
వడ్డీ వ్యాపారి సెల్ఫీ వీడియో
కొత్తపేట((రాజమహేంద్రవరం): రెండు రోజుల్లో తిరిగి వస్తా.. నా షాపులో తాకట్టు పెట్టిన వస్తువులు ఎవరివి వారికి తిరిగిస్తా.. అని షాపు మూసేసి పరారైన తాకట్టు వడ్డీ వ్యాపారి కూర్మదాసు హేమంత్‌కుమార్ తెలిపాడు. ఆ మేరకు ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. స్థానిక మెయిన్‌రోడ్డులో సత్యసూర్య బ్యాంకర్స్ (తాకట్టు వడ్డీ వ్యాపారం) నిర్వహిస్తున్న హేమంత్‌కుమార్ గత నెల 1, 2 తేదీల్లో షాపు మూసేసి పరారయ్యాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
దీంతో బాధితులు గతనెల ఆ షాపు వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా హేమంత్‌కుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ, తాకట్టు వడ్డీ వ్యాపారంలో తనతో పాటు మరో ఇద్దరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టగా రియల్టర్ వాసు తాను నష్టపోయానని చెప్పి వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనతో పెట్టుబడి పెట్టిన వారు చంపుతామని బెదిరించడంతో ప్రాణభయంతో పారిపోయానని, తన వద్ద తాకట్టు పెట్టిన వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయని, కరిగించలేదని పేర్కొన్నాడు.
కొన్ని తన వద్ద, మరికొన్ని తన వ్యాపార భాగస్వామి సత్యప్రియ శ్రీఘాకోళ్లపు రామకృష్ణ వద్ద, వాళ్ల నాన్న వద్ద ఉన్నాయని, పోలీసుల సహకారంతో తిరిగి వచ్చి ఎవరివి వారికి అప్పగిస్తానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనకు రక్షణ కావాలని పేర్కొన్న వీడియో తాకట్టుదారులకు కొంత ఊరటనిచ్చింది.