
టీడీపీ కూటమి ప్రభుత్వంలో మా భూమి కబ్జాకు గురైంది.. ఆ ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడ్డా.. ఇప్పుడు సిగ్గేస్తోంది
తిరుచానూరు పోలీసులు కబ్జారాయుళ్లతో కలిసిపోయారు.. జగన్ ప్రభుత్వంలో మా భూములు భద్రంగా ఉన్నాయి
ఆ్రస్టేలియా నుంచి ఓ ఎన్‌ఆర్‌ఐ సెల్ఫీ వీడియో విడుదల
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మీరు విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులా.. అయితే, ఖచ్చితంగా మీ భూములకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ భూములు భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. ఎందుకంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్‌ఆర్‌ఐలకు చెందిన రూ.కోట్లు విలువైన స్థలాలను యథేచ్ఛగా కబ్జాచేసే ముఠాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రత్యేకించి పోలీసులతో కుమ్మక్కయి మరీ ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈ విషయంలో ఒక ఎన్‌ఆర్‌ఐ పడుతున్న ఆవేదన ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది.
ఏపీ మరో బిహార్‌లా మారిందంటూ తిరుపతికి చెందిన ఎన్‌ఆర్‌ఐ బొర్రా రాజేంద్రప్రసాద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఆయన ఏమన్నారంటే..ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో తిరుచానూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 298/4లో 120 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కొందరు దానిని కబ్జాచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.

నిజానికి.. కిందటేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన ఎన్‌ఆర్‌ఐ విభాగం తరఫున ఆస్ట్రేలియాలో చురుగ్గా పనిచేశాను. మా నాన్న బొర్రా వెంకటరమణ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా రిటైరయ్యారు. ఆయన కూడా జనసేన నుంచి తిరుపతికి పోటీచేసిన ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి నుంచి పోటీచేసిన పులివర్తి నానిల గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడినందుకు ఇదేనా మాకు దక్కుతున్న న్యాయం? మా నాన్న నాలుగుసార్లు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో, తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదు. ఏపీ మరో బిహార్‌లా తయారైంది.
నాలాంటి ఎన్‌ఆర్‌ఐలు చాలామంది బాధితులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు. నిజానికి.. ఎన్‌ఆర్‌ఐలకు చెందిన స్థలాలను జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందనలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డా.. కానీ ఇప్పుడు సిగ్గేస్తోంది.
ఇదిలా ఉంటే.. తిరుచానూరు పరిసరాల్లో ఎన్‌ఆర్‌ఐలకు చెందిన స్థలాలను ఎంచుకుని కబ్జా రాయుళ్లు వాటిల్లోకి వాలిపోతున్నారని.. వీరికి పోలీసుల సహకారం ఉండటంతో ఎన్‌ఆర్‌ఐలు ఏమీ చేయలేకపోతున్నారని బొర్రా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. చివరికి.. తమ స్థలం విషయంలో పోలీసులు ప్రత్యర్థులతో సెటిల్ చేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారని మండిపడ్డారు.