documentary films
-
రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు
మాస్కో: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది రష్యా. వేలాది మంది సైనికులను కోల్పోతున్నా వెనక్కి తగ్గటం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పటికే సైనిక బలగాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకే మొగ్గు చూపిన పుతిన్.. తాజాగా జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌పై దాడి, నియో-నాజీల భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను సినిమా హాళ్లలో ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాడులు మొదలు పెట్టి ఏడాది కావస్తున్న క్రమంలో ఫిబ్రవరి నాటికి ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది క్రెమ్లిన్. ఫిబ్రవరి 1 నాటికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అమలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌లో పాలుపంచుకుని తమ హీరోయిజాన్ని ప్రదర్శించిన వారికి అంకితం చేసే డాక్యుమెంటరీలు తీసేలా పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఆయా సినిమా నిర్మాతలకు సహాయం అందించాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. ఆ దిశగా తీసుకున్న చర్యలపై మార్చి 1 నాటికి నివేదిక సమర్పించాలని రక్షణ మంత్రి సెర్గీ షోయిగూను ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ ప్రాంత అనుకూల దేశంలో నిరాయుధీకరణ, నాజీ భావజాలం కట్టడి అంటూ ఈ సైనిక చర్య చేపట్టారు. ఈ దాడి చెపట్టినప్పటి నుంచి రష్యాలోని అధికార టీవీ ఛానళ్లు.. తమ సైనిక బలగాలను పొగుడుతూ పలు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ వస్తున్నాయి. మరోవైపు.. స్వతంత్ర మీడియా సంస్థలు మూసివేశారు. జర్నలిస్టులు దేశం దాటి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌పై దాడిని ఎవరైనా విమర్శిస్తే జైలు శిక్ష విధించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం ! -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్‌గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
Cannes Film Festival 2022: అట్టహాసంగా ముగిసిన కాన్స్ వేడుకలు
ఫ్రాన్స్‌లో మొదలైన 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో దాదాపు 21 అవార్డులు అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పామ్ డీ ఆర్’ అవార్డును స్వీడెన్ ఫిల్మ్‌మేకర్ రూబెన్ ఓస్ట్లండ్ దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’కు ‘పామ్ డీఆర్’ అవార్డు లభించింది. రూబెన్స్ తెరకెక్కించిన ఫిల్మ్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. 2017లో ‘ది స్వైర్’ చిత్రానికిగాను కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డు అందుకున్నారాయన. విలాసవంతమైన విహారయాత్రకు ఆహ్వానించబడ్డ ఇద్దరు ఫ్యాషన్ మోడల్ సెలబ్రిటీల నేపథ్యంలో ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’ సాగుతుంది. ‘కాన్స్’ చలన చిత్రోత్సవంలో రెండో గొప్ప అవార్డుగా భావించే గ్రాండ్ ప్రైజ్‌ను రెండు సినిమాలు పంచుకున్నాయి. క్లైరే డెనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టార్స్ ఎట్ నైట్’, లుకాస్ థోన్స్ దర్శకత్వంలోని ‘క్లోజ్’ చిత్రాలు గ్రాండ్ ప్రైజ్‌ను పంచుకున్నాయి. జ్యూరీ ప్రైౖజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ‘ఈవో’(జెర్జిస్కో లిమౌస్కీ దర్శకుడు), ‘ది ఎయిట్ మౌంటెన్స్’ (ఫెలిక్స్ వాన్స్ – చార్లెట్ దర్శకులు) చిత్రాలకు జ్యూరీ అవార్డు దక్కింది. ‘బ్రోకర్’కి సాంగ్– కాంగ్ హూ ఉత్తమ నటుడిగా, ‘హోలీ స్పైడర్ ’ చిత్రానికి ఇరానీ యాక్ట్రస్ జార్ అమిర్ ఇబ్రహీమి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘డెసిషన్స్ టు లీవ్’ చిత్రాని పార్క్ చాన్స్ హూక్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఇండియా డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కి అవార్డు 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్ ఐ’ అవార్డు దక్కింది. షౌనక్ సేన్స్ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే ఇద్దరు బ్రదర్స్ గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్కైట్స్ బర్డ్స్ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు? అనే అంశాలతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఉంటుంది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ‘సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా ‘ఆల్ దట్ బ్రీత్స్’కి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా కాన్స్ చలన చిత్రోత్సవాల స్పెషల్ జ్యూరీ విభాగంలో ‘మేరిముపోల్ 2’ (మాంటస్ దర్శకుడు) డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. రష్యా, ఉక్రెయిన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో డాక్యుమెంటరీ షూటింగ్ నిమిత్తం మేరియుపోల్ వెళ్లారు లిథువేనియన్స్ దర్శకుడు మాంటస్. ఏప్రిల్‌లో రష్యా బలగాల దాడుల్లో ఖైదు కాబడిన మాంటస్ ఆ తర్వాత చనిపోయారనే వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ ‘జాయ్‌లాండ్’ కి ‘అన్ సర్టెన్ రిగార్డ్ కేటగిరీ’ విభాగంలో జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా 75వ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ దీపికా పదుకొనెతో పాటు మరికొంతమంది తారల రెడ్ కార్పెట్ వాక్స్ హైలైట్‌గా నిలిచాయి. -
ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం
అగర్తలా : ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడురోజులపాటు జరగనుంది. ఇందులోభాగంగా పురస్కారం పొందిన ఏడు దేశాలకు చెందిన 30 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఫిలిమ్స్ డివిజన్, యునెటైడ్ ఫిలిమ్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (యూఎఫ్పీఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవాన్ని త్రిపుర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి భానులాల్ సహా ప్రారంభించారు. కాగా ఈ 30 చిత్రాల్లో కొన్ని డాక్యుమెంటరీలు, మరికొన్ని లఘు చిత్రాలు, మరికొన్ని యానిమేషన్ సినిమాలు ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియా, భారత్, రొమేనియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బంగ్లాదేశ్, అజర్బైజాన్, నార్వే దేశాల్లో రూపొందాయి.