గుర్రంపోడు, న్యూస్‌లైన్: అర్హులందరికీ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం గుర్రంపోడులో నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర క్యాబినేట్ ఆమోద ముద్ర వేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలకు వివిధ పథకాల కింద 90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రచ్చబండ ద్వారా 405 మందికి రేషన్‌కార్డులు, 631 మందికి పింఛన్లు, 711 ఇందిరమ్మ ఇళ్లు, 36 బంగారు తల్లి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి, ఎంపీలు అందజేశారు. అంతకు ముందు 20 కోట్లతో నిర్మించిన చేపూరు మంచినీటి ప్రాజెక్టుకు మంత్రి, ఎంపీతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ యడవల్లి విజేందర్‌రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్రావు, ఆర్డీఓ రవినాయక్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్దార్ టి. వెంకటేశం, జెడ్పీ మాజీ చెర్మైన్ చింతరెడ్డి మల్లారెడ్డి, రచ్చబండ కమిటీ సభ్యులు జాలచినసత్తయ్య యాదవ్, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నీలా భారతమ్మ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
Published Sun, Dec 8 2013 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement