సబ్సిడీ సగమే
గుర్రంపోడు :స్ప్రింక్లర్లపై రైతులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం సగానికిసగం కోత విధించింది. గతంలో 90 శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50 శాతానికి కుదించింది. వాస్తవానికి మూడేళ్లుగా మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల సరఫరా నిలిపివేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల పంపిణీకి పూనుకుంది. సబ్సిడీ స్ప్రింక్లర్లు పొందేందుకు గతంలో 90 శాతం రాయితీ పోగా, మిగతా పదిశాతం రైతులు చెల్లించేవారు. ఇప్పుడు 50 శాతం రైతులే చెల్లిం చాలి. ఒక్కో స్ప్రింక్లర్ యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19,600.
స్ప్రింక్లర్లు తీసుకుంటే డ్రిప్ ఉండదు
మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ.లక్ష విలువ గల పరికరాల వరకు రాయితీపై పొందే వీలుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైతు స్ప్రింక్లర్లు, డ్రిప్‌లలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. స్ప్రింక్లర్లు పొందే రైతులకు సుమారు 10 వేల రూపాయల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుండగా, భవిష్యత్‌లో పదేళ్ల వరకు డ్రిప్ పొందే అవకాశం కోల్పోతాడు. స్ప్రింక్లర్లు తీసుకున్న రైతుకు మిగతా 90 వేల విలువకు కూడా రాయితీపై డ్రిప్ పరికరాలు పొందే అవకాశం కూడా లేదు. దీంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల స్ప్రింక్లర్ల పరికరాలకు డిమాండ్ ఉన్నా, డ్రిప్ అవకాశం కోల్పోతామనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నిబంధనలు సడలించి రైతుకు గరిష్టంగా నిర్ణయించిన రాయితీ పరిమితికి లోబడి స్ప్రింక్లర్లు, డ్రిప్ రెండింటిని పొందే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
స్ప్రింక్లర్లు, డ్రిప్ దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలు
మైక్రోఇరిగేషన్ అధికారులు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించారు. 24 మంది ఎంఐఓలు, ఉద్యాన వనశాఖలోని 8 మంది అధికారులు, వ్యవసాయశాఖలో 27 మంది అధికారులను ఆయా మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ నెల 25వ తేదీ వరకు వీరు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందేందుకు సంబంధింత ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఎంఐపీ ఏపీడీ పి.యాదగిరి తెలిపారు.