ఒక ప్రజ్ఞాగీతిక !
‘మా ఊరు’. అందరి ఊరే. కాబట్టే మ్యూరిచ్ జ్యూరీ బెస్ట్ ఏంత్రోపాలజికల్ డాక్యుమెంటరీగా కీర్తించింది. ఇందులో మాటలు దాదాపు లేవు. గ్రామీణ వాద్యపరికరాల శృతులు, సహజ శబ్దసౌందర్యం తప్ప. చల్లకవ్వం, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, గొంగడి నేతలు, జాలరి వల సృష్టించే జల తరంగాలు, ఇసురురాళ్ల జుగల్‌బందీ, పొదుగు నుంచి కురిసిన క్షీరసంగీతం, నేలను చీల్చే నాగలి, కుప్పనూర్పిళ్లు, దొమ్మరుల అపూర్వ దేహ విన్యాసాలు, యక్షగానాలు, దడిలో ఆమె స్నానింత, పూనకాలు, దొరరికం, ఎద్దు కేస్టరైజేషన్ ఎన్నెన్ని దృశ్యశకలాలో. ‘మా ఊరు’ ఎవరి ఊరు? ఒకే ఊరిలోని ఒకొక్కరి ఊహల ఊరు. ఏ ఊరి వారికైనా ఒకే జ్ఞాపకాల ‘వేరు’. అంతా బావుంది బతుకమ్మ లేదే అన్పించే క్షణంలోనే ‘ఊరు అనే బతుకమ్మలో ప్రతి దృశ్యమూ ఒక పువ్వే’ కదా అని స్ఫురిస్తుంది. డాక్యుమెంటరీలో ఎంపిక చేసిన స్టిల్స్‌ను ప్రామాణిక వివరాలతో (బిబిలియోగ్రఫీ) కూరిస్తే ఒక అపురూప పుస్తకం తయారవుతుంది.
- పున్నా కృష్ణమూర్తి
(బాల్య - కౌమార దశలో తన ఊరు ప్రజ్ఞాపూర్ తన మదిలో ముద్రించిన జ్ఞాపకాలను 35వ ఏట 1988లో బి.నరసింగరావు ‘మా ఊరు’గా పదిలపరచారు- నూరుకు పైగా ఊర్లను తిరిగి. తాను స్వరపరచి, దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీని తన 62వ ఏట ఇటీవల సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు)