అభిప్రాయం
ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవి నీతికి, వివక్షకు తావులేకుండా చేరేలా చూడటానికి వైఎస్ జగన్ తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ వలంటీర్ల వ్యవస్థ. దాదాపు రెండున్నర లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం ఐదువేల రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికీ–ప్రజలకూ మధ్య వారధిగా నిలిచారు. పదకొండు వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుండి ఆయా గ్రామాల– వార్డుల లోని ఇళ్ళ ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది.
ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్ననలను చూరగొని ఇతర రాష్ట్రాలకు సయితం స్ఫూర్తిగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించింది. అటువంటి ఉదాత్త వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఐదేళ్ళలో ఎంతో బురద చల్లారు, దుష్ప్రచారం చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగమా అని ఈసడించి అవమానించారు.
పవన్ కల్యాణ్ అయితే, మరింత హీనంగా దిగజారి వలంటీర్లు తాము సేకరించిన డేటా ద్వారా 30 వేల ఎమంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించారని పెద్ద అభాండమే వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తన ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదో మరి!
తీరా ఎన్నికలు సమీపించేసరికి బాబు వలంటీర్లను చంకకెత్తుకొని ‘మీకు పదివేలు ఇస్తా, మీ నైపుణ్యాలను పెంచుతా, సంపన్నులను చేస్తా’ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గెలిచి ప్రభుత్వం ఏర్పరిచాక వారి సేవలను కొనసాగించకుండా, పరోక్షంగా రద్దు చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. సచివాలయ సిబ్బందినే ఇంటింటికి పంపి మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పెన్షన్లను డోర్ డెలివరీ చేశామని గొప్ప చెప్పుకున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా, తమ వ్యవస్థను కొనసాగించకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే బాబు నిర్వాకం వల్ల బెజవాడ బుడమేరు వరదలో ముని గితే, గతిలేని పరిస్థితుల్లో వలంటీర్లను పిలిచి వారి సేవలను ఉపయోగించుకున్నారు. విలయం తగ్గాక వలంటీర్లను పట్టించుకోవడం మానేశారు.
కూటమి హామీ ఇచ్చిన సూపర్–6లో ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా, ఉన్న రెండున్నర లక్షల వలంటీర్లతో సహా మరెన్నో వేలమంది ఉపాధికి ఎసరు పెట్టారు. ఎంతో సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీది ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించడానికే దురాలో చనలు చేస్తున్నారు. ఇది తగదు. పాలక–ప్రతిపక్ష పార్టీల మధ్య విధానాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉండవచ్చుగాక... కానీ ఒక ఆదర్శ వ్యవస్థను అంతం చేయబూనటం మున్ముందు పాలక కూటమికి పతనహేతువు కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
వలంటీర్లు అంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సామాజిక స్వర్ణయుగపు చందమామ కథల రోజుల నాటి ‘పరోపకారి పాపన్నలు!’ 50 ఇళ్ళకు ఒకరు చొప్పున పిలిస్తే పలికే ఆపద్బాంధవులు! ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు సత్వరం అందించే దూతలు! పేదల ఆశీర్వచనాలు అందుకుంటూ తృప్తిపడే అల్ప సంతోషులు!
1969 మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా దేశంలోని అన్ని కళాశాలల విద్యార్థులలో స్వచ్ఛంద సేవానిరతిని పెంపొందించేందుకు జాతీయ సేవా పథకం ప్రవేశపెట్టారు. ఒక విధంగా దానికి కొనసాగింపుగా మన రాష్ట్రంలో వచ్చిన వ్యవస్థ ఈ వలంటీర్ వ్యవస్థ అని చెప్పవచ్చు. లక్ష లాదిగా వున్న ఈ వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి.
ఈదర గోపీచంద్
వ్యాసకర్త ‘గాంధీ స్మారక సమితి’ వ్యవస్థాపకులు ‘ 94403 45494
Comments
Please login to add a commentAdd a comment