ఉప్పమ్మా... తప్పెవరిదో చెప్పమ్మా?! | Introduction to Documentary | Sakshi
Sakshi News home page

ఉప్పమ్మా... తప్పెవరిదో చెప్పమ్మా?!

Published Wed, Feb 4 2015 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

ఉప్పమ్మా...  తప్పెవరిదో చెప్పమ్మా?!

ఉప్పమ్మా... తప్పెవరిదో చెప్పమ్మా?!

దృశ్యం
 
 డాక్యుమెంటరీ పరిచయం

 
ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం.
 
ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.
డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
 
‘ఉప్పు సత్యాగ్రహం’ పుణ్యమా అని ‘ఉప్పు’ అనేది ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. అది వంటలో వాడే దినుసు స్థాయి నుంచి చైతన్య ప్రతీక స్థాయికి, ఆత్మాభిమానపు పతాక స్థాయికి ఎదిగింది. అయితే, ఇప్పుడు ఉప్పు గురించి మాట్లాడుకోవడమంటే... గుజరాత్‌లోని ‘రణ్ ఆఫ్ కచ్’లో ఉప్పు పండించే కార్మికుల కన్నీళ్ల గురించి అనివార్యంగా  మాట్లాడుకోవడం కూడా.

చైనా, అమెరికాల తరువాత ఉప్పును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న  దేశం మనదే. ఇదేదో ‘ఘనత’లాగా ధ్వనిస్తున్నప్పటికీ, ఉప్పు తయారుచేసే శ్రామికుల కష్టాల్లోకి వెళితే మనసు దుఃఖతీరం అవుతుంది.  ‘మై నేమ్ ఈజ్ సాల్ట్’ డాక్యుమెంటరీ మనల్ని ఆ తీరానికి తీసుకువెళుతుంది. మనదే అయినా మనది కాని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది.

ఈ డాక్యుమెంటరీలో  రెండు కోణాలు మనకు పరిచయం అవుతాయి. పరిమితమైన సంప్రదాయవనరులతో ఉప్పును పండించడం  ఎంత కష్టమైన పని అనేది ఒక కోణం అయితే, పొట్ట చేతపట్టుకొని అనువుగాని చోట అష్టకష్టాలు పడుతూ ఎనిమిది నెలలు గడిపే శ్రామికుల జీవనశైలి పరిచయం కావడం... రెండో కోణం. ఈ ఎనిమిది నెలల కాలంలో వారి మానసిక, భౌతిక ప్రపంచాలు ఎలా ఉంటాయో ‘మై నేమ్ ఈజ్ సాల్ట్’ కళ్లకు కడుతుంది.
     
వారి కళ్లవైపు ఒకసారి చూడండి... కనిపించే కన్నీళ్లు, కనిపించని కన్నీళ్లు ఉంటాయి. రెండూ ఒకే రకమైన కథలు చెబుతాయి! కాళ్ల వైపు చూడండి ఒకసారి. ఉప్పు మడులలో నానీ నానీ సెప్టిక్ అయిన కాళ్లు... ఎన్ని కథలు చెబుతాయో వినండి! రణ్ ఆఫ్ కచ్‌లో ఉప్పు పండించే కార్మికులు... ఎవరూ 50 నుంచి 60 సంవత్సరాలకు మించి బతకరట. చిత్రమేమిటంటే, చావు తరువాత కూడా ఉప్పు వారిని వెంటాడుతూనే ఉంటుంది. సాల్ట్ కంటెంట్ వల్ల శవం చేతులు, కాళ్లు చితిమంటలకు లొంగవు. మరి కోరి కోరి ఈ నరకంలోకి ఎందుకు వస్తున్నట్లు?

‘‘సారీ... మేము మాత్రం నరకం అనుకోవడం లేదు’’ అంటాయి వారి కళ్లు.  ‘‘మా ముత్తాతలు ఈ పనిచేశారు. మా తాతలు చేశారు. నాన్న చేశాడు. ఇప్పుడు మేము చేస్తున్నాం. రాబోయే కాలంలో మా బిడ్డలు చేస్తారు. ఇదీ లెక్క...’’ అంటారు వాళ్లు. ఇది తరతరాలుగా క్రమం తప్పని లెక్క. పెట్టుబడిదారి దోపిడి, అసంఘటిత కార్మిక కష్టం... ఇలాంటివాటి గురించి వారు పెద్దగా ఆలోచించినట్లుగా కూడా అనిపించదు. ‘‘ఉప్పు పండించడం అంటే, కూరలో ఉప్పేసుకున్నంత తేలిక కాదు, అష్టకష్టాలు పడినా అదృష్టం కలిసిరావాలి. మంచి ధర రావాలంటే ‘నాణ్యమైన ఉప్పు’ చేతికందాల్సిందే’’ అంటాడు సనాభాయి అనే కార్మికుడు. ఆయన భార్య దేవుబెన్ విషాద మౌనం కూడా ఎన్నో అజ్ఞాత కథలను చెబుతున్నట్లుగానే అనిపిస్తుంది. ‘‘ప్రతి వంటకంలో ఉప్పు అతి ముఖ్యమైనది అంటారు. ఆ ఉప్పును పండించే మేము మాత్రం... ఎవరికీ ముఖ్యం కాదు’’ అనేది కచ్ కార్మికుల ఉమ్మడి వేదన.
     
‘కచ్’ అంటే సంస్కృతంలో ‘ద్వీపం’ అని అర్థం. ఇక్కడ ఉప్పు పండించే కార్మికుల పరిస్థితి... నిజంగా ద్వీపంలో ఉన్నట్లుగానే ఉంటుంది. మన నిత్యావసర వస్తువులేవీ అక్కడ కనిపించవు.  ఎనిమిది నెలల పాటు ఆలుగడ్డ కూర, రొట్టె తప్ప తినడానికి పెద్దగా ఏమీ ఉండదు. ‘పాలు’ దొరకడం అనేది ఊహకు కూడా అందని విషయం. అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల నేవిగేషన్ కోసం అద్దపు ముక్కలను వాడుతూ కాంతి సందేశాలు పంపుకుంటారు. ‘‘ఇన్ని కష్టాలు పడడం అవసరమా?’’ అని చాలామంది అనుకున్నట్లుగానే ఉప్పు పండించే కార్మికులపై మూడు పుస్తకాలు రాసిన అంబూ పటేల్ కూడా అనుకున్నాడు. ‘‘ఎందుకు ఇంత కష్టం?’’ అని అడిగాడు కూడా. ‘‘మరో ప్రత్యామ్యాయం ఏమున్నది?’’ అంటారు వాళ్లు.

ఇదంతా సరే, ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?

 ఈ అసంఘటిత కార్మికులకు రబ్బరు బూట్లు, గ్లోవ్స్, ఐ గ్లాసులు, స్వచ్ఛమైన నీరు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం వారి సాల్ట్ కమిషనర్‌లు చెబుతారు. పిల్లలకు పాఠాలు చెప్పడానికి  స్వచ్ఛంద సేవకులు బడులతో  సహా ఇక్కడికి వస్తారు. రకరకాల అధ్యయనాలు ‘రణ్ ఆఫ్ కచ్’ కార్మికుల ఆరోగ్యస్థితిగతులు,  ప్రమాద తీవ్రతను గురించి  హెచ్చరించినట్లుగానే అనిపిస్తాయి. ఎన్ని జరిగినా, ఎన్ని ప్రమాద హెచ్చరికలు వినిపించినా అదేమిటో మరి... ఏ మార్పు కనిపించని నిశ్చల  చిత్రంలాగే ఉంటుంది ‘కచ్’ కార్మికుల  పరిస్థితి. డాక్యుమెంటరీ పూర్తయిన తరువాత ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిల్చొని అడుగుతుంది -
 ఇంతకీ తప్పెవరిది? మార్పు కోరుకోని కార్మికులదా? వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపలేని ప్రభుత్వానిదా? ఒకవేళ విధిరాత ఉండి ఉంటే... విధిరాతదా?!
 - యాకుబ్ పాషా యం.డి
 
డాక్యుమెంటరీ పేరు: మై నేమ్ ఈజ్ సాల్ట్
దర్శకత్వం: ఫరీదా పచ
డెరైక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కొనెర్‌మాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement