ఒకానొక అధర్మ... అరాచక రాజ్యమున... | Introduction to Documentary | Sakshi
Sakshi News home page

ఒకానొక అధర్మ... అరాచక రాజ్యమున...

Published Wed, Feb 18 2015 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

ఒకానొక అధర్మ...      అరాచక  రాజ్యమున...

ఒకానొక అధర్మ... అరాచక రాజ్యమున...

దృశ్యం
 
డాక్యుమెంటరీ పరిచయం
 
ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల
 పరిచయమే... ఈ దృశ్యం.
 
 ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.
 డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
 
తాలిబన్‌లు...అనే మాట వినగానే ఒకే రకమైన మానసిక భావన కలగకపోవచ్చు. ఎందుకంటే, వాళ్ల గురించి చదివి ‘భయపడిన’ రోజులు ఉన్నాయి. వాళ్ల నిరర్థక, తెలివిహీన నిబద్ధతకు ‘బాధ పడిన’ కాలాలూ ఉన్నాయి. కొన్ని చేష్టలకు బిగ్గరగా నవ్వుకున్న సందర్భాలూ ఉన్నాయి. దూరంగా ఉన్నాం కాబట్టి...‘తాలిబన్లు అనగా?’ అనే ప్రశ్నకు మన నిఘంటువులలో అనేకానేక అర్థాలు, సమాధానాలు ఉండి ఉండొచ్చు. మరి ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు?

 ముఖ్యంగా 1996-2001 కాలం నాటి ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండేది? ఆ కాలమంతా యావత్ ఆఫ్ఘనిస్తాన్ చిగురుటాకులా గజగజ వొణికింది. వాళ్ల ఉనికి, ప్రాబల్యం ఏ ప్రాంతానికి పరిమితమైనది అనేది పక్కన పెడితే... దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకే రకమైన భయంతో వణికి పోయాయి. వారి చాదస్తం చాదస్తంగానే ఉండిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ మహిళల స్వేచ్ఛకు ప్రమాదకారి అయింది. మహిళల ఆర్థిక, మానసిక ప్రపంచంలో చీకటి నింపింది. తాలిబన్‌ల పాలనలో సరికొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
 
‘మహిళలు ఉద్యోగాలు చేయవద్దు’ ‘ఆడవాళ్లు బిగ్గరగా నవ్వకూడదు’ ‘రేడియో వినవద్దు. టీవి చూడవద్దు...’ ‘ఆడవాళ్లు ఆటలు ఆడవద్దు’ ‘తప్పు చేసిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపండి’

అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌లా లేదు... కన్నీటి బొట్టులా ఉంది. పులి ముందు వణుకుతున్న జింక పిల్ల వలే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటే... మొదటి రెండు రంగులు (నలుపు, ఎరుపు) పచ్చదనాన్ని మింగేసాయి. నల్లటి చీకటి! ఎర్రటి నెత్తురు!!

చారిత్రక విలువతో పోల్చితే... ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈజిప్ట్‌తో పోల్చదగినది. అలాంటి దేశం కాస్తా... ఒకానొక కాలంలో ‘ఆఫ్ఘనిస్తాన్’ అనుకోగానే ‘తాలిబన్’ అని భయంభయంగా ప్రతిధ్వనించేది.
   
రచయిత, డెరైక్టర్ సిద్దిక్... ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివి అమితాశ్చర్యానికి గురయ్యాడు. ఒక అమ్మాయి అబ్బాయిగా మారడం గురించిన వార్త అది. ఈ నేపథ్యంలోకి లోతుగా వెళితే అనేకానేక విషయాలు తెలిశాయి. వాటి సారం ‘ఒసామా’ కథగా రూపుదిద్దుకుంది. పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ లోనే ఈ ఫీచర్ లెంగ్త్ ఫిల్మ్‌ను చిత్రించారు.

పన్నెండు సంవత్సరాల అందమైన అమ్మాయి మరీనాకు అమ్మ, అమ్మమ్మ అండగా ఉంటారు. వాళ్లకు మాత్రం ఏ అండా ఉండదు. మగదిక్కూ ఉండదు. అందుకే ‘‘నువ్వే మా దిక్కు’’ అన్నట్లుగా చిట్టి తల్లివైపు చూస్తారు తల్లీ, కూతుళ్లు. ఇంట్లో పొయ్యి వెలగాలంటే, బయటికి వెళ్లి ఎవరో ఒకరు పని చేయాల్సిందే. మరి ముగ్గురూ ఆడవాళ్లే కదా! తాలిబన్‌లేమో ఆడవాళ్లు బయట కనిపించకూడదు అంటున్నారు. పని చేయకూడదంటున్నారు. అందుకే కన్నీళ్ల మధ్య అమ్మమ్మ అంటుంది...‘ఆడపిల్లలను పుట్టించవద్దని దేవుడిని వేడుకుంటాను’ అని. బాధ పడుతూ కూర్చుంటే, కన్నీళ్లను దిగమింగుకుంటూ కూర్చుంటే పని కాదు కదా! అందుకే జుట్టు కురచగా కత్తిరించి, మగదుస్తులు వేసి మరీనాను మగపిల్లాడిగా మారుస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయి కాదు... ఒసామా అనే పేరుగల అబ్బాయి!
 
ఒక పెద్ద మనిషి దగ్గర పనికి కుదిరిన ఒసామా ఆ తరువాత తాలిబన్‌ల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చేర్చబడుతుంది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి నిజమైన గుర్తింపు బయటపడుతుంది.
 
‘భయం నిండిన కళ్లతో తాలిబన్లను చూసే ఒసామా’ (తొలి దృశ్యంలో) ‘తన గుర్తింపు తెలిసిందనే భయంతో వణికి పోయిన ఒసామా’ (క్లైమాక్స్ ముందు దృశ్యంలో)... ఈ రెండు దృశ్యాల మధ్య జరిగినదంతా ఆ కథకు సంబంధించిన కథ మాత్రమే కాదు... ఆ కాలం నాటి చరిత్రను మార్మికంగానో, ప్రతీకాత్మకంగానో చెప్పడం కూడా. ‘క్షమించగలను. కానీ మరిచిపోలేను’ అనే నెల్సన్ మండేలా మాటతో మొదలయ్యే ఈ చిత్రంలో సుదీర్ఘమైన డైలాగులు, నేపథ్య ఉపన్యాసాల లాంటివేమీ ఉండవు. రకరకాల ప్రతీకల ద్వారా, నిశ్శబ్ద సన్నివేశాల ద్వారా చెప్పవలసిన విషయాన్ని బలంగా చెప్పాడు దర్శకుడు. ఆయన ఎక్కడి నుంచో దిగుమతైన డెరైక్టర్ కాదు... అచ్చంగా ఆఫ్ఘనిస్తానీయుడే. ఆ మట్టి వాసన తెలిసిన వాడే. కనుక సూక్ష్మ అంశాలను కూడా తెర మీదకు తేగలిగాడు. అందుకే ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడి పొయెటిక్ విజువల్ సెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది.

తాలిబన్ల పట్ల పాశ్చాత్య మీడియా చేసిన ‘అతి’ని కెమెరాలోకి అనుమతించకుండా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే నెపంతో తాలిబన్ల ‘అతి’ని వెనకేసుకువచ్చే అతివాదుల ‘అతి’ని దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. గొప్ప విషయం ఏమిటంటే, చిత్రం పూర్తయ్యాక గానీ... మనం చిత్రం చూశామనే భావన రాదు. మనం ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో కలియ తిరుగుతున్నట్లుగానే ఉంటుంది. పేద ఆఫ్ఘాన్‌ల ఇంట్లో గుడ్డి లాంతరు వెలుగులో కూర్చున్నట్లుగానే ఉంటుంది. పిల్లలను పడుకోబెట్టడానికి... ఒసామా అమ్మమ్మ చెప్పిన ఇంద్రధనుస్సు కథలాంటిదేదో విన్నట్లుగానే ఉంటుంది!
 - యాకుబ్ పాషా యం.డి
 
చిత్రం: ఒసామా; దర్శకత్వం, రచన: సిద్దిక్ బర్మాక్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement