వరికి గరిష్ట ధర క్వింటాకు రూ. 2,680
మిరప పంటకు రూ. 16,500 ఉండొచ్చు
21 ప్రధాన పంటల అంచనా ధరలను విడుదల చేసిన వ్యవసాయ వర్సిటీ
శాస్త్రీయంగా అధ్యయనం చేసి ధరల నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలు లభిస్తాయి. ఈ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసి ఈ ధరలను రూపొందించింది.
22 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో నెలవారీగా ఉన్న 21 రకాల పంట దిగుబడుల ధరలను నమూనాగా తీసుకొని వాటి ఆధారంగా ధరల అంచనాలను సిద్ధం చేసింది. వాటి ఆధారంగా ఏఏ పంటలు వేస్తే ఏ మేరకు దిగుబడులు వస్తాయో, వాటి ఆదాయంపై రైతులకు అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు.
» ఈ సీజన్‌లో పత్తి దిగుబడి వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య గరిష్టంగా క్వింటాకు రూ.7,200 వరకు ధర వస్తుందని వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. కనిష్టంగా రూ. 6,600 ఉంటుంది.
» వరి సాధారణ రకానికి నవంబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 2,203 నుంచి రూ. 2,350 ధర పలుకుతుంది. ఇక వరి గ్రేడ్ ఏ రకానికి అదే కాలంలో రూ. 2,290 నుంచి రూ. 2,680 వరకు ధర పలుకుతుందని పేర్కొంది.
» మొక్కజొన్నకు అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో రూ. 2,150 నుంచి రూ. 2,350 వరకు ధర వస్తుంది.
» పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధర లు, ఎగుమతులు, దిగుమతులు పరిమితు ల మూలంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు. ధరను బట్టి పంటలు వేసుకోవచ్చని వర్సిటీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment