తెలంగాణను నిద్ర లేపాం: సుంకిరెడ్డి
సంభాషణ
ప్రవాహంలోకి దూకినవాడు లోతును తట్టిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది? అరచేతిలో చూపిన అడుగుమట్టే అందుకు రుజువు. తెలంగాణ సమాజానికి ఎదురైన అనేక సవాళ్ల సందర్భాల్లో సుంకిరెడ్డి నారాయణరెడ్డి చరిత్రలోతుల్లోకి దూకాడు. తన రచనల్లో ఆ అడుగుమట్టిని చూపాడు. అనాది కాలం ఉంచి ఆధునిక కాలం వరకూ తెలంగాణ నేలపొరల్లో దాగిన నిజాలను వెలుగులోకి తెచ్చాడు. ఆ ప్రకాశం అనేకులకు ఉత్తేజాన్నిచ్చింది. కాబట్టే, ఆయన రచనలు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యపుస్తకాలయ్యాయి. టీనేజ్ విద్యార్థులు సైతం చరిత్రలోకి డైవ్ చేసేందుకు సుంకిరెడ్డి రచనలు ప్రేరణనిస్తున్నాయి. ‘ముంగిలి’కి ద్వానాశాస్త్రి పురస్కారం, ‘తెలంగాణ చరిత్ర’కు బి.ఎన్.శాస్త్రి పురస్కారం అందుకున్న డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవి, పరిశోధకుడు, వివిధ రచనలను సంకలనం చేసిన సంపాదకుడు కూడా. యు.జి.సి ప్రాజెక్ట్‌లో భాగంగా ‘తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం’ చేస్తోన్న సుంకిరెడ్డితో సంభాషణా సారాంశం:
‘ప్రతిజ్ఞ’ చేయించిన ఊరు..
నల్లగొండ జిల్లా పానగల్లు మండలం పగిడిమర్రి మా ఊరు. ఇరు రాష్ట్రాల విద్యార్థులు నిత్యం పఠించే ‘ప్రతిజ్ఞ’ రచయితది మా ఊరే. నల్లగొండలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ, పీహెచ్‌డీ చేసిన. బెంగాలీ, సంస్కృతం భాషలంటే కుతూహలం. వాటిని సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేసిన. నందిని సిధారెడ్డి, రఘునాథం, జింబో.. అందరం కలిసి ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ అయ్యాం. 1970-80ల మధ్యకాలంలో వెలువడిన కవితల్లో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మేం వేసిన ‘ఈతరం యుద్ధకవిత’ సంకలనం చాలామందికి ప్రేరణనిచ్చింది.
తెలంగాణ రైటర్స్...
1998 నవంబర్ 1న - అప్పటికి తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశను గమనించి- సిధారెడ్డి, కె.శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి తదితరులం ‘తెలంగాణ రైటర్స్’ సమావేశం ఏర్పాటు చేశాం. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి తొలి ఉద్యమ వేదిక ఇదే. మరుసటి సంవత్సరం ఇది ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’గా మారింది. తెలంగాణ సంస్కృతి, కవిత్వంపై శతాబ్దం కాలంగా (1917-2002) పరచిన చీకట్లను ఛేదిస్తూ వేదిక తరఫున తొలి సంకలనం ‘మత్తడి’ ప్రచురించాం. కవిత్వపు ఆదిమయుగం నుంచి క్రీ.శ.1700 వరకూ తెలంగాణ ప్రాచీన కవిత్వాన్ని ‘ముంగిలి’గా పాఠకుల ముందుంచాం. వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ‘తెలంగాణ చరిత్ర ఎందుకు లేదు’ అనే కోణంలో యువతను చైతన్యవంతం చేశాం.
ఎందరో మహానుభావులు...
తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి కృషిని వెలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆధునిక సాహిత్యంలో తెలంగాణ నుంచి కృషి చేసిన గవ్వా సోదరులు (మురహరిరెడ్డి-జానకిరామిరెడ్డి-అమృతరెడ్డి) చేసిన కృషి ఎందరికి తెలుసు? వారి రచనలు వెతికి వెలికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’కు ముందే తెలంగాణకు చెందిన సాయిరెడ్డి ‘కాపుబిడ్డ’ రాశారు. ఆ సంగతి ఎందరికి తెలుసు? కరుణశ్రీ పుష్పవిలాపం కంటే ముందే ‘సుమవిలాపం’ గోల్కొండ పత్రికలో ప్రచురితం. పోతన ఇక్కడి వాడు కాదన్నారు. పాల్కురికి సోమననూ కాదన్నారు. మూడు వేల సంవత్సరాలుగా తెలుగువారంతా కలిసే ఉన్నారన్నారు. ఈ వాదనలకు తిరుగులేని ఆధారాలతో బదులిచ్చాం. తరతరాల తెలంగాణను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం. తగ్గింపబడువారు హెచ్చింపబడతారనే చారిత్రక వాస్తవాన్ని చెబుతున్నాం. తెలంగాణ రైటర్స్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ ప్రజాసంఘాలు, తెలంగాణ రాజకీయపార్టీలు చేసిన కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. మేనిఫెస్టోను అవతరింప చేయలేదని కొందరు తెలంగాణ సాహిత్యకారులు ప్రభుత్వంపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. కొంత వ్యవధినివ్వాలని నేను భావిస్తున్నాను.
- పున్నా కృష్ణమూర్తి