ఆ సమాధులు... సమాధానాలు అడుగుతున్నాయి! | Asking for answers to the tombs | Sakshi
Sakshi News home page

ఆ సమాధులు... సమాధానాలు అడుగుతున్నాయి!

Published Wed, Apr 1 2015 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

ఆ సమాధులు... సమాధానాలు అడుగుతున్నాయి!

ఆ సమాధులు... సమాధానాలు అడుగుతున్నాయి!

దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం
 
ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల
 పరిచయమే... ఈ దృశ్యం.  ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.  డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
 
బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ యూనియన్ భవంతిలో ‘ఇట్స్ ఏ గర్ల్’ ప్రదర్శన పూర్తయిన తరువాత... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మంచిచెడులు, కెమెరా నైపుణ్యం, దర్శకుడి ప్రతిభ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడ లేదు. పెద్దగా ఏమిటి? అసలు ఎవరూ మాట్లాడలేదు. గొంతులో మాటలు లేవు. కంట్లో మాత్రం కన్నీటిబావులు!

ఎవరో అన్నారు మెల్లగా... ‘‘మనలో ఇంత క్రూరత్వం ఉందా!’’ అని. అంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడాలనిపించలేదు. అది ఆయస సమస్య మాత్రమే కాదు. ప్రేక్షకులందరి సమస్య. ఇక మనం ప్రధాన సమస్యలోకి వద్దాం...
   
‘ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య’ ‘ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన భర్త’ ‘చెత్తకుండీలో మరో ఆడశిశువు’ ఇవి పత్రికల్లో నిత్యం కనిపించే కాలాతీతమైన వార్తలు. ఈ హత్యలు నిన్న జరిగాయి. ఇవ్వాళ జరుగుతున్నాయి. రేపు కూడా జరుగుతాయి. ఏ నేరం చేశారని, చేస్తారని కడుపులో పిల్లని కడుపులోనే చంపేస్తున్నారు?! ఇది ఒక దేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు, అభివృద్ధికి, అభివృద్ధి లేమికీ సంబంధం లేకుండా చాలా దేశాల్లో పచ్చి నెత్తుటిలా మెరుస్తున్న సమస్య. అధిక జనాభా ఉన్న భారత్, చైనాలాంటి దేశాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. అందుకే ‘ఇట్స్ ఏగర్ల్’ ఈ రెండు దేశాలను కేంద్రంగా తీసుకుంది.
   
మొదటి దృశ్యంలో ఒక మహిళ (ఇండియా) తన చేతులతో ఎనిమిదిమంది ఆడశిశువులను పురిట్లోనే ఎలా చంపింది చెబుతుంది. వారిని సమాధి చేసిన ప్రదేశం కూడా చూపుతుంది. ఆ స్థలాన్ని చూసిన వాళ్లకు-  ‘‘మమ్మల్ని ఎందుకు చంపేశారు?’’ అనే ప్రశ్న దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తుంది.  తన బిడ్డల హత్య గురించి చెబుతున్నప్పుడు ఆ తల్లి కళ్లలో ఎలాంటి భావోద్వేగాలు కానరావు. అయితే ఒకమాట మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో అంటుంది...  ‘‘స్త్రీకి జీవితాన్ని ఇచ్చే శక్తి ఉంది. తీసుకునే శక్తి కూడా ఉంది’’
 ఆమె కరుడుగట్టిన నేరస్థురాలేమీ కాదు... మామూలు గృహిణియే... మరి ఎందుకు ఆమె అంత క్రూరంగా మారిపోయింది. అది క్రూరత్వమేనా? ఆడశిశువులను చంపేయడం తప్పేమీ కాదనే నమ్మకం తాలూకు ధీమా?!

ప్రపంచమంతా తిరుగుతూ పౌరహక్కుల ఉల్లంఘలపై, ప్రభుత్వహింసపై డాక్యుమెంటరీలు తీసే డేవిస్ ఒకరోజు ఇండియా, చైనాల్లో కొనసాగుతున్న గర్భస్థశిశు మరణాల గురించి విన్నాడు. ఆ క్రమంలో ఇండియా, చైనాల్లో పర్యటిస్తూ నాలుగు సంవత్సరాల కాలాన్ని తన డాక్యుమెంటరీ కోసమే వెచ్చించాడు. ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనే ముందస్తు ప్రణాళికలేవీ వేసుకోకుండానే కెమెరాతో రంగంలోకి దిగాడు. తాను ఈ రెండు దేశాల్లో తిరుగుతున్న రోజుల్లో ఎన్నో చేదు నిజాలు తెలిసాయి. పసిపిల్లలను రకరకాలుగా ఎలా చంపుతారో సూటిగానో, ఆ నోటో ఈ నోటో విని షాక్‌కు గురయ్యాడు.

 తమకు పుట్టబోయేది ఆడశిశువని తెలుసుకొని గర్భంలో బిడ్డని గర్భంలోనే చంపేసేవాళ్లు కొందరు. ఈ పనిని మొరటుగా చేసేవాళ్లు కొందరు. ఆధునిక వైద్య సహకారంతో చేసే వాళ్లు కొందరు.  కొందరు గొంతు నులిమి చంపుతారు!  కొందరు తల్లులు తాము ఇచ్చే పాలకు విషాన్ని కలిపి, పసి బిడ్డ చేత తాగించి చంపుతారు!  ఒక దృశ్యంలో ఒక మహిళ అంటుంది... ‘‘ఆడపిల్లగా పుట్టి రోజూ చావడం కంటే ఒక్కసారే చనిపోవడం నయం కదా!’’ అని. ఈ మాటల్లో ఆమె క్రూరత్వం కంటే ఈ రోగగ్రస్థవ్యవస్థ క్రూరత్వమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. పేదరికమే ఈ శిశుహత్యలకు కారణం అని మనం ఒక నిర్ధారణకు వచ్చేలోపే... అదేమీ కాదు... అన్ని సామాజిక,ఆర్థిక వర్గాల్లోనూ ఇది ఉంది అని డా.మిట్టు ఖురాన (ఇండియా) ఉదంతం చెబుతుంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తారు కుటుంబపెద్దలు. మిట్టు కడుపులో ఉన్నది ఇద్దరు ఆడశిశువులు అనే విషయం తెలియగానే భర్త, అత్తమామలు మిన్ను విరిగి మీద పడిపోతున్నట్లుగా వణికిపోతారు. ‘అబార్షన్’ చేయించడానికి సకల ప్రయత్నిస్తారు. అయితే ‘అబార్షన్’ను మిట్టు బలంగా తిరస్కరిస్తుంది . దీంతో భర్త ఆమె పట్ల క్రూరంగా వ్యవహరిస్తాడు. గదిలో పెట్టి తాళం వేస్తాడు.
   
‘అక్రమ వలసదారులు’ అనే మాట మనం వింటుంటాం. అయితే చైనాలో మాత్రం దీని కంటే ‘అక్రమ సంతానం’ అనే మాటే ఎక్కువ వినిపిస్తుంది. అక్కడ ‘వన్ చైల్డ్ పాలసీ’ అమల్లో ఉంది. పరిమితి కంటే ఎక్కువమంది పిల్లల్ని కంటే, ఆ పిల్లలు ‘అక్రమ సంతానం’ జాబితాలో చేరిపోతారు.

ఒక ఫ్యాక్టరీలో పని చేసే లీ ఫాంగ్ గర్భవతి అని తెలుసుకొని పోలీసులు ఇంటి మీద దాడి చేయడానికి వచ్చేలోపే భార్యాభర్తలిద్దరూ ఊరిని విడిచి పారిపోతారు. ఆమె ఒక రహస్య ప్రదేశంలో శిశువుకు జన్మనిస్తుంది. ఈ పిల్ల పెరిగి పెద్దయ్యాక చదువు, ఆరోగ్య సౌకర్యాలు ఉండే అవకాశాలు బొత్తిగా లేవు. లీగల్‌గా పని చేసుకోవడానికీ ఉండదు. ఇలాంటి వారి కన్నీటిని కూడా ఈ డాక్యుమెంటరీ తడుముతుంది. దీంతో పాటు మన దేశంలోని కట్నకానుకల వ్యవస్థ, ఆచారాలలోని మూఢత్వం, సాంస్కృతిక ప్రమాణాలలోని వైరుధ్యాలను చర్చిస్తుంది. ఆడపిల్లలపై ఉన్న రకరకాల సామెతలను ఉటంకిస్తుంది. ‘‘ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం భుజాలు తడుముకోవడం కాదు. భయపడి కళ్లు మూసుకోవడం కాదు... ‘చూశాం కదా... ఒక పనైపోయింది కదా!’ అనుకోవడం కూడా కాదు. ఏ మూల నుంచి చిన్న మార్పు వచ్చిన చాలు నా డాక్యుమెంటరీ న్యాయం జరిగినట్లే’’ అని తన మనసులో మాటను డెరైక్టర్‌గా చెప్పారు డెరైక్టర్. నిజమే కదా!
 - యాకుబ్ పాషా యం.డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement