గుర్రంపోడు/హైదరాబాద్: హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన గుర్రంపోడు ఎస్‌ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. వివరాలివి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆగస్టు 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జాల రజిత (32) కేసును తొలుత ఆత్మహత్యగా నమోదు చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీనిపై ఎస్పీ శరత్‌చంద్ర పవార్.. ఏఎస్పీ రాములునాయక్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రధాన నిందితుడు రాములుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినప్పటికీ.. మిగతా నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఎస్‌ఐ.. కానిస్టేబుల్ (నంబర్ 3524) ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య కేసు నమోదు చేయడంతోపాటు సహ నిందితులైన రాములు భార్య జాల పార్వతమ్మ, అన్న కుమారుడు జాల వెంకటయ్యను పోలీసు ఉన్నతస్థాయి విచారణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలో ముగ్గురు పాల్గొన్నట్లు తేలింది.
ఏ2, ఏ3 నిందితులను రక్షించే ప్రయత్నం జరిగినట్లు తేలడంతో ఎస్‌ఐపై చర్య తీసుకున్నారు. గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం ఎస్‌ఐ నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment