గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడులోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ కార్యాల యాల ఖాతాలలోని సొమ్మును పక్కదారి పట్టించాడు. లెక్కల్లో తేడాను ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎపీజీవీబీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గాదెపాక రవీందర్ సెప్టెంబర్ 13 ఎంపీడీఓ ఖాతా నుంచి రూ 28,276, తహసీల్దార్ ఖాతా నుంచి రూ 47,516లను గుర్రంపోడుకు చెందిన సైదిరెడ్డి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేశాడు. మళ్లీ రూ 58,307లను తహసీల్దార్ ఖాతా నుంచి కట్ట నర్సింహ్మ అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించాడు.
అక్టోబర్ 7న రూ 75,000లను ఖాతాదారుడికి తెలియకుండా శివప్రసాద్ అనే వ్యక్తి ఖాతాలో జమచేశాడు. ఆతర్వాత లెక్కల్లో తేడాలు రావడంతో గుర్తించిన బ్యాంకు అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టి నగదు బదిలీ కాబడిన ఖాతాదారుల నుంచి సొమ్మును రికవరీ చేశారు. నిందితుడు విషయం బయట పడినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ సుంకు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్యోగి రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.