![Gold Production processing unit established during YS Jagan govt](/styles/webp/s3/article_images/2025/02/13/gold_0.jpg.webp?itok=Im-98XWV)
కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఏర్పాటు చేసిన యంత్రాలు
కర్నూలు జిల్లాలో పూర్తిస్థాయి గోల్డ్ మైన్ ప్రారంభం దిశగా అడుగులు
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
18న బంగారం ప్రాసెసింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
1,494 ఎకరాల్లో రూ.320కోట్లతో ప్లాంట్ నిర్మించిన ‘మెస్సర్స్ జియో మైసూర్’
గోల్డ్ మైన్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి
సాక్షిప్రతినిధి కర్నూలు: కరువు సీమలో పసిడి ధగధగా మెరవనుంది. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్‌కు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. పూర్తిస్థాయిలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా గోల్డ్ ప్రాసెసింగ్‌పై ఈ నెల 18వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్రక్రియ చేపడతారు.
మూడు దశాబ్దాల కిందట గుర్తింపు...
కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) సర్వే చేసి నిర్ధారించింది. అప్పట్లో బంగారు నిక్షేపాల వెలికితీతకు దేశీయంగా ఏ కంపెనీ ముందుకురాలేదు.
⇒ భారత ప్రభుత్వం 2005లో మైనింగ్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది.
⇒ కర్నూలులో గోల్డ్ మైన్ ఏర్పాటు కోసం ఆస్ట్రేలియాకు చెందిన మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీకి 2013లో అనుమతులు లభించాయి.
⇒ తుగ్గలి, మద్దికెర మండలాల్లో 1,495 ఎకరాలను ‘జియో మైసూర్’ లీజుకు తీసుకుంది. మరో 70 ఎకరాలను కొనుగోలు చేసింది.
⇒ 2021లో ప్రొడక్షన్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసింది.
⇒ మొత్తం 1,495 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30వేల మీటర్లు డ్రిల్లింగ్ చేసింది.
⇒ పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి 15 నుంచి బంగారు వెలికితీతను ప్రారంభించింది.
⇒ ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్‌కు పంపితే మంచి ఫలితాలు వచ్చాయి.
⇒ అనంతరం రూ.320 కోట్ల పెట్టుబడితో పూర్తిస్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా, చైనా నుంచి మిషనరీ తెప్పించింది.
⇒ బంగారు ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు ఈ నెల 18న ప్రజాభిప్రాయసేకరణ జరపనున్నారు.
⇒ తొలుత ఓపెన్ కాస్ట్ మైనింగ్ 10 ఏళ్లపాటు ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే 25 ఏళ్ల వరకు కొనసాగవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
⇒ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ 20 టన్నుల మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేయగా, 40–50 గ్రాముల బంగారం ఉత్పత్తి అయింది. ప్రధాన ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 750 కిలోల బంగారు ఉత్పత్తి కానుంది. ఆ తర్వాత సామర్థ్యాన్ని పెంచనున్నారు.
దేశంలో మూడో ‘గోల్డ్ మైన్’
మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం 1880లో కోలార్ గోల్డ్ మైన్‌ను ప్రారంభించారు. రెండోది 1945లో రాయచూర్‌లోని ‘హట్టి మైన్స్’ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ యూనిట్‌ను ‘జియో మైసూర్’ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇది దేశంలోనే మూడో గోల్డ్ మైనింగ్ యూనిట్‌గా గుర్తింపు పొందనుంది. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1,000 మంది వరకు ఉద్యోగాలు లభిస్తాయి.
అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ, పన్నులు రూపంలో మంచి ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, డీఎంఎఫ్(డిస్ట్రిక్ మినరల్ ఫండ్) పేరిట ఉత్పత్తిలో 4.6శాతం చెల్లిస్తారు. అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ లీజుకు ప్రయత్నించింది. అప్పట్లో రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. రామగిరి మండలంలో కూడా బంగారు నిక్షేపాలు వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతమవుతుంది. వందలాది మందికి ఉపాధి లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment