‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష! | 'Higgins' nervalsina parimalapu language! | Sakshi
Sakshi News home page

‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష!

Published Fri, Oct 10 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష!

‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష!

మంచి పుస్తకం
 
‘మెహదీపట్నం దగ్గర గుడిమల్కాపూర్ మార్కెట్‌కి వెళ్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది కాబోలు’ అంటాడు  ప్రసాదమూర్తి, పూలండోయ్‌పూలు కవిత పూర్తి చేసి. ‘ఈ పదాన్ని ఇలాగే పలకాలి. ఈ వాక్యాన్ని అనేపుడు బాడీలాంగ్వేజ్ ఇలాగే ఉండాలి’ అనే ప్రొఫెసర్ హిగ్గిన్స్‌కు మాత్రం పూలమార్కెట్ అలా ఉండదు. హిగ్గిన్స్ ఎవరు? బెర్నార్డ్ షా నాటకం ‘పిగ్మేలియన్’ (1938) ఆధారంగా 1964లో   ‘మై ఫెయిర్ లేడీ’ అనే క్లాసిక్ ఫిలిం వచ్చింది. అందులో ఎలిజా అనే పూలమ్మిని హైసొసైటీ లేడీగా మార్చేందుకు శపథం పూనిన ఆచార్యుడు.
 
‘హిగ్గిన్స్’ తెలుగు కవుల్లోనూ ఉన్నారు. నియమం లేని వాక్యం గ్రామ్యం అన్నారు గ్రాంథికులు. చంపకమాల (సంపెంగ దండ) ఉత్పలమాల (కలువపూల దండ) అని పేర్లు పెట్టారు కాని పూల తాలూకూ వాసనలే సోకని ఛందస్సులతో పద్యాల ఇటుకలు పేర్చేశారు. కొందరు ఆధునికుల్లో ఛందస్సూ కవిత్వమూ రెండూ మృగ్యమే. ‘పూలండోయ్ పూలు’ కవితా సంకలనంలోని ప్రసాదమూర్తి కవితలు ఏ భాషలోని ‘హిగ్గిన్స్’కు అయినా పరిమళపు భాష నేర్పుతాయి. గుడిమల్కాపూర్ పూలమార్కెట్‌ను  డాక్యుమెంటరీగా తీస్తే  ఏ భాషలోని కవి అయినా తమ భాషల్లో ప్రసాదమూర్తి కవిత్వాన్నే పలుకుతాడు. ఈ సంకలనంలో కేవలం ‘పాటల పారిజాతాలు ... ఆశల సంపెంగలు’ మాత్రమే లేవు. అత్తిచెట్టు తనలోకే పుష్పిస్తూ ఫలంగా రూపొందిన విధంగా ప్రసాదమూర్తి తనలోనే దుఃఖించి పాఠకులకు కానుకగా అందించిన కవితలూ ఉన్నాయి.
 
‘పగలంతా సూర్యుడు రాల్చిన/ వెలుగు కలల్ని/ రాత్రిచంద్రుడు ఏరుకునే/ సన్నివేశం గుర్తొచ్చింది’ అన్న కవి ‘కొంపలు కొల్లేరైపోయాక/ఇంక ఇక్కడేముందని/ఓ పెద్ద చేప పెకైగిరి/నా కాళ్లమీద తోకతో కొట్టిపోయింది’ అలాంటి వ్యక్తీకరణే!
 
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధిగా పద్యంతో మొదలై, అష్టావధానాలూ చేసి, ప్రేయసీ అనే అలభ్యశతకం రాసి శ్రీశ్రీ ప్రభావంతో ఛందస్సుల నుంచి బయటపడ్డాననే ప్రసాదమూర్తి ఛందోస్ఫూర్తిని వీడలేదు. ప్రసాదమూర్తి వామపక్షభావాల నుంచి, దళిత ఉద్యమ మమేకత్వాన్నుంచి, భిన్న భావాల సంఘర్షణల నుంచి ఏ మంచినీ వదులుకోకుండా  కవిగా ప్రయాణిస్తున్నాడు అనేందుకు అతడి గత పుస్తకాలు ‘నాన్నచెట్టు’, ‘కలనేత’, ‘మాట్లాడుకోవాలి’కి కొనసాగింపైన ‘పూలండోయ్ పూలు’ ఉదాహరణ!
 లోహపురుషుడి కోసం లోహాన్ని సమకూర్చండి అన్న నాయకుడి పిలుపు నేపథ్యంలో ‘ప్రియమైన భారతీయులారా/మీరు లోహాన్ని సమకూచ్చండి/విగ్రహం కోసం కాదు/ సంగ్రామం కోసం’ అంటాడు!
 
ప్రపంచంలోని అన్ని సంఘర్షణసీమల్లోకి కలల విహారం చేస్తూ  ‘ఇండోపాక్ బార్డర్లో / నా రెండు కనుపాపల్నీ /అటూ ఇటూ దీపాలుగా పెట్టి/ క్రాస్ బార్డర్ హ్యూమనిజానికి/హారతులు పట్టమని ఆనతిచ్చాను’ తొలికవిత ‘అమ్మ పుట్టిన రోజు’లో ‘బతుకు నొప్పినంతా భరించీ భరించీ/పురిటి నొప్పుల్ని మాత్రం/నా కోసమే తియ్యగా మార్చుకున్నావు/ అక్షరాల ప్రసవంలో/ నేనూ అదే నేర్చుకున్నాను’ అంటాడు. నిజమే సుమీ అని 38 కవితలూ బోసిగా నవ్వుతాయి!
 
- పున్నా కృష్ణమూర్తి
 
పూలండోయ్ పూలు: ప్రసాదమూర్తి; వినూత్న ప్రచురణలు: ప్రతులు అన్ని ముఖ్యమైన చోట్లా;  వేల: 100/-
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement