గుడ్‌న్యూస్‌.. గుర్రంబోడు భూములకు మోక్షం! | Suryapet: Gurrambodu Land Dispute Resolve As Early As Possible | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌.. గుర్రంబోడు భూములకు మోక్షం!

Published Sat, Mar 6 2021 3:34 AM | Last Updated on Sat, Mar 6 2021 3:35 AM

Suryapet: Gurrambodu Land Dispute Resolve As Early As Possible - Sakshi

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాజకీయ రణరంగానికి వేదికైన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు భూములకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏళ్లుగా రావణకాష్టంలా మారిన ఈ భూముల వివాదానికి కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో చేయించిన సర్వేతో తెర పడినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వేనంబర్‌ 540లో 120.16 ఎకరాల భూమి తమదని గ్లేడ్‌ ఆగ్రో బయోటెక్‌ సంస్థ వాదిస్తూ వస్తోంది. అయితే క్షేత్రస్థాయి సర్వేలో ఇవి గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు తేలడంతో సదరు సంస్థకు అప్ప ట్లో మఠంపల్లి తహసీల్దార్‌ చేసిన మ్యుటేషన్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే ఈ భూమి సాగు చేసుకుంటున్న 129 మంది గిరిజన రైతులకు అసైన్‌ చేసేలా ప్రతిపాదనలు పంపాలని సదరు తహసీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం. రెండేళ్లుగా గుర్రంబోడు గిరిజన రైతుల ఆర్తనాదాలను ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడంతో..
మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్‌ 540లో 6,239.07 ఎకరాల భూమి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ, అటవీశాఖ పరిధిలో కొంత ఉండగా, పలు కంపెనీలు లీజు తీసుకోవడంతోపాటు కొన్ని కంపెనీలు కొనుగోలు చేశాయి. మరికొంత భూమిని గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ సర్వే నంబర్‌లోనే నాగార్జునసాగర్‌ నిర్వాసితులు 328 మంది రైతులకు 1,876.01 ఎకరాలు డీఫాం పట్టాలు ఇచ్చారు. ఈ భూములను సదరు రైతులు అమ్ముకోవచ్చు. కొంతమంది ఈ భూములను అమ్మడంతో కాలక్రమేణా చేతులు మారాయి. 6 వేలకు పైగా ఎకరాల భూమి ఈ సర్వే నంబర్‌లో ఉంటే సుమారు 12 వేల ఎకరాలకు పైగా పట్టాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్‌ ఈ భూముల విషయమై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ తర్వాత ఓ కంపెనీ, గిరిజనుల మధ్య ఇటీవల భూ వివాదం తారస్థాయికి చేరింది. ఈ భూముల విషయమై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది.

సర్వేతో తేలిన వాస్తవాలు  
గ్లేడ్‌ ఆగ్రో బయోటెక్‌ సంస్థ కొనుగోలు చేసినట్టు చూపుతున్న 400 ఎకరాలకు పై చిలుకు భూమిలో గిరిజనులు 120.16 ఎకరాలు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. సర్వే ప్రారంభంలోనే ఈ భూముల విషయంలో కలెక్టర్‌ అప్పట్లో అక్కడ విధులు నిర్వహించిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్‌ చేశారు. సదరు సంస్థకు అక్రమంగా మ్యుటేషన్‌ చేసినందుకు గాను కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 10 నుంచి ప్రారంభమైన సర్వే ఇటీవల ముగిసింది. 540 సర్వేనంబర్‌లోని భూమి ఎవరి అధీనంలో ఎంత ఉందో తేల్చారు. గ్లేడ్‌ సంస్థ తమదని చెబుతున్న 120.16 ఎకరాలను ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సర్వేలో గుర్తించారు.

9.18 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి
గ్లేడ్‌ ఆగ్రో బయోటెక్‌ సంస్థ గుండెబోయినగూడెం రెవెన్యూ పరిధి సర్వేనంబర్‌ 11లో 5.20 ఎకరాలు, మఠంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్‌ 68లో 3.38 ఎకరాలు.. మొత్తం 9.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని మఠంపల్లి తహసీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఎన్‌వీఆర్‌ బయోటెక్‌ సంస్థ నుంచి 233.10 ఎకరాలు గ్లేడ్‌ సంస్థకు మార్పు చేసింది. ఇందులో 92.15 ఎకరాలకు సంబంధించి భూమి అమ్మిన ఎన్‌వీఆర్‌ బయోటెక్‌ సంస్థ పేరు కాకుండా ఇతరుల పేరున ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల పరిశీలనలో తేలింది. దీంతో 92.15 ఎకరాలపై మళ్లీ తాజా విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాలని తహసీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement