నిన్ను ప్రేమించువారికై...
ప్రేమించడం... ప్రేమే జీవితం అనుకోవడం...
చేతులు కోసుకోవడం... రైలు కింద పడిపోవడం...
చదువులు మానేసి పిచ్చివారైపోవడం...
ప్రేమ కోసం ఇన్ని త్యాగాలు చేయాలా?
‘నువ్వు ఇష్టపడేవారి కోసం నువ్వు చచ్చిపోవాలనుకోవడం కంటె... నిన్ను ఇష్టపడేవారి కోసం నువ్వు బతకడం నేర్చుకో...’
అంటోంది ‘లవ్ డ్రైవ్’...
డెరైక్టర్స్ వాయిస్ : మాది విశాఖజిల్లా డొంకాడ గ్రామం. ఆంధ్ర యూనివర్శిటీలో బి.కాం చదివాను. ఆ తరవాత మల్టీ మీడియా, మాయా, విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఫ్రీలాన్సర్‌గా హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నాను. నాకు మా తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇది నా మొదటి లఘుచిత్రం. ఈ చిత్రానికి పెద్దగా ఖర్చేమీ చేయలేదు.
షార్ట్ స్టోరీ: అన్ని ప్రేమకథల్లాగే ఈ కథలో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఫోన్‌లో చాటింగ్‌లు, మెసేజ్‌లు, సినిమాలు, షికార్లు... అన్నీ మామూలే. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరికీ బాగా దెబ్బలు తగులుతాయి. ఒకరోజు హీరో... తలకి తగిలిన, కాలికి తగిలిన దెబ్బలకు కట్టు కట్టుకుని, రోడ్డు మీద కుంటుతూ నడుస్తుంటాడు. ఆ సమయంలో హీరోయిన్ అటుగా వస్తుంది. ఆమెను ఎంత పలకరించినా పలకదు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ, చేతి మీద గాయం చేసుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడికి ఎలా వచ్చిందనేది చిన్న ట్విస్ట్. ఆ తరవాత స్నేహితులు వచ్చి, ‘నిన్ను ప్రేమించేవారి కోసం నువ్వు బ్రతకాలి’ అనటంతో కథ పూర్తవుతుంది.
కామెంట్: ఈ కథ మొదటి నుంచి చివరి వరకు చాలా రొటీన్‌గా ఉందనే భావన కలుగు తుంది. ఇందులో కొత్తదనమేమీ లేదనిపి స్తుంది. అసలు కథంతా కొసమెరుపులోనే ఉంటుంది. ప్రేమలో కూరుకుపోయినవారికి, ఆత్మ హత్యలు చేసుకునేవారికి మంచి సందేశం ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకునే ముందు... మనల్ని కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే మనల్ని ప్రేమించేవారిని కూడా జ్ఞాపకం తెచ్చుకో వాలి. అప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా ఏ అఘాయిత్యాయినికీ పాల్పడరు... అనే విషయాన్ని చాలా చక్కగా చూపాడు. టేకింగ్, రీరికార్డింగ్, ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, యాంగిల్స్... అన్నీ బావున్నాయి. అయితే... నటీనటుల చేత డైలాగులు మరింత పటిష్ఠంగా చెప్పించి ఉంటే బాగుండేది. ఇంత చిన్నవయసులోనే మంచి మంచి ఆలోచనలు కలగడం వల్ల, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీయగలుగుతారు.
- డా.వైజయంతి