విద్యుత్‌ తీగ తెగిపడి మహిళ మృతి | women died with electrical shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగ తెగిపడి మహిళ మృతి

Published Fri, Oct 7 2016 10:32 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

women died with electrical shock

గుర్రంపోడు : విద్యుత్‌ తీగలు తెగి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వద్దిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం.. నిడుమనూరు మండలం నేతాపురానికి చెందిన బసిరెడ్డి చెన్నారెడ్డి, పుష్పలత (40) దంపతులు పదేళ్ల క్రితం మండలంలోని వద్దిరెడ్డిగూడేనికి వలస వచ్చారు. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పుష్పలత ఉన్న ఇంటికి ప్రహరీ లేక ఫెన్సింగ్‌ మాత్రమే ఉంది. ఇంటిపై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్‌ తీగ తెగిపడింది. అదే సమయంలో ఫెన్సింగ్‌ వెంట పుష్పలత ఊడుస్తూ తీగను గమనించకుండా కాలు తాగడంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది.   ఈమెకు భర్త, కుమారుడు ఉన్నారు. భర్త చెన్నారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయి వెంకట కిశోర్‌ తెలిపారు.
మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన 
పుష్పలత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని నల్లగొండ– దేవరకొండ ప్రధాన రహదారిపై మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదాలకు కారణమవుతున్న సమస్యలపై విద్యుత్‌ శాఖ సక్రమంగా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని,డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం, తదితర సౌకర్యాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.విద్యుత్‌ ఏఈ ప్రభాకర్‌ రెడ్డి విద్యుత్‌ శాఖ నుంచి నాలుగు లక్షల పరిహారం అందుతుందని హామీ ఇవ్వడంతో పాటు తక్షణ సాయం కింద తాను స్వంతంగా రూ.10 వేలు అందించారు.  కార్యక్రమంలో  మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాలచినసత్తయ్య యాదవ్, సీపీఎం మండల కార్యదర్శి వన మాల కామేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement