కాన్స్ చలన చిత్రోత్సవ వేడుకల్లో విజేతలు
ఫ్రాన్స్‌లో మొదలైన 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో దాదాపు 21 అవార్డులు అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పామ్ డీ ఆర్’ అవార్డును స్వీడెన్ ఫిల్మ్‌మేకర్ రూబెన్ ఓస్ట్‌లండ్ దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’కు ‘పామ్ డీఆర్’ అవార్డు లభించింది.
రూబెన్స్ తెరకెక్కించిన ఫిల్మ్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. 2017లో ‘ది స్వైర్’ చిత్రానికిగాను కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డు అందుకున్నారాయన. విలాసవంతమైన విహారయాత్రకు ఆహ్వానించబడ్డ ఇద్దరు ఫ్యాషన్ మోడల్ సెలబ్రిటీల నేపథ్యంలో ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’ సాగుతుంది. ‘కాన్స్’ చలన చిత్రోత్సవంలో రెండో గొప్ప అవార్డుగా భావించే గ్రాండ్ ప్రైజ్‌ను రెండు సినిమాలు పంచుకున్నాయి.
క్లైరే డెనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టార్స్ ఎట్ నైట్’, లుకాస్ థోన్స్ దర్శకత్వంలోని ‘క్లోజ్’ చిత్రాలు గ్రాండ్ ప్రైజ్‌ను పంచుకున్నాయి. జ్యూరీ ప్రైౖజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ‘ఈవో’(జెర్జిస్కో లిమౌస్కీ దర్శకుడు), ‘ది ఎయిట్ మౌంటెన్స్’ (ఫెలిక్స్ వాన్స్ – చార్లెట్ దర్శకులు) చిత్రాలకు జ్యూరీ అవార్డు దక్కింది. ‘బ్రోకర్’కి సాంగ్– కాంగ్ హూ ఉత్తమ నటుడిగా, ‘హోలీ స్పైడర్ ’ చిత్రానికి ఇరానీ యాక్ట్రస్ జార్ అమిర్ ఇబ్రహీమి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘డెసిషన్స్ టు లీవ్’ చిత్రాని పార్క్ చాన్స్ హూక్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు.
ఇండియా డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కి అవార్డు
75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్ ఐ’ అవార్డు దక్కింది. షౌనక్ సేన్స్ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే ఇద్దరు బ్రదర్స్ గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్‌కైట్స్ బర్డ్స్ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు? అనే అంశాలతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఉంటుంది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ‘సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా ‘ఆల్ దట్ బ్రీత్స్’కి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ లభించింది.
కాగా కాన్స్ చలన చిత్రోత్సవాల స్పెషల్ జ్యూరీ విభాగంలో ‘మేరిముపోల్ 2’ (మాంటస్ దర్శకుడు) డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. రష్యా, ఉక్రెయిన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో డాక్యుమెంటరీ షూటింగ్ నిమిత్తం మేరియుపోల్ వెళ్లారు లిథువేనియన్స్ దర్శకుడు మాంటస్. ఏప్రిల్‌లో రష్యా బలగాల దాడుల్లో ఖైదు కాబడిన మాంటస్ ఆ తర్వాత చనిపోయారనే వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ ‘జాయ్‌లాండ్’ కి ‘అన్ సర్టెన్ రిగార్డ్ కేటగిరీ’ విభాగంలో జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా 75వ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ దీపికా పదుకొనెతో పాటు మరికొంతమంది తారల రెడ్ కార్పెట్ వాక్స్ హైలైట్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment