నీరు చేరని చామలేడు చెరువు, చేపూరు చెరువుకు నీరు వెళ్లే సన్నటి కాల్వ
సాక్షి, గుర్రంపోడు : ఏఎమ్మార్పీ కాల్వలకు నీరు విడుదల చేస్తున్నా అటు పొలాలకు చివరి దాకా నీరందక, ఇటు చెరువులు నిండక నీరెటు పోతుందో అధికారులకే తెలియని పరిస్థితి. ఎలాగూ యాసంగి సీజన్ ముగుస్తున్నందున పంటలకు నీటి అవసరం లేని వేసవిలో ఏఎమ్మార్పీ జలాల ద్వారా చెరువులు నింపేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆన్ అండ్ ఆఫ్ నీటి విడుదల విధానంలో ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలనే కార్యాచరణ ప్రణాళికలో అధికారులు రూపకల్పన చేస్తున్నారు.
చెరువులు నింపేలా ప్రత్యేక కాల్వలకు భూ సేకరణ సమస్య లేకుండా ప్రస్తుతం ఉన్న మైనర్ కాల్వల చివరిల నుంచి లేదా మేజర్ కాల్వలకు అవసరమైన చోట తూములు అమర్చి దిగువభాగంలోని రైతులకు నీటి విడుదలకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన కాల్వ నుంచి మండలంలోని మేజర్ చెరువులైన చేపూరు, మొసంగి, చామలేడు, తదితర గ్రామాల చెరువులు నింపి వీటి ద్వారా ఇతర లింకు చెరువులు, కుంటలు నింపాలనే ప్రతిపాదన ఉంది.
ఆయకట్టులోనూ అడుగంటిన భూగర్భజలాలు..
మండలంలో ఏఎమ్మార్పీ ఆయకట్టులో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇందుకు కారణం ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు ఏఎమ్మార్పీ నీటితో నిండకపోవడమే. గతంలో సరిపడా నీరు విడుదల చేసిన సందర్భాల్లో వర్షాలు తోడై చెరువులు నిండేవి. ఈ ఏడాది భారీ వర్షాలే కరువై ఏఎమ్మార్పీ నీటినే నమ్ముకొవలసి వచ్చింది. అడపాదడపా నీటి విడుదలతో కొంత వరకు బోర్లలో లభిస్తున్న నీటిని కాల్వ నీరు తోడు కాకపోతుందా అనే ఆశతో యాసంగిలో వరిసాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు నష్టపోయారు.
పొట్టదశలో నీరందక చెరువుల కింద సాగు చేసిన పొలాలు కొంతవరకు ఎండి, నీరందక దెబ్బతిని సరైన దిగుబడులు వచ్చేలా లేవు. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీర్చేందుకు చెరువులు, కుంటలు నింపడమే పరిష్కారం కాగా ఈ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఎమ్మార్పీ పరిధిలో ఆరు మండలాల్లోని 130 చెరువులు, 64 లింక్ చెరువులు నింపేందుకు అవసరమైన చర్యలతో ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
గతంలోని లోపాలే.. చెరువులకు శాపాలు
ఏఎమ్మార్పీ ఆయకట్టులో చెరువులు, కుంటలు నింపేలా మేజర్, మైనర్ కాల్వలను తవ్వినప్పుడే చెరువులు, కుంటల్లోకి నీరుచేరేలా కాల్వలు తవ్వి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అప్పట్లో రైతులు చెరువులు, కుంటలకు నీరు చేరేలా చివరి వరకు మైనర్ కాల్వలు తవ్వాలని డిమాండ్ చేసినా తాము ఆయకట్టుకు వంద ఎకరాలకు వరకు నీరందేలా మైనర్ కాల్వలు తవ్వుతామని, చెరువుల వరకు నీరు చేరేలా కాంట్రాక్టర్లు కేవలం ఆయకట్టుకు నీరందించేలా కాల్వలను డిజైన్ చేశాడు. ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నేరుగా ఏఎమ్మార్పీకి నీరు చేరితే తప్ప చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు.
త్వరలోనే ఆయకట్టు చెరువులకు నీరందిస్తాం
గత నెల 19న డివిజన్ ఈఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డీఈఈ, ఏఈఈలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా. ఏ చెరువుకు ఎక్కడి నుంచి నేరుగా నీరందించవచ్చునో పరిశీలిస్తున్నాం. వేసవిలో నీటి సమస్యను అధిగమించేలా భూగర్భజలాలను కాపాడేందుకు చెరువులు నింపేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఉదయసముద్రంలో సరిపడా నీరు చేరిన తర్వాత ఇక్కడి చెరువులు, కుంటలకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం.
– అజయ్‌కుమార్, ఈఈ
Comments
Please login to add a commentAdd a comment