Director Hitchcock
-
సంచారమే ఎంతో బాగున్నది!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సంచారం అన్నది ఇప్పటి మాట కాదు... ఇప్పటి ప్రయాణం కాదు. జ్ఞానాన్ని వెదుకుతూ చేసిన సంచారం. భవబంధాలను తుంచుకోవడానికి చేసిన సంచారం. దైవాన్ని వెదుకుతూ చేసిన సంచారం. జవాబు దొరకని ప్రశ్నలకు జవాబుల కోసం చేసిన సంచారం. సంచారం అంటే మనల్ని మనం రద్దు చేసుకోవడం. సంకుచిత ప్రపంచం నుంచి సంకెళ్లు లేని విశాల ప్రపంచంలోకి పోవడం. సొంత ఆస్తి అనేది లేకుండా, సంచారమనేదే సొంత ఆస్తి అనుకుంటే, అదే అదృష్టమనుకుంటే ఆ అదృష్టం ఎంతమందికి ఉంది? ఈ దేశంలోని ప్రజలే అయినప్పటికీ, ప్రజలుగా గుర్తించబడని సంచార జాతులకు ఉంది. ఆ సంచార జాతులలో ఒకరైన రాజస్థాన్‌లోని కల్బెలియాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు ప్యారీస్‌కు చెందిన రాఫెల్ ట్రెజ. కల్బెలియా లేదా కబేలియా అనేది రాజస్థాన్‌లో ఒక నృత్యరూపకం. ఈ పేరుతోనే ఆ సంచార తెగను పిలుస్తారు. ఇంకా... సపేరా, జోగిర, జోగి అనే పేర్లతో పిలుస్తారు. ఆయన అక్కడెక్కడో నుంచో రాజస్థాన్‌కు వచ్చి, రెండవతరగతి రైలులో ప్రయాణం చేసి, కల్బెలియాన్లను వెదుకుతూ, వారితో మాట్లాడుతూ, వారి జీవనశైలిని కెమెరాతో చిత్రిస్తూ చేసిన మూడు నెలల ప్రయాణ సారంశమే ‘కోబ్రా జిప్సీ’ డాక్యుమెంటరీ. ఎవరి సంస్కృతి అయినా సరే, సంస్కృతి ఎప్పుడూ గొప్పదే. కల్‌బెలియన్‌ల సంస్కృతి కూడా అంతే. వాళ్ల సంస్కృతీ, సంప్రదాయాలకు ఏ కళాపీఠాలు, గ్రంధరాజాలు పెద్ద పీట వేయకపోవచ్చు. అంతమాత్రాన ఆ సంస్కృతి మనకు పట్టని సంస్కృతి కాదు. అందులో ఒక మార్మిక సౌందర్యం ఉన్నది. ఆ సౌందర్యాన్ని కల్‌బెలియన్‌ల హావభావాల్లో, చిలిపి చేష్టల్లో, నవ్వుల్లో నడకల్లో వెలికి తీశాడు డెరైక్టర్ రాఫెల్. తాను స్వయంగా సంగీత కారుడు కాబట్టి దృశ్యానుగుణమైన సంగీతాన్ని సమకూర్చాడు. కలబెలియన్లలో భిన్నమైన వృత్తులు ఉన్నాయి. కొందరు పాములోళ్లు... పాములు పడతారు. విషాన్ని అమ్ముకొని బతుకుతారు. కొందరు గొర్రెలు కాస్తూ... ఒకచోట ఉండకుండా దేశమంతా తిరుగుతారు. కొందరు పెళ్ళిళ్లకు పేరంటాలకు... నృత్యాలు చేస్తారు. నృత్యాలు నేర్పిస్తారు. కొందరు గుర్రాలనే జీవికగా చేసుకొని బతుకుతుంటారు....ప్రతి వృత్తిలో వారికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను తమకు తోచిన మాటల్లో చెబుతున్నప్పుడు వారి మాటల్లో ఎక్కడా నిరాశ కనిపించదు. ‘మీరు ఎందుకు అలా?’ ‘మేము ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఉదయించదు. ప్రశ్న అడిగితే...జవాబుకు ముందు నవ్వు. జవాబు చెప్పిన తరువాత... అడిగే ప్రశ్న ముందు నవ్వు. ఆ నవ్వు ఉత్త నవ్వు కాదు. జీవితం అంటే లెక్కలు వేసుకోవడం కాదు, లెక్క లేకుండా మనశ్శాంతితో బతకడం అని తెలియజేసే నవ్వు! ప్రకృతిలో మమేకమైనట్లు కనిపించే కల్బెలియాలకు ఆ ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన మూలికలతో వైద్యం చేయడం కూడా వచ్చు. ఒంటె మూత్రంతో వైద్యం చేయడంలో కూడా వీరు నిష్ణాతులు. వాళ్లు చేసే రకరకాల వృత్తులు ఒక ఎత్తు... నృత్యం ఒక ఎత్తు. పుంగి,డోలక్, మోర్చాంగ్, కంజరి... తదితర వాయిద్యాల నేపథ్య సంగీతంలో వారి నృత్యాన్ని చూడడం మరవలేని అనుభవం. పురాణాలు, జానపద కథల్లో నుంచి పుట్టకొచ్చిన ఈ పాటలు కేవలం హుషారుకే పరిమితమైనవి కాదు... సందర్భానుసారంగా రకరకాల భావోద్వేగాలతో ఈ పాటలు ప్రేక్షకులను తాకుతాయి. పెళ్లి నుంచి చావు వరకు... వివిధ కోణాలలో కల్బెలియాల సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతుంది ఈ డాక్యుమెంటరీ. ఒక సన్నివేశంలో ఒక కుర్రాడు తన నాన్న సమాధిని చూపిస్తూ అంటాడు- ‘‘ఇది మా నాన్న ఇల్లు’’ అని! ఇలా రకరకాల సన్నివేశాల్లో వారి సహజభావుకత బయటపడుతుంది. ఇక కల్‌బెలియన్‌ల పెళ్లిసందడి అంతా ఇంత కాదు... పెద్ద పెద్ద మైకుల్లో పాటలు మోగాల్సిందే. డ్యాన్సులు అదరాల్సిందే. పెళ్లికి అబ్బాయిని ఎలా ముస్తాబు చేస్తారు? అమ్మాయిని ఎలా ముస్తాబు చేస్తారు? అనేది వివరంగా చూపారు. సుమారు రెండువేలకు మందికి పైగా ఒకేచోట గుమిగూడే జాతరను... ఈ డాక్యుమెంటరీతో వివరంగా పరిచయం చేశారు రాఫెల్. కట్టెలను కొట్టి వాటిని నల్లటి బొగ్గులుగా మార్చే....వృత్తి నైపుణ్యం కావచ్చు, శ్రమ చేస్తూ కూడా నృత్యం చేసే ఉల్లాస సందర్భం కావచ్చు.... ‘లైఫ్ అంటే అతి పెద్ద సెలబ్రేషన్’అనే కల్బేలియన్ల మార్మిక తాత్వికతను ఈ డాక్యుమెంటరీ ప్రతిబింబిస్తుంది. జిప్సీల సాహసాలను, ప్రకృతితో వారి అనుబంధాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ మన ప్రపంచంలోనే కొత్త ప్రపంచాన్ని చూపుతుంది. ‘కల్బెలియన్లు ఇంకా పాత సంప్రదాయాలనే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు?’ ‘ప్రధాన స్రవంతిలోకి ఎందుకు రావడం లేదు?’ అనే విజ్ఞుల ప్రశ్నకు వారు చెప్పే జవాబు ‘‘ఇవి శివుడు ఆదేశించిన వృత్తులు. వీటి నుంచి దూరమైనామంటే... మాకు శని దాపురించినట్లే... దైవనిర్ణయాన్ని కాదనగల ధైర్యం ఎవరికి ఉంది!’’ అంటారు. ఇదే సమయంలో తమ కానిపా గురువు నేపథ్యంగా కులపురాణాన్ని కూడా నాటకీయంగా వినిపిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే కొత్తతరం ఒకటి బడిలోకి అడుగుపెడుతుంది. చివరి సన్నివేశంలో ఒక సింబాలిక్ షాట్ ఉంది. ఒక తాత తన దారిలో తాను వెళుతుంటాడు. అతని వెనకాలే నడిచొస్తున్న చిన్నపిల్లాడు... ఉన్నట్టుండి కొత్తదారి కేసి పరుగులెత్తుతుంటాడు. ఏంజరగనుంది అనేది భవిష్యత్ చెప్పనుందిగానీ.... ఈ డాక్యుమెంటరీలో వినిపించే ‘యూ లివ్ ఇన్ మీ’ పాటలా... దృశ్యాలూ మనలో చాలాకాలమే ఉండిపోతాయి. - యాకుబ్ పాషా యం.డి -
మన దేశంలో... రెండు ప్రపంచాల గురించి!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ నిన్నగాక మొన్న సాధ్వీ ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకున్నప్పుడు, అంతకుముందు ఎప్పుడో... అందాల పోటీలో గెలిచిన అమ్మాయి ఆనందబాష్పాలలో మెరిసిన గర్వపురేఖను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు.... ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. ‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అనే ప్రసిద్ధ వాక్యం అందరిలో నింపే స్ఫూర్తిని గురించి కాకుండా... ‘ఇంతకీ ఈ ఆధునిక స్త్రీ ఎవరు?’ అని ఆలోచిస్తే... ఆ ఆలోచనలకు కొనసాగింపే ఈ డాక్యుమెంటరీ చిత్రం. ప్రపంచంలోని దేశాల గురించి కాదు, ఒక దేశంలోని భిన్నమైన ప్రపంచాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన చిత్రం...‘ది వరల్డ్ బిఫోర్ హర్’ ‘ఆధునిక మహిళ ఎవరు?’ అనే ప్రశ్నలో నుంచే పుట్టుకువచ్చించే నిషా పహుజా ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ. ఇందులో రెండు ప్రధాన పాత్రల గురించి చెప్పుకుందాం.రుషి సింగ్: జైపూర్‌కు చెందిన ఈ అమ్మాయికి ‘మిస్ ఇండియా’ కావాలనేది కల. తన కల నెరవేర్చుకొని- ‘‘మా అమ్మాయి ఎంత ఎదిగిపోయిందో చూశారా!’’ అని తల్లిదండ్రులు గొంతు నిండా ఆనందంతో అందరితో చెప్పుకోవాలని, వారి కళ్లలో మెరుపులు చూడాలనేది రుషి కల. ప్రాచీ త్రివేది: రుషి ఆలోచనలకు, కలలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఔరంగబాద్ ‘దుర్గావాహిని’ ఆర్గనైజేషన్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న త్రివేది నిప్పులా బతకాలని, పెళ్లికి దూరంగా ఉండి తన జీవితాన్ని ‘దుర్గావాహిని’కే పూర్తిగా అంకితం చేయాలనుకుంటుంది. ‘ఐ హేట్ గాంధీ’లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె నిస్సంకోచంగా చేస్తుంటుంది. ‘స్త్రీలు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. స్త్రీలు తప్పనిసరిగా పిల్లల్ని కనాలి. ఇవి వారికి దేవుడు నిర్దేశించిన తప్పనిసరి విధులు’ అని నమ్ముతాడు త్రివేది తండ్రి. తన కూతురును చిన్నప్పటి నుంచి అదుపాజ్ఞల్లో ఎలా ఉంచిందీ చెప్పుకోవడం ఆయనకు గర్వంగా ఉంటుంది. హోంవర్క్ విషయంలోనో, మరే విషయంలోనో కూతురు అబద్ధం ఆడిందని కాల్చివాత పెడతాడు. ‘‘కాలిపై ఉన్న ఆ మచ్చను ఎప్పుడు చూసినా, గుర్తొచ్చినా ఇక జన్మలో అబద్దం ఆడదు’’ అని చిరునవ్వుల మధ్య చెప్పుకోవడం కూడా ఆయనకు గర్వంగా అనిపించే విషయం. ఒక మహిళానాయకురాలు ‘దుర్గావాహిని’ సైన్యాన్ని ఉద్దేశించి కాస్త ఆవేశం నిండిన స్వరంతో ఇలా అంటుంది ‘‘స్త్రీ, పురుషులు సమానమని అంటుంటారు. చివరికి రాజ్యాంగం కూడా అదే చెబుతుంది. కాని ఇదెలా సాధ్యం? కెరీర్ వేటలో పాశ్చాత్యకరణకు గురికావద్దు. మాతృత్వం విలువను అందరూ గ్రహించాలి’’ ఒక భర్త తన భార్యతో రెండోకూతురు వద్దంటే వద్దంటాడు. ఆ పిల్లను వదిలించుకుందాం అంటాడు. చంపేద్దాం అంటాడు. లేకుంటే తన దారి తాను చూసుకుంటాను అంటాడు. అలాగే చూసుకుంటాడు. ఒంటరిగానే అమ్మాయిని పెంచి పెద్ద చేస్తుంది ఆ ఇల్లాలు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై ‘మిస్ ఇండియా’ అవుతుంది. ‘‘వదిలించుకుందామనుకున్న అమ్మాయి... ఈరోజు చూడండి ఎంత ఎత్తుకు ఎదిగిందో’’ అని కూతురుని చూసి భావోద్వేగానికి గురవుతుంది అమ్మ. ఆమె కన్నీళ్లలో మన కన్నీళ్లు కూడా జత కలుస్తాయి. పైన చెప్పుకున్న మిస్ ఇండియా-2009 పూజా చోప్రా రుషిసింగ్లాంటి ఆశావహులకు రోల్‌మోడల్ కావచ్చు. ఇంకొందరికి ‘ఫైర్‌బ్రాండ్’ త్రివేది రోల్‌మోడల్ కావచ్చు. ఎవరికి సంబంధించిన బలమైన వాదాలు, పిడివాదాలు, భావజాలాలు, బరువుబాధ్యతలు, సమర్థనలు, సంఘర్షణలు వారికి ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు వాళ్ల దగ్గర ఆశ్చర్యాలు తప్ప సమాధానాలు వినిపించవు. రెండు రకాల భావజాలాలలోని భిన్నమైన వైరుధ్యాలను ఈ డాక్యుమెంటరీ పట్టిస్తుంది. ఒకే దేశానికి చెందిన రెండు ప్రపంచాలు ఇందులో కనిపిస్తాయి. ఈ భిన్నమైన ప్రపంచాలలోనూ ‘స్వీయస్పృహ’ లోపించడంలాంటి సామీప్యతలు కూడా కనిపిస్తాయి. డాక్యుమెంటరీలోకి డెరైక్టర్ చీటికి మాటికి ప్రవేశించి ‘ఇదేమిటి ఇలా?’ ‘అదేమిటి అలా?’ అని ప్రశ్నలు అడిగినట్లు అనిపించదు. దృశ్యాలే ప్రశ్నలవుతాయి. ప్రేక్షకుల ఆలోచనల సంఘర్షణలో నుంచి పుట్టిన సారమే సమాధానం అవుతుంది. ‘‘స్త్రీ అంటే... లార్జెస్ట్ మైనారీటి గ్రూప్ ఇన్ ది వరల్డ్’’ అనే జమైకన్ కవి మాటను విని నిరాశపడకుంటే-‘‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది’’ అనే ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే ‘‘మరి పై రెండు ప్రపంచాలా మధ్య ఆధునిక భారతీయ స్త్రీ ఎక్కడ ఉండాలి?’’ అని ప్రశ్నించుకుంటే- రుషిసింగ్ ‘అందాల ప్రపంచం’లోనా? త్రివేది ‘అతివాద ప్రపంచం’లోనా? అందాల ప్రపంచానికి ఓటు వేస్తే జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందం అనేది మార్కెట్ వస్తువుగా ఎందుకు మారిపోయింది, ‘స్త్రీ అంటేనే అందం..అందం అంటేనే స్త్రీ’ అనే భావనను కలిగిస్తున్న శక్తులు ఏమిటి? ఇండియా ఇండియాలా ఉండకుండా ‘అమెరికనైజేషన్’ ఎందుకవుతుంది? ‘మిస్ ఇండియా’ ‘మిస్ వరల్డ్’ కిరీటాల వెనుక దాగి ఉన్న కుట్రలు ఏమిటి?.... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. పాశ్చాత్యీకరణపై ఒంటికాలిపై నిప్పులు చెరిగే వారు ‘మోరల్ పోలిసింగ్’ను ఏ విధంగా సమర్థించుకుంటారో కూడా చెప్పాల్సి ఉంది. ఏ వైపుకు మొగ్గకుండా... పోస్టర్లో కూర్చున్న అమ్మాయిలా దూరం నుంచి రెండు ప్రపంచాలను చూడడమా? లేదా సముద్రంలా గంభీరమైన మౌనముద్ర దాల్చడమా? అనేది మన మన ఆలోచనలను బట్టి ఉంటుంది. డార్క్ కామెడిలో ఉన్న వెలుగు ఏమిటో తెలియాలంటే కూడా ఈ డాక్యుమెంటరీ చూడవచ్చు. - యాకుబ్ పాషా యం.డి చిత్రం: ది వరల్డ్ బిఫోర్ హర్ రచన, దర్శకత్వం: నిషా పహుజా -
ఒక కరెంట్ దొంగ కథ!
దృశ్యం డాక్యుమెంటరీ పరిచయం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మధ్యతరగతి ప్రజలను ఎప్పటికప్పుడు తాజాగా భయపెట్టే ‘కరెంట్ బిల్లు’ అనేది కాన్పూర్ పేదోళ్ల విషయానికి వస్తే డైనోసార్ లాంటిది. అందుకే దాన్ని దూరం నుంచి చూడాలనుకుంటారు తప్ప, దూరం నుంచి వినాలనుకుంటారు తప్ప... దగ్గరికి వెళ్లరు. మరి వాళ్లకు మాత్రం కరెంట్ అక్కర్లేదా? చీకట్లోనే మగ్గిపోతారా? అదేం లేదు. వారికి కూడా కరెంట్ కావాలి. అందుకే కొద్దిమంది పేదలు కరెంట్ కోసం ‘కతియ’ (కరెంట్ దొంగిలించే తీగ)ను నమ్ముకుంటారు. అదిగో ఆ కొక్కేలను చూడండి. అవి కొక్కేలు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని సవాలు చేసే సమాంతర వ్యవస్థలు. మిగిలిన వాళ్లలాగా భయం భయంగా కరెంట్ వాడుకోనక్కర్లేదు. నిర్భయంగా వాడుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ బిల్లు అనేది ఉంటే కదా! కరెంట్ దొంగలకు చేతిలో కాస్త డబ్బు పెడితే చాలు...‘కరెంట్ బిల్లు’ అనే మాట వినాల్సిన పనే లేదు. పారిశ్రామిక పట్టణమైన కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)లో ఈ కొక్కేల ఇళ్లు చాలా కనిపిస్తాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?! కాన్పూర్ ప్రాంతంలో దొంగ కరెంట్‌ను వినియోగించుకునేవారు పదుల సంఖ్యలో కాదు... వందల సంఖ్యలో కాదు... వేల సంఖ్యలో ఉంటారు. ఆ ‘వేలు’ ఉత్త ‘వేలు’ కాదు.... విలువైన ఓటు బ్యాంకు! ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించడంలో ఈ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలోని చాలామంది రాజకీయ నాయకులను ఈ అక్రమ విద్యుత్ సమస్య గురించి మాట్లాడమంటే కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఫీలైపోతారు. అందుకే వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తారు. దీంతో ప్రజాసంక్షేమ ఎజెండాలో ‘అక్రమ విద్యుత్’ కూడా పెద్ద పీట వేసుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఎనభై నిమిషాల ‘కతియాబాజ్’ (పవర్‌లెస్) డాక్యుమెంటరీ ఏం చెబుతుంది? అక్రమంగా విద్యుత్ వాడుతూ విద్యుత్ సంక్షోభాన్ని సృష్టిస్తున్న వాళ్లది తప్పా? లేక చర్యలు తీసుకోని ప్రభుత్వానిది తప్పా? అనే వాదనల్లో ఏ వైపూ సూటిగా నిలవకుండా, తీర్పు చెప్పినట్లుగా అనిపించకుండా ఒక వాస్తవ చిత్రాన్ని పట్టిస్తుంది.లోహసింగ్...పేరుకి తగినట్లే దృఢకాయుడు. చాలామంది దృష్టిలో అతనొక ‘కరెంట్’ రాబిన్ హుడ్. ఎందుకంటే ప్రభుత్వాన్ని దోచి ప్రజలకు పెడుతున్నాడు! కరెంట్ కొనుగోలు చేయలేని వాళ్లకు కరెంట్ ఇచ్చి... వాళ్ల కళ్లలో కాంతి నింపుతున్నాడు. కరెంట్ దొంగిలించడం అంటే... స్విచ్ వేసి బుగ్గ వెలిగించినంత ఈజీ ఏమీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా మనిషి మసి బొగ్గు కావాల్సిందే. అలా అయిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. లోహసింగ్ జేబులో నిండుగా కనిపించే డబ్బు గురించే చాలా మందికి తెలుసుగానీ... అతడి చేతివేళ్లకు అయిన గాయాల గురించి తక్కువమందికి తెలుసు. ఆ గాయాల గురించి అతడు నాటకీయంగా కథలు కథలుగా చెబుతాడు. ‘‘తమ్ముడూ... ఇంత రిస్క్ అవసరమా?’’ అని అమాయకంగా అడిగితే ‘‘ఆ రిస్కే నా జీవనాధారం. ఇంకో పని తెలియదు’’ అంటాడు గడుసుగా. లోహసింగ్ ఏరికోరి ఈ దందాలోకి రాలేదు. పరిస్థితులు అలా తీసుకువచ్చాయి. వాళ్ల నాన్న ఒక మిల్లులో పనిచేసేవాడు. అది మూతబడడంతో ఆయన బజారున పడ్డాడు. లోహసింగ్ స్కూల్ చదువు కూడా బందైపోయింది. ఆరు సంవత్సరాల వయసులో హోటల్లో కప్పులు కడగడం మొదలైంది. కరెంట్ తీగలను చూస్తూ పెరిగిన లోహసింగ్కు చివరికి ఆ తీగలే జీవనాధారాలయ్యాయి. లోహసింగ్ లాంటి కరెంట్ దొంగల గుండెల్లో కాన్పూర్ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ చీఫ్ అయిన రీతు మహేశ్వరి అదేపనిగా రైళ్లు పరుగెత్తిస్తుంటుంది. ఆమె వృత్తి నిబద్ధత కరెంటు దొంగలకే కాదు, స్థానిక రాజకీయ నాయకులకు కూడా చికాకు తెప్పిస్తుంది. ఒక నాయకుడైతే- ‘‘ఆమె పెద్ద ఆఫీసర్ అయితే కావచ్చు. ఆడదనే విషయం మరవద్దు’’ అని హెచ్చరిస్తాడు కూడా. సోషల్ స్కేల్‌కు చెరో వైపు ఉన్న రీతు, లోహసింగ్లు ఈ ‘కతియాబాజ్’ కథలో కేంద్ర పాత్రలు. ఒకే సమస్యకు సంబంధించి రెండు కోణాలకు లోహసింగ్, రీతు మహేశ్వరీ ప్రతినిధులు. ఇందులో అంతర్భాగంగా జెండర్ కోణం కూడా కనిపిస్తుంది. పూర్తిస్థాయి డాక్యుమెంటరీ తరహాలో కాకుండా సామాన్య ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ‘సినిమాటిక్ టర్మ్స్’ను అనుసరించింది ఈ డాక్యు డ్రామా. ఏం చెప్పనట్లే అనిపించే ‘కతియాబాజ్’ ఎన్నో విషయాలను చెబుతుంది. సమస్యను కాదు... దాని మూలాన్ని చూడండని, కరెంటు దొంగల కాలరు పట్టుకోవడమొక్కటే కాదు... వాళ్ల సమస్యల వేర్లపై కూడా దృష్టి సారించమని అడుగుతుంది. ‘‘ కరెంటు కోతల కాన్పూర్‌కు ఎవరైనా వీఐపి వస్తే అరనిమిషం కూడా కరెంట్ కోత విధించరు. కారణం ఏమిటి?’’ అనే సామాన్యుడి సందేహానికి సమాధానం ఒకటి కావాలి అని అడుగుతుంది. ‘‘మాలాంటి చిన్న దొంగలను పట్టడం కాదు... ఇండస్ట్రీలకు అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న పెద్ద దొంగలను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలి’’ అని అడిగే లోహసింగ్ ప్రశ్నకు జవాబు ఉందా? అని అడుగుతుంది. కాన్పూర్‌లో లోహసింగ్లాంటి కరెంట్ దొంగలు ఉండడంతో పాటు రీతు మహేశ్వరిలాంటి నిజాయితీ మూర్తీభవించిన అధికారులూ ఉంటారు. అయినంత మాత్రాన లోహసింగ్ కరెంట్ దొంగతనాన్ని ఎవరూ ఆపలేరు. ఫిలిబిత్‌కు జరిగిన రీతు ట్రాన్స్ఫర్ను కూడా ఎవరూ ఆపలేరు. అంతా సేమ్ టు సేమ్. కారణం?! ఒక్కసారి కాన్పూర్ ఆకాశం కేసి చూడండి. చిక్కులు చిక్కులుగా కరెంటు తీగలు. వాటిలాగే సమాధానాలు దొరకని చిక్కుప్రశ్నలు!! యాకుబ్ పాషా యం.డి చిత్రం: కతియాబాజ్ దర్శకత్వం: దీప్తి కక్కార్, ఫాహాద్ ముస్తఫా