హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దీనికోసం నిపుణుల సాయాన్ని తీసుకోనుంది. ఇందులో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో శుక్రవారం కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును పరిశీలించారు. సమావేశంలో భాగంగా ఆనంద్.. మురుగుతో నిండిన, నీళ్లు లేకున్న చెరువులను ఏ విధంగా తీర్చిదిద్దారో వివరించారు. బెంగళూరు నగరంలోని మొత్తం 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఆయన రంగనాథ్‌కు వివరించారు. అతి తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం కల్పించడానికి ఉన్న అవకాశాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.
చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, స్వచ్ఛమైన నీరు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పరిశీలించారు. మురుగు నీటి శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే ముందే మూడు నాలుగు దశల్లో ఫిల్టర్ చేసే తీరును హైడ్రా యోచిస్తోంది. మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం ద్వారా చెరువుకు చేరేలోపే ఆ నీరు కొంతమేర శుద్ధి అయ్యేలా బెంగళూరులో ఏర్పాటు చేసిన విధానంపై హైడ్రా అధ్యయనం చేస్తోంది.
త్వరలోనే బెంగళూరు వెళ్లి అక్కడ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని హైడ్రా అధికారులు యోచిస్తున్నారు. అలాగే ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కూల్చివేతల వ్యర్థాలను తొలగించి తొలిదశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ వద్ద ఉన్న ఎర్రకుంట, కూకట్‌పల్లి చెరువులకు పునరుజ్జీవనం కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. అయితే మల్లిగవాడ్‌తో కేవలం చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటారా? లేదా ఆయనకు హైడ్రాలో ఏమైనా కీలక పదవిని అప్పగిస్తారా? అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది.
ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్
హైడ్రా కమిషనర్‌తో శుక్రవారం ఆనంద్ మల్లిగవాడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆనంద్ మల్లిగవాడ్ గురించి చర్చ మొదలైంది. సోషల్‌మీడియాలో సైతం ఆయన ఎవరనీ సెర్చ్ చేస్తున్నారు. ఆనంద్ మల్లిగవాడడ్‌ను ‘లేక్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఆయన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు నీటి సంరక్షణ, పర్యావరణవేత్తగా కృషి చేస్తున్నారు. బెంగళూరులో క్షీణించిపోతున్న దశలో ఉన్న సమారు 23 చెరువులను పునరుద్ధరించటంలోకి కీలక పాత్ర పోషించారు.
1981లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జన్మించిన ఆనంద్.. 2017లో అనేకల్ సమీపంలోని క్యాలసనహళ్లి సరస్సు పునరుద్ధరించేందుకు బి.ముత్తురామన్ ‘సన్సెరా’ ఫౌండేషన్‌తో కలిసి పని చేశారు. ఇక.. అప్పటి నుంచి బెంగళూరులో చెరువుల పరిరక్షణకు సంబంధించి పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 2019లో తన ఇంజనీరంగ్ ప్రొఫెషన్‌ను వదిలేసి.. బెంగళూరులో చెరువుల పుణరుద్ధరణ, నీటి సంరక్షణే లక్ష్యంగా ఆయనే స్వయంగా ‘మల్లిగవాడ్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆయన సేవలు గుర్తించిన రోటరీ ఫౌండేషన్ ఆయనకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రధానం చేసింది.
ఇక.. ఏప్రిల్ 2024లో ఆయన, ఆయన ఫౌండేషన్‌పై కర్ణాటక లేక్ కన్జర్వేషన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్-2014లోని సెక్షన్ 430 కింద కేసు నమోదైంది.‘ నీటిపారుదల పనులు ఇబ్బందులు కలిగించటం. నీటిని తప్పుగా మళ్లించడం’ వంటి ఆరోపణలు రావటంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం గమనార్హం. బెంగుళూరు అర్బన్ జిల్లాలోని హీలలిగే అనే గ్రామంలోని రైతు సంఘం ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసింది. హీలలిగే వద్ద నీటి వనరులను పునరుద్ధరించడానికి మల్లిగవాడ్ చేపట్టిన పునరుజ్జీవన ప్రక్రియ అశాస్త్రీయ ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment