సాక్షి,ఎన్టీఆర్‌జిల్లా:ఎప్పుడూ వివాదాల్లో ఉండే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గురువారం(ఫిబ్రవరి 6) తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త పల్లికంటి డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో డేవిడ్ చెప్పడం సంచలనమైంది.
‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశా. కొలికపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ దళితుడినైన నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. నాలాంటోళ్లు ఎంతో మంది పైకి చెప్పుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం. నా చావుతోనైనా తిరువూరు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’అని సెల్ఫీ వీడియోలో డేవిడ్ విజ్ఞప్తి చేశాడు.
తన కుటుంబానికి చంద్రబాబే న్యాయం చేయాలని కోరాడు. ప్రస్తుతం డేవిడ్ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కొలికపూడిపై ఇటీవల సొంత పార్టీలో ఫిర్యాదులు ఎక్కువవడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఆయనను సంజాయిషీ కోరింది. గతంలో దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment