Pun Krishnamurthy
-
తెలంగాణను నిద్ర లేపాం: సుంకిరెడ్డి
సంభాషణ ప్రవాహంలోకి దూకినవాడు లోతును తట్టిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది? అరచేతిలో చూపిన అడుగుమట్టే అందుకు రుజువు. తెలంగాణ సమాజానికి ఎదురైన అనేక సవాళ్ల సందర్భాల్లో సుంకిరెడ్డి నారాయణరెడ్డి చరిత్రలోతుల్లోకి దూకాడు. తన రచనల్లో ఆ అడుగుమట్టిని చూపాడు. అనాది కాలం ఉంచి ఆధునిక కాలం వరకూ తెలంగాణ నేలపొరల్లో దాగిన నిజాలను వెలుగులోకి తెచ్చాడు. ఆ ప్రకాశం అనేకులకు ఉత్తేజాన్నిచ్చింది. కాబట్టే, ఆయన రచనలు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యపుస్తకాలయ్యాయి. టీనేజ్ విద్యార్థులు సైతం చరిత్రలోకి డైవ్ చేసేందుకు సుంకిరెడ్డి రచనలు ప్రేరణనిస్తున్నాయి. ‘ముంగిలి’కి ద్వానాశాస్త్రి పురస్కారం, ‘తెలంగాణ చరిత్ర’కు బి.ఎన్.శాస్త్రి పురస్కారం అందుకున్న డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవి, పరిశోధకుడు, వివిధ రచనలను సంకలనం చేసిన సంపాదకుడు కూడా. యు.జి.సి ప్రాజెక్ట్‌లో భాగంగా ‘తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం’ చేస్తోన్న సుంకిరెడ్డితో సంభాషణా సారాంశం: ‘ప్రతిజ్ఞ’ చేయించిన ఊరు.. నల్లగొండ జిల్లా పానగల్లు మండలం పగిడిమర్రి మా ఊరు. ఇరు రాష్ట్రాల విద్యార్థులు నిత్యం పఠించే ‘ప్రతిజ్ఞ’ రచయితది మా ఊరే. నల్లగొండలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ, పీహెచ్డీ చేసిన. బెంగాలీ, సంస్కృతం భాషలంటే కుతూహలం. వాటిని సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేసిన. నందిని సిధారెడ్డి, రఘునాథం, జింబో.. అందరం కలిసి ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ అయ్యాం. 1970-80ల మధ్యకాలంలో వెలువడిన కవితల్లో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మేం వేసిన ‘ఈతరం యుద్ధకవిత’ సంకలనం చాలామందికి ప్రేరణనిచ్చింది. తెలంగాణ రైటర్స్... 1998 నవంబర్ 1న - అప్పటికి తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశను గమనించి- సిధారెడ్డి, కె.శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి తదితరులం ‘తెలంగాణ రైటర్స్’ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి తొలి ఉద్యమ వేదిక ఇదే. మరుసటి సంవత్సరం ఇది ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’గా మారింది. తెలంగాణ సంస్కృతి, కవిత్వంపై శతాబ్దం కాలంగా (1917-2002) పరచిన చీకట్లను ఛేదిస్తూ వేదిక తరఫున తొలి సంకలనం ‘మత్తడి’ ప్రచురించాం. కవిత్వపు ఆదిమయుగం నుంచి క్రీ.శ.1700 వరకూ తెలంగాణ ప్రాచీన కవిత్వాన్ని ‘ముంగిలి’గా పాఠకుల ముందుంచాం. వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ‘తెలంగాణ చరిత్ర ఎందుకు లేదు’ అనే కోణంలో యువతను చైతన్యవంతం చేశాం. ఎందరో మహానుభావులు... తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి కృషిని వెలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆధునిక సాహిత్యంలో తెలంగాణ నుంచి కృషి చేసిన గవ్వా సోదరులు (మురహరిరెడ్డి-జానకిరామిరెడ్డి-అమృతరెడ్డి) చేసిన కృషి ఎందరికి తెలుసు? వారి రచనలు వెతికి వెలికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’కు ముందే తెలంగాణకు చెందిన సాయిరెడ్డి ‘కాపుబిడ్డ’ రాశారు. ఆ సంగతి ఎందరికి తెలుసు? కరుణశ్రీ పుష్పవిలాపం కంటే ముందే ‘సుమవిలాపం’ గోల్కొండ పత్రికలో ప్రచురితం. పోతన ఇక్కడి వాడు కాదన్నారు. పాల్కురికి సోమననూ కాదన్నారు. మూడు వేల సంవత్సరాలుగా తెలుగువారంతా కలిసే ఉన్నారన్నారు. ఈ వాదనలకు తిరుగులేని ఆధారాలతో బదులిచ్చాం. తరతరాల తెలంగాణను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం. తగ్గింపబడువారు హెచ్చింపబడతారనే చారిత్రక వాస్తవాన్ని చెబుతున్నాం. తెలంగాణ రైటర్స్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ ప్రజాసంఘాలు, తెలంగాణ రాజకీయపార్టీలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. మేనిఫెస్టోను అవతరింప చేయలేదని కొందరు తెలంగాణ సాహిత్యకారులు ప్రభుత్వంపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. కొంత వ్యవధినివ్వాలని నేను భావిస్తున్నాను. - పున్నా కృష్ణమూర్తి -
నూరేళ్లకూ మసకబారని చూపు...
బేతి శ్రీరాములు బి.ఎస్.రాములుగా పాఠకులెరిగిన రచయిత. పుట్టిన గడ్డ జగిత్యాల . తండ్రి ‘బొంబాయి’ బట్టలమిల్లు కార్మికుడు. తల్లి బీడీ కార్మికురాలు. ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాలలో చదివారు. 1964లో ఆర్.ఎస్.ఎస్ క్రియాశీలిగా మొదలయ్యి ’78లో ముఖ్యశిక్షక్‌గా ఎదిగి ఆ తర్వాత 90 వరకూ విప్లవరాజకీయాల్లో కొనసాగి పూలే-అంబేద్కర్ల అధ్యయనం వల్ల దళిత-బహుజన దార్శనికతతో రచనలు చేశారు. కరీంనగర్ మాండలీకంలో 1982లో ప్రచురితమైన ఆయన తొలి నవల ‘బతుకు పోరు’. ఇప్పుడు రెండవ నవల ‘చూపు’ ముద్రణలో ఉంది. ‘చూపు’ ప్రత్యేకత ఏమిటి? తెలంగాణ కేంద్రకం నుంచి చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలను కలుపుతూ మలచిన వృత్తం! ‘చూపు’ గురించి ఆయన మాటల్లోనే... ఏ మంచి నవలైనా సమాజాన్ని వ్యక్తీకరిస్తుంది. భవిష్యత్‌కూ ఉపకరిస్తుంది. బంకించంద్ర ‘ఆనందమఠ్’, రవీంద్రుని ‘గోరా’, ప్రేమ్‌చంద్ ‘రంగభూమి’ ఇందుకు ఉదాహరణలు. 1948లో లక్షీకాంత మోహన్ తెలంగాణపై తొలి నవల రాశారు. ఆ తర్వాత ఆళ్వారుస్వామి, దాశరథి తాము చూసిన తెలంగాణ సమాజపు సంక్షోభాలను నవలీకరించారు. ‘చూపు’లో తెలంగాణ ఉద్యమంలో మూడవ దశ కు సంబంధించిన సంఘటనలుంటాయి. తీసుకున్న కాలం 1989 నుంచి 2008 వరకూ. అంటే రాష్ట్ర ఆవిర్భావానికి ఐదేండ్ల ముందు వరకూ. 1996 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన 36 సంస్థలతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఆ అనుభవాలన్నిటినీ క్రోడీకరించుకుని తెలంగాణ గురించి ఫిక్షన్‌గా చెప్పిన నాన్ఫిక్షన్ ‘చూపు’. ఎన్నో ‘చూపు’ల సమదృష్టి! ‘చూపు’లో తల్లి- తండ్రి- విద్యార్థులు- అధ్యాపకులు- స్త్రీవాదులు- దళితులు- వామపక్షవాదులు- కాంట్రాక్టర్లు ఇలా కీలకమైన 15 పాత్రలు ఉన్నాయి. ఆధిపత్యకులాల నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించాల్సి రావడం వెనుక ఉన్న కారణాలను ఈ పాత్రలు వెల్లడిస్తాయి. ఈ పాత్రల్లో ఎవరి చూపు వారిదే. నవలను ఆకళింపు చేసుకుంటే రచయిత ‘చూపు’ తెలుస్తుంది. అది ఎంత వరకు నిష్పాక్షికం ఏ మేరకు ఆ విశ్లేషణను ఆచరణలో వినియోగించుకోవాలి అనే అంశాన్ని పాఠకులు నిర్ణయించుకుంటారు. ఇందులోని పాత్రలు వాస్తవిక వ్యక్తుల నుంచి వచ్చినవే. ప్రొ.లక్ష్మీపతి పాత్ర ప్రొ.జయశంకర్ వంటి తెలంగాణ మేథావుల సమ్మిళిత రూపం. పార్టీ ఐఏఎస్‌లూ, పార్టీ సీఈవోలు! ఉద్యమాలు విజయవంతం అయిన తర్వాత ‘మరోప్రపంచం’ ఊడిపడదని ఇందులో కొన్ని పాత్రలు కుండబద్దలు కొడతాయి. కమ్యూనిస్ట్ పాలన వస్తే ఇప్పటి ఐ.ఏ.ఎస్‌లు, ిసీ.ఈ.వోలూ, కాంట్రాక్టర్లు అంతరించి పోరని వీరి కుర్చీల్లో పార్టీ ప్రముఖులు వారి వారసులు ఆయా హోదాలలో వస్తారని వర్తమాన ‘కమ్యూనిస్ట్’ దేశాల పాలనాధోరణులను సోదాహరణంగా వివరించే కేపిటలిస్టులూ నవలలో ఉన్నారు. కులవృత్తుల సమాజం పారిశ్రామికవేత్తలు వచ్చేవరకూ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటుంది. పెట్టుబడికి కులస్వభావం ఉండదు. వర్గస్వభావం కూడా ఉండదు. ‘లాభ’స్వభావం మాత్రమే ఉంటుందనే సంభాషణలూ ఉన్నాయి! ఎందుకివ్వాలి? ఎందుకివ్వకూడదు! కొన్ని పాత్రలు ఆంధ్రా-తెలంగాణ ఆర్థిక మనస్తత్వాలను చర్చిస్తాయి. ఆంధ్రావాళ్లు దోపిడీ చేస్తున్నారనే ఆవేదనలుంటాయి. అందుకు ఎటువంటి పరిస్థితులు దోహదపడుతున్నాయి అనే వివేచన ఉండాలి కదా! ఆంధ్రప్రాంతంలో కేపిటలిస్ట్ దృక్పథం ఉంది. తెలంగాణలో భూస్వామ్యధోరణే చలామణిలో ఉంది. ఇక్కడి సమాజంపై జైన, శైవ ప్రభావాలున్నాయి. ఉన్నది చాలులే అనే ‘అంతఃచేతన’ ఉంది. అయితే ‘వనరులు ఎన్ని ఉన్నా స్థానికులు వాటిని ఉపయోగించుకుని ఎదగకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పారిశ్రామిక వేత్తలుగా, పెట్టుబడి దారులుగా స్థిరపడిపోతారు’ అని ‘చూపు’లో ఒక పాత్ర స్పష్టం చేస్తుంది. తెలంగాణ సమాజం తన సాంస్కృతిక విలువలను కోల్పోకుండా ‘వాణిజ్య దృక్పథం’ సంతరించుకోవాలని ‘ఎంటర్‌ప్రెన్యూయర్ సైకాలజీ’ అవసరమని కొన్ని పాత్రలు నొక్కిచెబుతాయి! సారాంశంలో నూరేళ్ల తర్వాతైనా ‘చూపు’ మసకబారదని, పాఠకులతో సంభాషిస్తుందని విశ్వసిస్తున్నాను! - పున్నా కృష్ణమూర్తి -
ఒక ప్రజ్ఞాగీతిక !
‘మా ఊరు’. అందరి ఊరే. కాబట్టే మ్యూరిచ్ జ్యూరీ బెస్ట్ ఏంత్రోపాలజికల్ డాక్యుమెంటరీగా కీర్తించింది. ఇందులో మాటలు దాదాపు లేవు. గ్రామీణ వాద్యపరికరాల శృతులు, సహజ శబ్దసౌందర్యం తప్ప. చల్లకవ్వం, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, గొంగడి నేతలు, జాలరి వల సృష్టించే జల తరంగాలు, ఇసురురాళ్ల జుగల్బందీ, పొదుగు నుంచి కురిసిన క్షీరసంగీతం, నేలను చీల్చే నాగలి, కుప్పనూర్పిళ్లు, దొమ్మరుల అపూర్వ దేహ విన్యాసాలు, యక్షగానాలు, దడిలో ఆమె స్నానింత, పూనకాలు, దొరరికం, ఎద్దు కేస్టరైజేషన్ ఎన్నెన్ని దృశ్యశకలాలో. ‘మా ఊరు’ ఎవరి ఊరు? ఒకే ఊరిలోని ఒకొక్కరి ఊహల ఊరు. ఏ ఊరి వారికైనా ఒకే జ్ఞాపకాల ‘వేరు’. అంతా బావుంది బతుకమ్మ లేదే అన్పించే క్షణంలోనే ‘ఊరు అనే బతుకమ్మలో ప్రతి దృశ్యమూ ఒక పువ్వే’ కదా అని స్ఫురిస్తుంది. డాక్యుమెంటరీలో ఎంపిక చేసిన స్టిల్స్‌ను ప్రామాణిక వివరాలతో (బిబిలియోగ్రఫీ) కూరిస్తే ఒక అపురూప పుస్తకం తయారవుతుంది. - పున్నా కృష్ణమూర్తి (బాల్య - కౌమార దశలో తన ఊరు ప్రజ్ఞాపూర్ తన మదిలో ముద్రించిన జ్ఞాపకాలను 35వ ఏట 1988లో బి.నరసింగరావు ‘మా ఊరు’గా పదిలపరచారు- నూరుకు పైగా ఊర్లను తిరిగి. తాను స్వరపరచి, దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీని తన 62వ ఏట ఇటీవల సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు) -
‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష!
మంచి పుస్తకం ‘మెహదీపట్నం దగ్గర గుడిమల్కాపూర్ మార్కెట్‌కి వెళ్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది కాబోలు’ అంటాడు ప్రసాదమూర్తి, పూలండోయ్‌పూలు కవిత పూర్తి చేసి. ‘ఈ పదాన్ని ఇలాగే పలకాలి. ఈ వాక్యాన్ని అనేపుడు బాడీలాంగ్వేజ్ ఇలాగే ఉండాలి’ అనే ప్రొఫెసర్ హిగ్గిన్స్‌కు మాత్రం పూలమార్కెట్ అలా ఉండదు. హిగ్గిన్స్ ఎవరు? బెర్నార్డ్ షా నాటకం ‘పిగ్మేలియన్’ (1938) ఆధారంగా 1964లో ‘మై ఫెయిర్ లేడీ’ అనే క్లాసిక్ ఫిలిం వచ్చింది. అందులో ఎలిజా అనే పూలమ్మిని హైసొసైటీ లేడీగా మార్చేందుకు శపథం పూనిన ఆచార్యుడు. ‘హిగ్గిన్స్’ తెలుగు కవుల్లోనూ ఉన్నారు. నియమం లేని వాక్యం గ్రామ్యం అన్నారు గ్రాంథికులు. చంపకమాల (సంపెంగ దండ) ఉత్పలమాల (కలువపూల దండ) అని పేర్లు పెట్టారు కాని పూల తాలూకూ వాసనలే సోకని ఛందస్సులతో పద్యాల ఇటుకలు పేర్చేశారు. కొందరు ఆధునికుల్లో ఛందస్సూ కవిత్వమూ రెండూ మృగ్యమే. ‘పూలండోయ్ పూలు’ కవితా సంకలనంలోని ప్రసాదమూర్తి కవితలు ఏ భాషలోని ‘హిగ్గిన్స్’కు అయినా పరిమళపు భాష నేర్పుతాయి. గుడిమల్కాపూర్ పూలమార్కెట్‌ను డాక్యుమెంటరీగా తీస్తే ఏ భాషలోని కవి అయినా తమ భాషల్లో ప్రసాదమూర్తి కవిత్వాన్నే పలుకుతాడు. ఈ సంకలనంలో కేవలం ‘పాటల పారిజాతాలు ... ఆశల సంపెంగలు’ మాత్రమే లేవు. అత్తిచెట్టు తనలోకే పుష్పిస్తూ ఫలంగా రూపొందిన విధంగా ప్రసాదమూర్తి తనలోనే దుఃఖించి పాఠకులకు కానుకగా అందించిన కవితలూ ఉన్నాయి. ‘పగలంతా సూర్యుడు రాల్చిన/ వెలుగు కలల్ని/ రాత్రిచంద్రుడు ఏరుకునే/ సన్నివేశం గుర్తొచ్చింది’ అన్న కవి ‘కొంపలు కొల్లేరైపోయాక/ఇంక ఇక్కడేముందని/ఓ పెద్ద చేప పెకైగిరి/నా కాళ్లమీద తోకతో కొట్టిపోయింది’ అలాంటి వ్యక్తీకరణే! ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధిగా పద్యంతో మొదలై, అష్టావధానాలూ చేసి, ప్రేయసీ అనే అలభ్యశతకం రాసి శ్రీశ్రీ ప్రభావంతో ఛందస్సుల నుంచి బయటపడ్డాననే ప్రసాదమూర్తి ఛందోస్ఫూర్తిని వీడలేదు. ప్రసాదమూర్తి వామపక్షభావాల నుంచి, దళిత ఉద్యమ మమేకత్వాన్నుంచి, భిన్న భావాల సంఘర్షణల నుంచి ఏ మంచినీ వదులుకోకుండా కవిగా ప్రయాణిస్తున్నాడు అనేందుకు అతడి గత పుస్తకాలు ‘నాన్నచెట్టు’, ‘కలనేత’, ‘మాట్లాడుకోవాలి’కి కొనసాగింపైన ‘పూలండోయ్ పూలు’ ఉదాహరణ! లోహపురుషుడి కోసం లోహాన్ని సమకూర్చండి అన్న నాయకుడి పిలుపు నేపథ్యంలో ‘ప్రియమైన భారతీయులారా/మీరు లోహాన్ని సమకూచ్చండి/విగ్రహం కోసం కాదు/ సంగ్రామం కోసం’ అంటాడు! ప్రపంచంలోని అన్ని సంఘర్షణసీమల్లోకి కలల విహారం చేస్తూ ‘ఇండోపాక్ బార్డర్లో / నా రెండు కనుపాపల్నీ /అటూ ఇటూ దీపాలుగా పెట్టి/ క్రాస్ బార్డర్ హ్యూమనిజానికి/హారతులు పట్టమని ఆనతిచ్చాను’ తొలికవిత ‘అమ్మ పుట్టిన రోజు’లో ‘బతుకు నొప్పినంతా భరించీ భరించీ/పురిటి నొప్పుల్ని మాత్రం/నా కోసమే తియ్యగా మార్చుకున్నావు/ అక్షరాల ప్రసవంలో/ నేనూ అదే నేర్చుకున్నాను’ అంటాడు. నిజమే సుమీ అని 38 కవితలూ బోసిగా నవ్వుతాయి! - పున్నా కృష్ణమూర్తి పూలండోయ్ పూలు: ప్రసాదమూర్తి; వినూత్న ప్రచురణలు: ప్రతులు అన్ని ముఖ్యమైన చోట్లా; వేల: 100/- -
ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన తెలుగు రచయిత ఎవరు?
అనంతమూర్తి సంస్మరణ సభలో ఒక ప్రశ్న! ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి (యుఆర్) సంస్మరణ సభ సందర్భంగా ఆయనపై ప్రఖ్యాత దర్శకుడు గిరీష్ కాసరవెల్లి ఫిలింస్ డివిజన్ కోసం రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని లామకాన్‌లో ఇటీవల ప్రదర్శించారు. తీర్ధహళ్లిలో తన ఇంటి వసారా- ఇంటి పెరడు మధ్య వర్ధిల్లిన రెండు ప్రపంచాలను రెండిటి సమన్వయంతో ‘మధ్యే’మార్గంగా తన ఎదుగుదలను అనంతమూర్తి ఈ చిత్రంలో ఆసక్తికరంగా వివరించారు. ఫ్రంట్ యార్డ్ (వసారా)లో గతంలో సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లిష్ చర్చనీయాంశం. బ్యాక్‌యార్డ్ (మహిళల నెలవు)లో గతంలో దేశీ రామాయణ, భాగవతాలు, ప్రస్తుతం కన్నడ యక్షగానాలూ! ఈ రెండూ తన ఇంట్లోనే కాదు భారతీయ సాహిత్యంలోనూ సమాంతరంగా ప్రవహిస్తున్నాయని అనంతమూర్తి వివరించారు. డాక్యుమెంటరీ అనంతరం ఇఫ్లూ ప్రొఫెసర్ తారకేశ్వర్, ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు అనంతమూర్తి రచనలను, మేధోజీవితాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘సంస్కార’ నవలాకారునిగా కంటే మేధోజీవిగా అనంతమూర్తి గొప్పవాడని వాడ్రేవు వ్యాఖ్యానించారు. కన్నడిగులు ఎక్కువమంది హాజరైన సమావేశంలో ఈ వ్యాఖ్య చిన్న కదలికను సృష్టించింది. తన ఉద్దేశంలో ‘సంస్కార’ గొప్పది కాదని కానేకాదని అంతకంటే ఏ మాత్రం తక్కువ కాని కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ తెలుగు సీమను దాటి వెళ్లలేదని అన్నారు. వెంటనే ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్న వచ్చింది. ‘సంస్కార’ వలె ‘యజ్ఞం’ ఇంగ్లిష్ పాఠకులకు చేరకపోవడం అనే సమాధానం మరికొన్ని ప్రశ్నలకు తావిచ్చింది. ‘యజ్ఞం’ ఇంగ్లిష్‌లోకి ఎందుకు అనువాదం కాలేదు? కాస్సేపు మౌనం! అనంతమూర్తి చనిపోయిన రెండు మూడు రోజుల తర్వాత తాము కర్ణాటకలోని ఒక పల్లెలో పర్యటిస్తున్నామని, ఒక సాయంత్రం స్థానిక యక్షగాన సమాజం అనంతమూర్తి జీవితాన్ని ప్రదర్శిస్తోందని ఇఫ్లూలో ఫిలిం స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న నిఖిల అన్నారు. అనంతమూర్తి చనిపోయిన తర్వాత సైతం అక్కడ ఇంటి ముంగిట (ఇంగ్లిష్)కు పెరడు (దేశీ)కు కనెక్టివిటీ ఉందని అన్నారు. ఇంగ్లిష్ ఆచార్యుడైనప్పటికీ తాను రాస్తోన్న జీవితం కన్నడిగులది కాబట్టి కన్నడలోనే అనంతమూర్తి రచనలు చేశారని, ఆయన సంస్కారను ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఎ.కె.రామానుజన్ వలె తెలుగులో యజ్ఞాన్ని ఎవరైనా అనువదిస్తే బావుండేద న్నారు. ఆయుర్వేద పరిశోధకురాలు డా.సత్యలక్ష్మి ఇటీవలి తన అనుభవాన్ని వెల్లడించారు. కొందరు స్త్రీవాద కవయిత్రులు తమ కవిత్వాన్ని ఇంగ్లిష్ చేసేవారి పేర్లను సూచించమన్నారని, కన్నడ లేదా మరోభాషల కవులు సరైన అనువాదం చేయలేరని తెలుగులో అటువంటి వారిని గుర్తించవలసినదిగా సూచించానని తెలిపారు. సినిమా విమర్శకుడు, పర్యావరణ చైతన్యశీలి విజేంద్ర మాట్లాడుతూ- ఆర్.కె.నారాయణ్ అనగానే మాల్గుడీ డేస్, గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్ గుర్తొస్తాయి. ముల్కరాజ్ ఆనంద్ అన్‌టచబుల్స్ గుర్తొస్తుంది. ఎ.కె.రామానుజన్, సాల్మన్ష్డ్రీ, అరుంధతీరాయ్, జంపాలహరి వలె ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన ఇంగ్లిష్‌లో రాసే తెలుగు రచయితలెవరు? అని ప్రశ్నించారు. ఇంగ్లిష్‌లో డాక్టరేట్లు చేసిన వారు, హెడాఫ్ ద డిపార్ట్మెంట్స్ అనువదించిన రచనలను మినహాయించాలని చమత్కరించారు! - పున్నా కృష్ణమూర్తి -
పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’!
జూన్ 12 వరకు నగరంలో కొనసాగనున్న ప్రదర్శన బెల్జియంలో సానపెట్టిన వజ్రాలకు ఒక రవ్వ ప్రకాశం ఎక్కువ అని సామెత. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు సమీపంలోని ‘మ్యూజియం ఆఫ్ శాక్రెడ్ ఆర్ట్’ (మోసా)లో ప్రదర్శించే చిత్రాలకూ అటువంటి అదనపు గౌరవం ఉంది. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించే యూరోపియన్ సంస్థ (యు ఆర్ ఐ)లో సభ్యుడైన మార్టిన్ ‘మోసా’ను 2009లో స్థాపించాడు. ‘మోసా’ నూతన భవనాన్ని ఈ నెల 17వ తేదీన హరిప్రసాద్ చౌరాసియా వేణుగానంతో, పూసపాటి పరమేశ్వరరాజు చిత్రించిన ఐకానిక్ కాలిగ్రఫీ చిత్రాల ఎగ్జిబిషన్ (టైమ్‌లెస్ ఆర్ట్)తో ప్రారంభిస్తున్నారు. అంతదూరం వెళ్లి పూసపాటి చిత్రాలను చూడలేం కదా! నథింగ్ టు వర్రీ! ఈ నెల 12 నుంచి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో పూసపాటి తాజాచిత్రాలు కొలువై ఉన్నాయి. వచ్చే నెల 12 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ నేపథ్యంలో పూసపాటితో సంభాషణా సారాంశం ఆయన మాటల్లోనే... విజయనగరంలో 1961లో జన్మించాను. తమిళనాడు, పుణే, ఔరంగాబాద్‌లలో చదువుకున్నాను. ‘ముద్ర’లో పనిచేశాను. జగదీష్ అండ్ కమలా మ్యూజియం ట్రస్టీలలో ఒకరిగా సేవలు అందిస్తున్నాను. మా ప్రపితామహులు పూసపాటి అప్పలరాజుగారు ఒరిస్సాలో ‘అస్కా’ అనే గ్రామానికి చెందినవారు. ఆలయ శిల్పాలు, లోహ విగ్రహాలు రూపొందించేవారు. పౌరాణిక గాధల చిత్రకథలను ప్రెస్కోలుగా చిత్రించేవారు. చింతగింజల మేళవింపుతో తయారైన రంగులను వాడి వస్త్రాలపై బొమ్మలు వేసేవారు. పూర్వీకుల కళ బహుశా నాలో అంతర్లీనంగా ఉండి ఉంటుంది. భారతీయ ఇతిహాసాలను ఆధునికంగా చెప్పాలనే ముప్పయ్యేళ్ల ప్రయత్నం ఐకానిక్ క్యాలిగ్రఫీ రూపంలో వ్యక్తమైంది. రామాయణంలో ‘కొత్తదనాలు’! వాల్మీకి రామాయణంలో ఇప్పటికీ మనకు ఉపకరించే కుటుంబ జీవితానికి సంబంధించిన మౌలిక విలువలున్నా యి. రామాయణం భారతీయ సామూహిక, సామాజిక చేతనాత్మ! తరచి చూస్తే.. రాముడు-సీత-లక్ష్మణుడు-భరతుడు-ఆంజనేయుడు-సుగ్రీవుడు-రావణుడు తదితర పాత్రలన్నీ ఏ కొంచెమో మన జీవితంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో 37 డ్రాయింగ్ల సంకలనంగా కాలిగ్రఫీలో రామాయణం రూపొందించాను. ఆరు కాండాల ఇతిహాసంలో ఎన్నెన్ని ఘట్టాలు... ఎన్నెన్ని పాత్రలు.... ఎంతటి వైవిధ్యం... వీటన్నిటిని ఎంపిక చేసుకున్న పాళీల ద్వారా లయగతితో వ్యక్తీకరించాను. నా పుస్తకంలో రామాయణ కథానుసారం చిత్రాలుండవు. నా మనో చిత్రంలో మెరిసిన ఘట్టాలను డ్రాయిం గులుగా మలచా. ఉదాహరణకు సరయూ నదిని గిరిజన రాజు గుహుడు తన పడవపై సీతారామలక్ష్మణులను దాటిస్తోన్న దృశ్యం పుస్తకంలో తొలి చిత్రం! ఈ బొమ్మను 2003 లో తొలిసారిగా వేశా. అందులో నావ హంసలా ఉంటుంది. పుస్తకంలోని ఇదే సన్నివేశంలోని పడవ సింపుల్ ! మంథర కైకేయికి దుర్బోధ చేసే చిత్రం (ఒకే గీత) వేసేందుకు చాలా కాలం పట్టింది. ఒక్క గీతలో మంథర పూర్తి శరీరాన్ని చూసినవారు తలపంకించడం గొప్ప కితాబు! రామసేతు చిత్రం లో ఇటుకపై దేవనాగరి లిపిలో ‘రామ’ చిత్రించాను. మొత్తం బొమ్మల్లో ‘అక్షరం’ ఇదొక్కటే! క్షరించని (నాశనం కాని) చిత్రాలు అనే అర్థంలో ఇందులోని చిత్రాలన్నీ అక్షరాలే! ‘గీత’ ప్రత్యేకత! అసంఖ్యాక రామాయణాలను శతాబ్దాలుగా ఎందరో కళాకారులు శిల్పాలుగా-విగ్రహాలుగా-చిత్రాలుగా మలుస్తున్నారు. వారందరి తపస్సునూ కాలిగ్రఫీ చిత్రాలలో స్పర్శామాత్రంగా రాబట్టి సంప్రదాయానికి ఆధునికత తేవాలనుకున్నాను. మనిషికి ఒడ్డూపొడవులున్నట్లే గీత ప్రారంభానికి, ముగింపుకు మధ్య స్థలకాలాదులుంటాయి. సరళంగా, ఒంపుగా, పలుచగా, చిక్కగా, శూన్యంగా గీత ప్రయాణిస్తుంది. చిత్రంలో ఖాళీ శూన్యం కాదు. రేఖలో భాగమూ, రేఖకు కొత్త కోణమూ! ఈ చిత్రాలు సందర్శకులకు సందేశాలు ఇవ్వవు. తమ సంస్కృతిలో తమకు నచ్చిన అన్వయించే ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకునేందుకు ఆస్కారం ఇస్తాయి. - పున్నా కృష్ణమూర్తి, సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్ పూసపాటి గురించి... తెలుగు పద్య మాధుర్యాన్ని ఆస్వాదించి ‘సుందర తెలుగు’ అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. పూసపాటి పరమేశ్వరరాజు ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ని చూస్తే ‘సుందర చిత్రమ్’ అనేవారేమో! క్యాలీగ్రఫీ అంటే అందమైన రాత! ఆ రాతలో తనదైన రీతిలో చిత్రాలను రూపొందించారు పూసపాటి! తెలుగు వారికే సొంతమైన పద్యాల్లా తెలుగువాడైన పూసపాటి ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ అనే అపురూప కళాప్రకియకు ఆద్యుడయ్యారు! కాబట్టే ఆయన చిత్రాలు సముద్రాంతర యానాలు చేస్తూ ప్రపంచ కళాప్రేమికులను అలరిస్తున్నాయ్! ఆమ్‌స్టర్‌డామ్‌లో 2013 జూలై నుంచి నవంబర్ 14 వరకూ ‘రామాయణ : లోర్ ఆఫ్ బిలీఫ్’ చిత్రాలను ప్రదర్శించారు. బీజింగ్‌లోని ఐదవ అంతర్జాతీయ బినాలేలో, ఇండియాలోని ఒకేఒక బినాలే అయిన కోచీ ముజిరిస్ బినాలేలో కూడా ఇవి ప్రదర్శితాలు. న్యూఢిల్లీలోని ఐఐసీ గ్యాలరీ నిర్వహించిన అంతర్జాతీయ కాలిగ్రఫీ కళాకారుల ప్రదర్శనకు పూసపాటి ఆహ్వానితులు. పూసపాటి వర్క్స్‌ను (బుద్ధిస్ట్ సింబల్స్, జూయిష్ సింబల్స్, క్రిస్టియన్ సింబల్స్, ఏక ఓంకారం, అల్లా నూరు నామాలు, అహురమజ్దా, న్యూమరికల్ యాత్రలు, ఎపిక్ నెరేటివ్స్, ఆయతనాలు, రామయణ-భాగవతాలు) ‘మోసా’ శాశ్వత ప్రాతిపదిక న ప్రద ర్శిస్తోంది. ‘రామాయణమ్ : లోర్ ఆఫ్ బిలీఫ్, ఐకానిక్ కాలిగ్రఫీ’ (రామాయణమ్ : విశ్వాస గాథ, ఐకానిక్ కాలిగ్రఫీ) అనే ప్రతిష్టాత్మక పుస్తకం ఇటీవల విడుదలైంది. వివిధ మ్యూజియంలు ఈ పుస్తకాన్ని సేకరించాయి. -
జీరోడిగ్రీ : కవిత్వానికి కనెక్ట్ చేస్తుంది!
‘లోకం మెచ్చని నా బతుకును లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు...’ అన్న ఏక వాక్యం ‘జీరోడిగ్రీ’కి ఇరుసు. మనుషుల్లో ఒరిజినాలిటీ కోసం వెతకడం, లేనివి ఉన్నవిగా చూపెట్టే కొద్దీ ఉన్నవి లేనివిగా తెల్సిపోతోందనే పరిశీలన ఈ కవిత్వానికి ధాతువు. నలుచదరాల తెలుపు నలుపు పుస్తకం. సాదాసీదా వచనం. ఇంతకంటే సింపుల్‌గా రాయడానికి వీల్లేని పదాలు. వచన కవిత్వానికి సహజమైన పంక్తులు, ఫుల్స్టాపుల సాంప్రదాయాన్నీ పాటించని వైనం. అలంకార రహితమైన పుస్తకంలో అహంకార రహిత కవిత్వం. ఈ కవిత్వం వస్తువేమిటి? సిద్ధాంతమేమిటి? పరిష్కారమేమిటి? అనే అన్ని ప్రశ్నలకూ ‘రంగు-రుచి-వాసన’ లేని నీటి బిందువులా తొణికిసలాడే సమాధానం! కాబట్టే, కవిసంగమం ద్వారా నిత్యకల్యాణంగా రోజూ కవిత్వం రాసే వందలాది యువకుల్లో ఒకరైన మోహన్‌రుషి కవిత్వం బెంగళూరుకు చెందిన నవులూరి మూర్తిని ఆకర్షించింది. కవి ఎవరో తెలియక పోయినా కవిత్వానికి పలవరించారు. ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తెలుగులో పుస్తకం రాకముందే ఇంగ్లిష్ పాఠకులను ఆనందపరచారు. ‘జీరోడిగ్రీ’లో 90కి పైగా కవితల్లో ఆకట్టుకోని వాక్యం అరుదు. ఉదాహరణకు కొన్ని వాక్యాలు : ప్రపంచమే కుగ్రామం కదా/ ఇప్పుడు ఇల్లు ఇరుకవడంలో ఆశ్చర్యం లేదు (ఓపెన్ ఘోరం) ఆ బట్టలన్నీ మా వీపులకేసి ఉతికినా మాకా శిక్ష చాలదు (పాత యంత్రం), అప్పుడే కదుల్తోన్న మున్సిపాలిటీ ట్రక్కులోంచి/ఒక్క చెయ్యి మాత్రం కన్పించింది (సిగ్నల్లైట్ సాక్షిగా...) పొయ్యిలో నువు కట్టెవయినా కూర పాత్రలో వాని హృదయం ఉడకదు (భరతవాక్యం) ఎందుకో తెల్వదు/ఊరికెల్లి పట్నమొచ్చిన కానించి/దేనిమీద నెనరు లేకుండయ్యింది (శెర) నడుస్త/ఉరుక్త/ నేను మా మిర్యాలగూడెంల బడ్త (దూప) తిరిగి తిరిగి అక్కడికే చేరుకున్నాను/మరిగి మరిగి మౌనమే మంచిదని తెలుసుకున్నాను (బైరాగి జననం) వంటి వాక్యాలు జీవితంలోని రెండు పార్శ్వాలనూ సూచిస్తాయి. మోహన్‌రుషి కవిత్వంలో సిద్ధాంత రాద్ధాంతాలు లేవు. అది చేస్తా ఇది చేస్తా లేవు. అది చెయ్యి ఇది చెయ్యి లేవు. కేవలం కవిత్వం ఉంది. బైరాగి-పఠాభి కోవలో ’ అని గోరటి వెంకన్న, దీవి సుబ్బారావు, హెచ్చార్కె, అసుర తదితరులు ఈ సంకలనానికి కితాబునిచ్చారు. ఇతడికి పట్టువడిన ఆల్కెమీ ఏమిటి? అక్షాంశాలకు ప్రామాణికమైన భూమధ్యరేఖను జీరో డిగ్రీ అంటారు. ప్రామాణిక రేఖాంశాన్ని కూడా జీరో డిగ్రీ అనే అంటారు. అక్షాంశాలు పరస్పరం కలవవు. భూమిపై నిర్దుష్టంగా ఉంటాయి. రేఖాంశాలు అనిర్దేశాలు. ఇదీ ఇక్కడా అని చెప్పడానికి వీలు కాని పరిభ్రమణాలు. వీటన్నిటి ఏకోన్ముఖ ప్రయాణం నార్త్పోల్లోని ‘జీరో డిగ్రీ’! మనిషిలో, అణువులో, బ్రహాండంలో సమస్తసృష్టిలో సహజమైన అంతర్గత కదలిక ‘జీరో’వైపే. ఆ కదలికను దేనికీ అంటని ‘అయస్కాంత సూచి’లో మాత్రమే గమనించగలం. మోహన్రుషిలోనూ అటువంటిదేదో ఉంది. ‘జీవితమంటే ఒకరికొకరు రియాక్ట్ కావడమే కదా’ అని సూచిస్తున్నాడు. -
పదాలు లేని ప్రవాహాలు...
‘దుర్గం’ అంటే దుర్-గమనము కదా! అంబేద్కర్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న దుర్గం చెరువు దరికి ‘సీక్రెట్ లేక్ పార్క్’ అనే పేరు చక్కగా సరిపోయింది. వెతుక్కుని వెతుక్కుని మరీ వెళ్లాలి. రెండు, మూడు, నాలుగు చక్రాలపై, దాదాపు మూడు వందల మంది మ్యూజిక్ లవర్స్, మొన్న శనివారం సాయంత్రం ఎలాగైతేనేం అక్కడకు చేరుకున్నారు. గోల్కొండ కోటకు మంచినీటిని సరఫరా చేసిన చరిత్ర కలిగిన దుర్గం చెరువు, తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, తాజాగా జాజ్ సంగీతంతో మ్యూజిక్ లవర్స్ దాహార్తిని తీర్చింది! వెలుగునీడల మార్మిక వాతావరణంలో, దక్కన్ రాక్స్ అమరికల మధ్య ఏర్పాటైన వేదికపై ముగ్గురు కళాకారులు పరిసరాల సోయగానికి ముగ్ధులయ్యారు. ఇంత చక్కని వేదికను తమ పర్యటనలో చూడలేదంటూ ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నారు. ఒకరు పోర్చుగల్‌కు చెందిన డబుల్ బాస్ వాద్యగాడు కార్లోస్ బైకా. మరొకరు రంగులీనే గిటార్ ‘తంత్ర’జ్ఞుడు, జర్మనీకి చెందిన ఫ్రాంక్ బొమస్. మరొకరు అమెరికాకు చెందిన క్లాసిక్ డ్రమ్మర్ జిమ్ బ్లాక్. ముగ్గురూ జాజ్లోని మూడు పాయలను సీక్రెట్ లేక్‌లోని యాంఫీథియేటర్పై సంగమింపజేశారు! పాప్-జాజ్-రాక్-పొయెట్రీల మేళవింపుతో స్వీయముద్రను వే సే ఇండిపెండెంట్ జాజ్‌ను ‘ఇండిజాజ్’ అంటారు కదా. ఇందులో తమదైన ప్రత్యేకతను చాటుతూ రాక్ సంగీతంలోని నిర్ణిద్ర శక్తిని, పాప్ సాహిత్యాన్ని స్ఫురింపజేసే రాగాలను, పోర్చుగీస్ జానపద సంగీతంలోని మధురిమలను ఏకీకృతం చేస్తూ ఈ ముగ్గురు 1996లో ‘జాజ్ ట్రియో’ గా ఏర్పడ్డారు. ‘అజుల్’ ఆల్బమ్‌తో ప్రారంభించి, ట్విస్ట్, లుక్ వాట్ దె హావ్ డన్ టు మై సాంగ్... తదితర ఆల్బమ్‌లతో పదిహేడు సంవత్సరాలుగా ‘ట్రియో’ ఇస్తోన్న ప్రదర్శనలు అమెరికా, యూరప్ దేశాల్లో నిత్యనూతనంగా విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్‌ముల్లర్ భవన్-గోథె జంత్రమ్ల ఆహ్వానంపై రెండు వారాలుగా ఢాకా, కోల్‌కతా, ముంబై, పుణె, త్రివేండ్రం, చెన్నైలు పర్యటిస్తూ హైదరాబాద్‌లో ముగింపు కచేరీకి విచ్చేశారు. కార్లోస్ బైకా రచయిత, స్వరకర్త. తాను రచించిన సాంగ్బుక్ తర్వాత మరో పాటల పుస్తకం ఎందుకు తీసుకురాలేదు అనే ప్రశ్నకు ‘ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక పాటే పాడగలరు’ అంటారు. అన్నట్లు ఆయన పాటల్లో పదాలుండవు. రాగాలే. ఆ శబ్దసౌందర్యంతో శ్రోతలు తమవైన పదాలను ఊహించుకుంటారు! ‘రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు’ అన్నట్లుగా మరచిపోవడం సాధ్యం కాని పదరహిత ప్రవాహాలు! ఏడాది క్రితం తాను స్వరపరచిన ‘థింగ్స్ ఎబౌట్’ ఆల్బమ్ బెస్ట్ పోర్చుగీస్ ఆల్బమ్‌గా ఎంపికైంది. డబుల్ బాస్‌పై ‘బో’వాడకుండా చేతి వేళ్లతో కార్లోస్ పలికించిన మంద్ర స్థాయిలోని స్వరాలు చిరుగాలికి నీటిలో సద్దుమణిగిన అలల సవ్వడిని గుర్తు చేశాయి. కార్లోస్ డబుల్ బాస్‌కు ఫ్రాంక్ మోబస్ గిటార్‌తో హృద్యంగా సమన్వయపరచడం, జిమ్బ్లాక్ రిథమిక్ డ్రమ్మింగ్ ఒక ‘క్లాసిక్’ ఎక్స్పీరియన్స్! - పున్నా కృష్ణమూర్తి