మన దేశంలో... రెండు ప్రపంచాల గురించి! | About the two worlds in our country | Sakshi
Sakshi News home page

మన దేశంలో... రెండు ప్రపంచాల గురించి!

Published Wed, Mar 4 2015 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

మన దేశంలో... రెండు ప్రపంచాల గురించి!

మన దేశంలో... రెండు ప్రపంచాల గురించి!

దృశ్యం
డాక్యుమెంటరీ పరిచయం

 
ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల
 పరిచయమే... ఈ దృశ్యం.
 
 ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.
 డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
 
నిన్నగాక మొన్న సాధ్వీ ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకున్నప్పుడు, అంతకుముందు ఎప్పుడో... అందాల పోటీలో గెలిచిన అమ్మాయి ఆనందబాష్పాలలో మెరిసిన గర్వపురేఖను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు.... ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది.

‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అనే ప్రసిద్ధ వాక్యం అందరిలో నింపే స్ఫూర్తిని గురించి కాకుండా... ‘ఇంతకీ ఈ ఆధునిక స్త్రీ ఎవరు?’ అని ఆలోచిస్తే... ఆ ఆలోచనలకు కొనసాగింపే ఈ డాక్యుమెంటరీ చిత్రం. ప్రపంచంలోని దేశాల గురించి కాదు, ఒక దేశంలోని భిన్నమైన ప్రపంచాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన చిత్రం...‘ది వరల్డ్ బిఫోర్ హర్’
   
 ‘ఆధునిక మహిళ ఎవరు?’ అనే ప్రశ్నలో నుంచే పుట్టుకువచ్చించే నిషా పహుజా ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ. ఇందులో రెండు ప్రధాన పాత్రల గురించి చెప్పుకుందాం.రుషి సింగ్: జైపూర్‌కు చెందిన ఈ అమ్మాయికి ‘మిస్ ఇండియా’ కావాలనేది కల. తన కల నెరవేర్చుకొని- ‘‘మా అమ్మాయి ఎంత ఎదిగిపోయిందో చూశారా!’’ అని తల్లిదండ్రులు గొంతు నిండా ఆనందంతో అందరితో చెప్పుకోవాలని, వారి కళ్లలో మెరుపులు చూడాలనేది రుషి కల.

ప్రాచీ త్రివేది: రుషి ఆలోచనలకు, కలలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఔరంగబాద్ ‘దుర్గావాహిని’ ఆర్గనైజేషన్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న త్రివేది నిప్పులా బతకాలని, పెళ్లికి దూరంగా ఉండి తన జీవితాన్ని ‘దుర్గావాహిని’కే పూర్తిగా అంకితం చేయాలనుకుంటుంది. ‘ఐ హేట్ గాంధీ’లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె నిస్సంకోచంగా చేస్తుంటుంది. ‘స్త్రీలు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. స్త్రీలు తప్పనిసరిగా పిల్లల్ని కనాలి. ఇవి వారికి దేవుడు నిర్దేశించిన తప్పనిసరి విధులు’ అని నమ్ముతాడు త్రివేది తండ్రి.

 తన కూతురును చిన్నప్పటి నుంచి అదుపాజ్ఞల్లో ఎలా ఉంచిందీ చెప్పుకోవడం ఆయనకు గర్వంగా ఉంటుంది. హోంవర్క్ విషయంలోనో, మరే విషయంలోనో కూతురు అబద్ధం ఆడిందని కాల్చివాత పెడతాడు. ‘‘కాలిపై ఉన్న ఆ మచ్చను ఎప్పుడు చూసినా, గుర్తొచ్చినా ఇక జన్మలో అబద్దం ఆడదు’’ అని చిరునవ్వుల మధ్య చెప్పుకోవడం కూడా ఆయనకు గర్వంగా అనిపించే విషయం. ఒక మహిళానాయకురాలు ‘దుర్గావాహిని’ సైన్యాన్ని ఉద్దేశించి కాస్త ఆవేశం నిండిన స్వరంతో ఇలా అంటుంది ‘‘స్త్రీ, పురుషులు సమానమని అంటుంటారు. చివరికి రాజ్యాంగం కూడా అదే చెబుతుంది. కాని ఇదెలా సాధ్యం? కెరీర్ వేటలో పాశ్చాత్యకరణకు గురికావద్దు. మాతృత్వం విలువను అందరూ గ్రహించాలి’’
   
ఒక భర్త తన భార్యతో రెండోకూతురు వద్దంటే వద్దంటాడు. ఆ పిల్లను వదిలించుకుందాం అంటాడు. చంపేద్దాం అంటాడు. లేకుంటే తన దారి తాను చూసుకుంటాను అంటాడు. అలాగే చూసుకుంటాడు. ఒంటరిగానే అమ్మాయిని పెంచి పెద్ద చేస్తుంది ఆ ఇల్లాలు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై ‘మిస్ ఇండియా’ అవుతుంది. ‘‘వదిలించుకుందామనుకున్న అమ్మాయి... ఈరోజు చూడండి ఎంత ఎత్తుకు ఎదిగిందో’’ అని కూతురుని చూసి భావోద్వేగానికి గురవుతుంది అమ్మ. ఆమె కన్నీళ్లలో మన కన్నీళ్లు కూడా జత కలుస్తాయి. పైన చెప్పుకున్న మిస్ ఇండియా-2009 పూజా చోప్రా రుషిసింగ్‌లాంటి ఆశావహులకు రోల్‌మోడల్ కావచ్చు. ఇంకొందరికి ‘ఫైర్‌బ్రాండ్’ త్రివేది రోల్‌మోడల్ కావచ్చు. ఎవరికి సంబంధించిన బలమైన వాదాలు, పిడివాదాలు, భావజాలాలు, బరువుబాధ్యతలు, సమర్థనలు, సంఘర్షణలు  వారికి ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు వాళ్ల దగ్గర ఆశ్చర్యాలు తప్ప సమాధానాలు వినిపించవు.

రెండు రకాల భావజాలాలలోని భిన్నమైన వైరుధ్యాలను ఈ డాక్యుమెంటరీ పట్టిస్తుంది. ఒకే దేశానికి చెందిన రెండు ప్రపంచాలు ఇందులో కనిపిస్తాయి. ఈ భిన్నమైన ప్రపంచాలలోనూ ‘స్వీయస్పృహ’ లోపించడంలాంటి సామీప్యతలు కూడా కనిపిస్తాయి. డాక్యుమెంటరీలోకి డెరైక్టర్ చీటికి మాటికి ప్రవేశించి ‘ఇదేమిటి ఇలా?’ ‘అదేమిటి అలా?’ అని ప్రశ్నలు అడిగినట్లు అనిపించదు. దృశ్యాలే ప్రశ్నలవుతాయి. ప్రేక్షకుల ఆలోచనల సంఘర్షణలో నుంచి పుట్టిన సారమే సమాధానం అవుతుంది.
   
‘‘స్త్రీ అంటే... లార్జెస్ట్ మైనారీటి గ్రూప్ ఇన్ ది వరల్డ్’’ అనే జమైకన్ కవి మాటను విని నిరాశపడకుంటే-‘‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది’’ అనే ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే ‘‘మరి పై రెండు ప్రపంచాలా మధ్య ఆధునిక భారతీయ స్త్రీ ఎక్కడ ఉండాలి?’’ అని ప్రశ్నించుకుంటే- రుషిసింగ్ ‘అందాల ప్రపంచం’లోనా? త్రివేది ‘అతివాద ప్రపంచం’లోనా?

అందాల ప్రపంచానికి ఓటు వేస్తే జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందం అనేది మార్కెట్ వస్తువుగా ఎందుకు మారిపోయింది, ‘స్త్రీ అంటేనే అందం..అందం అంటేనే స్త్రీ’ అనే భావనను కలిగిస్తున్న శక్తులు ఏమిటి? ఇండియా ఇండియాలా ఉండకుండా ‘అమెరికనైజేషన్’ ఎందుకవుతుంది? ‘మిస్ ఇండియా’ ‘మిస్ వరల్డ్’ కిరీటాల వెనుక దాగి ఉన్న కుట్రలు ఏమిటి?.... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. పాశ్చాత్యీకరణపై ఒంటికాలిపై నిప్పులు చెరిగే వారు ‘మోరల్ పోలిసింగ్’ను ఏ విధంగా సమర్థించుకుంటారో కూడా చెప్పాల్సి ఉంది. ఏ వైపుకు మొగ్గకుండా... పోస్టర్‌లో కూర్చున్న అమ్మాయిలా దూరం నుంచి రెండు ప్రపంచాలను చూడడమా? లేదా సముద్రంలా గంభీరమైన మౌనముద్ర దాల్చడమా? అనేది మన మన ఆలోచనలను బట్టి ఉంటుంది. డార్క్ కామెడిలో ఉన్న వెలుగు ఏమిటో తెలియాలంటే కూడా ఈ డాక్యుమెంటరీ చూడవచ్చు.
 - యాకుబ్ పాషా యం.డి
 
 చిత్రం: ది వరల్డ్ బిఫోర్ హర్
 రచన, దర్శకత్వం: నిషా పహుజా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement