సాక్షి, అమరావతి: నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచి, రైతులకు అధిక లాభాలనిచ్చే సూక్ష్మ సేద్యం విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం వేగంగా విస్తరిస్తూ దేశంలో నాలుగో స్థానానికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో రైతులు కుదేలైపోయారు. సూక్ష్మ సేద్యం చేసే చిన్న, సన్నకారు రైతులు మరింత దయనీయ స్థితిలోకి వెళ్లారు. పైగా, బిందు, తుంపర సేద్యం చేసే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.969.40 కోట్లు ఎగ్గొట్టింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వ్యవసాయ రంగం అభివృద్ధిపై దృష్టి సారించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదేలైపోయిన సూక్ష్మ సేద్యాన్ని తిరిగి గాడిలో పెట్టారు. బిందు, తుంపర సేద్యం చేసే రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ. 969.40 కోట్లను చెల్లించారు. పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై తుంపర, బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ పరికరాలపై జీఎస్టీ భారం రైతులపై పడకుండా ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.60 కోట్లకు పైగా జీఎస్టీని వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. దీంతో సూక్ష్మ సేద్యం రాష్ట్రంలో ఊపందుకొని, ఇప్పుడు 9.10 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దేశంలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తర్వాత నాలుగో స్థానాన్ని పొందింది.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మంగళవారం పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) పథకం కింద దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లో 10.96 శాతం మేర సూక్ష్మ సేద్యం సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 9.10 లక్షల హెక్టార్లలో రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక తొలి స్థానంలో, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు.
డ్రిప్, స్ప్రింక్లర్ వినియోగం ద్వారా సూక్ష్మ సేద్యాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని, నీటి వినియోగం సామరŠాద్యన్ని పెంచుతోందన్నారు. సూక్ష్మ సేద్యం చేసే చిన్న, సన్న కారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాలు అదనపు ఆర్థిక సాయాన్ని ఈ రైతులకు అందిస్తున్నాయన్నారు. సూక్ష్మ సేద్యం విస్తరణకు, ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు తీసుకునే రుణాలపై 3 శాతం మేర వడ్డీ రాయితీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు.
పీడీఎంసీ కింద దేశంలో మొత్తం 83.06 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఖర్చును తగ్గించే ప్రభావవంతమైన శాస్త్రీయ సాంకేతికలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్) అభివృద్ది చేసిందని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, రీసైక్లింగ్, నీటి బహుళ వినియోగం వంటి స్మార్ట్ సాంకేతికలను అభివృద్ది చేసిందన్నారు.
మైక్రో ఇరిగేషన్‌తో వ్యవసాయ నీటి వినియోగ సామర్ధ్యం మెరుపడుతుందని, పంట ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. ప్రధానంగా నీటి ఆదాతో పాటు ఎరువుల వినియోగం తగ్గుతుందని, అలాగే కూలీలు, ఇతర వ్యయం తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment