Feature Film
-
Cannes Film Festival 2022: అట్టహాసంగా ముగిసిన కాన్స్ వేడుకలు
ఫ్రాన్స్‌లో మొదలైన 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో దాదాపు 21 అవార్డులు అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పామ్ డీ ఆర్’ అవార్డును స్వీడెన్ ఫిల్మ్‌మేకర్ రూబెన్ ఓస్ట్లండ్ దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’కు ‘పామ్ డీఆర్’ అవార్డు లభించింది. రూబెన్స్ తెరకెక్కించిన ఫిల్మ్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. 2017లో ‘ది స్వైర్’ చిత్రానికిగాను కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డు అందుకున్నారాయన. విలాసవంతమైన విహారయాత్రకు ఆహ్వానించబడ్డ ఇద్దరు ఫ్యాషన్ మోడల్ సెలబ్రిటీల నేపథ్యంలో ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’ సాగుతుంది. ‘కాన్స్’ చలన చిత్రోత్సవంలో రెండో గొప్ప అవార్డుగా భావించే గ్రాండ్ ప్రైజ్‌ను రెండు సినిమాలు పంచుకున్నాయి. క్లైరే డెనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టార్స్ ఎట్ నైట్’, లుకాస్ థోన్స్ దర్శకత్వంలోని ‘క్లోజ్’ చిత్రాలు గ్రాండ్ ప్రైజ్‌ను పంచుకున్నాయి. జ్యూరీ ప్రైౖజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ‘ఈవో’(జెర్జిస్కో లిమౌస్కీ దర్శకుడు), ‘ది ఎయిట్ మౌంటెన్స్’ (ఫెలిక్స్ వాన్స్ – చార్లెట్ దర్శకులు) చిత్రాలకు జ్యూరీ అవార్డు దక్కింది. ‘బ్రోకర్’కి సాంగ్– కాంగ్ హూ ఉత్తమ నటుడిగా, ‘హోలీ స్పైడర్ ’ చిత్రానికి ఇరానీ యాక్ట్రస్ జార్ అమిర్ ఇబ్రహీమి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘డెసిషన్స్ టు లీవ్’ చిత్రాని పార్క్ చాన్స్ హూక్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఇండియా డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కి అవార్డు 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్ ఐ’ అవార్డు దక్కింది. షౌనక్ సేన్స్ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే ఇద్దరు బ్రదర్స్ గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్కైట్స్ బర్డ్స్ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు? అనే అంశాలతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఉంటుంది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ‘సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా ‘ఆల్ దట్ బ్రీత్స్’కి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా కాన్స్ చలన చిత్రోత్సవాల స్పెషల్ జ్యూరీ విభాగంలో ‘మేరిముపోల్ 2’ (మాంటస్ దర్శకుడు) డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. రష్యా, ఉక్రెయిన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో డాక్యుమెంటరీ షూటింగ్ నిమిత్తం మేరియుపోల్ వెళ్లారు లిథువేనియన్స్ దర్శకుడు మాంటస్. ఏప్రిల్‌లో రష్యా బలగాల దాడుల్లో ఖైదు కాబడిన మాంటస్ ఆ తర్వాత చనిపోయారనే వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ ‘జాయ్‌లాండ్’ కి ‘అన్ సర్టెన్ రిగార్డ్ కేటగిరీ’ విభాగంలో జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా 75వ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ దీపికా పదుకొనెతో పాటు మరికొంతమంది తారల రెడ్ కార్పెట్ వాక్స్ హైలైట్‌గా నిలిచాయి. -
కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?
మేక్సిమ్ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీ అయిన ‘కూళాంగల్’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బస్ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సన్నివేశం ‘కూళాంగల్’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్. మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది. ‘కూళాంగల్’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట. కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్’ సినిమాలు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్ వరకూ చేరాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్’ వంటి సినిమాలు చెబుతున్నది అదే. కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. - ‘కూళాంగల్’ నిర్మాత నయనతార -
ఆ సమాధులు... సమాధానాలు అడుగుతున్నాయి!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ యూనియన్ భవంతిలో ‘ఇట్స్ ఏ గర్ల్’ ప్రదర్శన పూర్తయిన తరువాత... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మంచిచెడులు, కెమెరా నైపుణ్యం, దర్శకుడి ప్రతిభ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడ లేదు. పెద్దగా ఏమిటి? అసలు ఎవరూ మాట్లాడలేదు. గొంతులో మాటలు లేవు. కంట్లో మాత్రం కన్నీటిబావులు! ఎవరో అన్నారు మెల్లగా... ‘‘మనలో ఇంత క్రూరత్వం ఉందా!’’ అని. అంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడాలనిపించలేదు. అది ఆయస సమస్య మాత్రమే కాదు. ప్రేక్షకులందరి సమస్య. ఇక మనం ప్రధాన సమస్యలోకి వద్దాం... ‘ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య’ ‘ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన భర్త’ ‘చెత్తకుండీలో మరో ఆడశిశువు’ ఇవి పత్రికల్లో నిత్యం కనిపించే కాలాతీతమైన వార్తలు. ఈ హత్యలు నిన్న జరిగాయి. ఇవ్వాళ జరుగుతున్నాయి. రేపు కూడా జరుగుతాయి. ఏ నేరం చేశారని, చేస్తారని కడుపులో పిల్లని కడుపులోనే చంపేస్తున్నారు?! ఇది ఒక దేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు, అభివృద్ధికి, అభివృద్ధి లేమికీ సంబంధం లేకుండా చాలా దేశాల్లో పచ్చి నెత్తుటిలా మెరుస్తున్న సమస్య. అధిక జనాభా ఉన్న భారత్, చైనాలాంటి దేశాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. అందుకే ‘ఇట్స్ ఏగర్ల్’ ఈ రెండు దేశాలను కేంద్రంగా తీసుకుంది. మొదటి దృశ్యంలో ఒక మహిళ (ఇండియా) తన చేతులతో ఎనిమిదిమంది ఆడశిశువులను పురిట్లోనే ఎలా చంపింది చెబుతుంది. వారిని సమాధి చేసిన ప్రదేశం కూడా చూపుతుంది. ఆ స్థలాన్ని చూసిన వాళ్లకు- ‘‘మమ్మల్ని ఎందుకు చంపేశారు?’’ అనే ప్రశ్న దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తుంది. తన బిడ్డల హత్య గురించి చెబుతున్నప్పుడు ఆ తల్లి కళ్లలో ఎలాంటి భావోద్వేగాలు కానరావు. అయితే ఒకమాట మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో అంటుంది... ‘‘స్త్రీకి జీవితాన్ని ఇచ్చే శక్తి ఉంది. తీసుకునే శక్తి కూడా ఉంది’’ ఆమె కరుడుగట్టిన నేరస్థురాలేమీ కాదు... మామూలు గృహిణియే... మరి ఎందుకు ఆమె అంత క్రూరంగా మారిపోయింది. అది క్రూరత్వమేనా? ఆడశిశువులను చంపేయడం తప్పేమీ కాదనే నమ్మకం తాలూకు ధీమా?! ప్రపంచమంతా తిరుగుతూ పౌరహక్కుల ఉల్లంఘలపై, ప్రభుత్వహింసపై డాక్యుమెంటరీలు తీసే డేవిస్ ఒకరోజు ఇండియా, చైనాల్లో కొనసాగుతున్న గర్భస్థశిశు మరణాల గురించి విన్నాడు. ఆ క్రమంలో ఇండియా, చైనాల్లో పర్యటిస్తూ నాలుగు సంవత్సరాల కాలాన్ని తన డాక్యుమెంటరీ కోసమే వెచ్చించాడు. ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనే ముందస్తు ప్రణాళికలేవీ వేసుకోకుండానే కెమెరాతో రంగంలోకి దిగాడు. తాను ఈ రెండు దేశాల్లో తిరుగుతున్న రోజుల్లో ఎన్నో చేదు నిజాలు తెలిసాయి. పసిపిల్లలను రకరకాలుగా ఎలా చంపుతారో సూటిగానో, ఆ నోటో ఈ నోటో విని షాక్‌కు గురయ్యాడు. తమకు పుట్టబోయేది ఆడశిశువని తెలుసుకొని గర్భంలో బిడ్డని గర్భంలోనే చంపేసేవాళ్లు కొందరు. ఈ పనిని మొరటుగా చేసేవాళ్లు కొందరు. ఆధునిక వైద్య సహకారంతో చేసే వాళ్లు కొందరు. కొందరు గొంతు నులిమి చంపుతారు! కొందరు తల్లులు తాము ఇచ్చే పాలకు విషాన్ని కలిపి, పసి బిడ్డ చేత తాగించి చంపుతారు! ఒక దృశ్యంలో ఒక మహిళ అంటుంది... ‘‘ఆడపిల్లగా పుట్టి రోజూ చావడం కంటే ఒక్కసారే చనిపోవడం నయం కదా!’’ అని. ఈ మాటల్లో ఆమె క్రూరత్వం కంటే ఈ రోగగ్రస్థవ్యవస్థ క్రూరత్వమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. పేదరికమే ఈ శిశుహత్యలకు కారణం అని మనం ఒక నిర్ధారణకు వచ్చేలోపే... అదేమీ కాదు... అన్ని సామాజిక,ఆర్థిక వర్గాల్లోనూ ఇది ఉంది అని డా.మిట్టు ఖురాన (ఇండియా) ఉదంతం చెబుతుంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తారు కుటుంబపెద్దలు. మిట్టు కడుపులో ఉన్నది ఇద్దరు ఆడశిశువులు అనే విషయం తెలియగానే భర్త, అత్తమామలు మిన్ను విరిగి మీద పడిపోతున్నట్లుగా వణికిపోతారు. ‘అబార్షన్’ చేయించడానికి సకల ప్రయత్నిస్తారు. అయితే ‘అబార్షన్’ను మిట్టు బలంగా తిరస్కరిస్తుంది . దీంతో భర్త ఆమె పట్ల క్రూరంగా వ్యవహరిస్తాడు. గదిలో పెట్టి తాళం వేస్తాడు. ‘అక్రమ వలసదారులు’ అనే మాట మనం వింటుంటాం. అయితే చైనాలో మాత్రం దీని కంటే ‘అక్రమ సంతానం’ అనే మాటే ఎక్కువ వినిపిస్తుంది. అక్కడ ‘వన్ చైల్డ్ పాలసీ’ అమల్లో ఉంది. పరిమితి కంటే ఎక్కువమంది పిల్లల్ని కంటే, ఆ పిల్లలు ‘అక్రమ సంతానం’ జాబితాలో చేరిపోతారు. ఒక ఫ్యాక్టరీలో పని చేసే లీ ఫాంగ్ గర్భవతి అని తెలుసుకొని పోలీసులు ఇంటి మీద దాడి చేయడానికి వచ్చేలోపే భార్యాభర్తలిద్దరూ ఊరిని విడిచి పారిపోతారు. ఆమె ఒక రహస్య ప్రదేశంలో శిశువుకు జన్మనిస్తుంది. ఈ పిల్ల పెరిగి పెద్దయ్యాక చదువు, ఆరోగ్య సౌకర్యాలు ఉండే అవకాశాలు బొత్తిగా లేవు. లీగల్‌గా పని చేసుకోవడానికీ ఉండదు. ఇలాంటి వారి కన్నీటిని కూడా ఈ డాక్యుమెంటరీ తడుముతుంది. దీంతో పాటు మన దేశంలోని కట్నకానుకల వ్యవస్థ, ఆచారాలలోని మూఢత్వం, సాంస్కృతిక ప్రమాణాలలోని వైరుధ్యాలను చర్చిస్తుంది. ఆడపిల్లలపై ఉన్న రకరకాల సామెతలను ఉటంకిస్తుంది. ‘‘ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం భుజాలు తడుముకోవడం కాదు. భయపడి కళ్లు మూసుకోవడం కాదు... ‘చూశాం కదా... ఒక పనైపోయింది కదా!’ అనుకోవడం కూడా కాదు. ఏ మూల నుంచి చిన్న మార్పు వచ్చిన చాలు నా డాక్యుమెంటరీ న్యాయం జరిగినట్లే’’ అని తన మనసులో మాటను డెరైక్టర్‌గా చెప్పారు డెరైక్టర్. నిజమే కదా! - యాకుబ్ పాషా యం.డి -
ఐ కెన్ ఫ్లై
A dream is a wish your heart makes... It is a destination you always wanted to reach ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పే సందేశం నుంచి స్ఫూర్తి పొందినట్టుంది ఇంచుమించు ఈ కోట్ కూడా. ‘కష్టంగా కనిపించేవన్నీ అసాధ్యం కావు. ఒకవేళ దేన్నైనా అసాధ్యం అనుకుంటే దాన్ని ఎప్పటికీ సాధించలేవు’... అంటూ పదకొండు నిమిషాల ఛోటా సినిమా ‘ఐ కెన్ ఫ్లై’ యువతలో చక్కని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసింది. లక్ష్యం ఉన్నా... దాన్ని చేరుకొనే రాస్తా ఏదో తెలుసుకోలేని అయోమయంలో కొట్టుకుపోతున్న యువతరం భుజం తట్టి భరోసా ఇచ్చే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు బెల్జియంలోని ఫ్లాండర్స్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పాఠంగా మారింది. హైటెక్ సిటీలో చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవి వీడె ఈ చిత్రానికి రూపకర్త. హాలీవుడ్ సినిమా టేకింగ్‌లను తలపించేలా ఈ చిత్రాన్ని రూపొందించిన రవి తన అనుభవాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నాడు. - హనుమా షార్ట్ ఫిల్మ్స్ తీయడం హాబీ. మా ఊరు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చాక ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికి పది షార్ట్ ఫిల్మ్స్ తీశా. ‘మై లాస్ట్ ఫొటోగ్రాఫ్’కు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులొచ్చాయి. క్రమంగా టార్గెట్ మారి... ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి ట్రయల్‌గానే ‘ఐ కెన్ ఫ్లై’ తీశాం. మాది పది మంది టీమ్. అందులో నలుగురు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. మిగిలినవారిలో ఇద్దరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ‘గాడ్జిల్లా, ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ గ్రాఫిక్స్ టీంలో వర్క్ చేశారు. అంతా కలసి పెట్టుకున్నదే ‘వీకెండ్ క్రియేషన్స్’. ఈ బ్యానర్ కిందే ‘ఐ కెన్ ఫ్లై’ చేశాం. ఎంతో కష్టపడ్డాం... గత ఏడాది డిసెంబర్లో ఈ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో గానీ పూర్తి కాలేదు. నిడివి తక్కువే అయినా... ఒక్కో సన్నివేశానికీ చాలా శ్రమించాల్సి వచ్చింది. భువనగిరి ఫోర్ట్ వద్ద షూటింగ్. ఇంపోర్టెడ్ మోటర్, గోప్రో (హెలికాప్టర్) కెమెరా వంటి అధునాతన పరికరాలు ఉపయోగించాం. ఓ షాట్లో గాలికి పచ్చ గడ్డి కదులుతూ ఉంటుంది. అలాగే ఎత్తయిన కొండ. ఇవన్నీ చూడ్డానికి గ్రాఫిక్స్‌లా ఉన్నా... ఒరిజినల్‌గా చేసినవే. మా క్యామ్ ఓ సారి కొండ కొనపై ఇరుక్కుపోతే... ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించిన పూర్ణ, ఆనంద్ టీమ్ హెల్ప్ చేసింది. గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. దీని నెరేషన్ రికార్డింగ్ యూఎస్‌లో చేశాం. లక్షన్నర రూపాయలు ఖర్చయినా... ఫిల్మ్ ఎంతో రిచ్‌గా వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో దీని ప్రీమియర్ చూసి సినీ పెద్దలు ఇంప్రెస్ అయ్యి... రెండు ఆఫర్లు ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఫిబ్రవరీలో నా దర్శకత్వంలో... మా టీమ్ చిత్ర రంగ ప్రవేశం చేస్తుంది. ఇదీ కథ... చాలా మంది విజయానికి రెండు మూడు అడుగుల దూరంలోనే ఉన్నా... ఆ విషయం గ్రహించలేక చివరి నిమిషంలో డ్రాపయిపోతారు. ‘హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్’... ఇవి గోల్ వైపునకు తీసుకు వెళతాయి. ‘ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇన్డిసిప్లీన్, లేజీనెస్’... ఇవి వెనక్కి లాగుతాయి. ఈ రెండింటినీ కచ్చితంగా బ్యాలెన్స్ చేస్తేనే గోల్‌ను రీచ్ కాగలవు. ఇదే ఈ సినిమా కథ కూడా. ఎంబీబీఎస్‌లో సీటు కోసం నాలుగేళ్లుగా ట్రై చేస్తున్న ఓ యువకుడుకి... దాన్ని సాధించడమంటే గాల్లో ఎగిరినంత. వాళ్ల నాన్నను అడిగితే... ‘ఎస్... యూ కెన్ ఫ్లై’ అంటూ ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహంతోనే యువకుడు ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో చిత్రం ముగుస్తుంది. ‘కీప్ ట్రయింగ్’ అన్నదానికి కాస్త ఎడ్యుకేషన్ మిక్స్ చేసి దీన్ని రూపొందించాం. బెల్జియంలో పాఠం... ఇది చూసిన బెల్జియంలోని ‘వాన్ ఇన్’ పబ్లిషింగ్ సంస్థ నాకు రైట్స్ కోసం మెయిల్ పంపింది. రాయల్టీ చెప్పమంటే... ఓ మంచి కార్యక్రమం కోసం కనుక, నేను దాన్ని ఉచితంగానే వారికి ఇచ్చాను. డీవీడీ వెర్షన్‌గా అక్కడి 150 సెకండ్రీ ఎడ్యుకేషనల్ స్కూల్స్ (ఇక్కడ ఏడు, ఎనిమిది)లో పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నారు. మొత్తం నాలుగు వేల మంది విద్యార్థులకు ఇది రీచ్ అవుతుందని వారు తెలిపారు. నిజంగా ఇదో పెద్ద విజయం మాకు. ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్‌ను ఇలా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఉపయోగించిన సందర్భాలు నాకు తెలిసి ఎక్కడా లేవు. ఇది మా టీమ్‌లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం.మెయిల్ టు sakshicityplus@gmail.com -
మన సినిమాకు మూలపురుషుడు
గత శతాబ్దపు తొలి రోజుల్లో, తెర మీద కదిలే బొమ్మల కళగా చలనచిత్రం ముందుకొస్తున్న మొదటినాళ్ళలో తన సమకాలికులు చాలా మంది కన్నా చలనచిత్ర రూపకల్పనలోని కళనూ, టెక్నిక్‌నూ మరింత మెరుగ్గా అర్థం చేసుకున్న భారతీయుడు-దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన రూపొందించిన తొలి మూవీ ‘రాజా హరిశ్చంద్ర’ (1913). భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి కథాకథనాత్మక చిత్రంగా ఆ సినిమా చరిత్రకెక్కింది. అలా తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శక, నిర్మాత కావడంతో దాదాసాహెబ్ ఫాల్కే ‘భారత చలనచిత్ర పరిశ్రమకు పితామహుడి’గా విశిష్టతను సంపాదించుకున్నారు. ‘దాదాసాహెబ్’గా ప్రసిద్ధుడైన ఆయన అసలు పేరు - ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబకంలో సంస్కృత పండితుల ఇంట జన్మించిన ఆయన ఎంతో శ్రమించి, తన సినీ కళా తృష్ణను తీర్చుకున్నారు. అప్పట్లో అన్నీ ఆయనే: ఈ కళా మాధ్యమం కొత్తగా దేశంలోకి వస్తున్న ఆ రోజుల్లో ఆయన వట్టి దర్శకుడు, నిర్మాతే కాదు. తన సినిమాకు తానే రచయిత, కళా దర్శకుడు, కెమేరామన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్, ప్రాసెసర్, ప్రింటర్, డెవలపర్, ప్రొజెక్షనిస్టు, డిస్ట్రిబ్యూటర్ కూడా అంటే ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కెమేరా, ప్రాసెసింగ్ యంత్రం, ముడి ఫిల్మ్ మినహా మిగతాదంతా దేశవాళీ సాంకేతిక నైపుణ్యంతో ఫాల్కే తొలి ఫీచర్‌ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ తీయడం ఓ చరిత్ర. తెరపై బొమ్మలు కదలడమే తప్ప మాట్లాడని ఆ మూకీ సినీ యుగంలో దాదాపు పాతికేళ్ళ వ్యవధిలో ఆయన 100 సినిమాలు, 30 లఘు చిత్రాలు రూపొందించారు. సినిమా మాట నేర్చి, టాకీలు వచ్చాక ఆయన హిందీ, మరాఠీ భాషల్లో కొల్హాపూర్ సినీటోన్‌కు ‘గంగావతరణ్’ తీశారు. ఫాల్కేకు అదే తొలి టాకీ అనుభవం. తీరా అదే ఆయన ఆఖరి చిత్రం కూడా కావడం విచిత్రం. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలై, చిత్ర పరిశ్రమలో తగినంత గుర్తింపునకు కూడా నోచుకోని ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో కన్నుమూశారు. అత్యున్నత సినీ పురస్కారం: మన దేశ సినీపరిశ్రమకు పునాదులు వేసిన తొలితరం వ్యక్తి ఫాల్కేను నిరంతరం గుర్తు చేసుకొనేందుకు వీలుగా ఆయన శతజయంతి సందర్భంగా ఆయన పేరు మీద భారత ప్రభుత్వం 1969లో ప్రత్యేకంగా ఓ అవార్డును నెలకొల్పింది. అలాగే, శతజయంతి పూర్తయిన వేళ భారత తంతి, తపాలా శాఖ 1971 ఏప్రిల్ 30న ఫాల్కేపై ప్రత్యేక తపాలా బిళ్ళ, కవరు విడుదల చేసింది. భారతీయ సినిమా పురోభివృద్ధికి వివిధ మార్గాలలో విశేషంగా సేవలందించిన సినీ రంగ కురువృద్ధులకు ఒకరికి ప్రతి ఏటా ప్రత్యేక గుర్తింపుగా ఇచ్చే అత్యున్నత పురస్కారమే -‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. దీన్ని ‘భారతీయ ఆస్కార్ అవార్డు‘గా పరిగణిస్తారు. జీవన సాఫల్యంగా ఇచ్చే పురస్కారం 1969లో నటి దేవికారాణి మొదలుకొని తాజాగా 2013వ సంవత్సరానికి గాను కవి, దర్శక, నిర్మాత గుల్జార్ వరకు ఇప్పటి వరకు 45 మంది భారతీయ సినీ దిగ్గజాలను వరించింది. మొదట్లో ఈ పురస్కార గ్రహీతలకు ఓ ప్రశంసా ఫలకం, శాలువా, రూ. 11 వేల నగదుతో సత్కరించేవారు. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చి, గడచిన పదేళ్ళ నుంచి ‘ఫాల్కే అవార్డు గ్రహీత’లను స్వర్ణ కమలం, శాలువా, పది లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డును అందుకున్న తెలుగువారిలో అన్నదమ్ములైన దర్శకుడు బి.ఎన్. రెడ్డి (1974), నిర్మాత బి. నాగిరెడ్డి(’86), అలాగే మూకీ కాలం నుంచి నటుడైన హైదరాబాదీ పైడి జైరాజ్ (’80), దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ (’82), హీరో అక్కినేని నాగేశ్వరరావు (’90), నిర్మాత డి. రామానాయుడు (2009), హైదరాబాద్‌తో అనుబంధమున్న దర్శకుడు శ్యామ్ బెనెగల్ (2005) ఉన్నారు. మన దర్శక, నిర్మాతల్లో, సాంకేతిక నిపుణుల్లో ఆ స్థాయిని అందుకొనే అర్హత ఇంకా చాలామందికి ఉన్నా, ఆ గౌరవం దక్కకపోవడం మాత్రం విషాదమే! - రెంటాల జయదేవ