gurrampodu
-
గుర్రంపోడు ఎస్ఐ సస్పెన్షన్
గుర్రంపోడు/హైదరాబాద్: హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన గుర్రంపోడు ఎస్ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. వివరాలివి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆగస్టు 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జాల రజిత (32) కేసును తొలుత ఆత్మహత్యగా నమోదు చేయడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.దీనిపై ఎస్పీ శరత్చంద్ర పవార్.. ఏఎస్పీ రాములునాయక్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రధాన నిందితుడు రాములుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినప్పటికీ.. మిగతా నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఎస్ఐ.. కానిస్టేబుల్ (నంబర్ 3524) ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య కేసు నమోదు చేయడంతోపాటు సహ నిందితులైన రాములు భార్య జాల పార్వతమ్మ, అన్న కుమారుడు జాల వెంకటయ్యను పోలీసు ఉన్నతస్థాయి విచారణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలో ముగ్గురు పాల్గొన్నట్లు తేలింది.ఏ2, ఏ3 నిందితులను రక్షించే ప్రయత్నం జరిగినట్లు తేలడంతో ఎస్ఐపై చర్య తీసుకున్నారు. గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం ఎస్ఐ నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు జర్నలిస్ట్ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్‌ను కిడ్నాప్ తరహాలో అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యత అని, అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని సంజయ్ హితవు పలికారు. హుజూర్నగర్ జైలుకు జర్నలిస్ట్ రఘు.. 14 రోజుల రిమాండ్ హుజూర్నగర్: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ రఘును సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు సబ్‌జైలుకు తరలించారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్లో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరోజు చోటుచేసుకున్న ఘటనలపై నమోదైన కేసులో జర్నలిస్ట్ రఘు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మఠంపల్లి పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని హుజూర్నగర్ కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. -
గుడ్‌న్యూస్.. గుర్రంబోడు భూములకు మోక్షం!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాజకీయ రణరంగానికి వేదికైన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు భూములకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏళ్లుగా రావణకాష్టంలా మారిన ఈ భూముల వివాదానికి కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో చేయించిన సర్వేతో తెర పడినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వేనంబర్ 540లో 120.16 ఎకరాల భూమి తమదని గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ వాదిస్తూ వస్తోంది. అయితే క్షేత్రస్థాయి సర్వేలో ఇవి గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు తేలడంతో సదరు సంస్థకు అప్ప ట్లో మఠంపల్లి తహసీల్దార్ చేసిన మ్యుటేషన్ రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే ఈ భూమి సాగు చేసుకుంటున్న 129 మంది గిరిజన రైతులకు అసైన్ చేసేలా ప్రతిపాదనలు పంపాలని సదరు తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. రెండేళ్లుగా గుర్రంబోడు గిరిజన రైతుల ఆర్తనాదాలను ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడంతో.. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 540లో 6,239.07 ఎకరాల భూమి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ, అటవీశాఖ పరిధిలో కొంత ఉండగా, పలు కంపెనీలు లీజు తీసుకోవడంతోపాటు కొన్ని కంపెనీలు కొనుగోలు చేశాయి. మరికొంత భూమిని గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ సర్వే నంబర్‌లోనే నాగార్జునసాగర్ నిర్వాసితులు 328 మంది రైతులకు 1,876.01 ఎకరాలు డీఫాం పట్టాలు ఇచ్చారు. ఈ భూములను సదరు రైతులు అమ్ముకోవచ్చు. కొంతమంది ఈ భూములను అమ్మడంతో కాలక్రమేణా చేతులు మారాయి. 6 వేలకు పైగా ఎకరాల భూమి ఈ సర్వే నంబర్లో ఉంటే సుమారు 12 వేల ఎకరాలకు పైగా పట్టాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ ఈ భూముల విషయమై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ తర్వాత ఓ కంపెనీ, గిరిజనుల మధ్య ఇటీవల భూ వివాదం తారస్థాయికి చేరింది. ఈ భూముల విషయమై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సర్వేతో తేలిన వాస్తవాలు గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ కొనుగోలు చేసినట్టు చూపుతున్న 400 ఎకరాలకు పై చిలుకు భూమిలో గిరిజనులు 120.16 ఎకరాలు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. సర్వే ప్రారంభంలోనే ఈ భూముల విషయంలో కలెక్టర్ అప్పట్లో అక్కడ విధులు నిర్వహించిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేశారు. సదరు సంస్థకు అక్రమంగా మ్యుటేషన్ చేసినందుకు గాను కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 10 నుంచి ప్రారంభమైన సర్వే ఇటీవల ముగిసింది. 540 సర్వేనంబర్‌లోని భూమి ఎవరి అధీనంలో ఎంత ఉందో తేల్చారు. గ్లేడ్ సంస్థ తమదని చెబుతున్న 120.16 ఎకరాలను ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సర్వేలో గుర్తించారు. 9.18 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ గుండెబోయినగూడెం రెవెన్యూ పరిధి సర్వేనంబర్ 11లో 5.20 ఎకరాలు, మఠంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 68లో 3.38 ఎకరాలు.. మొత్తం 9.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని మఠంపల్లి తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. ఎన్వీఆర్ బయోటెక్ సంస్థ నుంచి 233.10 ఎకరాలు గ్లేడ్ సంస్థకు మార్పు చేసింది. ఇందులో 92.15 ఎకరాలకు సంబంధించి భూమి అమ్మిన ఎన్వీఆర్ బయోటెక్ సంస్థ పేరు కాకుండా ఇతరుల పేరున ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల పరిశీలనలో తేలింది. దీంతో 92.15 ఎకరాలపై మళ్లీ తాజా విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. -
తీరనున్న నీటి కష్టాలు..!
సాక్షి, గుర్రంపోడు : ఏఎమ్మార్పీ కాల్వలకు నీరు విడుదల చేస్తున్నా అటు పొలాలకు చివరి దాకా నీరందక, ఇటు చెరువులు నిండక నీరెటు పోతుందో అధికారులకే తెలియని పరిస్థితి. ఎలాగూ యాసంగి సీజన్ ముగుస్తున్నందున పంటలకు నీటి అవసరం లేని వేసవిలో ఏఎమ్మార్పీ జలాల ద్వారా చెరువులు నింపేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆన్ అండ్ ఆఫ్ నీటి విడుదల విధానంలో ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలనే కార్యాచరణ ప్రణాళికలో అధికారులు రూపకల్పన చేస్తున్నారు. చెరువులు నింపేలా ప్రత్యేక కాల్వలకు భూ సేకరణ సమస్య లేకుండా ప్రస్తుతం ఉన్న మైనర్ కాల్వల చివరిల నుంచి లేదా మేజర్ కాల్వలకు అవసరమైన చోట తూములు అమర్చి దిగువభాగంలోని రైతులకు నీటి విడుదలకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన కాల్వ నుంచి మండలంలోని మేజర్ చెరువులైన చేపూరు, మొసంగి, చామలేడు, తదితర గ్రామాల చెరువులు నింపి వీటి ద్వారా ఇతర లింకు చెరువులు, కుంటలు నింపాలనే ప్రతిపాదన ఉంది. ఆయకట్టులోనూ అడుగంటిన భూగర్భజలాలు.. మండలంలో ఏఎమ్మార్పీ ఆయకట్టులో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇందుకు కారణం ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు ఏఎమ్మార్పీ నీటితో నిండకపోవడమే. గతంలో సరిపడా నీరు విడుదల చేసిన సందర్భాల్లో వర్షాలు తోడై చెరువులు నిండేవి. ఈ ఏడాది భారీ వర్షాలే కరువై ఏఎమ్మార్పీ నీటినే నమ్ముకొవలసి వచ్చింది. అడపాదడపా నీటి విడుదలతో కొంత వరకు బోర్లలో లభిస్తున్న నీటిని కాల్వ నీరు తోడు కాకపోతుందా అనే ఆశతో యాసంగిలో వరిసాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు నష్టపోయారు. పొట్టదశలో నీరందక చెరువుల కింద సాగు చేసిన పొలాలు కొంతవరకు ఎండి, నీరందక దెబ్బతిని సరైన దిగుబడులు వచ్చేలా లేవు. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీర్చేందుకు చెరువులు, కుంటలు నింపడమే పరిష్కారం కాగా ఈ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఎమ్మార్పీ పరిధిలో ఆరు మండలాల్లోని 130 చెరువులు, 64 లింక్ చెరువులు నింపేందుకు అవసరమైన చర్యలతో ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గతంలోని లోపాలే.. చెరువులకు శాపాలు ఏఎమ్మార్పీ ఆయకట్టులో చెరువులు, కుంటలు నింపేలా మేజర్, మైనర్ కాల్వలను తవ్వినప్పుడే చెరువులు, కుంటల్లోకి నీరుచేరేలా కాల్వలు తవ్వి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అప్పట్లో రైతులు చెరువులు, కుంటలకు నీరు చేరేలా చివరి వరకు మైనర్ కాల్వలు తవ్వాలని డిమాండ్ చేసినా తాము ఆయకట్టుకు వంద ఎకరాలకు వరకు నీరందేలా మైనర్ కాల్వలు తవ్వుతామని, చెరువుల వరకు నీరు చేరేలా కాంట్రాక్టర్లు కేవలం ఆయకట్టుకు నీరందించేలా కాల్వలను డిజైన్ చేశాడు. ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నేరుగా ఏఎమ్మార్పీకి నీరు చేరితే తప్ప చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు. త్వరలోనే ఆయకట్టు చెరువులకు నీరందిస్తాం గత నెల 19న డివిజన్ ఈఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డీఈఈ, ఏఈఈలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా. ఏ చెరువుకు ఎక్కడి నుంచి నేరుగా నీరందించవచ్చునో పరిశీలిస్తున్నాం. వేసవిలో నీటి సమస్యను అధిగమించేలా భూగర్భజలాలను కాపాడేందుకు చెరువులు నింపేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఉదయసముద్రంలో సరిపడా నీరు చేరిన తర్వాత ఇక్కడి చెరువులు, కుంటలకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం. – అజయ్‌కుమార్, ఈఈ -
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం: కుందూరు జానారెడ్డి
సాక్షి, గుర్రంపోడు : పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు శక్తి వంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తానని సీఎల్పీ మాజీ నేత, సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పాల్వాయి, మక్కపల్లి, మైలాపురం, జూనూతుల, తేనపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, చామలోనిబావి, పిట్టలగూడెం, కొప్పోలు, గుర్రంపోడు, చేపూరు, మొసంగి తదితర గ్రామాల్లో టీడీపీ, సీపీఐలతో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి సాధనకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. తనను ఎనిమిదోసారి గెలిపించి ఇంతవరకు ఒకే నియోజకవర్గంలో ఎవ్వరూ సాధించని రికార్డు ఇవ్వాలని అన్నారు. ఇది తనది కాదని నన్ను ఇంతగా ఎనిమిదిసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ రికార్డు దక్కుతుందని అన్నారు. తన ఈ శక్తిని, స్థాయిని ఇచ్చింది నియోజవర్గ ప్రజలేనని, ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శక్తి ఉన్నంత మేరకు కృషిచేస్తూనే ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లాంటి ఫథకాలు ఎన్నో అమలు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. తేనపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గట్టుపల్లి భూపాల్‌రెడ్డి జానారెడ్డి సమక్షంలో చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కడారి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాలచినసత్తయ్య యాదవ్, నాయకులు కంచర్ల యాదగిరిరెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, రాధాకృçష్ణ, సూదిని జగదీశ్వర్‌రెడ్డి, గట్టుపల్లి మణిపాల్‌రెడ్డి, లెంకల అశోక్‌రెడ్డి, వడ్డగోని యాదగిరిగౌడ్, జక్కల భాస్కర్, శివార్ల శేఖర్ , మారపాక అంబేద్కర్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలె రామచంద్రం, ఐతరాజు మల్లేషం , సీపీఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
రాజకీయ స్వప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలు
గుర్రంపోడు : రాజకీయ స్వప్రయోజనాల కోసమే అశాస్త్రీయ పద్ధతుల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి విమర్శించారు. శనివారం గుర్రంపోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల విభజనలో దూరం, వైశ్యాలం, జనాభా, సంస్కృతి, రాజరిక కట్టడాలు, కొత్త జిల్లాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలను ఏవీ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమన్నారు. సిరిసిల్లను జిల్లా చేయడానికి జనగామ, గద్వాల, అసిఫిబాద్ జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సీపీఐ గ్రామ, మండల, జిల్లా మహాసభలు నిర్వహిస్తుందని, వచ్చే నెల 17,18 నెలల్లో జిల్లా మహాసభ, 28,29,30 తేదీల్లో వరంగల్‌లో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కలకొండ కాంతయ్య, మండల సీపీఐ కార్యదర్శి రేపాక లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగ తెగిపడి మహిళ మృతి
గుర్రంపోడు : విద్యుత్ తీగలు తెగి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వద్దిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం.. నిడుమనూరు మండలం నేతాపురానికి చెందిన బసిరెడ్డి చెన్నారెడ్డి, పుష్పలత (40) దంపతులు పదేళ్ల క్రితం మండలంలోని వద్దిరెడ్డిగూడేనికి వలస వచ్చారు. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పుష్పలత ఉన్న ఇంటికి ప్రహరీ లేక ఫెన్సింగ్ మాత్రమే ఉంది. ఇంటిపై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో ఫెన్సింగ్ వెంట పుష్పలత ఊడుస్తూ తీగను గమనించకుండా కాలు తాగడంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమెకు భర్త, కుమారుడు ఉన్నారు. భర్త చెన్నారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి వెంకట కిశోర్ తెలిపారు. మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన పుష్పలత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని నల్లగొండ– దేవరకొండ ప్రధాన రహదారిపై మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదాలకు కారణమవుతున్న సమస్యలపై విద్యుత్ శాఖ సక్రమంగా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం, తదితర సౌకర్యాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్ ఏఈ ప్రభాకర్ రెడ్డి విద్యుత్ శాఖ నుంచి నాలుగు లక్షల పరిహారం అందుతుందని హామీ ఇవ్వడంతో పాటు తక్షణ సాయం కింద తాను స్వంతంగా రూ.10 వేలు అందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలచినసత్తయ్య యాదవ్, సీపీఎం మండల కార్యదర్శి వన మాల కామేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రమాద భాదిత కుటుంబాలను ఆదుకుంటాం
గుర్రంపోడు : కాల్వపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం గుర్రంపోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవాణ శాఖా మంత్రితో మాట్లాడి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందిస్తామని అన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో మాట్లాడానని మృతులకు రెండు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రమాద మృతులకు ఐదు లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షల పరిహారం అందించాలని కోరుతానని అన్నారు. క్షతగాత్రులకు ఆరోగ్య శ్రీ పథకం కింద మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్, నాయకులు బ్రహ్మచారి, మండలి లింగయ్య, రావుల సైదులు, నర్సింహరావు, యాదగిరిరెడ్డి, కిరణ్, ఉమర్, దాసరి యాదయ్యలు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు సాయమందిస్తాం
గుర్రంపోడు: వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ సాయ చర్యలు చేపట్టిందని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. శనివారం మండలంలోని తుర్కోనిబావిలో వర్షం కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించడం జరిగిందని అన్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు అధికార యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్ , ఎంపీటీసీ ఆవుల వెంకన్న , టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బల్గూరి నగేష్ గౌడ్ ఉన్నారు. -
యాదయ్యకు పీహెచ్డీ పట్టా
గుర్రంపోడు : మండలంలోని మొసంగికి చెందిన నిర్శనమెట్ల యాదయ్యకు ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ లేబర్ బేసెడ్ మాన్యుపాక్చరింగ్ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను పీహెచ్yీ పొందాడు. దళిత కుటుంబానికి చెందిన యాదయ్య ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థిగానే ఉంటూ ఎంతో కష్టపడి డాక్టరేట్ కావడం తనకు ఎంతో సంతోషాన్ని కల్గించిదని యాదయ్య అన్నారు. గేట్ ద్వారా ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయంలో సీటు సాధించినట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. బస్సు సౌకర్యం కూడ లేని మారుమూల గ్రామానికి చెందిన యాదయ్యకు పీహెచ్డీ రావడం తమ గ్రామానికి గర్వకారణమని మండల టీఆర్ఎస్ నాయకుడు నిర్శనమెట్ల అశోక్ అన్నారు. -
కొప్పోలులో ఘనంగా బోనాల పండుగ
గుర్రంపోడు : మండంలంలోని కొప్పోలు గ్రామంలో గురువారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు నైవేధ్యాలు సమర్పించి బోనాలకు వెళ్లడం సంప్రదాయంగా జరుగుతుంది. బోనాలతో గ్రామ దేవతల దేవాలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనవాసాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పెరిగిన బత్తాయి ధర..!
గుర్రంపోడు : బత్తాయి రైతులకు మంచిరోజులొచ్చాయి. గతంలో పంట ఉంటే ధర లేని..ధర ఉంటే దిగుబడి రాని పరిస్థితులు ఉండేవి. వర్షాభావంతో తగ్గిన తోటల సాగు..పడిపోయిన దిగుబడులతో మార్కెట్లో ధర కూడా దోబూచులాడింది. దీంతో నెల క్రితమే చాలా వరకు బత్తాయి తోటల్లో కాయ కోతలు ముగిసాయి. దీంతో ఇప్పటి వరకు కాయలు కోయని పది నుంచి 20శాతం తోటలకు మంచి ధర పలుకుతుంది. దళారులు తోటల వద్దకు వచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా టన్నుకు రూ25 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. నానా కష్టాలు పడి తోటలను కాపాడుకున్న తమకు ప్రస్తుత ధర ఎంతో ఊరటనిస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టన్నుకు రూ.పదివేల లోపు ఉన్న ధర ప్రస్తుతం పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బత్తాయి మార్కెట్ ప్రధాన కేంద్రాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ వర్షాకాలం సీజన్లో కురిసే వర్షాలపై మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఐతే ఎన్నడూ లేనంతగా ఆగస్టులో ఆయా నగరాల్లో వర్షాలు లేక మన బత్తాయి రైతులకు కలిసొచ్చింది. సెప్టెంబర్‌లో టన్నుకు రూ.30 వేల వరకు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
వ్యక్తి రిమాండ్
గుర్రంపోడు : మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీసులను దూషించాడు. అంతటితో ఆగకుండా పుష్కరాల విధులను నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకట సాయి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వనమాల చక్రపాణి బుధవారం మండలకేంద్రం సెంటర్లో పుష్కర విధులు నిర్వహిస్తున్న పోలీసులను మద్యం మత్తులో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో చక్రపాణిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు,కారు ఢీ: కుటుంబం బలి
గుర్రంపోడు : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. దేవరకొండ వైపు వెళుతున్న దేవరకొండ డిపో బస్సు, నల్లగొండ వైపు వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. -
సబ్సిడీ సగమే
గుర్రంపోడు :స్ప్రింక్లర్లపై రైతులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం సగానికిసగం కోత విధించింది. గతంలో 90 శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50 శాతానికి కుదించింది. వాస్తవానికి మూడేళ్లుగా మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల సరఫరా నిలిపివేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల పంపిణీకి పూనుకుంది. సబ్సిడీ స్ప్రింక్లర్లు పొందేందుకు గతంలో 90 శాతం రాయితీ పోగా, మిగతా పదిశాతం రైతులు చెల్లించేవారు. ఇప్పుడు 50 శాతం రైతులే చెల్లిం చాలి. ఒక్కో స్ప్రింక్లర్ యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19,600. స్ప్రింక్లర్లు తీసుకుంటే డ్రిప్ ఉండదు మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ.లక్ష విలువ గల పరికరాల వరకు రాయితీపై పొందే వీలుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైతు స్ప్రింక్లర్లు, డ్రిప్‌లలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. స్ప్రింక్లర్లు పొందే రైతులకు సుమారు 10 వేల రూపాయల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుండగా, భవిష్యత్‌లో పదేళ్ల వరకు డ్రిప్ పొందే అవకాశం కోల్పోతాడు. స్ప్రింక్లర్లు తీసుకున్న రైతుకు మిగతా 90 వేల విలువకు కూడా రాయితీపై డ్రిప్ పరికరాలు పొందే అవకాశం కూడా లేదు. దీంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల స్ప్రింక్లర్ల పరికరాలకు డిమాండ్ ఉన్నా, డ్రిప్ అవకాశం కోల్పోతామనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నిబంధనలు సడలించి రైతుకు గరిష్టంగా నిర్ణయించిన రాయితీ పరిమితికి లోబడి స్ప్రింక్లర్లు, డ్రిప్ రెండింటిని పొందే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలు మైక్రోఇరిగేషన్ అధికారులు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించారు. 24 మంది ఎంఐఓలు, ఉద్యాన వనశాఖలోని 8 మంది అధికారులు, వ్యవసాయశాఖలో 27 మంది అధికారులను ఆయా మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ నెల 25వ తేదీ వరకు వీరు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందేందుకు సంబంధింత ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఎంఐపీ ఏపీడీ పి.యాదగిరి తెలిపారు. -
పట్టెడు అన్నం పెట్టలేక..
గుర్రంపోడు :అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపునిచ్చే వ్యక్తి నాన్న. బతుకు సమరంలో వె న్నంటూ ఉంటూ భరోసానిచ్చే దైవం. అలాంటి నాన్న అనారోగ్యానికి గురైతే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారులు కనికరం లేకుండా వీధినపడేశారు. ఆస్తిపాస్తులు పంచుకున్న వారికి నాన్న పోషన భారమై బతికుండానే కాటిక సమీపంలో పడవేసిన సంఘటన గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రా మంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఆమలూరుకు చెందిన బొమ్ము మల్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం నల్లగొండకు వలసవెళ్లింది. మల్లయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు కృష్ణయ్య తాపిమేస్త్రిగా, చిన్న కుమారుడు వెంకన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. ఇల్లు కూలిపోయింది. భార్య 15ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో నల్లగొండలో కొడుకుల వద్దే ఉంటూ ప్రైవేట్ సంస్థల్లో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమం లో రెండేళ్ల క్రితం మల్లయ్య కాలికి గాయం కావడం, అప్పటికే షుగర్ వ్యాధి ఉండడం, మానసిక స్థితిలోపించి మంచానపడ్డాడు. దీంతో తండ్రిని పోషించే విషయంలో ఇద్దరు కుమారుల మధ్య గొడవ మొదలైంది. ఏడాదిగా తండ్రికి వైద్యం అందిస్తూ పోషిస్తున్న చిన్న కుమారుడు వెంకన్న తండ్రిని తీసుకవెళ్లమని తన సోదరుడు కృష్ణయ్యకు ఇటీవల చెప్పాడు. కానీ తాను పో షించలేనని పేర్కొనడంతో వెంకన్న శుక్రవారం మల్లయ్యను ఆమలూరుకు తీసుకువచ్చి గ్రామ శివారులో శ్మశానానికి ఆనుకుని ఉన్న సొంత భూమిలో గుడారం వేసి అందులో ఉంచి కులపెద్దలను ఆశ్రయించాడు. ఆదివారం పెద్ద కుమారుడు కృష్ణయ్యను ఫోన్లో సంప్రదించగా తండ్రితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నట్లు గ్రామస్తులు, కులపెద్దలు తెలిపా రు. దీంతో చేసేదేమిలేక తిండి తిప్పలు లేక పస్తులుం టున్న బొమ్ము మల్లయ్యకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
గుర్రంపోడు, న్యూస్‌లైన్: అర్హులందరికీ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం గుర్రంపోడులో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర క్యాబినేట్ ఆమోద ముద్ర వేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలకు వివిధ పథకాల కింద 90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రచ్చబండ ద్వారా 405 మందికి రేషన్‌కార్డులు, 631 మందికి పింఛన్లు, 711 ఇందిరమ్మ ఇళ్లు, 36 బంగారు తల్లి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి, ఎంపీలు అందజేశారు. అంతకు ముందు 20 కోట్లతో నిర్మించిన చేపూరు మంచినీటి ప్రాజెక్టుకు మంత్రి, ఎంపీతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ యడవల్లి విజేందర్‌రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్రావు, ఆర్డీఓ రవినాయక్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్దార్ టి. వెంకటేశం, జెడ్పీ మాజీ చెర్మైన్ చింతరెడ్డి మల్లారెడ్డి, రచ్చబండ కమిటీ సభ్యులు జాలచినసత్తయ్య యాదవ్, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నీలా భారతమ్మ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
‘సేంద్రియం’పై ప్రోత్సాహం కరువు
గుర్రంపోడు, న్యూస్‌లైన్: సేంద్రియ వ్యవసాయంతోనే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చనని అధికారులు చెబుతున్నా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం కరువైంది. గతంతో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సేంద్రియ వ్యవసాయానికి భారీగా రాయితీలు ప్రోత్సాహం ఇచ్చాయి. కానీ నేడు అరకొరగా అందిస్తున్న సాయం పై రైతులకు సమాచారమే కరువైంది. గ్రామాల్లో పశుసంపద నానాటీకీ తగ్గిపోతున్న తరుణంలో సేంద్రియ ఎరువు దొరకడం కష్టంగా మారుతున్నది. వర్మికంపోస్టు యూనిట్లు ఏవీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ వానపాముల యూనిట్లు, నాడెప్ కంపోస్టు యూనిట్లు, వర్మి హాచరీలకు 75 శాతం వరకు రాయితీ అందించాల్సి ఉండగా నామమాత్రంగా మంజూరు చేస్తున్నారు. తగిన ప్రచారం చేయడం లేదు. కేవ లం రైతులు షెడ్ నిర్మించుకుని సబ్సిడీ పొందిన తర్వాత వేరే అవసరాలకు వినియోగిస్తున్నారనే సాకుతో రాయితీకి మంగళం పాడుతున్నారు. గతంలో రాయితీ పొదాలంటే ఉద్యానవన శాఖ ఆధ్వ ర్యంలో రూ 30 వేల ఖర్చుతో రాతి కడీలతో తగినంత సైజులో తాటి కమ్మలతో కొట్టాన్ని నిర్మించుకోవాలి. వానపాములతో వర్మి కంపోస్టు తయారీ చేసుకుంటే రూ 15వేలు రాయితీ అందించే వారు. ఇప్పుడు ఉద్యానవనశాఖ వర్మిషెడ్లకు రాయితీని పూర్తిగా ఎత్తేశారు. వ్యవసాయశాఖ మాత్రం వర్మి కంపోస్టుషెడ్లు నిర్మించుకుంటే గతేడాది వరకు జేడీఏ తనిఖీ చేసిన తర్వాత రూ 25వేలు మంజూరు అయ్యేవి. కాగాసేంద్రియ సాగును ప్రోత్సహనికి రాయితీని కొన సాగించాలని రైతులు కోరుతున్నారు. -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం
గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడులోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ కార్యాల యాల ఖాతాలలోని సొమ్మును పక్కదారి పట్టించాడు. లెక్కల్లో తేడాను ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎపీజీవీబీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గాదెపాక రవీందర్ సెప్టెంబర్ 13 ఎంపీడీఓ ఖాతా నుంచి రూ 28,276, తహసీల్దార్ ఖాతా నుంచి రూ 47,516లను గుర్రంపోడుకు చెందిన సైదిరెడ్డి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేశాడు. మళ్లీ రూ 58,307లను తహసీల్దార్ ఖాతా నుంచి కట్ట నర్సింహ్మ అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించాడు. అక్టోబర్ 7న రూ 75,000లను ఖాతాదారుడికి తెలియకుండా శివప్రసాద్ అనే వ్యక్తి ఖాతాలో జమచేశాడు. ఆతర్వాత లెక్కల్లో తేడాలు రావడంతో గుర్తించిన బ్యాంకు అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టి నగదు బదిలీ కాబడిన ఖాతాదారుల నుంచి సొమ్మును రికవరీ చేశారు. నిందితుడు విషయం బయట పడినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ సుంకు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్యోగి రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.