సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యంలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సైతం పొందింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా కృషి చేస్తుంటే ఈనాడు రామోజీ మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.
ఆరోపణ: సూక్ష్మ సేద్యానికి తూట్లు..
వాస్తవం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సాగు నీటి పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నీటి బొట్టును రైతులు సద్వినియోగం చేసుకునేలా బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు సేద్యాన్ని, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యాన్ని చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు ఇందుకు అనువైనవిగా గుర్తించారు. ఈ మేరకు దశల వారీగా విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఆరోపణ: మూడేళ్లుగా నిలిపేసిన పథకం..
వాస్తవం: 2019–20లో రూ.720.08 కోట్లు ఖర్చు చేసి 3,04,705 ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడంతో 1,03,453 మంది లబ్ధి పొందారు. ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ఈ పథకం విస్తరణ జరగలేదు. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.636 కోట్లతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించారు. తద్వారా 82,289 మంది లబ్ధి పొందారు.
సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.465 కోట్లు సర్దుబాటు చేయగా రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించారు. 2023–24లో రూ.902 కోట్ల అంచనాతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటివరకు రూ.218.38 కోట్లు వెచ్చించి 71,690 ఎకరాల్లో విస్తరించగా 26,051 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అలాంటప్పుడు పథకాన్ని ఎక్కడ నిలిపివేశారో రామోజీకే తెలియాలి.
ఆరోపణ: ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష..
వాస్తవం: సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఎందుకు వివక్ష చూపుతుంది? 2019–20లో 1,03,453 లబ్ధి పొందితే వారిలో 8,525 మంది ఎస్సీలు, 3,583 మంది ఎస్టీలున్నారు. 2022–23లో 82,833 మంది లబ్ధి పొందితే వారిలో 3,241 మంది ఎస్సీలు, 1,889 మంది ఎస్టీలున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 26,498 మంది లబ్ధి పొందగా వారిలో 1,015 మంది ఎస్సీలు, 503 మంది ఎస్టీలున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు చెందిన 46,497 ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు రూ.131.52 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఆరోపణ: పన్నుల భారం రైతులపైనేనా?
వాస్తవం: తుంపర, బిందు సేద్యం పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తుండగా రైతులపై భారాన్ని తగ్గించేందుకు 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఒక్క 2022–23లోనే రూ.47 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది.
ఆరోపణ: రాయితీలలో కోత
వాస్తవం: సన్న, చిన్నకారు రైతులకు
90 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలను అందజేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటా కేవలం 33 శాతం మాత్రమే. మిగిలిన 57 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
ఆరోపణ: సిఫార్సులున్న వారికే పరికరాలు?
వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులుంటేనే బిందు, తుంపర సేద్యం పరికరాలు అమర్చేవారు. ఇప్పుడు ఆర్బీకేలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు అర్హతే కొలమానంగా ప్రతి రైతుకు ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా అందిస్తున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన 2–3 వారాల్లోపే నేరుగా వారి వ్యవసాయ క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చుతున్నారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక జరుగుతోంది. అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీల కింద ప్రదర్శిస్తున్నారు.
ఆరోపణ: సూక్ష్మ సేద్యంపై అవగాహన ఏది?
వాస్తవం: బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేలు, ఆర్బీకే ఛానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 5 వేల టన్నుల ఎరువులు, 1,553 టన్నుల విద్యుత్, 15 టీఎంసీల నీరు ఆదా కాగా రైతులకు రూ.210 కోట్ల మేరకు కూలీల ఖర్చు మిగిలింది.
బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించింది ఎవరు?
టీడీపీ సర్కారు ఎగ్గొట్టిన బకాయిలు సూక్ష్మ సేద్యం పథకానికి గుదిబండలా మారాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం జగన్ ఆ బకాయిలను చెల్లించి అన్నదాతలకు బాసటగా నిలిచారు. చంద్రబాబు చెల్లించకుండా చేతులెత్తేసిన రూ.969.40 కోట్ల బకాయిలను అణా పైసలతో సహా ఆయా కంపెనీలకు సీఎం జగన్ ప్రభుత్వం చెల్లించింది. తద్వారా రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం విస్తరణకు మార్గం సుగమం చేశారు. ఇంత భారీగా బకాయిలు పెట్టిన చంద్రబాబు సర్కారుపై రామోజీ కలం కదల్లేదు ఎందుకో మరి?
Comments
Please login to add a commentAdd a comment