Drip irrigation equipment
-
సూక్ష్మ సేద్యం చకచకా.. అర్హులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను విస్తరించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాలను పొందేందుకు రైతులు ఆర్బీకేల ద్వారా రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతోపాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 3.75 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రూ.1,395 కోట్లతో బిందు, తుంపర సేద్య పరికరాలను అమర్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 90 శాతం సబ్సిడీపై పరికరాలు ఈ ప్రాజెక్టు కింద ఐదెకరాల్లోపు విస్తీర్ణం గల చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5నుంచి 10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5నుంచి 12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు, తుంపర సేద్య పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాల కోసం 1.19 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇప్పటివరకు 2.16 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. 1.30 లక్షల ఎకరాలకు సంబంధించి 49,597 మంది రైతులు తమ వాటా చెల్లించారు. 46,174 మంది రైతులకు చెందిన 1.26 లక్షల ఎకరాల్లో పరికరాల అమరికకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు 42,211 మంది రైతులకు చెందిన 1.16 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్య పరికరాలను అమర్చారు. ఈ నెలాఖరులోగా మరో లక్ష ఎకరాల్లో తుంపర, బిందు సేద్య పరికరాలను అమర్చనున్నారు. మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరం ఉన్న వారికే ప్రాధాన్యత సూక్ష్మసేద్యం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతోంది. పారదర్శకంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరిక చేస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఎంతమందికి అర్హత ఉన్నా మంజూరు చేస్తున్నాం. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరికకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీబీ హరినాథరెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
బిందు సేద్యంపై పన్నుపోటు
రైతన్న సాగుకోసం ఉపయోగించే పరికరాలపై కేంద్ర ప్రభుత్వం గతంలో 18 శాతం ట్యాక్స్ పెంచింది. ఆ పన్నులను ఇటీవల కంటి తుడుపు చర్యగా 6 శాతం మేర తగ్గించింది. సాగునీటి వనరులు లేని పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న మెతుకుసీమలో రైతులను సూక్ష్మసేద్యం దిశగా ప్రోత్సహించాల్సిన అధికారులు, పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న సూక్ష్మసేద్యం 5 శాతం పన్నును జీఎస్టీ తర్వాత ఏకంగా 18 శాతానికి పెంచారు. దీంతో నేడు బిందు, తుంపర సేద్య పరికరాలు, రైతుకు భారంగా మారాయి. 18 శాతం ఉన్న జీఎస్టీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం 6శాతం తగ్గించి 12 శాతం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత మేర ఊరట కలిగినప్పటికీ రైతులపై భారం మాత్రం తప్పడం లేదు. మెదక్‌జోన్: జిల్లా వ్యాప్తంగా నీటి పొదుపునకు సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ, ఇతరులకు 90 సబ్సిడీపై బిందు తుంపర సేద్య పరికరాల యూనిట్లు మంజూరు చేసి ప్రోత్సహించింది. దీంతో సాగు నీరు తక్కువగా ఉన్న జిల్లాలలో రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది. జిల్లాలో 2016–17 సంవత్సరంలో 1,100 మంది రైతులకు 9,50 హెక్టార్లలో బిందుసేద్యం యూనిట్లను అందించారు. ఇందుకోసం రూ. 6.5 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా అందించగా ఇతర కులాల వారు కేవలం 5 శాతం పన్ను భరించాల్సి ఉండటంతో ఈలెక్కన రూ.50 లక్షలను రైతుల వాటాగా భరించారు. కాగా 2017–18 జులై ఒకటి నుండి 18 శాతం జీఎస్టీ అమల్లోకి రావటంతో సుమారు 900 మంది రైతులకు 750 హెక్టార్లకు బిందుసేద్యం కోసం ప్రభుత్వం రూ. 4.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రైతుల వాటా సుమారు రూ. 80 లక్షలు భరించాల్సిన పరిస్థితి. జిల్లాలో ఈ ఏడాది బిందు సేద్యంపై వెయ్యి హెక్టార్లను సాగులోకి తీసుక రావాలనే లక్ష్యంగా నిర్దేశించగా కేవలం 900 హెక్టార్లకు మాత్రమే రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో లాగా బిందు సేద్యం పరికరాలకు రైతులు ముందుకు రావడం లేదు. ప్రాజెక్టులు లేకపోవడమే.. బిందు తుంపర సేద్యానాకి దరఖాస్తు చేసుకుంటున్న వారిలో అత్యధికులు సన్నా, చిన్నకారు రైతులే. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఖర్చులు చేసి బోర్లు వేయించుకునే స్థోమత లేక పోవడం, ప్రస్తుతం ఉన్నబోరు బావుల్లో నుంచి వచ్చే కొద్దిపాటి నీటిని ఉపయోగించుకునేందుకు బిందు, తుంపర సేద్యం రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేకపోవటంతో బోర్ల ఆధారంగానే అధిక సంఖ్యలో రైతులు పంటలను సాగుచేస్తున్నారు. ఎకరం పంటపొలం సాగు చేసె రైతులు బిందు, తుంప సేద్యంతో 3 ఎకరాల్లో పంటలను సాగుచేసుకునే వీలు ఉండటంతో ఇటు వైపునకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిందు సేద్యానికి ఒక్కో యూనిట్‌కు రూ. 5 వేల చొప్పున రైతులకు చెల్లిస్తుంది. గతంలో ప్రభుత్వం చెల్లించే ఈ సొమ్ము వ్యాట్‌కు జమయ్యేది వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలపై జీఎస్టీని విధించే ప్రభుత్వం పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను విస్మరిస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. దరఖాస్తుదారులందరికీ అందిస్తాం జిల్లాలో బిందు సేద్యం పరికరాలను దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు పరికరాలను అందిస్తాం. పరికరాలపై ఇటీవల 18 శాతం జీఎస్టీ నుంచి 6శాతం తగ్గించి 12 శాతానికి కుదించారు. ఈఏడు సుమారు 900 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. –చక్రపాణి, ఉద్యానవన జిల్లా అధికారి -
బుగ్గితో రాజధాని నిర్మాణం!
రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో రైతుల నుండి భూ సమీకరణ జరపాలని నిర్దేశించిన ప్రాంతంలో ఇటీవల పచ్చటి పంటపొలాలను, తోటలను దుండగులు బుగ్గిపాలు చేశారు. ఈ అమానుషకాండకు రైతుల అరటి తోటలు, షెడ్డులు, డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి, ఎరువులు వగైరా కాలి బూడిదయ్యాయి. సీఎం తక్షణమే విచారణకు ఆదేశించడం సమంజసమే. అయితే ఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఒక మంత్రి అనుయాయులు రైతులే తమ పంటలను తగులబెట్టు కున్నారని, ఇందులో వైఎస్సార్సీపీ కార్యకర్తల హస్త ముందని చేసిన వెకిలి వ్యాఖ్యల వల్ల బాధిత రైతు లకు పుండు మీద కారం రాసినట్టు అనిపించడం సహజమే. కాబట్టే వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో, వారిని ఒప్పించి సేకరించిన భూము లతో రాజధానిని నిర్మిస్తేనే ప్రజలు హర్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఏదిఏమైనా భూములు ఇచ్చేదిలేదని రైతులు చెబు తుండగా, వారిని బెదిరించి అధికారాన్ని ప్రయోగించి భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటం అనర్థదాయక పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వం విజ్ఞతను చూపాల్సిన సమయమిది. -ఎమ్. ఎస్. రావు గోకివాడ, తూర్పు గోదావరి జిల్లా -
అందుబాటులో బిందు సేద్యం పరికరాలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో వివిధ రకాల పంటలు పండించుకోవడానికి నీటి సరఫరా కోసం బిందు సేద్యం(డ్రిప్) పరికరాలు అందుబాటులో ఉన్నాయని బిందు సేద్యం పథకం సంచాలకులు నర్సింగ్ తెలిపారు. జిల్లాకు భౌతిక లక్ష్యం 2,500 హెక్టార్లకు పైపులు, నాజిల్లు మంజూరైనట్లు తెలిపారు. పత్తి, పసుపు, మిర్చి, సోయా, మొక్కజొన్న పంటలకు రెండు వేల హెక్టార్లకు, కూరగాయల సాగుకు 500 హెక్టార్లకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి వద్ద దరఖాస్తులు లభిస్తాయని, వాటిని పూర్తి చేసి అక్కడే గానీ, ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో గానీ అందించవచ్చని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దరఖాస్తు చేసుకునే విధానం టైటిల్ బుక్ జిరాక్స్‌పై తహశీల్దార్ లేదా డెప్యూటీ తహశీల్దార్ సంతకం ఉండాలి. లేదా మీ సేవ ద్వారా తీసుకున్న 1బీ ఫారం జతపర్చాలి. కౌలు రైతులు రిజిస్ట్రార్ లీజు డాక్యుమెంటు ఐదేళ్ల వరకు తీసుకున్నది జతపర్చాలి. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకంతోపాటు ఈసీ జతచేయాలి. ఆధార్, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఏదేని ఒకటి జతచేయాలి. ఎస్సీ, ఎస్టీ రైతులు సంబంధిత అధికారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ జతపర్చాలి. దరఖాస్తు ఫారంపై ఇటీవల కాలంలో దిగిన పాస్‌పోర్టుసైజ్ ఫొటో అతికించాలి. ఒకసారి రాయితీ పొందిన రైతులకు పదేళ్ల వరకు ఈ పథకం వర్తించదు. రాయితీ వివరాలు.. ఐదెకరాల్లోపు విస్తీర్ణం కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.లక్షకు మించకుండా వంద శాతం రాయితీ ఇస్తారు. చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్షకు మించకుండా 90శాతం రాయితీ లభిస్తుంది. ఐదు నుంచి పదెకరాల భూమి ఉన్న రైతులకు రూ.లక్షకు మించకుండా 75శాతం సబ్సిడీ వర్తిస్తుంది. పదెకరాల కంటే ఎక్కువగా ఉంటే రూ.లక్షకు మించకుండా 60శాతం రాయితీ అందిస్తారు. ధర రూ.లక్షకు పైగా అయితే 12ఎకరాల వరకు బిందు సేద్యం ఏర్పాటు చేసుకునే రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారు. తుంపర్ల(స్ప్రింక్లర్స్) సేద్య పథక ం తుంపర్ల సేద్యం ద్వారా సాగు చేసుకోవడానికి జిల్లాలోని 52 మండలాలకు గాను ప్రతి మండలానికి 24 చొప్పున తుంపర్ల సేద్య పరికరాలు అందజేస్తాం. బిందు సేద్య పరికరాల దరఖా స్తు నమూనా వలనే దరఖాస్తుతో జిరాక్స్ పత్రాలు జతపరిచి ఏంపిడీవో లేదా మండల వ్యవసాయ అధికారికి అందించాలి. 8 రకాల కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రాయితీ వివరాలు పరికరాల ఖరీదు రూ.18,417.. ప్రభుత్వ రాయితీ 50 శాతం రూ.9.208 చెల్లిస్తుంది. రైతు రూ.9.209 భరించాలి. ఒక సెట్‌కు 25 హెచ్‌డీఈపీ పైపులు, 5 నాజిల్స్, 5 జీఐ పైపుల(రైజర్స్)తోపాటు ఇతర సామగ్రి అందజేస్తారు. గతంలో లబ్ధి పొందిన రైతులకు పదేళ్ల వరకు అవకాశం ఉండదు.