పట్టెడు అన్నం పెట్టలేక..
గుర్రంపోడు :అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపునిచ్చే వ్యక్తి నాన్న. బతుకు సమరంలో వె న్నంటూ ఉంటూ భరోసానిచ్చే దైవం. అలాంటి నాన్న అనారోగ్యానికి గురైతే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారులు కనికరం లేకుండా వీధినపడేశారు. ఆస్తిపాస్తులు పంచుకున్న వారికి నాన్న పోషన భారమై బతికుండానే కాటిక సమీపంలో పడవేసిన సంఘటన గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రా మంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...
ఆమలూరుకు చెందిన బొమ్ము మల్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం నల్లగొండకు వలసవెళ్లింది. మల్లయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు కృష్ణయ్య తాపిమేస్త్రిగా, చిన్న కుమారుడు వెంకన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. ఇల్లు కూలిపోయింది. భార్య 15ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో నల్లగొండలో కొడుకుల వద్దే ఉంటూ ప్రైవేట్ సంస్థల్లో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమం లో రెండేళ్ల క్రితం మల్లయ్య కాలికి గాయం కావడం, అప్పటికే షుగర్ వ్యాధి ఉండడం, మానసిక స్థితిలోపించి మంచానపడ్డాడు.
దీంతో తండ్రిని పోషించే విషయంలో ఇద్దరు కుమారుల మధ్య గొడవ మొదలైంది. ఏడాదిగా తండ్రికి వైద్యం అందిస్తూ పోషిస్తున్న చిన్న కుమారుడు వెంకన్న తండ్రిని తీసుకవెళ్లమని తన సోదరుడు కృష్ణయ్యకు ఇటీవల చెప్పాడు. కానీ తాను పో షించలేనని పేర్కొనడంతో వెంకన్న శుక్రవారం మల్లయ్యను ఆమలూరుకు తీసుకువచ్చి గ్రామ శివారులో శ్మశానానికి ఆనుకుని ఉన్న సొంత భూమిలో గుడారం వేసి అందులో ఉంచి కులపెద్దలను ఆశ్రయించాడు. ఆదివారం పెద్ద కుమారుడు కృష్ణయ్యను ఫోన్‌లో సంప్రదించగా తండ్రితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నట్లు గ్రామస్తులు, కులపెద్దలు తెలిపా రు. దీంతో చేసేదేమిలేక తిండి తిప్పలు లేక పస్తులుం టున్న బొమ్ము మల్లయ్యకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.