ఒక కరెంట్ దొంగ కథ! | Introduction to Documentary | Sakshi
Sakshi News home page

ఒక కరెంట్ దొంగ కథ!

Published Wed, Feb 25 2015 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

ఒక కరెంట్ దొంగ కథ!

ఒక కరెంట్ దొంగ కథ!

దృశ్యం
 
డాక్యుమెంటరీ పరిచయం
 

ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల
 పరిచయమే... ఈ దృశ్యం.
 
 ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.
డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
 
మధ్యతరగతి ప్రజలను ఎప్పటికప్పుడు తాజాగా భయపెట్టే ‘కరెంట్ బిల్లు’ అనేది కాన్పూర్ పేదోళ్ల విషయానికి వస్తే డైనోసార్ లాంటిది. అందుకే దాన్ని దూరం నుంచి చూడాలనుకుంటారు తప్ప, దూరం నుంచి వినాలనుకుంటారు తప్ప... దగ్గరికి వెళ్లరు.
 
మరి వాళ్లకు మాత్రం కరెంట్ అక్కర్లేదా? చీకట్లోనే మగ్గిపోతారా?


అదేం లేదు. వారికి కూడా కరెంట్ కావాలి. అందుకే కొద్దిమంది పేదలు కరెంట్ కోసం ‘కతియ’ (కరెంట్ దొంగిలించే తీగ)ను నమ్ముకుంటారు. అదిగో ఆ కొక్కేలను చూడండి. అవి కొక్కేలు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని సవాలు చేసే సమాంతర వ్యవస్థలు. మిగిలిన వాళ్లలాగా భయం భయంగా కరెంట్ వాడుకోనక్కర్లేదు. నిర్భయంగా వాడుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ బిల్లు అనేది ఉంటే కదా! కరెంట్ దొంగలకు చేతిలో కాస్త డబ్బు పెడితే చాలు...‘కరెంట్ బిల్లు’ అనే మాట వినాల్సిన పనే లేదు. పారిశ్రామిక పట్టణమైన కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)లో ఈ కొక్కేల ఇళ్లు చాలా కనిపిస్తాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?!

కాన్పూర్ ప్రాంతంలో దొంగ కరెంట్‌ను వినియోగించుకునేవారు పదుల సంఖ్యలో కాదు... వందల సంఖ్యలో కాదు... వేల సంఖ్యలో ఉంటారు. ఆ ‘వేలు’ ఉత్త ‘వేలు’ కాదు.... విలువైన ఓటు బ్యాంకు! ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించడంలో ఈ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలోని చాలామంది రాజకీయ నాయకులను ఈ అక్రమ విద్యుత్ సమస్య గురించి మాట్లాడమంటే కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఫీలైపోతారు. అందుకే వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తారు. దీంతో ప్రజాసంక్షేమ ఎజెండాలో ‘అక్రమ విద్యుత్’ కూడా పెద్ద పీట వేసుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడింది.
   
ఎనభై నిమిషాల ‘కతియాబాజ్’ (పవర్‌లెస్) డాక్యుమెంటరీ ఏం చెబుతుంది?

అక్రమంగా విద్యుత్ వాడుతూ విద్యుత్ సంక్షోభాన్ని సృష్టిస్తున్న వాళ్లది తప్పా? లేక చర్యలు తీసుకోని ప్రభుత్వానిది తప్పా? అనే వాదనల్లో ఏ వైపూ సూటిగా నిలవకుండా, తీర్పు చెప్పినట్లుగా అనిపించకుండా ఒక వాస్తవ చిత్రాన్ని పట్టిస్తుంది.లోహసింగ్...పేరుకి తగినట్లే దృఢకాయుడు. చాలామంది దృష్టిలో అతనొక ‘కరెంట్’ రాబిన్ హుడ్. ఎందుకంటే ప్రభుత్వాన్ని దోచి ప్రజలకు పెడుతున్నాడు! కరెంట్ కొనుగోలు చేయలేని వాళ్లకు కరెంట్ ఇచ్చి... వాళ్ల కళ్లలో కాంతి నింపుతున్నాడు.

కరెంట్ దొంగిలించడం అంటే... స్విచ్ వేసి బుగ్గ వెలిగించినంత ఈజీ ఏమీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా మనిషి మసి బొగ్గు కావాల్సిందే. అలా అయిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. లోహసింగ్ జేబులో నిండుగా కనిపించే డబ్బు గురించే చాలా మందికి తెలుసుగానీ... అతడి చేతివేళ్లకు అయిన గాయాల గురించి తక్కువమందికి తెలుసు. ఆ గాయాల గురించి అతడు నాటకీయంగా కథలు కథలుగా చెబుతాడు.
 ‘‘తమ్ముడూ... ఇంత రిస్క్ అవసరమా?’’ అని అమాయకంగా అడిగితే ‘‘ఆ రిస్కే నా జీవనాధారం. ఇంకో పని తెలియదు’’ అంటాడు గడుసుగా. లోహసింగ్ ఏరికోరి ఈ దందాలోకి రాలేదు. పరిస్థితులు అలా తీసుకువచ్చాయి. వాళ్ల నాన్న ఒక మిల్లులో పనిచేసేవాడు. అది మూతబడడంతో ఆయన బజారున పడ్డాడు. లోహసింగ్ స్కూల్ చదువు కూడా బందైపోయింది. ఆరు సంవత్సరాల వయసులో హోటల్లో కప్పులు కడగడం మొదలైంది. కరెంట్ తీగలను చూస్తూ పెరిగిన లోహసింగ్‌కు చివరికి ఆ తీగలే జీవనాధారాలయ్యాయి.
   
లోహసింగ్ లాంటి కరెంట్ దొంగల గుండెల్లో కాన్పూర్ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ చీఫ్ అయిన రీతు మహేశ్వరి అదేపనిగా రైళ్లు పరుగెత్తిస్తుంటుంది. ఆమె వృత్తి నిబద్ధత కరెంటు దొంగలకే కాదు, స్థానిక రాజకీయ నాయకులకు కూడా చికాకు తెప్పిస్తుంది. ఒక నాయకుడైతే- ‘‘ఆమె పెద్ద ఆఫీసర్ అయితే కావచ్చు. ఆడదనే విషయం మరవద్దు’’ అని హెచ్చరిస్తాడు కూడా.
 సోషల్ స్కేల్‌కు చెరో వైపు ఉన్న రీతు, లోహసింగ్‌లు ఈ ‘కతియాబాజ్’ కథలో కేంద్ర పాత్రలు. ఒకే సమస్యకు సంబంధించి రెండు కోణాలకు లోహసింగ్, రీతు మహేశ్వరీ ప్రతినిధులు. ఇందులో అంతర్భాగంగా జెండర్ కోణం కూడా కనిపిస్తుంది. పూర్తిస్థాయి డాక్యుమెంటరీ తరహాలో కాకుండా సామాన్య ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ‘సినిమాటిక్ టర్మ్స్’ను అనుసరించింది ఈ డాక్యు డ్రామా.
 ఏం చెప్పనట్లే అనిపించే ‘కతియాబాజ్’ ఎన్నో విషయాలను చెబుతుంది. సమస్యను కాదు... దాని మూలాన్ని చూడండని, కరెంటు దొంగల కాలరు పట్టుకోవడమొక్కటే కాదు... వాళ్ల సమస్యల వేర్లపై కూడా దృష్టి సారించమని అడుగుతుంది. ‘‘ కరెంటు కోతల కాన్పూర్‌కు ఎవరైనా వీఐపి వస్తే అరనిమిషం కూడా కరెంట్ కోత విధించరు. కారణం ఏమిటి?’’ అనే సామాన్యుడి సందేహానికి సమాధానం ఒకటి కావాలి అని అడుగుతుంది. ‘‘మాలాంటి చిన్న దొంగలను పట్టడం కాదు... ఇండస్ట్రీలకు అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న పెద్ద దొంగలను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలి’’ అని అడిగే లోహసింగ్ ప్రశ్నకు జవాబు ఉందా? అని అడుగుతుంది.
 కాన్పూర్‌లో లోహసింగ్‌లాంటి కరెంట్ దొంగలు ఉండడంతో పాటు రీతు మహేశ్వరిలాంటి నిజాయితీ మూర్తీభవించిన అధికారులూ ఉంటారు. అయినంత మాత్రాన లోహసింగ్ కరెంట్ దొంగతనాన్ని ఎవరూ ఆపలేరు. ఫిలిబిత్‌కు జరిగిన రీతు ట్రాన్స్‌ఫర్‌ను కూడా ఎవరూ ఆపలేరు. అంతా సేమ్ టు సేమ్. కారణం?! ఒక్కసారి కాన్పూర్ ఆకాశం కేసి చూడండి. చిక్కులు చిక్కులుగా కరెంటు తీగలు. వాటిలాగే సమాధానాలు దొరకని చిక్కుప్రశ్నలు!!
  యాకుబ్ పాషా యం.డి
 
చిత్రం: కతియాబాజ్
దర్శకత్వం: దీప్తి కక్కార్, ఫాహాద్ ముస్తఫా
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement