ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్‌ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు.
సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్‌లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం.
ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్‌లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి.
కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి.
–నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment