water problem salve
-
తీరనున్న నీటి కష్టాలు..!
సాక్షి, గుర్రంపోడు : ఏఎమ్మార్పీ కాల్వలకు నీరు విడుదల చేస్తున్నా అటు పొలాలకు చివరి దాకా నీరందక, ఇటు చెరువులు నిండక నీరెటు పోతుందో అధికారులకే తెలియని పరిస్థితి. ఎలాగూ యాసంగి సీజన్ ముగుస్తున్నందున పంటలకు నీటి అవసరం లేని వేసవిలో ఏఎమ్మార్పీ జలాల ద్వారా చెరువులు నింపేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆన్ అండ్ ఆఫ్ నీటి విడుదల విధానంలో ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలనే కార్యాచరణ ప్రణాళికలో అధికారులు రూపకల్పన చేస్తున్నారు. చెరువులు నింపేలా ప్రత్యేక కాల్వలకు భూ సేకరణ సమస్య లేకుండా ప్రస్తుతం ఉన్న మైనర్ కాల్వల చివరిల నుంచి లేదా మేజర్ కాల్వలకు అవసరమైన చోట తూములు అమర్చి దిగువభాగంలోని రైతులకు నీటి విడుదలకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన కాల్వ నుంచి మండలంలోని మేజర్ చెరువులైన చేపూరు, మొసంగి, చామలేడు, తదితర గ్రామాల చెరువులు నింపి వీటి ద్వారా ఇతర లింకు చెరువులు, కుంటలు నింపాలనే ప్రతిపాదన ఉంది. ఆయకట్టులోనూ అడుగంటిన భూగర్భజలాలు.. మండలంలో ఏఎమ్మార్పీ ఆయకట్టులో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇందుకు కారణం ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు ఏఎమ్మార్పీ నీటితో నిండకపోవడమే. గతంలో సరిపడా నీరు విడుదల చేసిన సందర్భాల్లో వర్షాలు తోడై చెరువులు నిండేవి. ఈ ఏడాది భారీ వర్షాలే కరువై ఏఎమ్మార్పీ నీటినే నమ్ముకొవలసి వచ్చింది. అడపాదడపా నీటి విడుదలతో కొంత వరకు బోర్లలో లభిస్తున్న నీటిని కాల్వ నీరు తోడు కాకపోతుందా అనే ఆశతో యాసంగిలో వరిసాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు నష్టపోయారు. పొట్టదశలో నీరందక చెరువుల కింద సాగు చేసిన పొలాలు కొంతవరకు ఎండి, నీరందక దెబ్బతిని సరైన దిగుబడులు వచ్చేలా లేవు. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీర్చేందుకు చెరువులు, కుంటలు నింపడమే పరిష్కారం కాగా ఈ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఎమ్మార్పీ పరిధిలో ఆరు మండలాల్లోని 130 చెరువులు, 64 లింక్ చెరువులు నింపేందుకు అవసరమైన చర్యలతో ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గతంలోని లోపాలే.. చెరువులకు శాపాలు ఏఎమ్మార్పీ ఆయకట్టులో చెరువులు, కుంటలు నింపేలా మేజర్, మైనర్ కాల్వలను తవ్వినప్పుడే చెరువులు, కుంటల్లోకి నీరుచేరేలా కాల్వలు తవ్వి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అప్పట్లో రైతులు చెరువులు, కుంటలకు నీరు చేరేలా చివరి వరకు మైనర్ కాల్వలు తవ్వాలని డిమాండ్ చేసినా తాము ఆయకట్టుకు వంద ఎకరాలకు వరకు నీరందేలా మైనర్ కాల్వలు తవ్వుతామని, చెరువుల వరకు నీరు చేరేలా కాంట్రాక్టర్లు కేవలం ఆయకట్టుకు నీరందించేలా కాల్వలను డిజైన్ చేశాడు. ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నేరుగా ఏఎమ్మార్పీకి నీరు చేరితే తప్ప చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు. త్వరలోనే ఆయకట్టు చెరువులకు నీరందిస్తాం గత నెల 19న డివిజన్ ఈఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డీఈఈ, ఏఈఈలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా. ఏ చెరువుకు ఎక్కడి నుంచి నేరుగా నీరందించవచ్చునో పరిశీలిస్తున్నాం. వేసవిలో నీటి సమస్యను అధిగమించేలా భూగర్భజలాలను కాపాడేందుకు చెరువులు నింపేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఉదయసముద్రంలో సరిపడా నీరు చేరిన తర్వాత ఇక్కడి చెరువులు, కుంటలకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం. – అజయ్‌కుమార్, ఈఈ -
సాగునీటికి సమరం.. వైఎస్సార్సీపీ నేతల దర్నా
కడప కార్పొరేషన్ : కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డిఆధ్వర్యంలో కదం తొక్కారు. పాపాఘ్నినదికి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ పోరుబాట పట్టారు. సోమవారం కొత్త కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షల కోట్లు దిగమింగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లక తప్పదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. పాపాఘ్నినదికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆయన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ‘కరువుపై పోరు’పేరుతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కరువు, బాబు కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు రక్కసి కరాళనృత్యం చేస్తుందన్నారు. ఒక్క శ్రీకాకుళం తప్ప రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతోందన్నారు. శ్రీకాకుళంలో మాత్రమే వరదలు వచ్చి అతివృష్టి సంభవించిందన్నారు. ప్రస్తుత కరువు గంజికరువు, ధాతు కరువును మించిపోయిందని రైతులు చెప్పుకుంటున్నారని అన్నారు. లక్షల కోట్లు దిగమింగడానికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లున్నారని ఎద్దేవా చేశారు. విభజనకు ముందు రాష్ట్రానికి రూ.60వేల కోట్ల అప్పులుంటే, ప్రస్తుతం అదనంగా రెండుల లక్షల కోట్లు ఉన్నాయన్నారు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ఉద్యమించి సాధించుకున్నామని, ఇప్పుడు పాపాఘ్ని నదికి కూడా నీటిని విడుదల చేసే వరకు పోరాటం ఆగదన్నారు. మైలవరం దక్షిణ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రతిరైతుకు ఏటా రూ.12,500 పెట్టుబడి కోసం ఇవ్వడం జరుగుతుందని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కమలాపురం నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మారుస్తామని, ప్రతి రైతు ఏటా రూ.4 లక్షలు సంపాదించేలా చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, అఫ్జల్ఖాన్, టీఎస్సార్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, రైతు నాయకులు రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, పత్తి రాజేశ్వరి, బాలమల్లారెడ్డి, ఉత్తమారెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వేణుగోపాల్ నాయక్, ఖాజా, దేవిరెడ్డి ఆదిత్య, టీపీ వెంకటసుబ్బమ్మ, శ్రీలక్ష్మి, రత్నకుమారి, సీహెచ్ వినోద్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరువల్లే బీమా సొమ్ము రైతులకు రాలేదు: వైఎస్ అవినాష్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే 2012–13లో శనగ పం టకు సంబంధించిన రూ. 120 కోట్ల పంటల బీమా రైతులకు రాకుండా పోయిందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నా రు. రాష్ట్ర వాటా చెల్లిస్తే తాము మిగతా మొత్తాన్ని ఇస్తామని కేంద్రం లేఖ రాసి రెండేళ్లవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖకు సమాధానం ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఈ ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని,. ఇతర రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చినా ఆ నీటిని గండికోటకు, బ్రహ్మంసాగర్‌కు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మొగమేరు వంక ద్వారా పాపాఘ్ని నదికి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి కమలాపురం నియోజకవర్గంలోని వీఎన్ పల్లి, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం మండలలాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్నారు. అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్నిసర్వనాశనం చేశారు: సురేష్‌బాబు రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు ధ్వజమెత్తారు. రాయలసీమకు కృష్ణాజలాలు తేవాలని వైఎస్ఆర్ పరితపించారని, ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీతో కూడా పోరాడి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. వెలిగల్లు, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి వెలిగల్లులో 5 టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌లో 11 టీఎంసీలు నిల్వ ఉంచారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గండికోట ముంపువాసులకు పరిహారం ఇవ్వలేదని, శ్రీశైలం రిజర్వాయర్‌కు 210టీఎంసీల వరద వచ్చినా జిల్లాలోని ప్రాజెక్టులకు చుక్క నీరివ్వలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రస్థానమే అధర్మంతో మొదలైంది: అంజద్‌బాషా సీఎం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే అధర్మంతో మొదలైందని, ధర్మం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆయనకు ధర్మపోరాట దీక్షలు చేసే అర్హత లేదని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా అన్నారు. బాబు గత తొమ్మిదేళ్లపాలనలో ఏడేళ్లు కరువులు వచ్చాయని, ఇప్పుడు నాలుగేళ్లు కూడా రైతులు కరువుతో అల్లాడుతున్నారన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో వ్యవసాయమే ఉండదన్నారు. సీఎం, అతని బినామీలు రాష్ట్రాన్ని లూటీ చేశారు: దుగ్గాయపల్లె ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని బినామీలైన సీఎం రమేష్, సుజనా చౌదరిలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టులకు శిలాఫ లకాలు వేశారే తప్ప ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. పాపాఘ్నికి నీటిని విడుదల చేయాలని రెండు నెలలుగా వినతిపత్రాలు ఇస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అతివృష్టి, అనా వృష్టితో రైతులు అల్లాడుతుంటే సీఎం బోటు రేసులు, విమాన విన్యాసాల కోసం రూ.400కోట్లు ఖర్చుచేయడం దారుణమన్నారు. 120 డొల్ల కంపెనీలు పెట్టి రూ.5700కోట్లు రుణం తీసుకొని బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి విషయంలో సీఎం ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబులాంటి వ్యక్తి సీఎంగా అవసరం లేదు: పి. సుబ్బారెడ్డి చంద్రబాబు రాయలసీమ వాసి అయినా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ 90 శాతం ప్రాజెక్టులను పూర్తి చేస్తే అందులో సీఎం జలహారతులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. నదుల అనుసంధానం పేరుతో వేలకోట్లకు టెండర్లు పిలిచి కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదినారాయణరెడ్డి, బుద్దావెంకన్న, చింతమనేని, దేవినేని ఉమా లాంటివారిని చుట్టూ పెట్టుకొని సీఎం అరాచకాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సాగు నీరిచ్చి రైతులను ఆదుకోండి పైడిపాళెం నుంచి కృష్ణాజలాలను పాపాఘ్ని నదికి విడుదల చేయాలని, సర్వరాయ సాగర్ నుంచి పాగేరు వంకకు కూడా నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు, అంజద్‌బాషా, మల్లికార్జునరెడ్డి కోరారు. ధర్నా అనంతరం వారు జేసీ–2 శివారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సాగునీరు విడుదల చేసి వీఎన్‌పల్లి, పెండ్లిమర్రి, కమలాపురం, వల్లూరు మండలాల రైతులను ఆదుకోవాలన్నారు. సర్వరాయసాగర్ నుంచి పాగేరు వంకకు నీటిని విడుదల చేస్తే వీఎన్‌పల్లె, యర్రగుంట్ల, కమాపురం మండలాల్లోని అనేక గ్రామాలకు తాగునీటి కొరత తీరుతుందన్నారు. మైలవరం దక్షిణ కాలువ నుంచి వస్తున్న 100 క్యూసెక్కుల నీటిని 300 క్యూసెక్కులకు పెంచాలన్నారు. కరువు మండలాల్లో సహాయ చర్యలు చేపట్టాలని, 2012, 2014, 2015,2016 సంవత్సరాల్లో రావాల్సిన ఇన్‌స్రూ?న్స్, పెట్టుబడి రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు అఫ్జల్ఖాన్, పులి సునీల్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
కందకాల వల్ల నాలుగేళ్లుగా నీటి కొరత లేదు!
వైద్యనిపుణులైన డాక్టర్ పూర్ణచంద్రారెడ్డికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామపరిధిలో 7 ఎకరాల మామిడి తోట ఉంది. ఇది తొమ్మిదేళ్ల తోట. ఎర్రనేల. నీటి సదుపాయం కోసం 12 బోర్లు వేశారు. ఒక్క బోరే సక్సెస్ అయ్యింది. అందులోనూ వేసవి వచ్చిందంటే నీరు బాగా తగ్గిపోతుండేది. తోటను నిశ్చింతగా బతికించుకోవడం కోసం నీటి లభ్యత పెంచుకోవడానికి ఏం చేయొచ్చని ఆలోచిస్తుండగా నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా చేపట్టిన కందకాల ద్వారా ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి డాక్టర్ పూర్ణచంద్రారెడ్డికి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించారు. వారు సూచించిన విధంగా వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు మించకుండా కందకాలు తవ్వించారు. 5 మీటర్లు వదిలి అదే వరుసలో మరో కందకం.. అలా తోట అంతటా కందకాలు తవ్వించారు. అప్పటి నుంచీ నీటి కొరత సమస్యే లేదని డా. పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. ‘మా ప్రాంతంలో ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు పడలేదు. చుట్టు పక్కల పొలాల్లో బోర్లకు నీటి సమస్య వచ్చింది. మాకు మాత్రం ఇప్పుడు కూడా ఎటువంటి సమస్యా లేదు. నాలుగేళ్ల క్రితం తవ్వించిన కందకాల ప్రభావం వల్లనే బోరులో నీటికి కొరత లేకుండా ఉందని స్పష్టంగా అర్థం అవుతున్నది. ఈ నాలుగేళ్లలో ఎంత వర్షం కురిసినప్పుడు కూడా.. మా పొలంలో నుంచి చుక్క నీరు కూడా బయటకు పోకుండా ఈ కందకాల ద్వారా భూమిలోకి ఇంకిపోతున్నాయి. అందువల్లే నీటికి కొరత రాలేదని చెప్పగలను. వచ్చే వేసవిలో కూడా నీటి సమస్య ఉండబోదనే అనుకుంటున్నాం..’ అని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తమ తోటకు మూడు వైపులా గోడ నిర్మించామని, మరో వైపు కందకాలు తవ్వామని.. వర్షపు నీరు బయటకు పోకుండా పూర్తిగా ఇంకుతుంటుందన్నారు. కందకాలు తవ్వుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు. వివరాలకు.. ప్రకాశ్– 97011 46234. -
గుక్కెడు నీరు దొరకడం లేదు
అన్నా... మా కాలనీలో వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాం. రోజుల తరబడి నీటి సమస్యతో అల్లాడుతున్నాం. పాలకులు పట్టించుకోవడం లేదు’. అని గుడివాడ కాళహస్తి కాలనీకి చెందిన బి. సుజాత ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుడివాడ వచ్చిన జననేతకు నీటి సమస్య గురించి సుజాత వివరించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు. రాజకీయ కుట్రతోనే తమకు తాగు నీటి సదుపాయం కల్పించడం లేదని ఆమె జననేతకు తన గోడును వినిపించారు. -
‘భగీరథ’తో నీటి సమస్య పరిష్కారం
భూపాలపల్లి అర్బన్ : గోదావరి అమృత జలాలను తాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిందని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఆరు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శనివారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తాగునీటిని శాశ్వత ప్రాతిపదికన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మిషన్ భగీరథ పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటిని అమృత జలాలుగా భావించాలని సూచించారు. వచ్చే ఎండాకాలం వరకు భూపాలపల్లి పట్టణంలో తాగునీటి కొరత సమస్యే ఉండదన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలో మొత్తం 10 ట్యాంకులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. రూ.63 కోట్లతో పట్టణంలోని బస్టాండ్, మునిసిపల్ కార్యాలయాల సమీపం, సుభాష్‌కాలనీ, జంగేడు, ఖాసీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, కమిషనర్ రవీందర్‌యాదవ్, కౌన్సిలర్లు జరీనాబేగం, హైమావతి, నిర్మల, గోనే భాస్కర్, వజ్రావని, బీవీ.చారి, రాకేష్, ఆలయ కమిటీ చైర్మన్ రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు సాంబమూర్తి, సంపత్‌కుమార్, రవీందర్‌రెడ్డి, సమ్మయ్య, తిరుపతిరెడ్డి, శ్రీరాములు, మురళి, అందే సుధాకర్, అధికారులు రవీందర్‌నా«థ్ శ్రీనా«థ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మూడు రోజుల్లో ఆయకట్టుకు నీరు
కాకినాడ ఆర్డీఓ అంబేడ్కర్ ‘సాక్షి’ ఎఫెక్ట్ పిఠాపురం : ఏలేరు, పీబీసీ పరిధిలో ఆయకట్టు భూములకు మరో మూడు రోజుల్లో సాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తామని కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ‘అనావృషే్టనా?’ అనే శీర్షికన వెలువడిన కథనానికి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయశాఖాధికారులు పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు శివారు ఆయకట్టులో సాగునీరు అందక ఇప్పటికీ నాట్లు పడని ప్రాంతాలను పరిశీలించారు. ఆర్డీఓ మాట్లాడుతూ పత్రికలో వచ్చిన కథనంపై ఆ ప్రాంతాలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఆదేశించారన్నారు. ఇప్పటి వరకు సాగునీరు సరఫరాలో ఇబ్బందులు ఎదురైనప్పటì కీ రెండు రోజుల నుంచి నీటి విడుదల అనుకున్న స్థాయిలో వస్తోందనితెలిపారు. నీరు అందక బీడులుగా ఉన్న పొలాలకు మూడురోజుల గడువు ఉందని వాటన్నిటికి కచ్చితంగా నీరు అందే ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని సాగునీరు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, డీడీ వీపీ రామారావు, ఏడీఏ పద్మశ్రీ, తహసీల్దారు సుగుణ తదితరులున్నారు.