర్థం కాదు’’ అంటాడు ‘లింకన్స్ మెలంకలి’ పుస్తకం రాసిన వోల్ఫ్ షెంక్. నిజానికి లింకన్ బాధపడినట్లు, ఏ ప్రసిద్ధ నాయకుడూ ‘డిప్రెషన్’తో బాధ పడి ఉండడు. అయినప్పటికీ ఆయన గత జ్ఞాపకాల భారంతో బాధ పడినట్లు అనిపించదు. ఆయన విజయాలకేమీ అది అడ్డుపడలేదు. ఒకే కోణం అని కాకుండా... లింకన్‌లోని రకరకాల డిప్రెసివ్ టెండెన్సీలను ఈ డాక్యుమెంటరీ స్పృశిస్తుంది. దీనికి సంబంధించి లింకన్ ఉత్తరాల నుంచి కొన్ని వాక్యాలను కూడా ఉదహరించారు. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీలో ప్రపంచానికి తెలిసిన లింకన్ వెలుగులు లేవు. తెలియని చీకటి ప్రపంచం ఉంది. ఆ చిమ్మ చీకట్లోనే ప్రకాశించే నిలువెత్తు లింకన్ సంతకం ఉంది. -యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: లింకన్ డెరైక్టర్: విక్రమ్ జయంతి డెరైక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎమ్మా మాథ్యూ -
ఉప్పమ్మా... తప్పెవరిదో చెప్పమ్మా?!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘ఉప్పు సత్యాగ్రహం’ పుణ్యమా అని ‘ఉప్పు’ అనేది ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. అది వంటలో వాడే దినుసు స్థాయి నుంచి చైతన్య ప్రతీక స్థాయికి, ఆత్మాభిమానపు పతాక స్థాయికి ఎదిగింది. అయితే, ఇప్పుడు ఉప్పు గురించి మాట్లాడుకోవడమంటే... గుజరాత్‌లోని ‘రణ్ ఆఫ్ కచ్’లో ఉప్పు పండించే కార్మికుల కన్నీళ్ల గురించి అనివార్యంగా మాట్లాడుకోవడం కూడా. చైనా, అమెరికాల తరువాత ఉప్పును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. ఇదేదో ‘ఘనత’లాగా ధ్వనిస్తున్నప్పటికీ, ఉప్పు తయారుచేసే శ్రామికుల కష్టాల్లోకి వెళితే మనసు దుఃఖతీరం అవుతుంది. ‘మై నేమ్ ఈజ్ సాల్ట్’ డాక్యుమెంటరీ మనల్ని ఆ తీరానికి తీసుకువెళుతుంది. మనదే అయినా మనది కాని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో రెండు కోణాలు మనకు పరిచయం అవుతాయి. పరిమితమైన సంప్రదాయవనరులతో ఉప్పును పండించడం ఎంత కష్టమైన పని అనేది ఒక కోణం అయితే, పొట్ట చేతపట్టుకొని అనువుగాని చోట అష్టకష్టాలు పడుతూ ఎనిమిది నెలలు గడిపే శ్రామికుల జీవనశైలి పరిచయం కావడం... రెండో కోణం. ఈ ఎనిమిది నెలల కాలంలో వారి మానసిక, భౌతిక ప్రపంచాలు ఎలా ఉంటాయో ‘మై నేమ్ ఈజ్ సాల్ట్’ కళ్లకు కడుతుంది. వారి కళ్లవైపు ఒకసారి చూడండి... కనిపించే కన్నీళ్లు, కనిపించని కన్నీళ్లు ఉంటాయి. రెండూ ఒకే రకమైన కథలు చెబుతాయి! కాళ్ల వైపు చూడండి ఒకసారి. ఉప్పు మడులలో నానీ నానీ సెప్టిక్ అయిన కాళ్లు... ఎన్ని కథలు చెబుతాయో వినండి! రణ్ ఆఫ్ కచ్‌లో ఉప్పు పండించే కార్మికులు... ఎవరూ 50 నుంచి 60 సంవత్సరాలకు మించి బతకరట. చిత్రమేమిటంటే, చావు తరువాత కూడా ఉప్పు వారిని వెంటాడుతూనే ఉంటుంది. సాల్ట్ కంటెంట్ వల్ల శవం చేతులు, కాళ్లు చితిమంటలకు లొంగవు. మరి కోరి కోరి ఈ నరకంలోకి ఎందుకు వస్తున్నట్లు? ‘‘సారీ... మేము మాత్రం నరకం అనుకోవడం లేదు’’ అంటాయి వారి కళ్లు. ‘‘మా ముత్తాతలు ఈ పనిచేశారు. మా తాతలు చేశారు. నాన్న చేశాడు. ఇప్పుడు మేము చేస్తున్నాం. రాబోయే కాలంలో మా బిడ్డలు చేస్తారు. ఇదీ లెక్క...’’ అంటారు వాళ్లు. ఇది తరతరాలుగా క్రమం తప్పని లెక్క. పెట్టుబడిదారి దోపిడి, అసంఘటిత కార్మిక కష్టం... ఇలాంటివాటి గురించి వారు పెద్దగా ఆలోచించినట్లుగా కూడా అనిపించదు. ‘‘ఉప్పు పండించడం అంటే, కూరలో ఉప్పేసుకున్నంత తేలిక కాదు, అష్టకష్టాలు పడినా అదృష్టం కలిసిరావాలి. మంచి ధర రావాలంటే ‘నాణ్యమైన ఉప్పు’ చేతికందాల్సిందే’’ అంటాడు సనాభాయి అనే కార్మికుడు. ఆయన భార్య దేవుబెన్ విషాద మౌనం కూడా ఎన్నో అజ్ఞాత కథలను చెబుతున్నట్లుగానే అనిపిస్తుంది. ‘‘ప్రతి వంటకంలో ఉప్పు అతి ముఖ్యమైనది అంటారు. ఆ ఉప్పును పండించే మేము మాత్రం... ఎవరికీ ముఖ్యం కాదు’’ అనేది కచ్ కార్మికుల ఉమ్మడి వేదన. ‘కచ్’ అంటే సంస్కృతంలో ‘ద్వీపం’ అని అర్థం. ఇక్కడ ఉప్పు పండించే కార్మికుల పరిస్థితి... నిజంగా ద్వీపంలో ఉన్నట్లుగానే ఉంటుంది. మన నిత్యావసర వస్తువులేవీ అక్కడ కనిపించవు. ఎనిమిది నెలల పాటు ఆలుగడ్డ కూర, రొట్టె తప్ప తినడానికి పెద్దగా ఏమీ ఉండదు. ‘పాలు’ దొరకడం అనేది ఊహకు కూడా అందని విషయం. అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల నేవిగేషన్ కోసం అద్దపు ముక్కలను వాడుతూ కాంతి సందేశాలు పంపుకుంటారు. ‘‘ఇన్ని కష్టాలు పడడం అవసరమా?’’ అని చాలామంది అనుకున్నట్లుగానే ఉప్పు పండించే కార్మికులపై మూడు పుస్తకాలు రాసిన అంబూ పటేల్ కూడా అనుకున్నాడు. ‘‘ఎందుకు ఇంత కష్టం?’’ అని అడిగాడు కూడా. ‘‘మరో ప్రత్యామ్యాయం ఏమున్నది?’’ అంటారు వాళ్లు. ఇదంతా సరే, ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఈ అసంఘటిత కార్మికులకు రబ్బరు బూట్లు, గ్లోవ్స్, ఐ గ్లాసులు, స్వచ్ఛమైన నీరు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం వారి సాల్ట్ కమిషనర్లు చెబుతారు. పిల్లలకు పాఠాలు చెప్పడానికి స్వచ్ఛంద సేవకులు బడులతో సహా ఇక్కడికి వస్తారు. రకరకాల అధ్యయనాలు ‘రణ్ ఆఫ్ కచ్’ కార్మికుల ఆరోగ్యస్థితిగతులు, ప్రమాద తీవ్రతను గురించి హెచ్చరించినట్లుగానే అనిపిస్తాయి. ఎన్ని జరిగినా, ఎన్ని ప్రమాద హెచ్చరికలు వినిపించినా అదేమిటో మరి... ఏ మార్పు కనిపించని నిశ్చల చిత్రంలాగే ఉంటుంది ‘కచ్’ కార్మికుల పరిస్థితి. డాక్యుమెంటరీ పూర్తయిన తరువాత ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిల్చొని అడుగుతుంది - ఇంతకీ తప్పెవరిది? మార్పు కోరుకోని కార్మికులదా? వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపలేని ప్రభుత్వానిదా? ఒకవేళ విధిరాత ఉండి ఉంటే... విధిరాతదా?! - యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: మై నేమ్ ఈజ్ సాల్ట్ దర్శకత్వం: ఫరీదా పచ డెరైక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కొనెర్మాన్