బిందు సేద్యం.. సిరులు సాధ్యం | Drip Farming .. Caerulea possible | Sakshi
Sakshi News home page

బిందు సేద్యం.. సిరులు సాధ్యం

Published Sun, Aug 17 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

బిందు సేద్యం.. సిరులు సాధ్యం

బిందు సేద్యం.. సిరులు సాధ్యం

మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలూ మారాలి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి.. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ.. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని.. ఆదర్శ వ్యవసాయం చేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే ‘బిందు సేద్యం’.. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను పరిశీలిద్దామా..
 
  డ్రిప్పు పద్ధతితో.. నాణ్యమైన దిగుబడులు, అధిక లాభాలు
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత అవకాశం
బీసీ, ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ
 చేర్యాల తులసీదాస్, నంగునూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఆరు తడి పంటలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో బిందు సేద్యం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. డిప్పు పద్ధతిన ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చని మైక్రో సిబ్బంది చెబుతున్నారు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిచవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకోవచ్చని పేర్కొం టున్నారు.

ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్’ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు తొంభై శాతం రాయితీ ప్రకటించిం ది. ఐదు నుంచి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. ఈ లెక్కన ఎక రం పొలం ఉన్న రైతులకు రూ. 50 వేలకు గాను రూ. 6 వేలు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.10 వేలు చెల్లిస్తే లక్ష రూపాయల విలువైన పరికరాలను అందజేస్తారు. పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ రాయితీ పొందని ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన  అనంతరం అర్హులైన వారికి మైక్రో ఇరిగేషన్ పీడీ డ్రిప్పును మంజూరు చేస్తారు.  
 
ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి
ప్రతి మండలానికి ఒక మైక్రో ఇరిగేషన్ ఏరియా కో ఆర్డినేటర్ ఉంటారు.
అతని వద్ద లభించే ఫారాన్ని తీసుకుని వివరాలను పూరించాలి.
మీ సేవా కేంద్రం నుంచి 1బీ, ఆధార్ లేదా రేషన్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, భూమికి సంబంధించిన సర్వే నక్షా కాపీలను దరఖాస్తు ఫారానికి జతచేయాలి.
ఎస్సీ, ఎస్టీలైతే మీ సేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి.
డ్రిప్పు మంజూరైన రైతు పీడీ టీఎస్ ఎంఐపీ పేరిట డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) తీసి అధికారులకు అందజేయాలి.
 
ఏ పరికరాలు అందజేస్తారు.
బోరు మోటర్లు ఉన్న రైతులకు స్క్రీన్‌ఫిల్టర్, వ్యవసాయ బావులు ఉన్న రైతులకు సాండ్‌ఫిల్టర్‌తో కూడిన డ్రిప్పు అందజేస్తారు.
హెడ్‌యూనిట్ పరికరాల్లో ల్యాట్రల్, పీవీసీ మెయిన్ లైన్, సబ్ లైన్ కంట్రోల్ వాల్వ్స్, ఎయిర్ రిలీజ్ వాల్వ్, ప్రెజర్ క్రేజ్. ఇస్తారు.
యూరియా కలుపుకోవడానికి ట్యాంక్, వెంచూరిలు కూడా అందజేస్తారు.
21 రకాల కంపెనీలకు చెందిన పైపులు అందుబాటులో ఉన్నాయి. రైతులు కోరిన కంపెనీ పైపులను అందజేస్తారు.
కంపెనీకి చెందిన వ్యక్తులు రైతు భూమిని సర్వే చేసి డ్రిప్పును బిగించి సలహాలు, సూచనలు అందజేస్తారు.
వీరు బిగించిన పరికరాలకు 5 సంవత్సరాల పాటు కంపెనీ వారంటీ ఉంటుంది.
 
ఏ పంటలు సాగు చేసుకోవచ్చు
ఆరుతడితోపాటు అన్ని రకాల పంటలను ఈ విధానం ద్వారా పండిచుకోవచ్చు.
మామిడి, బొప్పాయి, అరటి, ద్రాక్ష, సపోట, దానిమ్మ, అరటి, మల్బరీ, జామ, సీతాఫలం తదితర తోటలు..
వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, వేరుశనగ (పల్లి), చెరకు, అల్లం, పసుపు, బంగాళదుంప, మిరప, కూరగాయ పంటలకు ఇది ఎంతో సౌకర్యవంతమైనది.
 
డ్రిప్పు వల్ల ఉపయోగాలు
ఎత్తుపళ్లాలు ఉన్న భూములు, గరప నేలల్లోనూ బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయొచ్చు.  
50 శాతం నీరు ఆదా అవుతుంది.
కలుపు, చీడ పీడల బెడద ఉండదు.
కూలీల కొరతను సులువుగా అధిగమించ వచ్చు.
20 నుంచి 30 శాతం నాణ్యమైన, అధిక దిగుబడి పొందవచ్చు.
ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు.
 
ఫోన్ చేస్తే మేమే వస్తాం
 ఆరుతడి పంటలకే కాకుండా అన్ని రకాల పంటలకు డ్రిప్పు బిగించుకోవచ్చు. దీని ద్వారా పంటలు పండిస్తే నీరు, ఫెర్టిలైజర్ నేరుగామొక్కలకు అందడంతో 15 నుంచి 20 శాతం ఎక్కువ దిగుబడులు వస్తాయి. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఏ రైతుకు డ్రిప్పు కావాలన్నా ఫోన్ చేస్తే చాలు..   స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారాలు అందజేసి డ్రిప్పు మంజూరు చేయిస్తాం. ఇదే కాకుండా రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ డ్రిప్పు వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.  - అర్జున్, సిద్దిపేట నియోజకవర్గ ఏరియా కో ఆర్డినేటర్, ఫోన్: 8374449858

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement