Micro Irrigation Project
-
సూక్ష్మ సేద్యం చకచకా.. అర్హులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను విస్తరించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాలను పొందేందుకు రైతులు ఆర్బీకేల ద్వారా రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతోపాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 3.75 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రూ.1,395 కోట్లతో బిందు, తుంపర సేద్య పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 90 శాతం సబ్సిడీపై పరికరాలు ఈ ప్రాజెక్టు కింద ఐదెకరాల్లోపు విస్తీర్ణం గల చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5నుంచి 10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5నుంచి 12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్య పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాల కోసం 1.19 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇప్పటివరకు 2.16 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. 1.30 లక్షల ఎకరాలకు సంబంధించి 49,597 మంది రైతులు తమ వాటా చెల్లించారు. 46,174 మంది రైతులకు చెందిన 1.26 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు 42,211 మంది రైతులకు చెందిన 1.16 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. ఈ నెలాఖరులోగా మరో లక్ష ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాలను అమర్చనున్నారు. మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మసేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక చేస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఎంతమందికి అర్హత ఉన్నా మంజూరు చేస్తున్నాం. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరికకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
ఇంకా ఎన్నాళ్లు?
సాక్షి, కడప : గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టు పరిధిలోని రైతులు పరిహారం అందక ఇక్కట్లు పడుతున్నారు. ప్రతి ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అని ప్రభుత్వం అట్టహాసంగా చెబుతున్నా, భూమి కోల్పోయిన రైతులకు మాత్రం అగచాట్లు తప్పడం లేదు. 2007-08 ప్రాంతంలో తవ్విన సంపులు, కాల్వలకు సంబంధించి రైతులు భూములు కోల్పోయినా నేటికీ పరిహారం అందలేదు. కొందరు 50 సెంట్లు కోల్పోతే, మరికొందరు ఎకరా కోల్పోయారు. గాలేరు-నగరి కాలువ కింద పిల్ల కాలువలు, సంపులు నిర్మించి మైక్రో ఇరిగేషన్ ద్వారా పైపులను అమర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా రైతుల విషయంలో మాత్రం ఎందుకు పరిహారం అందించకుండా ఆలస్యం చేస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం కరువవుతోంది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం కింద చేపడుతున్న మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు చెందిన రైతుల పొలాల్లో సంపులు, కాలువలు నిర్మించారు. పైడిపాలెం నుంచి వచ్చే కాలువకు అనుసంధానంగా సంపుల ఏర్పాటు జరిగింది. అయితే తొండూరు మండలంలో పదుల సంఖ్యలో రైతులు భూములను సంపులకు ఇచ్చారు. సంపుల కింద భూమి కోల్పొయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పరిహారం అందక బాధిత రైతులు ముద్దనూరులోని గాలేరు-నగరి భూ సేకరణ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జేసీ-2, స్పెషల్ కలెక్టర్‌ను కలిసిన రైతులు తొండూరుకు చెందిన రైతులు వెంకట్రామిరెడ్డి, రామాంజనేయరెడ్డి, నడిపి రాజా, నాగిరెడ్డి తదితరులు వెళ్లి కడప కలెక్టరేట్లోని జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. ఏళ్ల తరబడి ఉన్నా పరిహారం అందలేదని, భూమిని సంపునకు ఇవ్వడంతో ఏడెనిమిదేళ్లుగా పంటలు వేసుకోలేదని వివరించారు. పంట పండక, పరిహారం అందక రెండు విధాల నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేయగా, ఆయన గాలేరు-నగరి ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావును కలవాలని సూచించారు. అనంతరం రైతులు ఆయన్నూ కలిశారు. ముద్దనూరు స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్‌ను కలిసి సమస్య తెలియజేయాలని, వెంటనే నివేదికలు తెప్పించుకుని పరిహారం మంజూరు చేస్తామని ఆయన హామి ఇచ్చారు. పరిహారం వెంటనే అందించాలి నా పేరు అట్ల రామాంజనేయరెడ్డి. మాది తొండూరు. 217/1ఏ సర్వే నెంబరులో 89 సెంట్ల భూమి సంపునకు పోయింది. 2013లో నా భూమిలో సంపు, కాలువ నిర్మించారు. 2013 జులై 6వ తేదిన పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ పరిహారం మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నిమార్లు తిరిగినా న్యాయం జరగలేదు. ఎవరిని కలవాలో తెలియక అవస్థలు పడుతున్నా. -
బిందు సేద్యం.. సిరులు సాధ్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలూ మారాలి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి.. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ.. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని.. ఆదర్శ వ్యవసాయం చేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే ‘బిందు సేద్యం’.. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను పరిశీలిద్దామా.. ► డ్రిప్పు పద్ధతితో.. నాణ్యమైన దిగుబడులు, అధిక లాభాలు ►మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత అవకాశం ►బీసీ, ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ చేర్యాల తులసీదాస్, నంగునూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఆరు తడి పంటలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో బిందు సేద్యం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. డిప్పు పద్ధతిన ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చని మైక్రో సిబ్బంది చెబుతున్నారు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిచవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకోవచ్చని పేర్కొం టున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్’ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు తొంభై శాతం రాయితీ ప్రకటించిం ది. ఐదు నుంచి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. ఈ లెక్కన ఎక రం పొలం ఉన్న రైతులకు రూ. 50 వేలకు గాను రూ. 6 వేలు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.10 వేలు చెల్లిస్తే లక్ష రూపాయల విలువైన పరికరాలను అందజేస్తారు. పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ రాయితీ పొందని ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి మైక్రో ఇరిగేషన్ పీడీ డ్రిప్పును మంజూరు చేస్తారు. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ►ప్రతి మండలానికి ఒక మైక్రో ఇరిగేషన్ ఏరియా కో ఆర్డినేటర్ ఉంటారు. ► అతని వద్ద లభించే ఫారాన్ని తీసుకుని వివరాలను పూరించాలి. ► మీ సేవా కేంద్రం నుంచి 1బీ, ఆధార్ లేదా రేషన్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, భూమికి సంబంధించిన సర్వే నక్షా కాపీలను దరఖాస్తు ఫారానికి జతచేయాలి. ►ఎస్సీ, ఎస్టీలైతే మీ సేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ►డ్రిప్పు మంజూరైన రైతు పీడీ టీఎస్ ఎంఐపీ పేరిట డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) తీసి అధికారులకు అందజేయాలి. ఏ పరికరాలు అందజేస్తారు. ►బోరు మోటర్లు ఉన్న రైతులకు స్క్రీన్ఫిల్టర్, వ్యవసాయ బావులు ఉన్న రైతులకు సాండ్ఫిల్టర్తో కూడిన డ్రిప్పు అందజేస్తారు. ►హెడ్యూనిట్ పరికరాల్లో ల్యాట్రల్, పీవీసీ మెయిన్ లైన్, సబ్ లైన్ కంట్రోల్ వాల్వ్స్, ఎయిర్ రిలీజ్ వాల్వ్, ప్రెజర్ క్రేజ్. ఇస్తారు. ►యూరియా కలుపుకోవడానికి ట్యాంక్, వెంచూరిలు కూడా అందజేస్తారు. ►21 రకాల కంపెనీలకు చెందిన పైపులు అందుబాటులో ఉన్నాయి. రైతులు కోరిన కంపెనీ పైపులను అందజేస్తారు. ►కంపెనీకి చెందిన వ్యక్తులు రైతు భూమిని సర్వే చేసి డ్రిప్పును బిగించి సలహాలు, సూచనలు అందజేస్తారు. ►వీరు బిగించిన పరికరాలకు 5 సంవత్సరాల పాటు కంపెనీ వారంటీ ఉంటుంది. ఏ పంటలు సాగు చేసుకోవచ్చు ►ఆరుతడితోపాటు అన్ని రకాల పంటలను ఈ విధానం ద్వారా పండిచుకోవచ్చు. ►మామిడి, బొప్పాయి, అరటి, ద్రాక్ష, సపోట, దానిమ్మ, అరటి, మల్బరీ, జామ, సీతాఫలం తదితర తోటలు.. ►వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, వేరుశనగ (పల్లి), చెరకు, అల్లం, పసుపు, బంగాళదుంప, మిరప, కూరగాయ పంటలకు ఇది ఎంతో సౌకర్యవంతమైనది. డ్రిప్పు వల్ల ఉపయోగాలు ►ఎత్తుపళ్లాలు ఉన్న భూములు, గరప నేలల్లోనూ బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయొచ్చు. ►50 శాతం నీరు ఆదా అవుతుంది. ►కలుపు, చీడ పీడల బెడద ఉండదు. ►కూలీల కొరతను సులువుగా అధిగమించ వచ్చు. ►20 నుంచి 30 శాతం నాణ్యమైన, అధిక దిగుబడి పొందవచ్చు. ►ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు. ఫోన్ చేస్తే మేమే వస్తాం ఆరుతడి పంటలకే కాకుండా అన్ని రకాల పంటలకు డ్రిప్పు బిగించుకోవచ్చు. దీని ద్వారా పంటలు పండిస్తే నీరు, ఫెర్టిలైజర్ నేరుగామొక్కలకు అందడంతో 15 నుంచి 20 శాతం ఎక్కువ దిగుబడులు వస్తాయి. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఏ రైతుకు డ్రిప్పు కావాలన్నా ఫోన్ చేస్తే చాలు.. స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారాలు అందజేసి డ్రిప్పు మంజూరు చేయిస్తాం. ఇదే కాకుండా రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ డ్రిప్పు వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. - అర్జున్, సిద్దిపేట నియోజకవర్గ ఏరియా కో ఆర్డినేటర్, ఫోన్: 8374449858 -
సబ్సిడీ సగమే
గుర్రంపోడు :స్ప్రింక్లర్లపై రైతులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం సగానికిసగం కోత విధించింది. గతంలో 90 శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50 శాతానికి కుదించింది. వాస్తవానికి మూడేళ్లుగా మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల సరఫరా నిలిపివేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా స్ప్రింక్లర్ల పంపిణీకి పూనుకుంది. సబ్సిడీ స్ప్రింక్లర్లు పొందేందుకు గతంలో 90 శాతం రాయితీ పోగా, మిగతా పదిశాతం రైతులు చెల్లించేవారు. ఇప్పుడు 50 శాతం రైతులే చెల్లిం చాలి. ఒక్కో స్ప్రింక్లర్ యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19,600. స్ప్రింక్లర్లు తీసుకుంటే డ్రిప్ ఉండదు మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ.లక్ష విలువ గల పరికరాల వరకు రాయితీపై పొందే వీలుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైతు స్ప్రింక్లర్లు, డ్రిప్‌లలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. స్ప్రింక్లర్లు పొందే రైతులకు సుమారు 10 వేల రూపాయల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుండగా, భవిష్యత్‌లో పదేళ్ల వరకు డ్రిప్ పొందే అవకాశం కోల్పోతాడు. స్ప్రింక్లర్లు తీసుకున్న రైతుకు మిగతా 90 వేల విలువకు కూడా రాయితీపై డ్రిప్ పరికరాలు పొందే అవకాశం కూడా లేదు. దీంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల స్ప్రింక్లర్ల పరికరాలకు డిమాండ్ ఉన్నా, డ్రిప్ అవకాశం కోల్పోతామనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నిబంధనలు సడలించి రైతుకు గరిష్టంగా నిర్ణయించిన రాయితీ పరిమితికి లోబడి స్ప్రింక్లర్లు, డ్రిప్ రెండింటిని పొందే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలు మైక్రోఇరిగేషన్ అధికారులు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించారు. 24 మంది ఎంఐఓలు, ఉద్యాన వనశాఖలోని 8 మంది అధికారులు, వ్యవసాయశాఖలో 27 మంది అధికారులను ఆయా మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ నెల 25వ తేదీ వరకు వీరు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందేందుకు సంబంధింత ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఎంఐపీ ఏపీడీ పి.యాదగిరి తెలిపారు.