సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను విస్తరించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాలను పొందేందుకు రైతులు ఆర్‌బీకేల ద్వారా రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతోపాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 3.75 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రూ.1,395 కోట్లతో బిందు, తుంపర సేద్య పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
90 శాతం సబ్సిడీపై పరికరాలు
ఈ ప్రాజెక్టు కింద ఐదెకరాల్లోపు విస్తీర్ణం గల చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5నుంచి 10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5నుంచి 12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్య పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాల కోసం 1.19 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇప్పటివరకు 2.16 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. 1.30 లక్షల ఎకరాలకు సంబంధించి 49,597 మంది రైతులు తమ వాటా చెల్లించారు. 46,174 మంది రైతులకు చెందిన 1.26 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు 42,211 మంది రైతులకు చెందిన 1.16 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. ఈ నెలాఖరులోగా మరో లక్ష ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాలను అమర్చనున్నారు. మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత
సూక్ష్మసేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక చేస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఎంతమందికి అర్హత ఉన్నా మంజూరు చేస్తున్నాం. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరికకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
– డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం
Comments
Please login to add a commentAdd a comment