the documentary
-
సంచారమే ఎంతో బాగున్నది!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సంచారం అన్నది ఇప్పటి మాట కాదు... ఇప్పటి ప్రయాణం కాదు. జ్ఞానాన్ని వెదుకుతూ చేసిన సంచారం. భవబంధాలను తుంచుకోవడానికి చేసిన సంచారం. దైవాన్ని వెదుకుతూ చేసిన సంచారం. జవాబు దొరకని ప్రశ్నలకు జవాబుల కోసం చేసిన సంచారం. సంచారం అంటే మనల్ని మనం రద్దు చేసుకోవడం. సంకుచిత ప్రపంచం నుంచి సంకెళ్లు లేని విశాల ప్రపంచంలోకి పోవడం. సొంత ఆస్తి అనేది లేకుండా, సంచారమనేదే సొంత ఆస్తి అనుకుంటే, అదే అదృష్టమనుకుంటే ఆ అదృష్టం ఎంతమందికి ఉంది? ఈ దేశంలోని ప్రజలే అయినప్పటికీ, ప్రజలుగా గుర్తించబడని సంచార జాతులకు ఉంది. ఆ సంచార జాతులలో ఒకరైన రాజస్థాన్‌లోని కల్బెలియాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు ప్యారీస్‌కు చెందిన రాఫెల్ ట్రెజ. కల్బెలియా లేదా కబేలియా అనేది రాజస్థాన్‌లో ఒక నృత్యరూపకం. ఈ పేరుతోనే ఆ సంచార తెగను పిలుస్తారు. ఇంకా... సపేరా, జోగిర, జోగి అనే పేర్లతో పిలుస్తారు. ఆయన అక్కడెక్కడో నుంచో రాజస్థాన్‌కు వచ్చి, రెండవతరగతి రైలులో ప్రయాణం చేసి, కల్బెలియాన్లను వెదుకుతూ, వారితో మాట్లాడుతూ, వారి జీవనశైలిని కెమెరాతో చిత్రిస్తూ చేసిన మూడు నెలల ప్రయాణ సారంశమే ‘కోబ్రా జిప్సీ’ డాక్యుమెంటరీ. ఎవరి సంస్కృతి అయినా సరే, సంస్కృతి ఎప్పుడూ గొప్పదే. కల్‌బెలియన్‌ల సంస్కృతి కూడా అంతే. వాళ్ల సంస్కృతీ, సంప్రదాయాలకు ఏ కళాపీఠాలు, గ్రంధరాజాలు పెద్ద పీట వేయకపోవచ్చు. అంతమాత్రాన ఆ సంస్కృతి మనకు పట్టని సంస్కృతి కాదు. అందులో ఒక మార్మిక సౌందర్యం ఉన్నది. ఆ సౌందర్యాన్ని కల్‌బెలియన్‌ల హావభావాల్లో, చిలిపి చేష్టల్లో, నవ్వుల్లో నడకల్లో వెలికి తీశాడు డెరైక్టర్ రాఫెల్. తాను స్వయంగా సంగీత కారుడు కాబట్టి దృశ్యానుగుణమైన సంగీతాన్ని సమకూర్చాడు. కలబెలియన్లలో భిన్నమైన వృత్తులు ఉన్నాయి. కొందరు పాములోళ్లు... పాములు పడతారు. విషాన్ని అమ్ముకొని బతుకుతారు. కొందరు గొర్రెలు కాస్తూ... ఒకచోట ఉండకుండా దేశమంతా తిరుగుతారు. కొందరు పెళ్ళిళ్లకు పేరంటాలకు... నృత్యాలు చేస్తారు. నృత్యాలు నేర్పిస్తారు. కొందరు గుర్రాలనే జీవికగా చేసుకొని బతుకుతుంటారు....ప్రతి వృత్తిలో వారికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను తమకు తోచిన మాటల్లో చెబుతున్నప్పుడు వారి మాటల్లో ఎక్కడా నిరాశ కనిపించదు. ‘మీరు ఎందుకు అలా?’ ‘మేము ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఉదయించదు. ప్రశ్న అడిగితే...జవాబుకు ముందు నవ్వు. జవాబు చెప్పిన తరువాత... అడిగే ప్రశ్న ముందు నవ్వు. ఆ నవ్వు ఉత్త నవ్వు కాదు. జీవితం అంటే లెక్కలు వేసుకోవడం కాదు, లెక్క లేకుండా మనశ్శాంతితో బతకడం అని తెలియజేసే నవ్వు! ప్రకృతిలో మమేకమైనట్లు కనిపించే కల్బెలియాలకు ఆ ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన మూలికలతో వైద్యం చేయడం కూడా వచ్చు. ఒంటె మూత్రంతో వైద్యం చేయడంలో కూడా వీరు నిష్ణాతులు. వాళ్లు చేసే రకరకాల వృత్తులు ఒక ఎత్తు... నృత్యం ఒక ఎత్తు. పుంగి,డోలక్, మోర్చాంగ్, కంజరి... తదితర వాయిద్యాల నేపథ్య సంగీతంలో వారి నృత్యాన్ని చూడడం మరవలేని అనుభవం. పురాణాలు, జానపద కథల్లో నుంచి పుట్టకొచ్చిన ఈ పాటలు కేవలం హుషారుకే పరిమితమైనవి కాదు... సందర్భానుసారంగా రకరకాల భావోద్వేగాలతో ఈ పాటలు ప్రేక్షకులను తాకుతాయి. పెళ్లి నుంచి చావు వరకు... వివిధ కోణాలలో కల్బెలియాల సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతుంది ఈ డాక్యుమెంటరీ. ఒక సన్నివేశంలో ఒక కుర్రాడు తన నాన్న సమాధిని చూపిస్తూ అంటాడు- ‘‘ఇది మా నాన్న ఇల్లు’’ అని! ఇలా రకరకాల సన్నివేశాల్లో వారి సహజభావుకత బయటపడుతుంది. ఇక కల్‌బెలియన్‌ల పెళ్లిసందడి అంతా ఇంత కాదు... పెద్ద పెద్ద మైకుల్లో పాటలు మోగాల్సిందే. డ్యాన్సులు అదరాల్సిందే. పెళ్లికి అబ్బాయిని ఎలా ముస్తాబు చేస్తారు? అమ్మాయిని ఎలా ముస్తాబు చేస్తారు? అనేది వివరంగా చూపారు. సుమారు రెండువేలకు మందికి పైగా ఒకేచోట గుమిగూడే జాతరను... ఈ డాక్యుమెంటరీతో వివరంగా పరిచయం చేశారు రాఫెల్. కట్టెలను కొట్టి వాటిని నల్లటి బొగ్గులుగా మార్చే....వృత్తి నైపుణ్యం కావచ్చు, శ్రమ చేస్తూ కూడా నృత్యం చేసే ఉల్లాస సందర్భం కావచ్చు.... ‘లైఫ్ అంటే అతి పెద్ద సెలబ్రేషన్’అనే కల్బేలియన్ల మార్మిక తాత్వికతను ఈ డాక్యుమెంటరీ ప్రతిబింబిస్తుంది. జిప్సీల సాహసాలను, ప్రకృతితో వారి అనుబంధాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ మన ప్రపంచంలోనే కొత్త ప్రపంచాన్ని చూపుతుంది. ‘కల్బెలియన్లు ఇంకా పాత సంప్రదాయాలనే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు?’ ‘ప్రధాన స్రవంతిలోకి ఎందుకు రావడం లేదు?’ అనే విజ్ఞుల ప్రశ్నకు వారు చెప్పే జవాబు ‘‘ఇవి శివుడు ఆదేశించిన వృత్తులు. వీటి నుంచి దూరమైనామంటే... మాకు శని దాపురించినట్లే... దైవనిర్ణయాన్ని కాదనగల ధైర్యం ఎవరికి ఉంది!’’ అంటారు. ఇదే సమయంలో తమ కానిపా గురువు నేపథ్యంగా కులపురాణాన్ని కూడా నాటకీయంగా వినిపిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే కొత్తతరం ఒకటి బడిలోకి అడుగుపెడుతుంది. చివరి సన్నివేశంలో ఒక సింబాలిక్ షాట్ ఉంది. ఒక తాత తన దారిలో తాను వెళుతుంటాడు. అతని వెనకాలే నడిచొస్తున్న చిన్నపిల్లాడు... ఉన్నట్టుండి కొత్తదారి కేసి పరుగులెత్తుతుంటాడు. ఏంజరగనుంది అనేది భవిష్యత్ చెప్పనుందిగానీ.... ఈ డాక్యుమెంటరీలో వినిపించే ‘యూ లివ్ ఇన్ మీ’ పాటలా... దృశ్యాలూ మనలో చాలాకాలమే ఉండిపోతాయి. - యాకుబ్ పాషా యం.డి -
‘నిర్భయ’ డాక్యుమెంటరీ ప్రసారం నిలుపుదలపై బాలివుడ్ విమర్శలు
విచారణ కూడా ఇదే వేగంతో చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: నిర్భయ ఘటనకు సంబంధించి బ్రీటీష్ దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ(ఇండియన్ డాటర్) ప్రసారం నిలిపివేయడంపై బాలివుడ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. నిలుపుదల విషయంలో వేగంగా నిర్ణయం తీసుకున్నట్లే కేసు విచారణనూ ఇదే వేగంతో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం ఎందుకు వారిపై వేంటనే చర్య తీసుకోకుండా, మూడేళ్లుగా కూర్చోబెట్టి మేపుతున్నారని మండిపడింది. ఈ మేరకు పలువురు బాలివుడ్ ప్రముఖులు అభిషేక్ కపూర్, అనురాగ్ బసు, పునిత్ మల్హోత్రా, సిద్ధార్థ్ తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని ట్వీటర్లో ప్రశ్నించారు. -
మన దేశంలో... రెండు ప్రపంచాల గురించి!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ నిన్నగాక మొన్న సాధ్వీ ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకున్నప్పుడు, అంతకుముందు ఎప్పుడో... అందాల పోటీలో గెలిచిన అమ్మాయి ఆనందబాష్పాలలో మెరిసిన గర్వపురేఖను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు.... ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. ‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అనే ప్రసిద్ధ వాక్యం అందరిలో నింపే స్ఫూర్తిని గురించి కాకుండా... ‘ఇంతకీ ఈ ఆధునిక స్త్రీ ఎవరు?’ అని ఆలోచిస్తే... ఆ ఆలోచనలకు కొనసాగింపే ఈ డాక్యుమెంటరీ చిత్రం. ప్రపంచంలోని దేశాల గురించి కాదు, ఒక దేశంలోని భిన్నమైన ప్రపంచాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన చిత్రం...‘ది వరల్డ్ బిఫోర్ హర్’ ‘ఆధునిక మహిళ ఎవరు?’ అనే ప్రశ్నలో నుంచే పుట్టుకువచ్చించే నిషా పహుజా ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ. ఇందులో రెండు ప్రధాన పాత్రల గురించి చెప్పుకుందాం.రుషి సింగ్: జైపూర్‌కు చెందిన ఈ అమ్మాయికి ‘మిస్ ఇండియా’ కావాలనేది కల. తన కల నెరవేర్చుకొని- ‘‘మా అమ్మాయి ఎంత ఎదిగిపోయిందో చూశారా!’’ అని తల్లిదండ్రులు గొంతు నిండా ఆనందంతో అందరితో చెప్పుకోవాలని, వారి కళ్లలో మెరుపులు చూడాలనేది రుషి కల. ప్రాచీ త్రివేది: రుషి ఆలోచనలకు, కలలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఔరంగబాద్ ‘దుర్గావాహిని’ ఆర్గనైజేషన్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న త్రివేది నిప్పులా బతకాలని, పెళ్లికి దూరంగా ఉండి తన జీవితాన్ని ‘దుర్గావాహిని’కే పూర్తిగా అంకితం చేయాలనుకుంటుంది. ‘ఐ హేట్ గాంధీ’లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె నిస్సంకోచంగా చేస్తుంటుంది. ‘స్త్రీలు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. స్త్రీలు తప్పనిసరిగా పిల్లల్ని కనాలి. ఇవి వారికి దేవుడు నిర్దేశించిన తప్పనిసరి విధులు’ అని నమ్ముతాడు త్రివేది తండ్రి. తన కూతురును చిన్నప్పటి నుంచి అదుపాజ్ఞల్లో ఎలా ఉంచిందీ చెప్పుకోవడం ఆయనకు గర్వంగా ఉంటుంది. హోంవర్క్ విషయంలోనో, మరే విషయంలోనో కూతురు అబద్ధం ఆడిందని కాల్చివాత పెడతాడు. ‘‘కాలిపై ఉన్న ఆ మచ్చను ఎప్పుడు చూసినా, గుర్తొచ్చినా ఇక జన్మలో అబద్దం ఆడదు’’ అని చిరునవ్వుల మధ్య చెప్పుకోవడం కూడా ఆయనకు గర్వంగా అనిపించే విషయం. ఒక మహిళానాయకురాలు ‘దుర్గావాహిని’ సైన్యాన్ని ఉద్దేశించి కాస్త ఆవేశం నిండిన స్వరంతో ఇలా అంటుంది ‘‘స్త్రీ, పురుషులు సమానమని అంటుంటారు. చివరికి రాజ్యాంగం కూడా అదే చెబుతుంది. కాని ఇదెలా సాధ్యం? కెరీర్ వేటలో పాశ్చాత్యకరణకు గురికావద్దు. మాతృత్వం విలువను అందరూ గ్రహించాలి’’ ఒక భర్త తన భార్యతో రెండోకూతురు వద్దంటే వద్దంటాడు. ఆ పిల్లను వదిలించుకుందాం అంటాడు. చంపేద్దాం అంటాడు. లేకుంటే తన దారి తాను చూసుకుంటాను అంటాడు. అలాగే చూసుకుంటాడు. ఒంటరిగానే అమ్మాయిని పెంచి పెద్ద చేస్తుంది ఆ ఇల్లాలు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై ‘మిస్ ఇండియా’ అవుతుంది. ‘‘వదిలించుకుందామనుకున్న అమ్మాయి... ఈరోజు చూడండి ఎంత ఎత్తుకు ఎదిగిందో’’ అని కూతురుని చూసి భావోద్వేగానికి గురవుతుంది అమ్మ. ఆమె కన్నీళ్లలో మన కన్నీళ్లు కూడా జత కలుస్తాయి. పైన చెప్పుకున్న మిస్ ఇండియా-2009 పూజా చోప్రా రుషిసింగ్లాంటి ఆశావహులకు రోల్‌మోడల్ కావచ్చు. ఇంకొందరికి ‘ఫైర్‌బ్రాండ్’ త్రివేది రోల్‌మోడల్ కావచ్చు. ఎవరికి సంబంధించిన బలమైన వాదాలు, పిడివాదాలు, భావజాలాలు, బరువుబాధ్యతలు, సమర్థనలు, సంఘర్షణలు వారికి ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు వాళ్ల దగ్గర ఆశ్చర్యాలు తప్ప సమాధానాలు వినిపించవు. రెండు రకాల భావజాలాలలోని భిన్నమైన వైరుధ్యాలను ఈ డాక్యుమెంటరీ పట్టిస్తుంది. ఒకే దేశానికి చెందిన రెండు ప్రపంచాలు ఇందులో కనిపిస్తాయి. ఈ భిన్నమైన ప్రపంచాలలోనూ ‘స్వీయస్పృహ’ లోపించడంలాంటి సామీప్యతలు కూడా కనిపిస్తాయి. డాక్యుమెంటరీలోకి డెరైక్టర్ చీటికి మాటికి ప్రవేశించి ‘ఇదేమిటి ఇలా?’ ‘అదేమిటి అలా?’ అని ప్రశ్నలు అడిగినట్లు అనిపించదు. దృశ్యాలే ప్రశ్నలవుతాయి. ప్రేక్షకుల ఆలోచనల సంఘర్షణలో నుంచి పుట్టిన సారమే సమాధానం అవుతుంది. ‘‘స్త్రీ అంటే... లార్జెస్ట్ మైనారీటి గ్రూప్ ఇన్ ది వరల్డ్’’ అనే జమైకన్ కవి మాటను విని నిరాశపడకుంటే-‘‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది’’ అనే ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే ‘‘మరి పై రెండు ప్రపంచాలా మధ్య ఆధునిక భారతీయ స్త్రీ ఎక్కడ ఉండాలి?’’ అని ప్రశ్నించుకుంటే- రుషిసింగ్ ‘అందాల ప్రపంచం’లోనా? త్రివేది ‘అతివాద ప్రపంచం’లోనా? అందాల ప్రపంచానికి ఓటు వేస్తే జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందం అనేది మార్కెట్ వస్తువుగా ఎందుకు మారిపోయింది, ‘స్త్రీ అంటేనే అందం..అందం అంటేనే స్త్రీ’ అనే భావనను కలిగిస్తున్న శక్తులు ఏమిటి? ఇండియా ఇండియాలా ఉండకుండా ‘అమెరికనైజేషన్’ ఎందుకవుతుంది? ‘మిస్ ఇండియా’ ‘మిస్ వరల్డ్’ కిరీటాల వెనుక దాగి ఉన్న కుట్రలు ఏమిటి?.... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. పాశ్చాత్యీకరణపై ఒంటికాలిపై నిప్పులు చెరిగే వారు ‘మోరల్ పోలిసింగ్’ను ఏ విధంగా సమర్థించుకుంటారో కూడా చెప్పాల్సి ఉంది. ఏ వైపుకు మొగ్గకుండా... పోస్టర్లో కూర్చున్న అమ్మాయిలా దూరం నుంచి రెండు ప్రపంచాలను చూడడమా? లేదా సముద్రంలా గంభీరమైన మౌనముద్ర దాల్చడమా? అనేది మన మన ఆలోచనలను బట్టి ఉంటుంది. డార్క్ కామెడిలో ఉన్న వెలుగు ఏమిటో తెలియాలంటే కూడా ఈ డాక్యుమెంటరీ చూడవచ్చు. - యాకుబ్ పాషా యం.డి చిత్రం: ది వరల్డ్ బిఫోర్ హర్ రచన, దర్శకత్వం: నిషా పహుజా -
ఒక కరెంట్ దొంగ కథ!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మధ్యతరగతి ప్రజలను ఎప్పటికప్పుడు తాజాగా భయపెట్టే ‘కరెంట్ బిల్లు’ అనేది కాన్పూర్ పేదోళ్ల విషయానికి వస్తే డైనోసార్ లాంటిది. అందుకే దాన్ని దూరం నుంచి చూడాలనుకుంటారు తప్ప, దూరం నుంచి వినాలనుకుంటారు తప్ప... దగ్గరికి వెళ్లరు. మరి వాళ్లకు మాత్రం కరెంట్ అక్కర్లేదా? చీకట్లోనే మగ్గిపోతారా? అదేం లేదు. వారికి కూడా కరెంట్ కావాలి. అందుకే కొద్దిమంది పేదలు కరెంట్ కోసం ‘కతియ’ (కరెంట్ దొంగిలించే తీగ)ను నమ్ముకుంటారు. అదిగో ఆ కొక్కేలను చూడండి. అవి కొక్కేలు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని సవాలు చేసే సమాంతర వ్యవస్థలు. మిగిలిన వాళ్లలాగా భయం భయంగా కరెంట్ వాడుకోనక్కర్లేదు. నిర్భయంగా వాడుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ బిల్లు అనేది ఉంటే కదా! కరెంట్ దొంగలకు చేతిలో కాస్త డబ్బు పెడితే చాలు...‘కరెంట్ బిల్లు’ అనే మాట వినాల్సిన పనే లేదు. పారిశ్రామిక పట్టణమైన కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)లో ఈ కొక్కేల ఇళ్లు చాలా కనిపిస్తాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?! కాన్పూర్ ప్రాంతంలో దొంగ కరెంట్‌ను వినియోగించుకునేవారు పదుల సంఖ్యలో కాదు... వందల సంఖ్యలో కాదు... వేల సంఖ్యలో ఉంటారు. ఆ ‘వేలు’ ఉత్త ‘వేలు’ కాదు.... విలువైన ఓటు బ్యాంకు! ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించడంలో ఈ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలోని చాలామంది రాజకీయ నాయకులను ఈ అక్రమ విద్యుత్ సమస్య గురించి మాట్లాడమంటే కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఫీలైపోతారు. అందుకే వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తారు. దీంతో ప్రజాసంక్షేమ ఎజెండాలో ‘అక్రమ విద్యుత్’ కూడా పెద్ద పీట వేసుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఎనభై నిమిషాల ‘కతియాబాజ్’ (పవర్‌లెస్) డాక్యుమెంటరీ ఏం చెబుతుంది? అక్రమంగా విద్యుత్ వాడుతూ విద్యుత్ సంక్షోభాన్ని సృష్టిస్తున్న వాళ్లది తప్పా? లేక చర్యలు తీసుకోని ప్రభుత్వానిది తప్పా? అనే వాదనల్లో ఏ వైపూ సూటిగా నిలవకుండా, తీర్పు చెప్పినట్లుగా అనిపించకుండా ఒక వాస్తవ చిత్రాన్ని పట్టిస్తుంది.లోహసింగ్...పేరుకి తగినట్లే దృఢకాయుడు. చాలామంది దృష్టిలో అతనొక ‘కరెంట్’ రాబిన్ హుడ్. ఎందుకంటే ప్రభుత్వాన్ని దోచి ప్రజలకు పెడుతున్నాడు! కరెంట్ కొనుగోలు చేయలేని వాళ్లకు కరెంట్ ఇచ్చి... వాళ్ల కళ్లలో కాంతి నింపుతున్నాడు. కరెంట్ దొంగిలించడం అంటే... స్విచ్ వేసి బుగ్గ వెలిగించినంత ఈజీ ఏమీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా మనిషి మసి బొగ్గు కావాల్సిందే. అలా అయిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. లోహసింగ్ జేబులో నిండుగా కనిపించే డబ్బు గురించే చాలా మందికి తెలుసుగానీ... అతడి చేతివేళ్లకు అయిన గాయాల గురించి తక్కువమందికి తెలుసు. ఆ గాయాల గురించి అతడు నాటకీయంగా కథలు కథలుగా చెబుతాడు. ‘‘తమ్ముడూ... ఇంత రిస్క్ అవసరమా?’’ అని అమాయకంగా అడిగితే ‘‘ఆ రిస్కే నా జీవనాధారం. ఇంకో పని తెలియదు’’ అంటాడు గడుసుగా. లోహసింగ్ ఏరికోరి ఈ దందాలోకి రాలేదు. పరిస్థితులు అలా తీసుకువచ్చాయి. వాళ్ల నాన్న ఒక మిల్లులో పనిచేసేవాడు. అది మూతబడడంతో ఆయన బజారున పడ్డాడు. లోహసింగ్ స్కూల్ చదువు కూడా బందైపోయింది. ఆరు సంవత్సరాల వయసులో హోటల్లో కప్పులు కడగడం మొదలైంది. కరెంట్ తీగలను చూస్తూ పెరిగిన లోహసింగ్కు చివరికి ఆ తీగలే జీవనాధారాలయ్యాయి. లోహసింగ్ లాంటి కరెంట్ దొంగల గుండెల్లో కాన్పూర్ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ చీఫ్ అయిన రీతు మహేశ్వరి అదేపనిగా రైళ్లు పరుగెత్తిస్తుంటుంది. ఆమె వృత్తి నిబద్ధత కరెంటు దొంగలకే కాదు, స్థానిక రాజకీయ నాయకులకు కూడా చికాకు తెప్పిస్తుంది. ఒక నాయకుడైతే- ‘‘ఆమె పెద్ద ఆఫీసర్ అయితే కావచ్చు. ఆడదనే విషయం మరవద్దు’’ అని హెచ్చరిస్తాడు కూడా. సోషల్ స్కేల్‌కు చెరో వైపు ఉన్న రీతు, లోహసింగ్లు ఈ ‘కతియాబాజ్’ కథలో కేంద్ర పాత్రలు. ఒకే సమస్యకు సంబంధించి రెండు కోణాలకు లోహసింగ్, రీతు మహేశ్వరీ ప్రతినిధులు. ఇందులో అంతర్భాగంగా జెండర్ కోణం కూడా కనిపిస్తుంది. పూర్తిస్థాయి డాక్యుమెంటరీ తరహాలో కాకుండా సామాన్య ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ‘సినిమాటిక్ టర్మ్స్’ను అనుసరించింది ఈ డాక్యు డ్రామా. ఏం చెప్పనట్లే అనిపించే ‘కతియాబాజ్’ ఎన్నో విషయాలను చెబుతుంది. సమస్యను కాదు... దాని మూలాన్ని చూడండని, కరెంటు దొంగల కాలరు పట్టుకోవడమొక్కటే కాదు... వాళ్ల సమస్యల వేర్లపై కూడా దృష్టి సారించమని అడుగుతుంది. ‘‘ కరెంటు కోతల కాన్పూర్‌కు ఎవరైనా వీఐపి వస్తే అరనిమిషం కూడా కరెంట్ కోత విధించరు. కారణం ఏమిటి?’’ అనే సామాన్యుడి సందేహానికి సమాధానం ఒకటి కావాలి అని అడుగుతుంది. ‘‘మాలాంటి చిన్న దొంగలను పట్టడం కాదు... ఇండస్ట్రీలకు అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న పెద్ద దొంగలను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలి’’ అని అడిగే లోహసింగ్ ప్రశ్నకు జవాబు ఉందా? అని అడుగుతుంది. కాన్పూర్‌లో లోహసింగ్లాంటి కరెంట్ దొంగలు ఉండడంతో పాటు రీతు మహేశ్వరిలాంటి నిజాయితీ మూర్తీభవించిన అధికారులూ ఉంటారు. అయినంత మాత్రాన లోహసింగ్ కరెంట్ దొంగతనాన్ని ఎవరూ ఆపలేరు. ఫిలిబిత్‌కు జరిగిన రీతు ట్రాన్స్ఫర్ను కూడా ఎవరూ ఆపలేరు. అంతా సేమ్ టు సేమ్. కారణం?! ఒక్కసారి కాన్పూర్ ఆకాశం కేసి చూడండి. చిక్కులు చిక్కులుగా కరెంటు తీగలు. వాటిలాగే సమాధానాలు దొరకని చిక్కుప్రశ్నలు!! యాకుబ్ పాషా యం.డి చిత్రం: కతియాబాజ్ దర్శకత్వం: దీప్తి కక్కార్, ఫాహాద్ ముస్తఫా -
ఒకానొక అధర్మ... అరాచక రాజ్యమున...
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తాలిబన్లు...అనే మాట వినగానే ఒకే రకమైన మానసిక భావన కలగకపోవచ్చు. ఎందుకంటే, వాళ్ల గురించి చదివి ‘భయపడిన’ రోజులు ఉన్నాయి. వాళ్ల నిరర్థక, తెలివిహీన నిబద్ధతకు ‘బాధ పడిన’ కాలాలూ ఉన్నాయి. కొన్ని చేష్టలకు బిగ్గరగా నవ్వుకున్న సందర్భాలూ ఉన్నాయి. దూరంగా ఉన్నాం కాబట్టి...‘తాలిబన్లు అనగా?’ అనే ప్రశ్నకు మన నిఘంటువులలో అనేకానేక అర్థాలు, సమాధానాలు ఉండి ఉండొచ్చు. మరి ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు? ముఖ్యంగా 1996-2001 కాలం నాటి ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండేది? ఆ కాలమంతా యావత్ ఆఫ్ఘనిస్తాన్ చిగురుటాకులా గజగజ వొణికింది. వాళ్ల ఉనికి, ప్రాబల్యం ఏ ప్రాంతానికి పరిమితమైనది అనేది పక్కన పెడితే... దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకే రకమైన భయంతో వణికి పోయాయి. వారి చాదస్తం చాదస్తంగానే ఉండిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ మహిళల స్వేచ్ఛకు ప్రమాదకారి అయింది. మహిళల ఆర్థిక, మానసిక ప్రపంచంలో చీకటి నింపింది. తాలిబన్ల పాలనలో సరికొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ‘మహిళలు ఉద్యోగాలు చేయవద్దు’ ‘ఆడవాళ్లు బిగ్గరగా నవ్వకూడదు’ ‘రేడియో వినవద్దు. టీవి చూడవద్దు...’ ‘ఆడవాళ్లు ఆటలు ఆడవద్దు’ ‘తప్పు చేసిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపండి’ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌లా లేదు... కన్నీటి బొట్టులా ఉంది. పులి ముందు వణుకుతున్న జింక పిల్ల వలే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటే... మొదటి రెండు రంగులు (నలుపు, ఎరుపు) పచ్చదనాన్ని మింగేసాయి. నల్లటి చీకటి! ఎర్రటి నెత్తురు!! చారిత్రక విలువతో పోల్చితే... ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈజిప్ట్‌తో పోల్చదగినది. అలాంటి దేశం కాస్తా... ఒకానొక కాలంలో ‘ఆఫ్ఘనిస్తాన్’ అనుకోగానే ‘తాలిబన్’ అని భయంభయంగా ప్రతిధ్వనించేది. రచయిత, డెరైక్టర్ సిద్దిక్... ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివి అమితాశ్చర్యానికి గురయ్యాడు. ఒక అమ్మాయి అబ్బాయిగా మారడం గురించిన వార్త అది. ఈ నేపథ్యంలోకి లోతుగా వెళితే అనేకానేక విషయాలు తెలిశాయి. వాటి సారం ‘ఒసామా’ కథగా రూపుదిద్దుకుంది. పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ లోనే ఈ ఫీచర్ లెంగ్త్ ఫిల్మ్‌ను చిత్రించారు. పన్నెండు సంవత్సరాల అందమైన అమ్మాయి మరీనాకు అమ్మ, అమ్మమ్మ అండగా ఉంటారు. వాళ్లకు మాత్రం ఏ అండా ఉండదు. మగదిక్కూ ఉండదు. అందుకే ‘‘నువ్వే మా దిక్కు’’ అన్నట్లుగా చిట్టి తల్లివైపు చూస్తారు తల్లీ, కూతుళ్లు. ఇంట్లో పొయ్యి వెలగాలంటే, బయటికి వెళ్లి ఎవరో ఒకరు పని చేయాల్సిందే. మరి ముగ్గురూ ఆడవాళ్లే కదా! తాలిబన్లేమో ఆడవాళ్లు బయట కనిపించకూడదు అంటున్నారు. పని చేయకూడదంటున్నారు. అందుకే కన్నీళ్ల మధ్య అమ్మమ్మ అంటుంది...‘ఆడపిల్లలను పుట్టించవద్దని దేవుడిని వేడుకుంటాను’ అని. బాధ పడుతూ కూర్చుంటే, కన్నీళ్లను దిగమింగుకుంటూ కూర్చుంటే పని కాదు కదా! అందుకే జుట్టు కురచగా కత్తిరించి, మగదుస్తులు వేసి మరీనాను మగపిల్లాడిగా మారుస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయి కాదు... ఒసామా అనే పేరుగల అబ్బాయి! ఒక పెద్ద మనిషి దగ్గర పనికి కుదిరిన ఒసామా ఆ తరువాత తాలిబన్ల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చేర్చబడుతుంది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి నిజమైన గుర్తింపు బయటపడుతుంది. ‘భయం నిండిన కళ్లతో తాలిబన్లను చూసే ఒసామా’ (తొలి దృశ్యంలో) ‘తన గుర్తింపు తెలిసిందనే భయంతో వణికి పోయిన ఒసామా’ (క్లైమాక్స్ ముందు దృశ్యంలో)... ఈ రెండు దృశ్యాల మధ్య జరిగినదంతా ఆ కథకు సంబంధించిన కథ మాత్రమే కాదు... ఆ కాలం నాటి చరిత్రను మార్మికంగానో, ప్రతీకాత్మకంగానో చెప్పడం కూడా. ‘క్షమించగలను. కానీ మరిచిపోలేను’ అనే నెల్సన్ మండేలా మాటతో మొదలయ్యే ఈ చిత్రంలో సుదీర్ఘమైన డైలాగులు, నేపథ్య ఉపన్యాసాల లాంటివేమీ ఉండవు. రకరకాల ప్రతీకల ద్వారా, నిశ్శబ్ద సన్నివేశాల ద్వారా చెప్పవలసిన విషయాన్ని బలంగా చెప్పాడు దర్శకుడు. ఆయన ఎక్కడి నుంచో దిగుమతైన డెరైక్టర్ కాదు... అచ్చంగా ఆఫ్ఘనిస్తానీయుడే. ఆ మట్టి వాసన తెలిసిన వాడే. కనుక సూక్ష్మ అంశాలను కూడా తెర మీదకు తేగలిగాడు. అందుకే ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడి పొయెటిక్ విజువల్ సెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. తాలిబన్ల పట్ల పాశ్చాత్య మీడియా చేసిన ‘అతి’ని కెమెరాలోకి అనుమతించకుండా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే నెపంతో తాలిబన్ల ‘అతి’ని వెనకేసుకువచ్చే అతివాదుల ‘అతి’ని దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. గొప్ప విషయం ఏమిటంటే, చిత్రం పూర్తయ్యాక గానీ... మనం చిత్రం చూశామనే భావన రాదు. మనం ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో కలియ తిరుగుతున్నట్లుగానే ఉంటుంది. పేద ఆఫ్ఘాన్ల ఇంట్లో గుడ్డి లాంతరు వెలుగులో కూర్చున్నట్లుగానే ఉంటుంది. పిల్లలను పడుకోబెట్టడానికి... ఒసామా అమ్మమ్మ చెప్పిన ఇంద్రధనుస్సు కథలాంటిదేదో విన్నట్లుగానే ఉంటుంది! - యాకుబ్ పాషా యం.డి చిత్రం: ఒసామా; దర్శకత్వం, రచన: సిద్దిక్ బర్మాక్ -
ఉప్పమ్మా... తప్పెవరిదో చెప్పమ్మా?!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘ఉప్పు సత్యాగ్రహం’ పుణ్యమా అని ‘ఉప్పు’ అనేది ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. అది వంటలో వాడే దినుసు స్థాయి నుంచి చైతన్య ప్రతీక స్థాయికి, ఆత్మాభిమానపు పతాక స్థాయికి ఎదిగింది. అయితే, ఇప్పుడు ఉప్పు గురించి మాట్లాడుకోవడమంటే... గుజరాత్‌లోని ‘రణ్ ఆఫ్ కచ్’లో ఉప్పు పండించే కార్మికుల కన్నీళ్ల గురించి అనివార్యంగా మాట్లాడుకోవడం కూడా. చైనా, అమెరికాల తరువాత ఉప్పును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. ఇదేదో ‘ఘనత’లాగా ధ్వనిస్తున్నప్పటికీ, ఉప్పు తయారుచేసే శ్రామికుల కష్టాల్లోకి వెళితే మనసు దుఃఖతీరం అవుతుంది. ‘మై నేమ్ ఈజ్ సాల్ట్’ డాక్యుమెంటరీ మనల్ని ఆ తీరానికి తీసుకువెళుతుంది. మనదే అయినా మనది కాని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో రెండు కోణాలు మనకు పరిచయం అవుతాయి. పరిమితమైన సంప్రదాయవనరులతో ఉప్పును పండించడం ఎంత కష్టమైన పని అనేది ఒక కోణం అయితే, పొట్ట చేతపట్టుకొని అనువుగాని చోట అష్టకష్టాలు పడుతూ ఎనిమిది నెలలు గడిపే శ్రామికుల జీవనశైలి పరిచయం కావడం... రెండో కోణం. ఈ ఎనిమిది నెలల కాలంలో వారి మానసిక, భౌతిక ప్రపంచాలు ఎలా ఉంటాయో ‘మై నేమ్ ఈజ్ సాల్ట్’ కళ్లకు కడుతుంది. వారి కళ్లవైపు ఒకసారి చూడండి... కనిపించే కన్నీళ్లు, కనిపించని కన్నీళ్లు ఉంటాయి. రెండూ ఒకే రకమైన కథలు చెబుతాయి! కాళ్ల వైపు చూడండి ఒకసారి. ఉప్పు మడులలో నానీ నానీ సెప్టిక్ అయిన కాళ్లు... ఎన్ని కథలు చెబుతాయో వినండి! రణ్ ఆఫ్ కచ్‌లో ఉప్పు పండించే కార్మికులు... ఎవరూ 50 నుంచి 60 సంవత్సరాలకు మించి బతకరట. చిత్రమేమిటంటే, చావు తరువాత కూడా ఉప్పు వారిని వెంటాడుతూనే ఉంటుంది. సాల్ట్ కంటెంట్ వల్ల శవం చేతులు, కాళ్లు చితిమంటలకు లొంగవు. మరి కోరి కోరి ఈ నరకంలోకి ఎందుకు వస్తున్నట్లు? ‘‘సారీ... మేము మాత్రం నరకం అనుకోవడం లేదు’’ అంటాయి వారి కళ్లు. ‘‘మా ముత్తాతలు ఈ పనిచేశారు. మా తాతలు చేశారు. నాన్న చేశాడు. ఇప్పుడు మేము చేస్తున్నాం. రాబోయే కాలంలో మా బిడ్డలు చేస్తారు. ఇదీ లెక్క...’’ అంటారు వాళ్లు. ఇది తరతరాలుగా క్రమం తప్పని లెక్క. పెట్టుబడిదారి దోపిడి, అసంఘటిత కార్మిక కష్టం... ఇలాంటివాటి గురించి వారు పెద్దగా ఆలోచించినట్లుగా కూడా అనిపించదు. ‘‘ఉప్పు పండించడం అంటే, కూరలో ఉప్పేసుకున్నంత తేలిక కాదు, అష్టకష్టాలు పడినా అదృష్టం కలిసిరావాలి. మంచి ధర రావాలంటే ‘నాణ్యమైన ఉప్పు’ చేతికందాల్సిందే’’ అంటాడు సనాభాయి అనే కార్మికుడు. ఆయన భార్య దేవుబెన్ విషాద మౌనం కూడా ఎన్నో అజ్ఞాత కథలను చెబుతున్నట్లుగానే అనిపిస్తుంది. ‘‘ప్రతి వంటకంలో ఉప్పు అతి ముఖ్యమైనది అంటారు. ఆ ఉప్పును పండించే మేము మాత్రం... ఎవరికీ ముఖ్యం కాదు’’ అనేది కచ్ కార్మికుల ఉమ్మడి వేదన. ‘కచ్’ అంటే సంస్కృతంలో ‘ద్వీపం’ అని అర్థం. ఇక్కడ ఉప్పు పండించే కార్మికుల పరిస్థితి... నిజంగా ద్వీపంలో ఉన్నట్లుగానే ఉంటుంది. మన నిత్యావసర వస్తువులేవీ అక్కడ కనిపించవు. ఎనిమిది నెలల పాటు ఆలుగడ్డ కూర, రొట్టె తప్ప తినడానికి పెద్దగా ఏమీ ఉండదు. ‘పాలు’ దొరకడం అనేది ఊహకు కూడా అందని విషయం. అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల నేవిగేషన్ కోసం అద్దపు ముక్కలను వాడుతూ కాంతి సందేశాలు పంపుకుంటారు. ‘‘ఇన్ని కష్టాలు పడడం అవసరమా?’’ అని చాలామంది అనుకున్నట్లుగానే ఉప్పు పండించే కార్మికులపై మూడు పుస్తకాలు రాసిన అంబూ పటేల్ కూడా అనుకున్నాడు. ‘‘ఎందుకు ఇంత కష్టం?’’ అని అడిగాడు కూడా. ‘‘మరో ప్రత్యామ్యాయం ఏమున్నది?’’ అంటారు వాళ్లు. ఇదంతా సరే, ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఈ అసంఘటిత కార్మికులకు రబ్బరు బూట్లు, గ్లోవ్స్, ఐ గ్లాసులు, స్వచ్ఛమైన నీరు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం వారి సాల్ట్ కమిషనర్లు చెబుతారు. పిల్లలకు పాఠాలు చెప్పడానికి స్వచ్ఛంద సేవకులు బడులతో సహా ఇక్కడికి వస్తారు. రకరకాల అధ్యయనాలు ‘రణ్ ఆఫ్ కచ్’ కార్మికుల ఆరోగ్యస్థితిగతులు, ప్రమాద తీవ్రతను గురించి హెచ్చరించినట్లుగానే అనిపిస్తాయి. ఎన్ని జరిగినా, ఎన్ని ప్రమాద హెచ్చరికలు వినిపించినా అదేమిటో మరి... ఏ మార్పు కనిపించని నిశ్చల చిత్రంలాగే ఉంటుంది ‘కచ్’ కార్మికుల పరిస్థితి. డాక్యుమెంటరీ పూర్తయిన తరువాత ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిల్చొని అడుగుతుంది - ఇంతకీ తప్పెవరిది? మార్పు కోరుకోని కార్మికులదా? వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపలేని ప్రభుత్వానిదా? ఒకవేళ విధిరాత ఉండి ఉంటే... విధిరాతదా?! - యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: మై నేమ్ ఈజ్ సాల్ట్ దర్శకత్వం: ఫరీదా పచ డెరైక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కొనెర్మాన్ -
సంక్రాంతి పర్వాన ఆకాశ దేశాన!
ఏమాటకామాట చెప్పుకోవాలి... సంక్రాంతి రోజుల్లో ఆకాశం ఆకాశంలా ఉండదు. విశాలమైన పూలతోటలా ఉంటుంది. ఆ తోటలో... ఎన్ని అందమైన గాలిపట పుష్పాలో కదా! ఆ నోటా ఈ నోటా... మన పండగ సమయపు ఆకాశాన్ని గూర్చి విన్న ఫ్రాన్సిస్కో లిగ్‌నోల అనే ఇటాలియన్ అమ్మాయి తన మిత్రుడు, కెమెరామెన్ జీన్ ఆంటోనితో చర్చించింది. అప్పుడు వారొక నిర్ణయానికి వచ్చారు... సంక్రాంతి పండగ రోజుల్లో ఇండియాకు వెళ్లాలని. అలా ఓ సంక్రాంతి పండగ రోజుల్లో గుజరాత్‌లోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్‌కు వచ్చారు... పతంగుల పండగ కోసం, ఆకాశంలో వెలిగిపోయే పూలతోట కోసం! ఈ నేపథ్యంలో పుట్టిందే ‘అండర్ ది అహ్మదాబాద్ స్కై’ డాక్యుమెంటరీ. మొదట ఆల్జజీరా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ‘విట్నెస్ స్పెషల్’ కార్యక్రమంలో ఈ డాక్యుమెంటరీ ప్రసారమైంది. నాలుగు భాగాల ఈ డాక్యుమెంటరీలో ఎన్నెన్నో కోణాలు కనిపిస్తాయి. తొలి దృశ్యం... అందమైన సూర్యోదయం. అయ్యవారి మాటలు వినిపిస్తుంటాయి... ‘‘ఏదో ఒకరోజు... ఆ ఆకాశంలో నారాయణుడు కనిపించి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడు. నారాయణుడి చుట్టూ చేరి దేవతలు సంతోషంలో తలమునకలై పోతారు...’’ ఆకాశంలో కనిపించే సంభ్రమాశ్చర్య దృశ్యాన్ని చూసి... ప్రజలు ‘పతంగ్ ఉత్సవ్’ను ఘనంగా జరుపుకుంటారట. దీంతో... రోజూ కనిపించే ఆకాశమే ఆరోజు రంగులమయమై, సౌందర్యమయమై, కన్నులపండగై కనిపిస్తుందట. కొద్ది సేపటి తరువాత కెమెరా అహ్మదాబాద్ పతంగుల దుకాణాల గల్లీలలోకి వెళుతుంది. ‘‘ఎలా ఉన్నాయి పతంగ్‌ల ధరలు?’’ అడుగుతాడు కస్టమర్. పతంగులు అమ్మేటాయన దగ్గరి నుంచి ఏకవాక్య సమాధానం వినిపించదు. ఎందుకంటే, మనుషుల్లో తేడా ఉన్నట్లే, మనసుల్లో తేడా ఉన్నట్లే పతంగుల్లోనూ తేడాలు ఉంటాయి. అన్నీ ఎగిరేది ఆకాశంలోనైనా పేదోళ్ల పతంగులు, పెద్దోళ్ల పతంగులు, మధ్యతరగతి పతంగులు... ధరను బట్టి పతంగుల విలువ పెరుగుతుంది. అందుకే, దుకాణదారుడిని ‘‘ధర ఎంత?’’ అని అడిగితే చాలు... చాలా వివరంగా మాట్లాడతాడు. తన దుకాణంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు తొంగి చూస్తున్న 15 రకాల పతంగుల గురించి! హిందువులు మాత్రమే కాదు... జైనులు, సిక్కులు, ముస్లింలు... మతాలకు అతీతంగా ‘ఫెస్టివల్ ఆఫ్ మకరసంక్రాంతి’ని పతంగుల పండగ ద్వారా సొంతం చేసుకుంటారు. పతంగి అంటే ఆట వస్తువు కాదు... మతాలకతీతమైన లౌకిక ప్రతీక! ఢిల్లీ గేట్ దగ్గర మాంజా తయారీదారులు కూడా ఈ డాక్యుమెంటరీలో తమ గొంతు వినిపిస్తారు. కూరగాయలు, రకరకాల ఔషధ మొక్కల సారంతో తొమ్మిది రకాల మాంజా ఎలా తయారవుతుందో చెబుతారు. ‘మాంజా గురు’గా ప్రసిద్ధుడైన అరవై సంవత్సరాలు పైబడిన ధీరుబాయి పటేల్ - ‘‘మాంజాను అందరూ ఒకేవిధంగా తయారుచేసినట్లు అనిపించినా... ఎవరి రహస్యాలు వారికి ఉంటాయి’’ అంటారు. అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కవి భాను షా... ఇంటర్వ్యూలో ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. భాను షా అంటే కవి మాత్రమే కాదు... పతంగులకు సంబంధించిన సంపూర్ణ సమాచార సర్వస్వం. వివిధ కాలాల్లో పతంగుల తయారీ, పతంగ్ ఉత్సవ్‌కు సంబంధించిన ఆనాటి విశేషాలు ఆయన నోటి నుంచి వినాల్సిందే. ‘అహ్మదాబాద్ కైట్ మ్యూజియం’లో ప్రతి పతంగి గురించి సాధికారికంగా చెప్పగలిగే సామర్థ్యం భాను షా సొంతం. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి తాత్విక నిర్వచనాలు ఇస్తారు షా. ‘‘ఆకాశం అనే ప్రపంచంలో గాలిపటం అనేది స్వేచ్ఛను, ఒకరి గాలిపటాన్ని మరొకరు తెంపడం అనేది పోటీ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి’’ అంటారు ఆయన. ‘‘నగరమంతా ఆ రోజు ఇళ్లలో కాదు... ఇంటి కప్పులపై ఉంటుంది’’ అని చమత్కరిస్తారు అహ్మదాబాద్ అర్కిటెక్చర్ ప్రొఫెసర్ నితిన్ రాజే. కైట్ మార్కెట్లో వినిపించే ‘షోలే’ సినిమాలోని ‘మెహబూబా మెహబూబా ’ పాట కావచ్చు, ఆలయ వీధుల్లో పవిత్రధ్వనితో వినిపించే ‘ధినక్ ధినక్ నాచే బోలానాథ్’ పాట కావచ్చు... నేపథ్యసంగీతం ద్వారా దృశ్యాన్ని పండించి ‘అండర్ ది అహ్మదాబాద్ స్కై’ డాక్యుమెంటరీని కన్నుల పండగ చేయడంలో విజయం సాధించింది ఫ్రాన్సిస్సో లిగ్‌నోల, జీన్ అంటోని ద్వయం. - యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: అండర్ ది అహ్మదాబాద్ స్కై దర్శకత్వం: ఫ్రాన్సిస్కో లిగ్‌నోల కెమెరా: జీన్ ఆంటోని -
ఒక ప్రజ్ఞాగీతిక !
‘మా ఊరు’. అందరి ఊరే. కాబట్టే మ్యూరిచ్ జ్యూరీ బెస్ట్ ఏంత్రోపాలజికల్ డాక్యుమెంటరీగా కీర్తించింది. ఇందులో మాటలు దాదాపు లేవు. గ్రామీణ వాద్యపరికరాల శృతులు, సహజ శబ్దసౌందర్యం తప్ప. చల్లకవ్వం, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, గొంగడి నేతలు, జాలరి వల సృష్టించే జల తరంగాలు, ఇసురురాళ్ల జుగల్బందీ, పొదుగు నుంచి కురిసిన క్షీరసంగీతం, నేలను చీల్చే నాగలి, కుప్పనూర్పిళ్లు, దొమ్మరుల అపూర్వ దేహ విన్యాసాలు, యక్షగానాలు, దడిలో ఆమె స్నానింత, పూనకాలు, దొరరికం, ఎద్దు కేస్టరైజేషన్ ఎన్నెన్ని దృశ్యశకలాలో. ‘మా ఊరు’ ఎవరి ఊరు? ఒకే ఊరిలోని ఒకొక్కరి ఊహల ఊరు. ఏ ఊరి వారికైనా ఒకే జ్ఞాపకాల ‘వేరు’. అంతా బావుంది బతుకమ్మ లేదే అన్పించే క్షణంలోనే ‘ఊరు అనే బతుకమ్మలో ప్రతి దృశ్యమూ ఒక పువ్వే’ కదా అని స్ఫురిస్తుంది. డాక్యుమెంటరీలో ఎంపిక చేసిన స్టిల్స్‌ను ప్రామాణిక వివరాలతో (బిబిలియోగ్రఫీ) కూరిస్తే ఒక అపురూప పుస్తకం తయారవుతుంది. - పున్నా కృష్ణమూర్తి (బాల్య - కౌమార దశలో తన ఊరు ప్రజ్ఞాపూర్ తన మదిలో ముద్రించిన జ్ఞాపకాలను 35వ ఏట 1988లో బి.నరసింగరావు ‘మా ఊరు’గా పదిలపరచారు- నూరుకు పైగా ఊర్లను తిరిగి. తాను స్వరపరచి, దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీని తన 62వ ఏట ఇటీవల సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు) -
ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన తెలుగు రచయిత ఎవరు?
అనంతమూర్తి సంస్మరణ సభలో ఒక ప్రశ్న! ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి (యుఆర్) సంస్మరణ సభ సందర్భంగా ఆయనపై ప్రఖ్యాత దర్శకుడు గిరీష్ కాసరవెల్లి ఫిలింస్ డివిజన్ కోసం రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని లామకాన్‌లో ఇటీవల ప్రదర్శించారు. తీర్ధహళ్లిలో తన ఇంటి వసారా- ఇంటి పెరడు మధ్య వర్ధిల్లిన రెండు ప్రపంచాలను రెండిటి సమన్వయంతో ‘మధ్యే’మార్గంగా తన ఎదుగుదలను అనంతమూర్తి ఈ చిత్రంలో ఆసక్తికరంగా వివరించారు. ఫ్రంట్ యార్డ్ (వసారా)లో గతంలో సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లిష్ చర్చనీయాంశం. బ్యాక్‌యార్డ్ (మహిళల నెలవు)లో గతంలో దేశీ రామాయణ, భాగవతాలు, ప్రస్తుతం కన్నడ యక్షగానాలూ! ఈ రెండూ తన ఇంట్లోనే కాదు భారతీయ సాహిత్యంలోనూ సమాంతరంగా ప్రవహిస్తున్నాయని అనంతమూర్తి వివరించారు. డాక్యుమెంటరీ అనంతరం ఇఫ్లూ ప్రొఫెసర్ తారకేశ్వర్, ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు అనంతమూర్తి రచనలను, మేధోజీవితాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘సంస్కార’ నవలాకారునిగా కంటే మేధోజీవిగా అనంతమూర్తి గొప్పవాడని వాడ్రేవు వ్యాఖ్యానించారు. కన్నడిగులు ఎక్కువమంది హాజరైన సమావేశంలో ఈ వ్యాఖ్య చిన్న కదలికను సృష్టించింది. తన ఉద్దేశంలో ‘సంస్కార’ గొప్పది కాదని కానేకాదని అంతకంటే ఏ మాత్రం తక్కువ కాని కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ తెలుగు సీమను దాటి వెళ్లలేదని అన్నారు. వెంటనే ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్న వచ్చింది. ‘సంస్కార’ వలె ‘యజ్ఞం’ ఇంగ్లిష్ పాఠకులకు చేరకపోవడం అనే సమాధానం మరికొన్ని ప్రశ్నలకు తావిచ్చింది. ‘యజ్ఞం’ ఇంగ్లిష్‌లోకి ఎందుకు అనువాదం కాలేదు? కాస్సేపు మౌనం! అనంతమూర్తి చనిపోయిన రెండు మూడు రోజుల తర్వాత తాము కర్ణాటకలోని ఒక పల్లెలో పర్యటిస్తున్నామని, ఒక సాయంత్రం స్థానిక యక్షగాన సమాజం అనంతమూర్తి జీవితాన్ని ప్రదర్శిస్తోందని ఇఫ్లూలో ఫిలిం స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న నిఖిల అన్నారు. అనంతమూర్తి చనిపోయిన తర్వాత సైతం అక్కడ ఇంటి ముంగిట (ఇంగ్లిష్)కు పెరడు (దేశీ)కు కనెక్టివిటీ ఉందని అన్నారు. ఇంగ్లిష్ ఆచార్యుడైనప్పటికీ తాను రాస్తోన్న జీవితం కన్నడిగులది కాబట్టి కన్నడలోనే అనంతమూర్తి రచనలు చేశారని, ఆయన సంస్కారను ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఎ.కె.రామానుజన్ వలె తెలుగులో యజ్ఞాన్ని ఎవరైనా అనువదిస్తే బావుండేద న్నారు. ఆయుర్వేద పరిశోధకురాలు డా.సత్యలక్ష్మి ఇటీవలి తన అనుభవాన్ని వెల్లడించారు. కొందరు స్త్రీవాద కవయిత్రులు తమ కవిత్వాన్ని ఇంగ్లిష్ చేసేవారి పేర్లను సూచించమన్నారని, కన్నడ లేదా మరోభాషల కవులు సరైన అనువాదం చేయలేరని తెలుగులో అటువంటి వారిని గుర్తించవలసినదిగా సూచించానని తెలిపారు. సినిమా విమర్శకుడు, పర్యావరణ చైతన్యశీలి విజేంద్ర మాట్లాడుతూ- ఆర్.కె.నారాయణ్ అనగానే మాల్గుడీ డేస్, గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్ గుర్తొస్తాయి. ముల్కరాజ్ ఆనంద్ అన్‌టచబుల్స్ గుర్తొస్తుంది. ఎ.కె.రామానుజన్, సాల్మన్ష్డ్రీ, అరుంధతీరాయ్, జంపాలహరి వలె ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన ఇంగ్లిష్‌లో రాసే తెలుగు రచయితలెవరు? అని ప్రశ్నించారు. ఇంగ్లిష్‌లో డాక్టరేట్లు చేసిన వారు, హెడాఫ్ ద డిపార్ట్మెంట్స్ అనువదించిన రచనలను మినహాయించాలని చమత్కరించారు! - పున్నా కృష్ణమూర్తి -
జరగబోయేది చెబుతుంది!
సైన్స్... ఫిక్షన్... హారర్... టై... సిక్త్స్‌సెన్స్... ఏది చూసినా... అంతకుముందే జరిగినట్టు అనిపించడం... జరగబోయేదాన్ని కలగనడం... ‘ఫైనల్ డెస్టినేషన్’ వంటి ఎన్నో సినిమాలు ఈ అంశం ఆధారంగానే వచ్చాయి. ఆ ప్రభావంతో నామాల రవీందర్సూరి తీసిన లఘుచిత్రమే సిక్త్స్‌సెన్స్... డెరైక్టర్స్ వాయిస్: మాది నల్గొండ జిల్లా జాల్పకుంట్ల. ఉస్మానియా యూనివ ర్శిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఫిల్ చేశాను. ఆలూరి సాంబశివరావు నిర్మించిన సిక్త్స్‌సెన్స్ అనే ఈ లఘుచిత్రాన్ని ఆలూని క్రియేషన్స్ బ్యానర్‌పై తీశాను. చిన్నచిన్న కవితలతో మొదలైన నా రచన... కథలు, నవలలు టీవీ ప్రోగ్రామ్స్ నుండి సినిమాలకు కథ అందించేంతవరకూ సాగింది. నాలుగు సినిమాలకి కథ, మాటలు అందించాను. అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఏడ్చేవాడిని... కంటికి చుక్క కారకుండా కసితీరా ఏడ్చేవాడిని. ఓడిపోతానేమోనని ఏడ్చేవాడిని. కానీ ఓడిపోయాననుకున్న ప్రతిసారీ మా సూరన్న ఎప్పటికైనా నేను గెలుస్తానని ధైర్యం చెప్పేవాడు. పోతే, నేను రచయితగా పరిచయమవుతాననుకుంటే, డెరైక్టర్ని అవుతున్నాను. నా చిన్ననాటి మిత్రుడు బిజినెస్ పార్ట్నర్ అయిన నిర్మాత సాంబశివరావుగారికి కాన్సెప్ట్ చెప్పడం అత నికి నచ్చడం చకచకా జరిగిపోయాయి. ఇదే నిర్మాతతో ఇప్పుడు బిగ్ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాను. ఈ షార్ట్ ఫిలిమ్‌కి నాకు నా మిత్రులు బాగా సహకరించారు. షార్ట్ స్టోరీ: జరగబోయేది ముందుగానే తెలియడం, కల రూపంలో సాక్షాత్కరించడం... కామెంట్: ఫిక్షన్ కథను బాగా తయారుచేసుకున్నాడు. కెమెరా యాంగిల్స్ బావున్నాయి. భయానక రసాన్ని బాగా చూపించాడు. సస్పెన్స్‌ను ఎంతో ఉత్కంఠభరితంగా చూపాడు. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్... అన్నీ బావున్నాయి. ముఖ్యంగా డైలాగులు చాలా బావున్నాయి. కలలు నిజాలు... కలలు అబద్ధాలు... ఆకారంలో కలలు ఎలాగైనా ఉండొచ్చు... వంటి మాటలు బాగా రాశాడు. ‘ఏడుపును బయటకు రానీయకుండా... నవ్వును బయటకు తీసుకుని రారా...’ ‘నవ్వు నలిగిపోకుండా... ఏడుపు ఎగరగొట్టకుండా... రెండింటినీ మిక్స్ చేయరా...’ వంటి సంభాషణలు ఆర్సిఎం రాజు గళంలో పలకడం ఈ లఘుచిత్రానికి ప్లస్ అయ్యింది. రూమ్ డెకొరేషన్ చాలా బావుంది. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చూపించడంలో దర్శకుడికి ఉన్న అభిరుచి కనపడుతోంది. ప్రధానపాత్రలో వేసిన వ్యక్తి డైలాగ్ డెలివరీ బాగాలేదు. భావాలను ముఖంలో బాగానే వ్యక్తీకరించాడు కాని, డైలాగ్ డెలివరీ మాత్రం చాలా పూర్‌గా ఉంది. ఇటువంటి సస్పెన్స్ చిత్రాలలో డైలాగ్‌లో ఎక్స్ప్రెషన్, ముఖంలో భయం... వంటివి పూర్తిశాతం ప్రదర్శించలేకపోతే చిత్రం రక్తికట్టదు. నటనలో టైమింగ్, ఇంకా ఎడిటింగ్ బావుండాలి. చిత్రంలో అన్ని హంగులూ పూర్తిస్థాయిలో ఉంటేనే ఆ చిత్రం కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. సినిమాలలో దర్శకులుగా స్థిరపడాలనుకునేవారు పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - డా.వైజయంతి కలలు నిజాలు... కలలు అబద్ధాలు... ఆకారంలో కలలు ఎలాగైనా ఉండొచ్చు... వంటి మాటలు బాగా రాశాడు. ‘ఏడుపును బయటకు రానీయకుండా... నవ్వును బయటకు తీసుకుని రారా...’ ‘నవ్వు నలిగిపోకుండా... ఏడుపు ఎగరగొట్టకుండా... రెండింటినీ మిక్స్ చేయరా...’ వంటి సంభాషణలు ఆర్సిఎం రాజు గళంలో పలకడం ఈ లఘుచిత్రానికి ప్లస్ అయ్యింది.