drip irigation
-
సూక్ష్మ సేద్యం చకచకా.. అర్హులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను విస్తరించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాలను పొందేందుకు రైతులు ఆర్బీకేల ద్వారా రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతోపాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 3.75 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రూ.1,395 కోట్లతో బిందు, తుంపర సేద్య పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 90 శాతం సబ్సిడీపై పరికరాలు ఈ ప్రాజెక్టు కింద ఐదెకరాల్లోపు విస్తీర్ణం గల చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5నుంచి 10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5నుంచి 12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్య పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాల కోసం 1.19 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇప్పటివరకు 2.16 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. 1.30 లక్షల ఎకరాలకు సంబంధించి 49,597 మంది రైతులు తమ వాటా చెల్లించారు. 46,174 మంది రైతులకు చెందిన 1.26 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు 42,211 మంది రైతులకు చెందిన 1.16 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. ఈ నెలాఖరులోగా మరో లక్ష ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాలను అమర్చనున్నారు. మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మసేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక చేస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఎంతమందికి అర్హత ఉన్నా మంజూరు చేస్తున్నాం. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరికకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
బిందు సేద్యమే దిక్కు
సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి డ్రిప్ (బిందు), స్ప్రింక్లర్ (తుంపర) ఇరిగేషన్ తిరుగులేని మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి సమర్థ వినియోగం, ఆరుతడి పంటలను ప్రోత్సహించడం.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలన్నారు. గతంలో ‘నీరు-మీరు’ కార్యక్రమం చేపట్టామని, ఇప్పుడు ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని కరువులేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. సాగునీటి రంగంపై శ్వేతపత్రాన్ని, ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు, సరైన ప్రణాళిక అంటూ లేకుండా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని విమర్శించారు. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపట్టం వల్ల అన్నీ అసంపూర్ణంగా మిగిలిపోయాయని చెప్పారు. ప్రాజెక్టుల కంటే ముందే కాలువలు తవ్వారని, అనుమతులు పూర్తిగా రాకుండానే ప్రాజెక్టుల ను మొదలుపెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా విడిచిపెట్టిన ప్రాజెక్టుల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం మినహా మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 17,500 కోట్లు అవసరమని అంచనా వేశామని చెప్పారు. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని, ఇలా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. చట్ట ప్రకారమే స్థానికతను నిర్ణరుుంచాలి స్థానికతను చట్ట ప్రకారమే నిర్ణయించాలని, తమ ఇష్టప్రకారం నిర్ధారిస్తామంటే కుదరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 5 సంవత్సరాలు అమెరికాలో నివాసం ఉంటే గ్రీన్‌కార్డు ఇవ్వాలనే చట్టం అక్కడ ఉందని, ఎక్కడైనా చట్టం అమలు కావాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో కూడా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం ప్రకారం.. ‘ఏడేళ్ల నిబంధన’ ఉందంటూ, కమలనాథన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 1956కు పూర్వం భద్రాచలం, నల్లగొండ జిల్లాలోని కొన్ని మండలాలు ఆంధ్రాలోనే ఉండేవని గుర్తు చేశారు. రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నామని, రీ షెడ్యూల్ కోసం ఆర్బీఐ అడిగిన అదనపు సమాచారం ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మారిన బ్యాక్‌గ్రౌండ్ సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశాలు నిర్వహించే ఆయన నివాసంలోని హాలులో ఈసారి అధికారిక చిహ్నాలు దర్శనమిచ్చాయి. గతంలో ఎప్పుడు మాట్లాడినా.. బ్యాక్‌గ్రౌండ్‌గా టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్, పార్టీ చిహ్నమైన గుడిసె, నాగలి, చక్రంలతో కూడిన ఫ్లెక్సీ ఉండేది. సోమవారం వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ కూర్చొని మాట్లాడే చంద్రబాబు ఈసారి బహిరంగసభలో మాదిరిగా నిలబడి మాట్లాడారు.